Previous Page Next Page 
వైరం పేజి 32


    "ఏమీ చేయదు. తల్లీ కూతుళ్ళు ఇద్దరు మాత్రమే వుంటూ వుంటారు. పని తేలికే! ఆ పిల్లని ఎత్తుకు వచ్చి ఈ షిప్పులోకి ఎక్కించు. ఇది నీకు ఎంట్రెన్స్ లాంటిది దాస్! పాసయితే నీ హీరో నీ కాళ్ళ దగ్గర వుంటాడు."
    కొద్దిగా నానుస్తూ, సంశయంగా అడిగాడు దాస్.
    "నామ్ నిశానీ లేని ఆ పిల్ల కోసం ఇంత హంగామా ఎందుకు సర్!" అని ఆగి, అంతలోనే తట్టినట్లుగా, "అంత అందగత్తా ఏమిటి?" అన్నాడు.
    "సింపుల్ గా సీదా సాదాగా ఉండే ఆడపిల్ల"
    "మరి?"
    నవ్వాడు అభిరాం.
    "ఆ అమ్మాయిని పాము ఒకటి పడగ పట్టిందని విన్నాను. అంటే మీ ఇండియన్ సెంటిమెంటు ప్రకారం రాజయోగమో రాణివాసమో తప్పదంటారు. రాజాని కావాలనే కోరిక నాకు ఉంది దాస్. నిజంగానే! అ పిల్ల నా రాణీగా వుంటే, రాజయోగం మరింతగా రాణిస్తుంది కదా!" అని విరగబడి నవ్వాడు అభిరామ్. అంతలోనే అతని మొహం మారిపోయింది. "ఊరికే అంటున్నా! సీరియస్ గా తీసుకోకు. అసలు సంగతి చెప్పాలంటే, వజ్రాల వర్తకుడూ కమ్ కంప్యూటర్ ఇంజినీరూ అయిన ఓ అందగాడు తనని వరించాలని కలవరించిపోతున్నా కాదనేస్తున్న ఆ పిల్లని చెడగొట్టాలని వుంది బాస్! జస్ట్ ఫర్ థ్రిల్! అందగత్తె అయినా కాకపోయినా ఆడపిల్ల మాత్రం అవును గదా!" అన్నాడు అభిరాం నిర్దాక్షిణ్యంగా.    
    "చిలకని పట్టడం చిటికెలో పని!" అన్నాడు దాస్.
    "తోడూ నీడా లేని ఆడపిల్ల- ఒంటరిగా ఉంటున్న తల్లీ కూతుళ్ళూ! ఎత్తుకు రావటం కోసం పెద్ద ఎత్తులేమీ వేయనఖ్ఖరలేదు. సింపుల్ ట్రిక్స్ చాలు! పేరు - 'అరుణ' ట!"

                                   *    *    *    *

    'గుణమణీ రాయల్ ఛారియెట్స్' అని బోర్డు వున్న గేటులోకి తన మెర్సిడెస్ బెంజ్ మేబాక్ కారుని పోనిచ్చాడు సూరజ్. రాజులూ, రారాజులూ మాత్రమే వాడగల రాయంచలాంటి కార్ల అమ్మకాలు మాత్రమే జరుగుతాయి అక్కడ.
    అరగంట క్రితమే తనకి తన తండ్రి ఇచ్చిన ఆ అయిదున్నర కోట్ల ఖరీదయిన కారుని గంట తిరక్కుండానే అమ్మిపారేయాలని అతని ఆరాటం.
    కానీ, ఆ కారులో టిక్ టిక్ మంటున్న టైంబాంబు ఉందని అతనికి తెలియదు.
    తమ కుక్క షీలా ఆ గూడెం వాళ్ళ కుక్కతో స్నేహం చేసినందుకు పనిష్ మెంటుగా తనవాళ్ళు గూడెం గూడేన్నీ తగలబెట్టేశారా!
    ఎంత అమానుషం!
    తండ్రి తనకు 'లంచంగా' ఇచ్చిన ఈ కారుని అమ్మేసి ఆ గూడెం వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వడం తన కనీస ధర్మం కాదూ!
    ముందుగా అరుణని కలవాలి.
    తను ఇట్లా చేశాడని చెబితే అరుణ తప్పకుండా సంతోషిస్తుంది.
    తనమీద మంచి ఇంప్రెషన్ కూడా పడవచ్చును. అది బోనస్సే అవుతుంది.
    కానీ అందుకోసం కాదు గదా తను ఇలా చేస్తోంది.
    దానవుల మధ్య మానవులు ఇంకా మిగిలే వున్నారనుకొని నచ్చచెప్పుకోవడానికే!
    ఈ 'గుణమణీ రాయల్ ఛారెయెట్స్' బోర్డు తను ఇదివరకే చూశాడు.
    ఎకరాలకొద్దీ మేర వున్న కాంపౌండు. గేట్లో నుంచి మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి నున్నటి సిమెంటు రోడ్డు. రోడ్డుమీదికే ఒక గ్లాస్ ఛాంబర్ లో నుంచి కనబడుతున్న అతి ఖరీదైన కార్లు.
    వాటిల్లో ఒక ఫెర్రారీ, ఒక జాగ్వార్, ఒక ఫోర్డ్.
    ఇటాలియన్ ఫెర్రారీ కార్లు రెడీమేడ్ గా దొరకవు. ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే తయారుచేస్తారు. మూడు కోట్ల పైబడి ఇంక మనం కోరుకున్న సౌకర్యాలని అనుసరించి కారు ఖరీదు.
    అంటే ఇతనికి అందరూ పెద్ద పెద్ద కస్టమర్సు అన్నమాటేగా!
    కారుని గేటు దగ్గరే ఆపేశారు అక్కడి సెక్యూరిటీ వాళ్ళు.
    "యస్ సర్!" అన్నాడు వాళ్ళ చీఫ్ ప్రశ్నార్ధకంగా.
    "ఈ కారుని అమ్మేయడానికి వచ్చాను."
    అతను సూరజ్ వైపు ఒకసారి ఎగాదిగా చూశాడు.
    అతని అనుమానం సూరజ్ కి అర్థం అయింది.
    "ఇవిగో డాక్యుమెంట్లు - కారు నాదే!" అని పేపర్లు తీయబోయాడు.
    సెక్యూరిటీ అతను చిన్నగా నవ్వాడు.
    "అఖ్ఖర్లేదు సర్! మీరు.. ధీరేంద్రషా కుమారుడు సూరజ్! యామ్ ఐ రైట్? ధీరేంద్ర షా ఫ్యామిలీ గురించి తెలియనిది ఎవరికీ?"
    లోపలికి వెళ్ళీ వెళ్ళగానే ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించాడు గుణమణి.
    "వణక్కం సార్! వాంగో వాంగో!" అన్నాడు.
    "వణక్కం" అని ప్రతివాదం చేసి, తను వచ్చిన పనేమిటో ఒక్క గుక్కలో చెప్పేశాడు సూరజ్. అతనికి నాన్చడం చేతకాదు.
    "ఈ కారు అమ్మేయదలుచుకున్నాను."
    "మేబాక్! మీ నాన్నగారు కొన్నారు. ఇది ఇండియాలో ఇప్పటిదాకా రెండో కారు అంతే! ఆర్ యూ ష్యూర్?"
    "కారు నాకు ఇచ్చారు. నేను అమ్మేస్తున్నాను."
    ఎందుకని అడగలేరు గుణమణి.
    "దీని ఖరీదు కరెక్టుగా చెప్పాలంటే ఐదుకోట్ల పాతిక లక్షలు. ఎక్స్ ట్రాలతో కలిపి మీకు ఐదున్నర అయింది. మీరు ఆరు కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తూ వుండవచ్చును. నేను మూడు ఇస్తాను" అన్నాడు చాలా బిజినెస్ లైక్ గా.
    చురుగ్గా చూశాడు సూరజ్.
    నవ్వాడు గుణమణి.
    "ఎంత గొప్ప కారు అయినా ఒకసారి రోడ్డుమీది కొచ్చిందంటే విలువ పడిపోతుంది. మూడు కోట్లు. దటీజ్ మై బెస్ట్ ఆఫర్! టేకిట్ ఆర్ లీవిట్ సర్."
    ఒక్క క్షణం మాత్రమే ఆలోచించి "ఓకే!" అన్నాడు సూరజ్.
    తృప్తిగా నవ్వుకున్నాడు గుణమణి.
    అతను ఏ కాలేజీకి వెళ్ళలేదు గానీ, ఎదుటి మనిషి సైకాలజీ చదివేయడంలో ఘటికుడు!
    సూరజ్ లోని 'తొందరని' వాసన పసికట్టేశాడు గుణమణి.
    "చెక్కు ఇవ్వనా?" అన్నాడు మతలబుగా.
    "వద్దు. రెడీ క్యాష్ ఇవ్వగలరా?" అన్నాడు సూరజ్.
    "సమస్యే లేదు" అన్నాడు గుణమణి.
    అతనామాట అన్న మరుక్షణంలోనే ఒకడు ఒక గోతాన్ని లాక్కొచ్చాడు. గుణమణికి డబ్బంటే ఉన్న నిర్లక్ష్యం అంతా డబ్బుని అట్లా గోతాల్లో కుక్కి ఉంచడంలోనే తెలుస్తోంది.
    "మూడు కోట్లు...కారు గేట్లోకి వస్తుండగానే లెఖ్ఖపెట్టించి వుంచాను. వెయ్యి రూపాయల నోట్ల కట్టలు. మీ నాన్నగారికి నా నమస్కారాలు తెలియజేయండి" అన్నాడు గుణమణి.
    పైకి మర్యాదగా అలా అంటున్నా, మనసులో మాత్రం ఇంకోలా అనుకున్నాడు అతను.
    ధీరేంద్రషా! తల తిరుగుడు మనిషి!
    "నీ ఇల్లు అమ్మరా బాబూ! అంటే పోరా పో! అన్నట్లుగా చూస్తాడా? పైత్తెకారిగాడు!
    ఇక్కడ ఈ బీచ్ లో ఇంత పెద్ద కాంపౌండు ఉన్న ఇళ్ళు రెండే రెండు.
    ఒకటి ఆ ధీరేంద్రషాది.
    రెండోది తనది.
    సముద్రతీరం వెంట పరిగెత్తే ఈ రోడ్డు. ధీరేంద్ర ఇల్లు సముద్రం వైపు ఉంది. వెనక వైపంతా ఇసక - అది దాటితే సముద్రం.
    ఒక ప్రైవేట్ బీచ్ లాగా వుంటుంది.
    రోడ్డుకి ఇవతలవైపు తన ఇల్లు.
    ధీరేంద్ర ఇంటిని తను కొనేయగలిగితే తనకి స్ట్రాటజికల్ గా చాలా మేలు జరుగుతుంది.
    కానీ పెడసరపు మనిసి అమ్మనంటాడే!
    ఆ తండ్రి ఇల్లు అమ్మకపోతే ఈ కొడుకు కారు అమ్మేస్తున్నాడు.
    ఆ తలతిక్క మనిషికి తల తీసేసినట్లు అవదూ? తిక్క తిన్నగా కుదురుతుందిలే!
    "మా వాళ్ళు మిమ్మల్ని మా కారులో దింపుతారు. మేబాక్ తో పోలిస్తే ఏవంత గొప్ప కారు లెండి - పోర్ష్ - కేవలం అరవై అయిదు లక్షలే!' అని నవ్వి, ఆ తర్వాత తన మనిషితో చెప్పాడు. 'సార్ ని ఎక్కడ కావాలంటే అక్కడ దింపేసి రండి' అని "ఈ పేపర్లమీద సంతకాలు పెట్టండి. రేపటికి రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది" అన్నాడు లౌక్యంగా.
    "వెళ్ళి వస్తాను" అన్నాడు సూరజ్.
    సూరజ్ వెళ్ళిన అరగంటకి అక్కడ పార్క్ చేసివున్న మేబాక్ లో పెట్టిన బాంబు పేలింది! దాని శబ్దం కొన్ని కిలోమీటర్లదాకా వినబడింది.
    క్షణంలో గుణమణి భవంతి సమూలంగా నేలమట్టం అయిపోయింది.

                        *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS