Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 3

    గాయత్రి వింటూ కూర్చుంది గంభీరంగా! ఏమీ మాటాడలేదు.

    "హురే! హుర్రే!! అక్కా నీకు పెళ్ళొహోచ్" అంది ఆమని పట్టరాని ఆనందంతో ఆమె చెంపలమీద ముద్దులవర్షం కురిపించింది.

    "ఎవర్నిపడితే వాళ్ళని అలా మీదపడి ముద్దులు పెట్టుకోవటం తప్పు అని చెప్పానా? ఏమిటి దూకుడు?" అని మందలించింది తల్లి.

    "అక్కని ముద్దు పెట్టుకుంటే తప్పా! అదికూడా తప్పేనా?" బుకాయింపు కంఠస్వరంతో అడిగింది ఆమని!

    గాయత్రి మొదటిసారిగా పెదవులు విప్పింది.

    "ఆమనీ! అమ్మగారికి కూడ ఎదురు చెప్పటం నేర్చుకున్నావా?"

    "నేనేం ఎదురు చెప్పాను! అమ్మని ముద్దు పెట్టుకోకూడదు అక్కని ముద్దు పెట్టుకోకూడదు. ఎవర్ని ముద్దు పెట్టవద్దంటే ఎలా?"

    "కుదురుగా కూర్చుని వినరాదూ?" అంది అక్క.

    "కదలకుండా నీలాగా గాడెస్ ఇమేజ్ లాగా కూర్చోవాలంటే నాకు పరమబోర్? మీరిద్దరూ మాటాడుకోండి! నా రూమ్ లోకి వెళ్ళి 'క్వీన్ ఆఫ్ బార్బేరియన్స్' పిక్చర్ చూచుకుంటాను."

    "చదివిస్తే నీకు వచ్చిన తెలివి యిదన్నమాట? నోర్మూసుకుని కూర్చో కదిలావంటే కాళ్ళు విరిచేస్తాను" అంది తల్లి తమ మాటలు పనివారికి వినిపించకుండా కంఠస్వరాన్ని తగ్గిస్తూ.

    తల్లి మందలించడం బహు అరుదు! ఇలా సీరియస్ గా మాటాడటం ఇదే మొదటిసారి. మామూలు మాటలుకాక అతి ముఖ్యమయిన మరో విషయం తల్లి చెప్పాలనుకుంటోంది కాబోలు!

    కాస్సేపు కాలు కుదురుగా కూర్చోకపోతే రెండు వంకల నుంచి చివాట్లు అనివార్యం అని తెలుసుకుంది ఆమని.

    మరింక కాలు చెయ్యి నోరు ఆడించకుండా కుదురుగా కూర్చుంది.

    "గాయత్రీ! నీకు పెళ్ళి ప్రయత్నాలు చెయ్యాలని వుంది. మన సమస్యలను అర్ధంచేసుకుని మన పద్ధతులను గౌరవించగల మంచి కుర్రాడు దొరకాలి! కొంతమంది పెద్దలకు కూడ చెప్పాను.

    వారి ఆస్తి సంపదలు మనకు నిమిత్తంలేదు.

    నిన్ను ఎవరు చూసుకుంటారో అతనికి ఈ కుటుంబ గౌరవంతో పాటు నీవాటా ఆస్థికూడ దక్కుతుంది. అర్హత కలిగినవాడయి వుండాలి. మనిషి చెడిపోవటానికి అత్యుత్తమ సాధనం డబ్బు.

    దాన్ని సంపాదించాలని తొందరపడేవారు అందుకోసం కొన్ని తప్పులు చేస్తారు. తీరా డబ్బు వచ్చాక మనిషిలో ధీరత్వం స్థిరమయిన బుద్ధి లేకపోతే అది మరిన్ని తప్పులు చేయిస్తుంది.

    నీకు ఎలాంటి భర్తను చూడాలనే విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. నీకు కూడ కోరికలుంటాయి.

    నాకోసం నువ్వు జీవించాలని కాదు. నీ సుఖం కోసమే నువ్వు బ్రతకాలి. ఇలాంటివాడు నాకు భర్త కావాలనే ఆలోచన నీకు కూడ ఉండవచ్చు! మనసువిప్పి నాతో చెప్పు.

    నా ఆలోచనలు నీ కోరికలు రెండు తీర్చగల మనిషి కోసం విచారిస్తాను! వరులు ఎందరో ఉంటారు!

    బాధ్యతలు అర్ధం చేసుకునేవారు కొందరే ఉంటారు.

    అలాంటి వారిని చూడటానికి కొంత సమయం పడుతుంది కదా! ముందునించే విచారించుకోవాలి" అన్నదామె.

    గాయత్రి ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే బదులు చెప్పింది.

    "అమ్మగారూ! బాధ్యత అంతా మీది! మీ ఆలోచనలు ఎలాంటివో నా కోరికలు కూడ అలాంటివే!" అంది.

    అక్కవంక ఫూల్ ని చూస్తున్నట్టుగా చూచింది ఆమని!

    "ఆల్వేస్ ఫిలడెల్ఫియా కమ్స్ బిఫోర్ వాషింగ్టన్ డి.సి! అమ్మగారు అడగటం! అక్కగారు అవును అనటం.

    "నీకెలాంటి మొగుడు కావాలనే విషయంలో నీకే అయిడియా లేకపోతే నువ్వెలా బ్రతుకుతావో పిచ్చి అక్కా!?

    "అమ్మగారికి అభ్యంతరం చెప్పమనికాదు, ఎలాంటి కోరికలు లేకుండా ఎలా ఉంటున్నావు. బండరాయివా?" అని రాల్చేసింది ఆమని!!

    "నోర్మూసుకో! కోరికలు లేవని నేను అనలేదు. అవి అమ్మగారి ఆలోచనలకు అనుకూలంగా ఉన్నాయి అన్నాను.

    "అయినా పెళ్ళి నీది కాదుకదా! నాది కదా! నువ్వు ఎక్కువగా ఎందుకు మాటాడతావు?" అంది గాయత్రి.

    "ఇలాంటి భర్త కావాలని నీకు లేకపోయినా నాకు ఇలాంటి బావగారు కావాలనే కోరికలున్నాయి. పర్మిషన్ యిస్తే చెప్తాను" అంది ఆమని.

    ఆమె అంటున్న మాటలు ఆకతాయితనంగా ఉన్నా చాల రీజనబుల్ అనిపించాయి రాణి సుమిత్రకి.

    "తప్పులేదమ్మా! తల్లిగా గాయత్రి ఇలాంటి భర్త దొరకాలని నేను అనుకుంటున్నాను. అది తప్పు కాదు, అలాగే చెల్లిగా అక్కకు ఇలాంటి భర్త అయితే బాగుంటుందని నువ్వూ అనుకోవచ్చు.

    అందులో తప్పుకాని అసహజం కాని లేదు.

    పోనీ నువ్వు చెప్పు, అక్కకి ఎలాంటి భర్తను చూడమంటావు?" అని అడిగింది తల్లి. గాయత్రి చెల్లెలివంక చురుక్కుమని చూచింది.

    జయించాను అన్నట్లు కళ్ళలో మెరుపులు మెరిపించి ఏమీ తెలియనిదానిలా తల్లివంక తిరిగి చెప్పటం మొదలెట్టింది ఆమని.

    "థాంక్స్ మమ్మీ! కొందరికి లేకపోయినా మీరయినా రైట్స్ ని గుర్తించారు. బావగారు దబ్బపండులా వుండాలి.

    ఆరడుగుల రెండంగుళాల పొడవుండాలి.

    మినిమమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

    వాయిస్ మగతనం ఉట్టిపడేలా గంభీరంగా ఉండాలి. అవసరాల కోసం అభిప్రాయాలు దాచుకునే నంగి మనిషి కాకుండా డెస్పరేట్ గా చెప్పగలిగిన వాడు అయుండాలి.

    అఫ్ కోర్సు! బీదవాడయినా ఫరవాలేదు.

    అక్క అతని తల దువ్వాలి అంటే ముక్కాలిపేట ఎక్కాలన్న మాట.

    అలాంటి బావగారయితే నాకు నచ్చుతారు. వారితో నేను మాటాడతాను. లేకపోతే అస్సలు పలకరించను, అంది ఆమని?!

    బిడ్డలు ఇద్దరి అభిప్రాయాలు విని లోలోపల చాలా పొంగిపోయింది రాణి సుమిత్ర. చెప్పిన పద్ధతులు వేరు కాని ఇద్దరూ చెప్పింది ఒక్కటే.

    ఈ అభిప్రాయాలన్నీ తల్లిగా తాను అనుకున్నవే.

    వినయ విధేయతలు ఉట్టిపడే ధోరణిలో అనుకూలమయిన పద్ధతిలో గాయత్రి చెప్పింది. ఆమని పోరాడి సాధించుకోవాలనే ధోరణి కాదు కాని అమ్మనయినా ఆడిగి పెట్టించుకోవాలనే ధోరణిలో చెప్పింది.

    ముగ్గురి అభిప్రాయాలు ఒకటే కావటం ఒక శుభ పరిణామం అనిపించిందామెకు. ప్రయత్నాలు మొదలెట్టవచ్చు అనుకుంది.

    "మమ్మీ శాంతి హోమం అయిపోగానే నేను వెళ్ళిపోతాను" అంటూ ప్రయాణం సంగతి అడిగింది ఆమని పనిలో పనిగా.

    తల్లి ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది.

    ఎప్పుడు అడిగితే ఏమవుతుందో అని భయం పుట్టేలాగ.

    "మనం స్వయంగా చేస్తున్న బ్రహ్మోత్సవాలకు నువ్వు లేకపోతే బావుండదు."

    "అయినా పరీక్షలు పూర్తి అయిన తరువాత మళ్ళీ ఎందుకు?"

    "మెడికల్ ఎంట్రెన్స్ కోచింగ్ తీసుకోవాలి మమ్మీ?"

    "డాక్టరు కావాలనా ననీ కోరిక."

    "మొదటి ఐడియా ఐ.ఎ.ఎస్! ఇఫ్ నాట్ డాక్టరయినా కావాలనుకుంటున్నాను. ఈ రెండు ప్రయత్నాలు చేయటానికి సబ్జెక్టులు అడ్డురావు కాని ముందు డాక్టర్ సీటు వస్తే ఐ.ఎ.ఎస్. వదులుకోవాలో లేదో అప్పుడు ఆలోచిస్తాను. అందుకే వెళ్ళాలి మేడమ్ కి రేపు సాయంత్రమే కన్పిస్తానని చెప్పాను."

    "పొరపాటు చేశావు. వెంటనే ఫోన్ చేసి వారికి క్షమాపణలు చెప్పు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకుండా అయినా సరే స్వామి ఉత్సవాలు జరిగితే నాకు లోటుగా వుంటుంది.

    అయామ్ వెరీ సీరియస్. ఈ విషయంలో నీ కోరిక తీర్చను. రాజీ పడను. పెందరాడే మీరు సిద్ధంగా ఉండాలి.

    మనం ముగ్గురం వెళ్ళి ఆలయం దగ్గర ఏర్పాటు చివరిసారిగా చూచి రావాలి. రేపు ఉదయం పరాయి గ్రామాల వారు రావడం మొదలవుతుంది. ఆ తరువాత మనం ఏమి చేయటానికి ఉండదు. లోపాలు కన్పిస్తే పదిమందీ చెప్పుకుంటారు.

    "చెప్పింది వింటున్నావా ఆమనీ! అర్ధమయ్యిందా?"


    "అర్ధమయింది ఈ ఊళ్ళో ఫోన్ కూడ లేదు. ఫోన్ చేయటానికి జీపులో కాదు మారుతి జిప్సీలో వెడతాను అంది ఆమని!" అలాగే అంది తల్లి.

    తల్లి వెళ్ళిపోయాక హాయిగా ఊపిరి పీల్చి అక్కని ఒక బెటాలియన్ లా చుట్టుముట్టింది ఆమని.



                                                                                 2


    "అక్కా! రెడీ అయ్యావా?" అంటూ గాయత్రి గదిలోకి వచ్చింది ఆమని! ఆ సమయంలో తల్లికి ఇష్టమయిన రవ్వల గాజులు వేసుకుంటోందామె.

    "ఇవి చాలా బావున్నాయి కదూ!" అంది చెల్లికి చూపుతూ!

    "ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి! బ్యూటీఫుల్! ఎప్పుడు చేయించావు"

    "పిచ్చి మొద్దు నీకేమీ తెలియదు. ఇవి మనకి ట్రెడిషన్ గా వచ్చిన ఆభరణాలలోవి. ఎవరో మన తాతమ్మో ముత్తాతమ్మో చేయించుకున్నవి అన్న మాట! అమ్మగారు చాలా రోజులు ఇష్టంగా వేసుకున్నారట.

    మరీ మొరటుగా ఎనిమిది గాజులు ఎందుకు?

    "నువ్వు నాలుగు తీసుకో! నేను నాలుగు వేసుకుంటాను, అంది గాయత్రి!

    ఆమని ముఖం వికారంగా అయిపొయింది!

    "నాకు అలా ఒకరు ధరించిన నగలు వేసుకోవాలంటే అలర్జీ అక్కా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS