Previous Page Next Page 
మహిమ పేజి 3


    పెద్ద కార్పోరేట్ ఆఫీసు లెవల్లో ఎంతో ఆధునికంగా ఉంది ఆఫీసు. ఐదో అంతస్తు మొత్తం విజువల్స్. అంటే చాలామటుకు ఇండోర్ లో చిన్న చిన్న యాడ్స్ షూట్ చేస్తూ ఉంటారు. వంటగది, బాత్ రూమ్, డాక్టర్ ఛాంబర్... లాంటి వాటిల్లో ప్రకటనలకి సరిపోయే చిన్న చిన్న సెట్స్ కొన్ని, స్టూడియోలు, మేకప్ రూములు, రకరకాల ఆర్టిస్ట్ లు మేకప్ లతో, మెడలో ఐడెంటిటీ కార్డులు వేలాడేసుకుని ఎవరి పనులతో వారు బిజీగా ఉన్నారు. ఓ చోట ఏదో షూటింగ్ జరుగుతోంది. లైట్స్ ఆన్, కెమెరా అంటూ మాటలు వినిపిస్తున్నాయి. కొందరమ్మాయిలు, జూనియర్ ఆర్టిస్ట్ లు కాబోలు చేతిలో కాగితాలు చూసుకుంటూ స్క్రిప్టు కాబోలు చదువు కుంటున్నారు. కట్ ... లైట్సాఫ్ ... నిశ్శబ్దంగా స్టూడియో తలుపులు మూసి మిగతా ఆఫీసు అంతా తిరిగింది.
    నాలుగో ఫ్లోర్ లో విజువల్స్ చూస్తూ, మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎవరి పనిలో వారున్నారు. షూట్ అయి వచ్చిన ప్రకటనలని ఏ చిన్న తప్పు లేకుండా చూస్తూ, ఎడిట్ చేస్తూ, నెంబర్లేస్తూ, పేర్లురాస్తూ, పై అధికార్ల చేత ఓకే చేయించాక టీ.వి.లకి, ప్రింట్ మీడియాకి వెళ్ళాల్సిన సెక్షన్ల వారీగా సి.డి.లు ర్యాక్ ల నిండా సర్దివున్నాయి.
    మూడో ఫ్లోరంతా క్రియేటివ్, కమ్యూనికేషన్. ప్రతివాళ్లు ప్రకటనలకి కావల్సిన స్క్రిప్టులు తయారుచేస్తూ, కంప్యూటర్లతో కుస్తీపడుతున్నారు. తను పని చేయబోయేది ఈ సెక్షన్ అన్నమాట. కొత్తగా ఆర్టరు వచ్చిన ప్రకటనలకి, ప్రోడక్టులకి స్క్రిప్టు సిద్ధమయ్యేది ఇక్కడే. వివిధ ప్రకటనల విజువల్స్ తయారుచేసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు, ఎడిటర్లు, మ్యూజిక్, ఆర్టిస్టులు అంతా విజువల్ డిపార్ట్ మెంట్ కిందకి వస్తారు. ముద్రా కమ్యూనికేషన్స్ లో ట్రైనింగ్ పీరియడ్ లో ప్రతి డిపార్ట్ మెంట్, సెక్షన్స్ గురించి చెపుతారు. వాళ్ళ సెక్షన్స్ తోటే కాక అన్ని సెక్షన్స్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఏ డైరెక్టరుకో ఇంకో మంచి ఐడియా తట్టి స్క్రిప్టులో మార్పులు చేర్పులు సూచించవచ్చు. సి.డి. వచ్చాక ఓకే చేసే ముందు తాము ఇచ్చిన స్క్రిప్టుకి అనుగుణంగా యాడ్ తయారయిందో లేదో, భావం సరిగ్గా ప్రజెంట్ చేశారో లేదో చూసి సంతృప్తి చెందాకే ఓకే చెయ్యాలి. అలాగే ప్రకటనకి కావల్సిన ఖర్చుకి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ శాంక్షన్ తీసుకోవాలి. క్రియేటివ్ డిపార్ట్ మెంట్ లో భారతీయ భాషలన్నింటిలోకి ప్రకటనలు తయారవుతాయి. ముందు ఇంగ్లీషు తయారుచేసి తరువాత తర్జుమా చేస్తారు కాపీరైటర్స్. దాన్ని పర్యవేక్షించడానికి ఒక సీనియర్ రైటరుంటారు.
    రెండో ఫ్లోర్ అంతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్, ఛైర్మన్, డైరెక్టర్లు, ఫైనాన్స్ డైరెక్టర్, అకౌంట్స్ విభాగాలున్నాయి.
    ఫస్ట్ ఫ్లోరంతా అవుట్ డోర్ యూనిట్. సామాన్లు, ప్రొడక్షన్ మెటీరియల్, స్టోర్స్, క్యాంటీన్ అన్నీ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో షూటింగ్ వ్యాన్స్, అందరి కార్లకి పార్కింగ్ ప్లేస్ లు అలాట్ చేసి ఉన్నాయి.
    అంతా చుట్టివచ్చేసరికి సీమ వచ్చింది. "సారీ! కాస్త ఆలస్యం అయింది. పద వెడదాం" అంది.
    "ఫరవాలేదు, ఆఫీసంతా చూసి వచ్చాను ఈలోగా..."
    "ఇదో సముద్రం. మొత్తం నాలుగు వందల స్టాఫ్ ఉన్నారు. కాంట్రాక్ట్ ఆర్టిస్టులు కాక ఎవరెవరో కూడా సరిగా గుర్తుండరు, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా. అపార్ట్ మెంట్ లో కలిసి ఉన్నవాళ్లం స్నేహితులవుతాం. మిగతా అంతా పని వరకే పరిచయం. పద వెడదాం" స్కూటీ స్టాండ్ వైపు నడిచింది.
    "ఓ స్కూటీ ఉందా ?"
    "ఆ ... అపార్ట్ మెంట్ కి ఇక్కడికి ఒక కిలోమీటరు కూడా ఉండదు. నడిచే దూరం కాదు. రోజూ ఆటోలకి, క్యాబ్ లకి ఎక్కడ ఖర్చుపెట్టగలం. నీకు స్కూటీ నడపడం వచ్చా..."
    "ఓ ఎస్" అంది మహిమ ఉత్సాహంగా.
    "మరింకేం. నీకెప్పుడు కావల్సి వచ్చినా, నాది వాడుకో. కొత్తది కొనుక్కో. లోన్ కావాలంటే ఇస్తారు" అంది సీమ.
    మెయిన్ రోడ్ మీద నుంచి, ఓ సందులోకి దారితీసి, మై హోమ్ అపార్ట్ మెంట్ గేట్ లోంచి బేస్ మెంట్ లోకి తీసుకెళ్ళి తన స్కూటీని పార్క్ చేసింది సీమ.
    "ఇదే మా అపార్ట్ మెంట్. మన ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ లో ఉంది. రా" ఇద్దరూ లిఫ్ట్ లో పైకి వెళ్ళారు. "ఇవిగో ...304, 306 ఈ రెండు ఫ్లాట్ లు మనవే. మేం అందరం కలిసి తీసుకున్నాం. ఎదురెదురుగా ఉన్నాయి రెండు ఫ్లాట్లు. లోపలికి వెళ్ళగానే డ్రాయింగ్ రూము, సోఫాసెట్టు, టీ.వి., ఓ పక్క డైనింగ్ టేబుల్ ఉన్నాయి.
    "ఇదిగో, ఇది మన రూము" అంది సీమ.
    ఓ మాదిరిగా గది పెద్దదే. రెండు కిటికీల దగ్గర రెండు మంచాలు. ఎవరి మంచం దగ్గర వారికి టేబిల్, రెండు కప్ బోర్డ్ లు. సీమ టేబిల్...కంప్యూటర్, పుస్తకాలు... సామానుతో నిండి ఉంది. గదికి ఆనుకుని చిన్న బాల్కనీ ఉంది. బట్టలు ఆరేసున్నాయి. రెండు ప్లాస్టిక్ కుర్చీలు, బాత్ రూమ్, గీజరు, షవరు అన్నీ సదుపాయంగా ఉన్నాయనిపించింది.
    "ఓ గుడ్! చాలా బాగుంది రూము. ఇద్దరికి కంఫర్టబుల్ గా సరిపోతుంది. ఒకరికొకరు తోడు. చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు" సంతోషంగా అంది మహిమ.
    "సరే అయితే, రేప్పొద్దున ఎనిమిది గంటలకల్లా సామానుతో వచ్చేయి. సామానిక్కడ పడేసి ఆఫీసుకు వెడదాం. టిఫిన్ ఇక్కడే చేద్దాం" అంటూ "రేణుకా..." అని పిలిచింది సీమ. వంటింట్లో పనిచేస్తున్న ముఫ్పై, ముఫ్పై ఐదేళ్ల పనమ్మాయి వచ్చింది. "రేణుక... ఈ అమ్మాయి మహిమ. రేపటి నుంచి నా రూమ్మేట్. తనూ రేపు టిఫిన్ చేస్తుంది. తనకు కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి" అని రేణుకకు చెప్పి, మహిమ వైపు తిరిగింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS