Previous Page Next Page 
ఆలింగనం పేజి 29


    ఇంట్లోకి నడుస్తుంటే అంతా కొత్తగా అనిపించింది. గుమ్మానికి 'వెల్ కం' అన్న బోర్డు వేలాడ్తోంది.

 

    ఇంట్లోకి ఎర్రని పట్టుచీర, దానిమీద ఒత్తుగా గులాబీరేకులు అమరుస్తూ...చిన్నక్క!

 

    "అక్కా!" అన్నాను.

 

    చిన్నక్క కళ్ళజోడు పైకి తోసుకుంటూ, "వచ్చావా? కాస్త సహాయం చెయ్యి" అంది.

 

    "ఏమిటక్కా ఈ హడావుడంతా? మనింటికి ఎవరన్నా గెస్ట్ లు వస్తున్నారా?" అన్నాను.

 

    చిన్నక్క నన్ను ఎగాదిగా చూసి -

 

    "ఈరోజు నాన్నగారు రిటైరౌతున్నారు తెలీదా? ఏ లోకంలో ఉన్నావు?" అంది.

 

    "అయితే..." అన్నాను.

 

    "దానిదంతా చాదస్తం... ఆయన సేవలకి మనం ఇలా కృతజ్ఞతలు చూపాలంటుంది" అంది అమ్మ.

 

    చిన్నక్క గంభీరంగా "ఎస్సెల్సీ పాసయి పదిహేడేళ్ళప్పుడు ఉద్యోగంలో చేరి, ఒంటి రెక్క మీద ఈ సంసార రధాన్ని ఈరోజువరకూ తోసుకువచ్చారు. ఆయన రెక్కలు అలిసిపోయాయి. ఇంక ఈరోజు నుండీ మనం ప్రశాంతమైన జీవితాన్ని యివ్వాలి. ఇటువంటి నాన్న...లేనివాళ్ళు మనని చూసి ఎంత ఈర్ష్యపడతారో తెలుసా?" అంది.

 

    అమ్మ నవ్వింది. ఆమె కళ్ళనిండా నీళ్ళు వచ్చాయి.

 

    "చలికాలంలో ఎప్పుడూ ఒణుక్కుంటూ సైకిల్ తొక్కుతూ ఆఫీసుకి వెళ్ళేవారు. ఓ కోటు కొనుక్కోమంటే ఎన్నడూ నా మాట వినలేదు. తనకోసం ఒక్క పైసా అన్నా ఖర్చుచెయ్యలేదు. ఎప్పుడూ పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచనలే!" అంది.

 

    "అందుకే ఈ కోటు కొన్నాను" చిన్నక్క నాన్నగారి కోసం ఉన్నికోటు కొంది.

 

    నా బాధ తాత్కాలికంగా మర్చిపోయాను.

 

    'అన్నీ మిధ్య...ఒదులు...ఒదులుకో ఈ విశాల విశ్వంలో, అన్న తత్త్వాలూ, వేదాంతాలూ ఎన్నో విన్నాను కానీ...ఒదులుకోలేని యీ బంధాలూ, కనిపించని తీగలలో మనని బంధించే ఈ అనుబంధాలూ... ఎంత తీపి! ఎందుకు రాస్తారో అట్లాంటి పాడు పాటలు?

 

    అన్ని ఏర్పాట్లూ అయ్యాక చిన్నక్క కళ్ళల్లో ఎంత తృప్తి! పెద్దక్కా పిల్లలూ కూడా వచ్చారు.

 

    "కాళిందీ...ఉద్యోగం వచ్చిందిటగా, బాగానే సంపాదిస్తున్నట్లున్నావే?" అంది పెద్దక్క.

 

    దానికున్న డబ్బు యావ చూస్తుంటే నాకు మహా చిరాకేసింది.

 

    "ఏవిటే ఇట్లా ఎండిపోయావు? నీలో మునుపటి అందమేలేదు! ఏదో జబ్బు చేసినట్లు ఏవిటా వాలకం?" అంది నన్ను.

 

    పెద్దక్క పిల్లలు పుట్టిన తర్వాత బాగా లావయిపోయింది. అందుకే నన్ను చూసినప్పుడల్లా ఆ విధంగా మాట్లాడ్తుంది.

 

    నాలో దాని పూర్వపు పోలికలు కనిపించి గేలిచేస్తాయి అనుకుంట! అమ్మ పక్కన చేరి "అమ్మా...కొత్త చీరా?" అని చీరని సవరిస్తూ.

 

    "కాళీ తెచ్చింది. కావాలంటే తీసుకో" అంది అమ్మ నవ్వి.

 

    పిల్లలకోసం ఏదయినా సరే! ఆలోచించకుండా త్యాగం చేసేసే గుణం గలది తల్లి...బలీ, శిబీ, కర్ణుడూ కంటే గొప్పది కదా!

 

    నాన్నగారిని ఆఫీసువాళ్ళు కార్లో తెచ్చారు. చిన్నక్క హారతి పళ్ళెంతో అమ్మని ఎదురు పంపించింది. అమ్మ మొహం హారతి వెలుగులో ఎర్రగా ప్రతిఫలిస్తోంది! నాన్నగారు మెడలో పూలమాలతో స్వయంవరానికొచ్చిన రాకుమారుడిలా ఉన్నారు!

 

    "ఏవిట్రరా ఈ హడావుడీ?" అన్నారు.

 

    చిన్నక్క నాన్నగారికి కుంకుమతో నామం పెట్టి ఇంట్లోకి పూలమీద నడిపిస్తూ తీసుకువచ్చింది.

 

    ఆయన కుర్చీలో కూర్చున్నాకా "నాన్నా ఈరోజునుండీ ఈ కోటు వేసుకొని ఈ భగవద్గీతని ఈ స్టాండ్ లో పెట్టుకుని చదువుకోవాలి" అంది.

 

    ఆయన అక్క తల నిమిరాడు.

 

    పెద్దక్క చేసి తెచ్చిన సున్నుండని ఆయన నోట్లో పెట్టింది. పిల్లలంతా క్లాప్స్ కొట్టారు.

 

    నేను ఏమీ ఇవ్వలేదని తట్టి గబగబా వెళ్ళి నా గూట్లోంచి టేప్ రికార్డర్ తెచ్చి ఆయనకి ఇస్తూ "నాన్నా రేపటి నుండి మీకు ఇష్టమైన సుప్రభాతాన్ని వింటూ నిద్ర లేవండి!" అన్నాను.

 

    నాన్న నా తలమీదు ముద్దు పెట్టుకుని "రత్నాల్లాంటి మీ ముగ్గుర్నీమించిన బహుమతులేముంటాయమ్మా! అందుకు మీ అమ్మకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అని కొంటెగా అమ్మవైపు చూశారు.

 

    అమ్మ మొహం సిగ్గుతో దానిమ్మ పువ్వే అయింది.

 

    చిన్నక్క రెండు ప్యాకెట్లు తీసి "ఇందులో మీ ఇద్దరూ మీకు నచ్చిన చీరలు తీసుకోండి" అంటూ పెద్దక్కకి చూపించింది.

 

    "ఎందుకే!" చీరలు చూస్తూనే అంది పెద్దక్క.

 

    "ఎందుకంటే ఈరోజు నుండీ నాన్నగారి బాధ్యతలన్నీ నావే కనుక!" నవ్వుతూ అంది చిన్నక్క.

 

    "నా మీద ఇప్పుడు జాలిపడమను ఈ లోకాన్ని! పాపం ముగ్గురూ ఆడపిల్లలే అనేవాళ్ళు ప్రతివాళ్ళూ" గర్వంగా మీసాన్ని మెలివేస్తూ అన్నారు నాన్న.

 

    చిన్నక్క బలవంతం చేసి అందర్నీ భోజనానికి హోటల్ కి తీసుకెళ్ళింది. పిల్లలతో సమానంగా తనూ అల్లరి చేసింది! పెద్దక్క కూడా వాళ్ళ అత్తగారి గురించి ఏవేవో విషయాలు చెప్పి నవ్వుతోంది. నాన్నగారు అమ్మా కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

 

    అందరికన్నా గంభీరంగా ఉన్నది నేనే!

 

    అందరికీ రేపు ఏం చెయ్యాలో తెలుసు. నాకు మాత్రం శూన్యంగా ఉంది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS