ప్రాణం పోగానే ఆ కళేబరాన్ని భరించలేకపోయినాను. వికృతం, అసహ్యం, భయంకరం. జీవితానికీ మరణానికీ ఏమి సంబంధం లేదు. ఆకాశాన యెరిగిన పక్షి కాదిది. ఏదో భయంకర పదార్ధం. ఇంత భేదాన్ని కలిగించిన సూత్రం యేమిటి? ఇది వరకున్నది ఇప్పుడు లేనిది? నాకన్నా మహానుభావులు ఎందరో తలబద్దలయ్యేట్టు యోచించారు. ఏం లాభం? సుఖంగా దాన్ని కూరవొండుకొని తినక యీ ప్రశ్నలన్నీ! చచ్చింది ఎట్లాను చచ్చింది. ప్రాణం ఏ లోకానో వుంటేనేం లేకపోతేనేం? ఏడ్చి యోచించి నేనేమీ సహాయం చెయ్యలేను కదా! వేదాంతమంటే అదీ! నాలో లేదా యీ దేశపు హిందూరక్తం? కాని హిందువులకి వేదాంతం vusaline, నల్లమందు, ఏ బాధనించీ , వేదాంతంలోకి వెళ్ళి మనస్సుని సమాధానపరుచుకొని , తమ కూరత్వంలో, స్వార్ధంలో నిద్రపోతారు. కాని వేదాంతంలో ఎంత తిరిగినా నన్ను తృప్తిపరచదు. వేదాంతం జవాబు చెప్పలేని ప్రశ్నలు ఎన్నో తోస్తాయి. వేదాంతం ఎక్కడికీ పోనీ గుడ్డి గల్లీ -
మళ్ళీ తుపాకి మోత, ఇంకా చావులు, యింకా అరుపులు మళ్ళీ యింకా చావులు - కాలం గడిచింది. ఇదంతా చూస్తో ఏమి చలించకుండా సూర్యుడు నడుస్తున్నాడు. గాలి ఎప్పటంత సంతోషంగానూ వీస్తోంది. రక్తంతో ఎర్రబడ్డ పువ్వులు కూడా ఏం సంబంధం లేదన్నట్టు నవ్వుతూనే వున్నాయి.
చాలాసార్లు అనుకుంటాను. నేను లేని రోజు అనే మొదటి రోజు సంగతి. లోకంలో ఏ మార్పు వుండదు. ఒక మనిషి తక్కువైతే నలుగురు ఎక్కువవుతున్నారు. గడ్డి ఇట్లానే ఎదుగుతుంది. ఎండ యిట్లానే మండుతుంది. గాలి యిట్లానే వీస్తుంది. మనుషులిట్లానే తిరుగుతారు. నేను మాత్రం వుండను. అంటే, లోకమే వుండదు. యెట్లా వుంటుంది? నేను లేకపోయింతరవాత! కాని వుంటుందే! మరి ఎట్లా వుంటుంది? ఇట్లా యోచించి యోచించి అర్ధరాత్రులు , యీ సమస్య అంతం కాక మెదడు వేడెక్కి నిద్రరాక , మరిచిపోవాలంటే యీ సమస్య వదలక, పక్క మీద దొర్లుతాను, జీవితం మీద మనసుకి అంత ఆసక్తి ఉంది. అంత అనురాగం వుంది. అందువల్లనే "నేను లేకపోతే లోకం ఏదీ!" అనే అహంభావం. ఈ లోకమంతా మనసు కల్పించిన పటమేమో అనిపిస్తుంది. ఈ పాడుమనసు యింతకన్న మంచిలోకాన్ని కల్పించకూడదూ , శేషాచార్లూ, బురదలూ, పంగనామాల పందికొక్కులూ, ముళ్ళ కంచలూ , రోగాలూ లేని లోకాన్ని!
ఈ "నేను" జీవితానికంతా పునాది గనకనే యీ "నేను" ని పట్టుకుని యిట్లా వెళ్ళాడతారు మనుషులు. ఆ "నేను" లో నుంచి 'నాది' పుడుతుంది. పొట్ట మీద పాకే పిల్ల "నాది" అనలేక మొదటి సారి "అది" అనేటప్పటి కల్లా అవును ఆ "నాది' నీ దుఃఖాల కంతా 'అది ' అనుకుంటాను. ఈ "నేను" యీ "నాది" అనుకునేవాటిని అన్నిటినీ విడిచిపోవాలి ఎప్పుడో ఒకప్పుడు. అందుకనే ఎట్లాగో వోలాగు ఆ "నేను" ని ఇక్కడే వుంచాలని వోదలాలని వెర్రి ప్రయత్నాలు చేస్తారు. పుస్తకాలు వ్రాసి అవి శాశ్వతంగా వుంటాయని కవులకి భ్రమ. గీతాంజలి తెనిగించి సోమనాధరావు గారు, తన పేరు మీద రవీంద్రనాద్ పేరు మీద శ్లేష వేసి "రవి సోములుండు దాకా!" అన్నారు. ఇప్పుడా తెలుగు పుస్తకం సంగతి తెలిసినవాడేలేడు. సత్రాలు, టాజ్ మహల్ , అంకితాలు - యెన్ని వెర్రి ప్రయత్నాలు పాపం!
పై పెచ్చు యీ పురాణగాధలు తోడుపడ్డాయి. కీర్తిని శ్లాషించి శ్లాషించి , ఇంత తెలిసిన వేదాంతులు ఆ కీర్తిని ముఖ్యంగా చచ్చిన తరవాత కీర్తిని ఎందుకంత అవధిగా చూపారో అర్ధం కాదు. పోనీ బతికి వున్నప్పటికీ కీర్తి ఏదో వుపయోగపడవచ్చు. మంచి నీళ్ళ బదులు ఎవరన్నా మజ్జిగ యివ్వవచ్చు. "రైలు స్టేషనులో ఎవరో గుర్తుపట్టి సామాన్లు రైలులో ఎక్కించి పెట్టవచ్చు. కాని చచ్చింతరవాత ఆ రక్తం కోసం యీ పురాణయోధుల చేత ఘాతుక కార్యాలు చేయించారు, పుణ్యాలని పేరు పెట్టి. ఈ నాటికి ఆ కీర్తి కాంత శుభ్రంగా యిందరి మొగాళ్ళ పక్కల్లో మైలపడి కూడా యింకా మనుషుల్ని ఆకర్షిస్తోనే వుంది, నవకవుల్ని, దేశోద్దారాకుల్నీ , విశ్వదాతల్నీ!
నాలో మెల్లిగా మార్పు కలుగుతోంది . రాలిన తెచ్చిన పిట్టల్ని లెక్క పెట్టుతున్నాను. పొదల్లో దూరి పిట్టలు వాళ్ళకి చిక్కక తప్పించుకుంటో వుంటే బాధపడుతున్నాను. తుపాకి గురి తప్పితే అసహ్యించుకొంటున్నాను. ఎన్ కరేజ్ మెంటు ఇస్తున్నాను. డిజప్పాయింటు అవుతున్నాను. దిగులు పోయింది , ఉత్సాహం ఎక్కువైంది . 'అవుగో ! కొట్టు, కాల్చు, పట్టుకో, తీసుకురా! ఎన్ని? ఇంతేనా?' అంటున్నాను. ఆకాశం లేదు, పువ్వులు లేవు, నీళ్ళు కనబడవు. పిట్టలు , తుపాకీ దెబ్బలు , చావులు, పీనిగలు, రెక్కలు ఇంతే. గంట కింద బావురుమని ఏడవడానికి సిద్దమైన నేను; అందమైన అనుభవాన్ని , సుందర లోకాన్ని ధ్వంసం చేస్తున్నాడని నా మిత్రుడి మీద ఆగ్రహించిన నేను ప-----
చంపడమే ముఖ్యం. ఎన్ని చస్తే అంత సంతోషం ఆ పిట్టల్ని తినే కోర్కె లేదు. కాని అవి చస్తే నాకు తృప్తి . పడవనిండా కుప్పలు కుప్పలుగా అనేకరకాల పిట్టలు చచ్చినవి , చస్తున్నవి మెడలు వెళ్ళాడేసి , కళ్ళ మీద పొరలు కమ్మి యికల్ని నీళ్ళలో తడిసి అసహ్యమేసే ఆ కళేబరాల్నీ చూస్తె సంతోషం. విల్లువలె రెక్కలు వొంచి సునాయాసంగా గాలిలో తేలే పిట్టల్ని చూస్తె కోపం.
చివరికి ఇంకెందుకు , గంగ పాట్లని వర్నిస్తాడే భర్తహరి; - ఆ steps(స్టెప్సు) అన్నీ ; అంత అధోగతికి దిగాను. సరిగా గురి చూట్టం లేదని మిత్రుడి చేతులోంచి తుపాకి లాక్కొని కాల్చి ఓ కొంగకాలు విరగేసి కారు కారుమని అరుస్తో పరిగెత్తితే అది చచ్చి కింద పడలేదని దుక్కించాను.
ఇంక యీ ఉదంతాల్లో వుండే నీతి, అవినీతి , వ్రాయాలి. ప్రతి కధకీ పద్యాలకీ చివర నీతి వుండవోద్దూ! స్కూలు మాష్టర్లనీ, పిల్లల్నీ ,ఇన్ స్పెక్టర్లనీ అడగండి.
ఎందుకంటె నేను ఎప్పుడూ దుర్మార్గులకే వ్రాస్తాను. సన్మార్గులు యీ పత్రికల్ని పగలు చదవడం మానేశారు! వాళ్ళకి అప్పుడే దీంట్లో అవినీతి స్పష్టమై వుంటుంది ఎవరి పడకగదిలో వాళ్ళకి. ఇంక దుర్మార్గులకి ------
