Previous Page Next Page 
అమ్మా... నన్ను క్షమించొద్దు పేజి 24

అశోక్ మాటలకు ఉలిక్కిపడి కొద్దిగా సిగ్గుపడింది. అశోక్ సుజాత బిందెను నీళ్ళతో నింపటం చూసి ఆడవాళ్ళంతా చోద్యంగా బుగ్గలు నొక్కుకున్నారు. కనీసం "థ్యాంక్స్" కూడా చెప్పకుండా విశాలనేత్రాలతో ఓసారి చూసి వెళ్ళిపోయే ఆమెని ఆరాధనగా చూశాడతను.
ఆ కళ్ళు అతని కలల లోగిళ్ళయినాయి.
క్రమంగా సుజాత ఆలోచనల్లో కూడా అశోక్ చోటు చేసుకుంటున్నాడు. అతని మాట, చొరవ, ప్రేమ, అనురాగం ఆమెని వివశురాల్ని చేస్తోంది.
సుజాత మంచినీళ్ళకోసం వెళ్ళినప్పుడల్లా ఆలస్యంగా తిరిగిరావటం తల్లికి అనుమానం కలిగించింది. సదాచార కుటుంబం కాబట్టి నీళ్ళు స్వయంగానే తెచ్చుకోకతప్పదు. తాను అనారోగ్యవంతురాలు కాబట్టి కూతుర్ని పంపకా తప్పటం లేదు.
"నీ పెద్ద జడ వల్ల పువ్వుకే అందం" మందారపువ్వు అందించాడు.
"నీ విశాలనేత్రాల్లో నీ నీడ చూసుకోనీ" కళ్ళల్లోకి సూటిగా చూశాడు.
"నీ అరచేతి రేఖలు నా అరచేతి రేఖలకు జతపడినాయో లేదో చూడనీ" పాణిగ్రహణం చేశాడు.
బావిదగ్గర పూలతోట ప్రేమోద్యానం అయింది. కలల కౌగిలిలో కాలం బందీ అయింది.
పల్లెల్లో ఇలాంటివి ఎన్నాళ్ళు దాగుతాయి! కరణంగారు అగ్గిమీద గుగ్గిలమై పోయాడు.
"ఇంటి పరువు తీస్తావా..." అని జుట్టుపట్టి, లాక్కెళ్ళి గదిలో పడేసి దాదాపు బందీని చేశాడు.
తాను చూసిన సినిమాల్లో హీరోయిన్ లా అశోక్ తో లేచిపోయి పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డ సుజాత అతడు వూరిని విడిచిపోయాడని విని నిరాశతో నీరుగారిపోయింది.
పది రోజుల్లోనే పక్కవూళ్ళో బడిపంతులు బసవయ్యకు రెండో భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన సుజాత ప్రాణంలేని బొమ్మలా యాంత్రికంగా మారిపోయింది. ఆమె దృష్టిలో అశోక్ మోసగాడుగా పిరికివాడిగా మిగిలిపోయాడు.
తొలిప్రేమలోని మాధుర్యాన్ని రుచి చూపించిన అశోక్ మళ్ళీ జీవితంలో కన్పిస్తాడని సుజాహ ఊహించలేదు. బసవయ్యగారి భార్యగా బాధ్యతలు ,బాధలు తప్ప అనుభూతులు, ఆనందాలు లేని జీవితంలో అనుకోకుండా అశోక్ కనపడడం ఆమె మనసును అల్లకల్లోలం చేసింది.
చీరాల్లో బస్ ఆగిన కుదుపుకు ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకుంది సుజాత.
బస్ దిగి నిలుచుంది. అతనూ దిగాక ఆమె దగ్గరికి వచ్చాడు.
"ఏం పనిమీద వచ్చారు" కొంగు భుజాల చుట్టూ కప్పుకొని సంచీ చేత్తో పట్టుకుంది. ముందుకు అడుగేయబోతూ ఆగిపోయి అడిగింది.
"ఆఫీసు పనిమీద... ఇక్కడికి దగ్గర్లో పల్లెల్లో..." ఊరిపేరు చెప్పాడు.
"అరె.. అది మా వూరే.." ఆనందం, బాధ ఆమె స్వరంలో మెలికలు తిరిగాయి.
"అలాగా.. ఆటోలో వెళదాం" ఆటోకేసి నడిచాడు.. ఆమె అతన్ని అనుసరించింది.
ఇద్దరూ ఊళ్ళోకి అడుగుపెట్టారు.
భర్త ఏమనుకుంటాడో! అశోక్ తన కాపురం కూలుస్తాడా... ఇన్నేళ్ళ తర్వాత ఈ కలయిక దేనికి దారితీస్తుందో...
ఆలోచనల్లోనే ఇల్లు వచ్చేసింది.
బసవయ్యగారు ఇంటి అరుగుమీదే కూర్చొని చుట్ట కలుస్తున్నాడు. అతడ్ని తన భర్తగా అశోక్ కి పరిచయం చేయాలంటే సిగ్గుగా ఉంది. కానీ తప్పదు...
పరిచయాలయినాక... 'కూర్చోండి.. కాఫీ తెస్తాను' ఇంట్లోకి వెళ్ళింది సుజాత.
వాళ్ళిద్దరూ ఏవేవో సంగతులు మాట్లాడుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, పిల్లలు... లోపల్నుంచే ఆసక్తిగా వింటోంది.
"నాకు చిన్నప్పుడే మా మామయ్య కూతురితో పెళ్ళయిందండీ! ఇంజనీరింగ్ చదివించిందీ ఆయనే! ఉద్యోగం వచ్చి సెటిలయ్యాక ఫామిలీ పెట్టాను హైద్రాబాదులో" ఆ మాటలు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి.
ఎంతమోసం... తననో పావుగా వాడుకున్నాడు. అతని వల్లనే తొందరపడి నాన్న ఈ రెండో సంబంధం చేశాడు. కళ్ళల్లో నీళ్ళు కాఫీ గ్లాసులో పడుతుంటే తలతిప్పుకుంది. మౌనంగా కాఫీ గ్లాసు బల్లమీద పెట్టి లోపలికి వచ్చేసింది.
"మీరు పని అయినాక భోజనానికి మా యింటికే రండి" అమాయకపు బసవయ్య ఆహ్వానం అది.!
"వద్దండీ! శ్రమ ఎందుకు... నేను ఒక గంటలోనే వెళ్ళిపోతాను. సుజాతగార్కి థ్యాంక్స్ చెప్పండి.."
"మంచిదండీ! ఇటువైపొస్తే మా యింటికి తప్పక రండి. వాళ్ళ ఊరివాళ్ళు కనిపిస్తే సుజాతకెంతో ఆనందం."
అశోక్ వెళ్తేగానీ బైటికి రాలేదు సుజాత.
"అతగాడేమనుకుంటాడు.. కనీసం భోజనం చేసిపొమ్మని చెప్పొచ్చుగదా! మర్యాదకైనా అనవు" బసవయ్య మందలింపుగా అన్నాడు.
"మరేం ఫర్వాలేదు... అలాంటి వాళ్ళకిదే మర్యాద.. మీరు లోపలికి రండి.. గాలి చల్లగా ఉంది.." భర్త చేయి పట్టి లోపలికి తీసుకెళ్ళింది సుజాత.
పెళ్ళయ్యాక తొలిసారిగా ప్రేమగా మాట్లాడిన భార్య స్పర్శకు బసవయ్య వళ్ళు పులకరించింది.
తాను వచ్చిన పనిని పూర్తి చేసుకున్న తృప్తితో వెనక్కి తిరిగి వెళుతున్న అశోక్ బలహీనహృదయంలో తట్టుకోలేనంత సంతోషం! టప్ మని ఓ చుక్కరాలింది. తలెత్తి చూశాడు.. ఆకాశం నిండా... ఆకాశమంతటి నల్లమబ్బు... విధి వేరుచేసినా సుజాతను మర్చిపోలేని దురదృష్టవంతుడు. ఉద్యోగం ఇంటర్వ్యూకి పిలుపు వచ్చి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆమె పరాయిదై పోయింది. ఆమెను మరువలేక అవివాహితుడుగా మిగిలిపోయినా.. సుజాత తల్లిద్వారా ఆమె దాంపత్యజీవితం సరిగా లేదని విని.. ఆమె సుఖం కోరి.. అసంతృప్తితో రగిలే ఆమె మనసు మారటానికే ఆమె మేలుగోరి అలా విషయాన్ని మార్చి చెప్పాడని సుజాతకి ఎవరూ చెప్పే అవకాశం లేదన్న నమ్మకంతో సాగిపోతున్నాడతను.
వానజల్లు మొదలయింది. వాన కురిపించి జగత్తుకు మేలుచేసి, తేలికపడిన మనసుతో తేలిపోతుందా తెల్లమబ్బు అతనిలాగే!

                                                                 (కమలాకర్ మెమోరియల్ ట్రస్టు ప్రత్యేక సంచిక, మే 1999)
                                                                      * * * 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS