Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 23


    రామనామ కేదో అక్షరమే
    సబ సుఖ శాంతి సమాయీ! !
    అని (K C Dey) కే.సి.డే . పాడుతున్నాడు గ్రామ ఫోనులో. K C Dey రికార్డులు ప్రతి వాళ్ళకీ అమ్మకూడదని. ఒక శాసనం వుంటే బాగుండును! డెమోక్రసీ , ప్రజలందరికీ కళలు, ఆనందం , కమ్యునిజం  -- తారతమ్యం లేకుండా అనుభవం -- అంటాము. భాగ్యాలూ, భోగాలు, పంచుతాము కాని విలువగల కళా పదార్ధాల నించి అనందం పొందగల సంస్కారాన్ని యెవరు పంచగలరు? ఇది ఉత్త విద్యవల్ల, సాధన వల్ల , వాతావరణం వల్ల మనసులో కలిగంచగలిగిన మార్పు కాదు. లక్ష్మీ భాయి సంగీతాన్ని కాఫీ హోటలు రేడియో, దుమ్ము రోడ్ల మీద, మాధాకవళం వాళ్ళ నోళ్ళల్లో, మోటారు రోదల్లో, వేడి మసాలా వడల అరుపుల్లో, పందుల గురగురతో కలిసి వెదజల్లుతో వుంటే యేడుపు వస్తుంది. అమూల్యమైన సంగీతం ఎంతో కష్టపడితేనే కాని లభించని కళానుభవం ఎంత చులకనైపోయింది? తెల్లారకట్ట జట్కాబండి వాడు ఒంటరితనాన్ని తప్పించుకోడానికి "క్యా కరణ్ హై అబ్ రోనేకా" అని అరుస్తాడు.
    కే.సి.డే,
    'రామనామకేదో అక్షరమే' అని చక్కగా బతిమాలుతున్నట్లు పాడితే రామనమంలో నాకు కూడా ఉత్సాహం కలుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక దీక్షితులు గారికి ఎట్లా వుంటుందో? దీక్షితులు గారూ - D L రాయి "సీతి" చదివారా? అసలు రామాయణం అంతా "రామ" అనే శబ్దంలోంచే పుట్టిందేమో అనుకుంటాను. ఈ "రామ" అనే శభ్దానికి మంత్ర శాస్త్రంలో గొప్ప విలువ ఉంది. ఆ పదం మీద సాధారణ ప్రజలకు ప్రేమ కలగడానికనే ఆ రామాయణ కధ కలిపించారో , కాక ఆ పేరున్న యే రాజు కదో జంట చేశారో! "రామ" అనే పదం నిజంగా "సబ సుఖ శాంతి సమాయీ" కావచ్చు. శరీరం మీద, మనసు మీద నరాల మీద ఆ sound కి Influence అదికారం ఉండి వుండవచ్చునెమో! దానికి emotional quality ని యిచ్చేందుకై ఆ కధంతా వ్రాశారేమో!
    మిత్రుడు తారానాద్ గారిని చూడడానికి తుంగభద్ర వెళ్ళి నప్పుడు అక్కడ ఒక కన్నడ జ్యోతిష పండితుడున్నాడు. నేను రైలు దిగి వెళ్ళినప్పుడు సుమిత్రాగారికి జ్యోతిషంలో పాఠాలు చెపుతున్నారు.
    నన్ను చూడగానే తారానాద్ గారు "టీ వస్తుంది. యీ లోపల - ఆంధ్రులు వీరు. ఈయన జాతకం ఎట్లా నడవబోతుందో నాకు తెలిసికోవాలని ఉంది" అన్నారు.
    నా జాతక చక్రం వేసి అయన ముందు ఆమెని దాని మీద ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. "ఈ గ్రహాల కూటమి యేమి తెలియజేస్తోంది."
    ఆమె చెప్పలేదు . "count చేసే లెక్కకు వచ్చే జాతక చక్రాలు రెండు రకాలు---- శ్రీరాముడి చక్రం, శ్రీకృష్ణుడి చక్రం ." చూడండి.
    "ఈ జాతకుడి చక్రం దేనిమల్లె వుంది?"
    "కనబడుతోంది - అది శ్రీరాముడి చక్రం. అంటే జీవిత మంతా కష్టాలు."
    ఇది శ్రీరాముడితో పోలిక వచ్చినందుకు ఫలితం.
    "ఆదర్శాలూ, వాటికై యత్నం. ఆ మూలంగా తెచ్చి పెట్టుకున్న అశాంతీ, బాధలూ సంఘ ద్వేషం అపవాదులూ - యీ జాతకుడికి ఎన్నడూ సౌఖ్యమనేది సున్న. భోగాలు ఉండనీ, లేకపోనీ , వాటివల్ల సౌఖ్యం రాదు. దృష్టి ఆదర్శాల వేపు - అశాంతి - బాధ" అన్నాడు.
    నా సంగతి ఏమయితేనేం? శ్రీరాముడి సంగతి మాత్రం నిజమే పాపం!
    "ఇంక కృష్ణుడి చక్రం -- అన్నీ భోగాలు, అంతా లీల." నిజమే కృష్ణుడి దగ్గర ఎవరూ వేదాంతం మాట్లాడరు, అందరూ స్తుతులూ, యాచనలూ-
    "వేద పురుషుడివి నీకు తెలీందేముంది!" అని చల్లగా తప్పుకుంటారు. ప్రతి వాడికీ, ప్రతి రుషికి, కోతికి బైరాగికీ రాముడు లోకువ. ప్రతివాడూ , యోగమూ, ధర్మమూ, వైరాగ్యమూ మాట్లాడే వాడె భోధించేవాడే, పైగా ధర్మాలు వెలిగే యుగంలో స్వయంగా విష్ణులో ముప్పాతిక అంశంలో పుట్టాట్ట శ్రీరాముడు. ఆయనకి యీ బోధనల అవసరమేమిటో! శ్రీరాముడికి , ధర్మరాజుకీ , ఎవరు బోధించినా చచ్చేదాకా కూడా జ్ఞానం వొచ్చినట్లు లేదు. చివరదాకా భోదిస్తూనే వున్నారు. అన్ని పాపాలూ చేసిన అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత బోధించాడు. శ్రీకృష్ణుడు ప్రపంచవాంగ్మయమలో ఆకర్షకమైన పాత్రలలో ముఖ్యుడు పిల్లల కొంటెతనాలకి, చిన్నతనంలో వుండే అందానికి, సంతోషానికి , ఉత్సాహాలకి ఆదర్శం. బృందావనం , యమునా తీరం, గోపికలు, వేణుగానం, రాసనృత్యం - అంతా అలంకారం , అనందం . ఒక్కదినం కృష్ణుడితో  బృందావనంలో గడిపే అదృష్టానికి తన సాహిత్య ప్రాధాన్యాన్ని వోడులుకుంటానన్నాడు టాగూరు.
    పిల్లల అల్లరి ఆసక్తికి, యవ్వనుల శృంగారానికి ఎన్ని కలాలు కదుపుతాయి అతని కధలు!    
    అతను రసికాపతంసుడు. ప్రేమలో మోహంలో , చాతుర్యం, తీవ్రత, లీల శృంగారం - ఎంత వుందో అంతా చిరకాలం నించి కవులు తమ భావ వీధుల్లో అందుకో కలిగిందంతా శ్రీకృష్ణుడి మీద వర్ణించారు.
    అట్లాంటి వ్యభిచారి చేత (అస్కలిత బ్రహ్మగారి చేత)  ఉపనిషత్సారం అనుకుని సన్యాసులు పూజించే భగవద్గీతని చెప్పించడంలో వున్న రహస్యాన్ని సత్యాన్ని ఎవరన్నా గమనించారా?
    సౌరిస్ అంటోంది గదా "ఆ రాముడికి ప్రతిసారీ ఎవరో ఒకరు 'నువ్వు మనిషివి కావు దేవుడిని; నువ్వు మనిషివి కావు విష్ణుని' అని యెప్పుడూ జ్ఞాపకం చేయవలసిందే కదా! అంత చెప్పినా తెలివి రాదు. పైగా కృష్ణుడు తానే చెప్పుకుంటాడు నూటికి ముందు తానే భగవంతున్నని."
    "వినయం, వినయం," అని బళ్ళల్లో గుళ్ళల్లో భోదిస్తాడు గాని "వెధవనీ" అంటే లోకం కూడా "వును నువ్వు వెధవ్వే" అంటుంది. తన ప్రజ్ఞ తాను చాటుకొన్న వాణ్ణి లోకం విలువ చేస్తుంది; కావలిస్తే నవ కవుల్ని సన్మానించినప్పుడు వాళ్ళు రేపల్లెలో యిచ్చిన ఉపన్యాసాలు సాక్ష్యం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS