విశాలాంధ్ర
శ్రీశైలమల్లీశు సిగమీఁదిజాబిల్లి
తీపివెన్నెలలు చిందినది నేఁడు!
అమరావతీస్తూప కమనీయశిల్పాలు
ననలెత్తి పరిమళించినవి నేఁడు!
ఏడుకొండలవాని పైడిబెత్తముకాంతి
దిగ్దిగంతములు నిండినది నేఁడు!
సింహాచలస్వామి చెంచులదొరసాని
వి ల్లెక్కుడించి నవ్వినది నేఁడు!
కాకతమ్మ వాహన మోరుగంటిలోన
చెంగుమని లేచి రంకెవేసి నేఁడు!
హంపి యందలి శ్రీవిఠలాలయమున
కదలినవి రాతిరథము చక్రములు నేఁడు !!
విలసిల్లుచున్నవి వీథివీథుల మంద
హాసరేఖలు విజయధ్వజాలు
అలరుచున్నవి వాకిళుల మహోజ్జ్వలరత్న
హారాలు మంగళతోరణాలు
వినిపించుచున్నవి విశ్వకల్యాణ వి
హారాలు వీరశంఖారవాలు
రాజిల్లుచున్నవి తేజోవిరాజితా
శాంతాలు దివ్యదీపాంకురాలు
తెనుఁగుసస్యాలు విఱుగఁబడినవి నేఁడు
తెనుఁగుతోటలు విరియఁబూచినవి నేఁడు
కనుల సంతోషబాష్పాలు తొణుకులాడ
తెనుఁగుతల్లి రంజిల్లి నవ్వినది నేఁడు !!
జలకంబుల్ సవరించి - హస్తముల పూజాపాత్రముల్ దాల్చి - ఔ
దలలన్ వంచి - మహాంద్రవిష్ణువును సందర్శింప రం డల్లదే
తలుపుల్ దీసిరి - వింటిరా తెలుఁగుగంటల్ - కంటిరా వెల్గుపం
టలు - ముక్కోటి త్రిలింగసోదరుల కన్నా! నేడు 'ముక్కోటి'రా !!
తంబురా శ్రుతిచేసి త్యాగయ్య! రావయ్య!
తెనుఁగుపాటల తియ్యదనము మీఱ
పొలము దున్నుట చాలు పోతన్న! రావన్న!
తెనుఁగు మాటల చక్కదనము చింద
ధవళాశ్వమెక్కి రుద్రమదేవి! రావమ్మ!
తెనుఁగుకోటల దిట్టతనము వెలుఁగ
ఆముటేనుఁగుతోడ రామమూర్తీ! రమ్ము!
తెనుఁగుగుండెల గట్టిదనము చెలఁగ
రాష్ట్రపీఠన పసుపు పారాణి దాల్చి
కొలువుదీర్చెను నేఁడు మీ తెలుఁగు తల్లి;
సరససంగీతసాహిత్యశౌర్యధైర్య
దీప్తు లెగజిమ్ముఁ డాంధ్రప్రదేశ మెల్ల!
పొంగి పులకించెనేమి త్రిలింగభూమి;
వెలుగులు వెలార్చినది నేఁడు తెలుఁగునాడు;
తమ్ముఁడా రమ్ము! ఆర్ఘ్యపాద్యమ్ము లిమ్ము!
చెల్లెలా! తెమ్ము పువ్వులపళ్ళెరమ్ము!
పాలుకారెడు జవహరులాలుచేయి
శ్రీలు చిందించె నేఁడాంధ్రసీమ యెల్ల;
పువ్వుపువ్వున తేనెలు పొంగిపొరల
నవ్వినవి నేఁడు తెనుఁగు నందనవనాలు!!
భాగ్యనగరాన ఆంధ్రుల భాగ్యములను
దిద్దు నేఁడు మోతీలాలు పెద్దకొడుకు;
దేశ నాయకు "లాంధ్రప్రదేశ'మునకు
ఆచరింతురు పుణ్యావాహనములు !!
శింజానమధురమంజుల
మంజీరము లయ్యె తెలుఁగుమాగాణమ్ముల్ !!
పుంజీభవించె నవనవ
సంజీవ సమగ్ర సస్యసౌభాగ్యంబుల్.
తెనుఁగుజనయిత్రి దోయిలించినది నీకు
భారతసవిత్రి "శ్రీరస్తు" పలుకవమ్మ!
ఐకమత్యమ్ముతోడ ముందడుగు లిడఁగ
తెనుఁగుబిడ్డల ఆశీర్వదింపుమమ్మ !
.jpg)
"రండిరా యిదె! కాల్చుకోండిరా" యని నిండు
గుండెలిచ్చిన మహోద్దండమూర్తి
పట్టింపువచ్చెనా బ్రహ్మంతవానిని
గద్దించి నిలబెట్టు పెద్దమనిషి
తనకు నామాలు పెట్టిన శిష్యులను గూడ
ఆశీర్వదించు దయామయుండు
సర్వస్వము స్వరాజ్య సమరయజ్ఞము నందు
హోమ మ్మొనర్చిన సోమయాజి
అతఁడు వెలుఁగొందు ముక్కోటి ఆంధ్రజనులు
నమ్మికొల్చిన ఏకైక నాయకుండు;
మన "ప్రకాశము" మన మహామాత్యమౌళి
సరిసములు లేని "ఆంధ్రకేసరి" యతండు !
నీలాల ముంగురుల్ ఫాలాన నటియింప
ముద్దుగా గిరజాల దిద్దినాఁడు
సింగార మెగబోయు బంగారు నుదుటిపై
తిలకమ్ము కొనగోట తీర్చినాఁడు
ముంగాళ్ళపై పాలచెంగావి ధోవతి
జీరాడ కుచ్చెలల్ చెక్కినాఁడు
సిలుకు లాల్చీపైన జలతారు శాలువా
వింతగా వలెవాటు వేసినాఁడు
కప్పుర విడెమ్ము తావులు గుప్పు మనఁగ
పూలరంగని భంగి వాహ్యాళి వెడలె
దొర సంజెల గౌతమీ తీరములకు
"టింగు రంగా" యటంచు మా "టంగుటూరి."
ధైర్యసాహసభరితము తన చరితయే
తనజాతి చరితమై తనరువాఁడు
ధర్మదీక్షాపరత్వము తన తత్త్వమే
తనజాతి తత్త్వమై తనరువాఁడు
స్వాతంత్ర్య సమరసాక్ష్యము తన లక్ష్యమే
తనజాతి లక్ష్యమై తనరువాఁడు
అమరదీక్షాలవాలము తన శీలమే
తనజాతి శీలమై తనరువాఁడు
జీవితమె త్యాగమయముగా చేదుమందు
మ్రింగిన "మహాపురారి" మా "టంగుటూరి"
"ఆంధ్రకేసరి" దివ్యనామాక్షరములు
చెఱగ విఁకముందు భారత చరితమందు!
