Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 2


    "ఉహూ నేను వెళ్లను కామేశ్వరి పిన్నీ!"

    "వెళ్లకపోతే ఎలా? పద్దతి ప్రకారం ముండమోయక పోతే ఇంటికి అరిష్టం కదూ?

    "ఇంతకు మించిన అరిష్టం ఇంకేం వస్తుంది? ఇరవ య్యేళ్లకే భర్తను పోగొట్టుకోవడంకంటే అరిష్టం ఏముంటుంది?"

    "ఇక నీకు జరిగేదేమీ లేకపోవచ్చు! ఇంట్లో వుండే వాళ్ల యోగక్షేమాలు చూచుకోవాలికదా? ఇంకా తోడికోడళ్లు, ఆడపడుచులూ వున్న ఇల్లు!"

    "నేను ముండ మోయకపోవడానికి వాళ్ల యోగక్షేమాలకీ సంబంధం ఏమిటి?"

    కామేశ్వరి గొంతులో తీవ్రత చోటుచేసుకొంది. "వితండవాదం చాలుగాని లే! ఈ కాస్త అయిపోనిస్తే నీకు జరిగే నష్టం ఏమిటి?"

    "బొట్టులేని నా ముఖాన్ని అద్దంలో చూచుకోలేను! ఇరవయ్యేళ్లకే అరవయ్యేళ్లదానిలా వేషం వేసుకోలేను!"

    "ఇప్పుడీ తంతు అయిపోతే నువ్వు బొట్టు పెట్టుకొన్నా, ఎలా సింగారించుకున్నా అడిగేదెవరు?"

    "ఇప్పుడడిగేవాళ్ళే  అప్పుడూ వుంటారు! అప్పుడిచ్చే జవాబు ఇప్పుడిస్తాను! నా భర్తతో వచ్చినదేదో అతడు పోయిన మరురోజే తీసేశాను! ఈ బొట్టూ, గాజులు అతడితో రాలేదు!ఇవి చచ్చేదాకా ఇలా వుండాల్సినవే!  హక్కును ఎవరూ కాదనడానికి వీల్లేదు!" తొణుకూ బెణుకూ లేకుండా చెప్పింది శంకరి.

    శంకరికి నచ్చజెప్పడానికి కృష్ణమాచారిని లేపి తీసుకువచ్చారు. "నీ చెల్లెలికి నువ్వయినా నచ్చజెప్పవయ్యా! బొట్టూ, గాజులు తీసేయనంటూందావిడ!"

    "శంకరీ! ఏమిటమ్మా ఇది?" అంటూ వచ్చాడు ఆచారి.

    "నాకు భర్తపోయినదానికంటే నేను వేయబోయే వేషం గురించే కదన్నయ్యా నువ్వింత బాధపడేది? ఇంత బాధపడుతూ నాకీ వేషం వేయించాలని ఎందుకు తాపత్రయపడతావు?"సూటిగా అడిగింది.

    "కానీ తప్పదుకదమ్మా! శుభాలకేకాదు, అశుభాలకీ మనకి కొన్ని పద్దతులున్నాయి కదమ్మా? మనకిష్టమైనా కష్టమైనా చేయాల్సిందే!"

    "ఏ పద్దతి ఎందుకేర్పడిందో ఇప్పుడనవసరంగాని  ఈ పద్దతి మాత్రం... .భర్త మరణంతోనే సగం చచ్చే స్త్రీని, మిగతా సగంకూడా ఆమె బ్రతికుండగానే చంపేయడం అన్నయ్యా! కొంచెం సహృదయంతో ఆలోచించి చూడు! ఈ ఆచారాలు, శాస్త్రాలు, పద్దతులు - ఇవన్నీ పురుష పరంగా ఏర్పడ్డవే! స్త్రీపట్ల అతడెంత సంకుచితంగా, స్వార్దంగా ఆలోచించాడో  ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తను  చస్తే తన శవంతోపాటు తన భార్యనికూడా సజీవంగా తగలేసేంత వరకూ వెళ్లాయి అతడి ఆలోచనలు! అతడి ఆలోచనలే శాస్త్రాలుగా, ధర్మాలుగా రూపుదిద్దుకొన్నాయి! అవి స్త్రీ సజీవదహనం ఆగిపోయినా, బ్రతికివున్న ఆమె మీద కసిదీర్చుకొంటున్నట్టుగా ఈ ఆచారాన్ని సృష్టించారు. ముండమొయ్యడం అనే పేరుతో ఆమెకు ప్రేతరూపం వచ్చేట్టు చేశారు! తలగొరిగించారు! ఆమె నుండి అలంకరణలన్నీ దూరంచేశారు. నయం గరిటకాల్చి  ముఖం మీదవాత పెట్టమనలేదు! అక్కడికి సంతోషించాలి ఆఢది. ఇదంతా తను పోయాక మరో పురుషుడు ఆమెకేసి కన్నెత్తి చూడకూడదని! తన భార్య మరెవరికీ చెందకూడదని! కొంచెం చదువుకొనమి, విచక్షణగల ఆడది వీటిగురించి ఆలోచిస్తే తప్పేమిటన్నయ్యా?" ఆవేశంగా అడిగింది శంకరి.

    కృష్ణమాచారికి డిగ్రీలు లేవుగాని పురాణాలు, శాస్త్రాలు, బాగా చదువుకొన్నవాడే. శాస్త్రాలు ఆచారాలు అన్న సంకుచిత పరిధినుండి తొలగి కొంచెం విశాలంగా ఆలోచిస్తే వితంతు స్త్రీకి కల్పించబడిన  ఈ దౌర్బాగ్యం పురుషుడి స్వార్దపూరిత, సంకుచిత ఆలోచనే అని సుస్పష్టమౌతుంది! భార్య చచ్చిన మరురోజే పురుషుడు పూలరంగడిలా తిరగొచ్చు. మళ్లీ పెళ్లికూడా చేసుకోవచ్చు. కాని స్త్రీకి మాత్రం ఆ వీలు ఏది? అలంకరణల కన్నిటికీ దూరమై ఒంటిపూట భోజనం, దర్బాసనం మీద శయనిస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకొని స్వర్గంలో వున్న భర్తను కలుసుకోడానికి వీలయినంత  త్వరగా సమాయత్తం కావాలి!పాపం! స్వర్గంలో వున్న పతిదేవుని ఆత్మ తన భార్య ఎప్పుడు వస్తుందా అని ఒంటరిగా బిక్కు బిక్కు మంటుంటాడు మరి!

    మానవతా దృష్టితో చూస్తే చెల్లెలి వాదనలో తప్పేమీ కనిపించలేదు కృష్ణమాచారికి. అందుకని బలవంతం చేయలేకపోయాడు.

    కాని, అత్తగారు బంధువులు  అంతటితో వదలలేదు శంకరిని.

    "నా కొడుక్కు ముండమోయకపోతే నా కోడలెలా అవుతుంది? నా కోడలు కాకపోయాక ఇక ఈ ఇంట్లో తనకుండే పనేముంది? తక్షణం నా ఇంట్లోంచి నడువ్!" అన్నారు మామగారు.

    శంకరి వెంటనే తన బట్టలూ, సామానూ సర్దుకోసాగింది. "పదన్నయ్యా!"

    "కొంచెం ఆవేశం తగ్గించుకో, శంకరీ! భర్తకర్మ కాండకి వుండకుండా వెళ్లిపోతే బంధువుల్లో మాట వస్తుందమ్మా!ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే లేం! నలుగురున్నారని గుర్తు పెట్టుకొని నడవాల్సిన వాళ్లం!"

    "తన కోసం తను బ్రతకడం కాక, ఇంకెవరి కోసమో బ్రతకడం వల్లే మనిషి జీవితంలో ఇన్ని కష్టాలు, అన్నయ్యా! మనకు నచ్చిన పని. మనకు న్యాయమనిపించిన పని చేయడానికి నలుగురిని గుర్తుంచుకోవలసిన అవసరం ఏమిటి?"

    చెల్లెలి మాటలకు సమాధానం చెప్పలేనట్లుగా చూశాడు ఆచారి.

    అత్తగారు అందుకొని నిక్కచ్చిగా చెప్పింది "ఇప్పుడు మీ లెక్కేమిటని వెళ్లిపోయినట్టు కాదు!రేపు మా ఆస్తి పాస్తులతో నీకేమీ సంబంధముండదు!"

    "మీరైనా నేను ఇక్కడుండి చాకిరీ చేస్తేనే తిండీ బట్టా చూస్తారేమో! చాకిరీ చేసి తినడానికి అత్తగారిల్లే కానక్కరలేదు కదా?"

    "అయితే నిన్ను దొరసానిలా కూర్చోబెట్టి చేయాలామేం?"

    "అక్కరలేదు! నా మానాన నన్ను బ్రతకనిస్తే చాలు!"

    బావమరిది కర్మకాండకని వచ్చి ఇలా అర్దాంతరంగా చెల్లెలిని తీసుకొని వెళ్లిపోతే బాగుండదేమో అని ఆలోచిస్తున్నాడు ఆచారి.

    "వదినకి నెల తప్పింది కదా? ఎలాగూ మీకో మనిషి అవసరమే కదా? నాకు ఊరికే తిండి పెట్టక్కరలేదు!"

    "ఛీ! ఎంత నిష్టూరంగా మాట్లాడుతున్నావమ్మా? స్వంత చెల్లెలికి తిండి పెట్టడానికి పని చేయించుకొనే దౌర్బాగ్యుడిలా కనిపిస్తున్నానా?" ఆచారి విచలిత స్వరంతో అన్నాడు, కళ్లు ఆర్ద్రమైపోగా.


                          *    *    *   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS