Previous Page Next Page 
దేవదాసు పేజి 2

    ఏమిటిరా ఇదంతా?"
    "ఆ దేవదాసుగాడు__నన్ను నెట్టి__ఆఁ__ఆఁ__వాడి లెక్క _"
    "మళ్ళీ మూర్ఖుడా?"
    కాని క్షణంలో జరిగిన వ్యవహారమంతా తెలిసికొని, చాపమీద కూర్చొని అడిగాడు_దేవదాసు నిన్ను నెట్టి, పడగొట్టి వెళ్ళిపోయాడా?"
    భూలో అన్నాడు__"ఆఁ__ఆఁ__ఆఁ__ఆఁ" తరువాత కొన్ని క్షణాలు సున్నం దులుపుకొన్నాడు. అయితే శ్వేతవర్ణం, శ్యామ వర్ణం కలిసిపోయిన కారణంగా విద్యార్ధి నాయకుడు భూతంలాగా కన్పిస్తూ వున్నాడు. అప్పుడు కూడా అతడి ఏడ్పు ఆగలేదు.
    "దేవా నిన్ను నెట్టి సున్నంలోకి పడగొట్టి వెళ్ళిపోయాడా, సరే!" అన్నాడు
    "ఆఁ__ఆఁ__ఆ__" అన్నాడు భూలో.
    "పిల్లలెక్కడున్నారు?" అడిగాడు పంతులవారు.
    ఆ తరువాత పిల్లల సమూహం కందిపోయిన వదనాలతో రొప్పుకుంటూ రోజుకుంటూ తిరిగివచ్చి "దేవాను మేము పట్టుకోలేకపోయామండీ! అబ్బా! ఎంతో గురిగా రాయి విసురుతాడు!" అని చెప్పారు.
    "పట్టుకోలేకపోయారా?"
    మరో పిల్లవాడు మొదట చెప్పిన విషయాన్నే రిపీట్ చేస్తూ "అబ్బా! ఎంతో గురిగా....!"
    "కొంచెం ఆగండి!"
    అతడు నోరుమూసుకుని ప్రక్కనే కూర్చుండిపోయాడు. నిష్ఫలమయిన క్రోధంతో మొదట పండితులవారు పార్వతిని బాగా బెదిరించారు. తరువాత భోలానాద్ చేయి పట్టుకొని "పద, ఒకసారి జమీందారుగా కచేరీలో చెప్పివద్దాం!" అన్నారు.
    జమీందారయిన ముఖోపాధ్యాయగారి దగ్గర వారి పుత్రరత్నం యొక్క ప్రవర్తనను గురించి ఫిర్యాదు చేద్దామని దాని తాత్పర్యం.
    అప్పుడు దాదాపు మూడు గంటల అవుతూ వుంది. నారాయణ ముఖోపాధ్యాయగారు బయట కూర్చొని హుక్కా త్రాగుతూ వున్నారు. ఒక నౌకరు పంఖా చేతబట్టుకొని విసురుతూ వున్నాడు. విద్యార్ధితోపాటు ఆ కాలంలో పండితులవారి రాకతో విస్మితుడై  "ఎవరూ, గోవిందా?" అన్నాడాయన.
    గోవింద్ పండితుడు కాయస్థుడు. అంచేత వంగి నమస్కారం చేసాడు. భూలోను చూపించి విషయమంతా వివరంగా వర్ణించాడు. ముఖోపాధ్యాయగారు విరక్తి చెంది "అయితే దేవదాసు అదుపు తప్పిపోతున్నాడన్న మాట!" అన్నారు.
    "ఏం చేసేది? ఇక మీరే సెలవియ్యండి!"
    జమీందారు బాబు హుక్కా పైపు ప్రక్కనబెట్టి  "వాడు ఎటువెళ్ళాడు?" అన్నాడు.
    "ఏం తెలుసు? పట్టుకొనడానికి వెళ్ళిన వాళ్ళను, రాళ్ళు విసిరి తరిమేశాడు."
    వాళ్ళిద్దరూ కొంచెం సేపు మౌనంగా వున్నారు. "ఇంటికి వచ్చినపుడు వాడి సంగతి చూస్తాలెండి." అన్నాడు నారాయణబాబు.
    గోవింద్ పండితుడు విద్యార్ధి చేయి పట్టుకొని పాఠశాలకు మామూలు వేళకన్నా కొంచెం ముందుగానే సెలవిచ్చేశారు. వెళుతూ, వెళుతూ పిల్లలు అనేక విమర్శలూ, ప్రతి విమర్శలూ చేసుకుంటూ వున్నారు.
    "అబ్బా! దేవా ఎంత బలం గలవాడు!" అన్నాడు ఒకడు.
    "భూలోను బెదరగొట్టి ఆశ్చర్యపరిచాడు" అన్నాడు మరొకడు.
    "అబ్బా! ఎంత గురిగా రాయి విసురుతాడు!"
    ఒకడు భూలో పక్షం వహిస్తూ "భూలో దీనికి బదులు తీర్చుకుంటాడు, చూసుకో" అన్నాడు.
    "హిశ్! బదులు తీర్చుకొనడానికి అతడు ఇక పాఠశాలకు వస్తే గదా?"
    ఈ చిన్న సమూహానికి ఓ ప్రక్కగా పార్వతి కూడా తన పుస్తకమూ, స్లేటూ తీసికొని ఇంటికొస్తూ వుంది. దగ్గరలోని ఒక బాలుడి చేయి పట్టుకొని "మణీ! దేవదాసును పండితులవారు నిజంగానే పాఠశాలకు రానివ్వరా?" అని అడిగింది.
    రానివ్వరు, ఏ విధంగానూ రానివ్వరు" అన్నాడు మణి.
    పార్వతి తప్పుకొని ముందుకు పోయింది. ఆమెకు యీ సంభాషణ బొత్తిగా నచ్చలేదు. పార్వతి తండ్రి పేరు నీలకంఠ చక్రవర్తి. చక్రవర్తి మహాశయుడు జమీందారుగారి పొరుగువాడు. ముఖోపాధ్యాయగారి భవంతి ప్రక్కనే ఆయన ఇల్లు వుంది. అది చాలా చిన్నది. పురాతన పద్దతిలో కట్టిన కట్టడం. ఆయనకు పన్నెండు బీఘాల వ్యవసాయం వుంది. నాలుగిళ్ళ పౌరోహిత్యం వుంది. జమీందారుగారి ఇంటి నుంచి కూడా కొద్దీ గొప్పా లభిస్తూనే వుంటుంది. ఆయన కుటుంబం సుఖంగా వుంది. హాయిగా కాలం గడిచిపోతూ వుంది.
    మొదట పార్వతికి ధర్మదాసు ఎదురయ్యాడు. అతడు దేవదాసు ఇంట్లో వుండే నౌకరు. సంవత్సరం వయసు దగ్గర నుంచి యెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ ఆమె అతడి వెంట వస్తూ, పోతూ వుండేది. పాఠశాలకు పంపించి పోతాడు. సెలవియ్యగానే ఇంటికి తీసుకుపోతాడు. అతడు యీ పని నియమ పూర్వకంగా ప్రతిరోజూ చేస్తాడు. ఈరోజు కూడా ఆ పని మీదే పాఠశాలకు వెళ్ళాడు. పార్వతిని చూసి అతడు "పత్తో, దేవదాదా ఎక్కడున్నాడు?" అన్నాడు.
    "పారిపోయాడు."
    "పారిపోయాడా? ఎందుకూ?" అన్నాడు ధర్మదాసు చాలా ఆశ్చర్యంగా.
    తర్వాత పార్వతి భోలానాథ్ కు పట్టిన దుస్థితికి సంబంధించిన వృత్తాంతం కొత్త పద్దతిలో జ్ఞప్తికి తెచ్చుకొని నవ్వుతూ వుంది__"చూడు ధర్మా, దేవదాదా యెక్కడున్నాడు?" అన్నాడు.
    "పారిపోయాడు."
    "పారిపోయాడా? ఎందుకూ?" అన్నాడు ధర్మదాసు చాలా ఆశ్చర్యంగా.
    తర్వాత పార్వతి భోలానాథ్ కు పట్టిన దుస్థితికి సంబంధించిన వృత్తాంతం కొత్త పద్దతిలో జ్ఞప్తికి తెచ్చుకొని  నవ్వుతూ వుంది__"చూడు ధర్మా, దేవదాదా__హి__హి__హి__అమాంతంగా ఆ సున్నం గుట్టలో__హి__హి__
హూ__హూ__అమాంతంగా ధర్మా, వెల్లికిలగా పడవేశాడు.
    ధర్మాదాసుకు ఆ మాటలన్నీ అర్ధం కాకపోయినా, ఆ నవ్వు చూసి కొద్దిగా నవ్వాడు. తరువాత నవ్వు ఆపుకొని "ఏం జరిగింది పత్తో? చెప్పవేమిటీ?" అన్నాడు.
    "దేవదాసు, భూలోను నెట్టి పొడి సున్నంలో పడ....హి_హి_హి_."
    "ధర్మదాసు ఈసారి అంతా అర్ధం చేసుకున్నాడు. చాలా విచారిస్తూ "పత్తో, అతడు ఇప్పుడు యెక్కడున్నాడో నీకు తెలుసా?" అన్నాడు.
    "నాకేం తెలుసు?"
    "నీకు తెలుసు, చెప్పు. అమ్మో! అమ్మో! అతడికి ఆకలయి వుంటుంది."
    "ఆకలయ్యే వుంటుంది. అయినా నేను చెప్పను."
    "ఎందుకు చెప్పనూ?"
    "చెపితే నన్ను చితకబాదుతాడు. నేను అన్నం ఇచ్చి వస్తాను."
    ధర్మదాసు కొంచెం అసంతృప్తిగా__"అయితే ఇచ్చిరా. చీకటి పడకముందే మరపించి ఇంటికి తీసుకొని రా."
    "తీసుకొస్తాను."
    పార్వతి ఇంటికి వచ్చి చూసింది. ఆమె తల్లీ, దేవదాసు తల్లీ కథ అంతా వినే వున్నారు. ఆమెను కూడా విషయాలన్నీ అడిగారు. నవ్వుతూనూ, గంభీర్యంగానూ ఆమెకు చేతనయిన విధంగా చెప్పింది. తరువాత మొర్మొరాలు చిన్న గుడ్డలో మూటగా కట్టుకొని జమీందారుగారి తోటలోకి జొరబడిపోయింది. తోట వారి ఇళ్ళకు దగ్గరగానే వుంది. అందులోనే ఓ వైపు వెదుళ్ళ తోపు వుంది. దాగి వుండి పొగ త్రాగడానికి దేవదాసు యీ వెదుళ్ళ తోపు మధ్యలో ఒక చోటు శుభ్రం చేసికొని వుంచినట్లు ఆమెకు తెలుసు. పారిపోయి వచ్చినప్పుడల్లా దాగి వుండటానికి అదే అతడి రహస్య స్థావరం. పార్వతి లోపలికి వెళ్ళి చూసింది. వెదురు తోపు మధ్యలో దేవదాసు ఓ చిన్న హుక్కా పట్టుకొని కూర్చున్నాడు. పెద్దవాళ్ళలాగా ధూమపానం చేస్తూ వున్నాడు. ముఖం చాలా గాంభీర్యముగా వుంది. అతడి ముఖంలో ఎన్నో దుర్భావనల చిహ్నాలు వ్యక్తమవుతూ వున్నాయి. అతడు పార్వతి రావడం చూసి చాలా సంతోషించాడు. కాని ఆ సంతోషాన్ని బయట పడనివ్వలేదు. పొగ త్రాగుతూనే 'రా' అన్నాడు.
    పార్వతి దగ్గరకు వచ్చి కూర్చున్నది. ఆమె తెచ్చిన ఆ చిన్ని మూటమీద అతని దృష్టి పడింది. ఇంకేమీ అడగకుండా అతడు ముందు దానిని విప్పుకొని నములుతూ "పత్తో, పండితులవారు ఏం చేశారు?" అన్నాడు.
    "పెదనాన్న గారితో చెప్పారు."
    దేవదాసు కోపంతో "నాన్నగారితో చెప్పారా?" అన్నాడు.
    "అవును."
    "ఆ తరువాత?"
    "నిన్ను ఇక నుంచి పాఠశాలకు రానివ్వరు."
    "నేను కూడా చదవదలచుకోలేదు."
    అదే సమయంలో ఆ తింటున్న మొర్మొరాలు అయిపోవచ్చాయి. దేవదాసు పార్వతి ముఖం వైపు చూస్తూ "ఏదయినా చిరుతిండి పెట్టు."
    "చిరుతిండి ఏమీ తీసుకొని రాలేదు."
    "అయితే మంచినీళ్ళు తీసుకొని రా!"
    "మంచినీళ్ళు యెక్కడ తెచ్చేదీ?"
    దేవదాసు విసుగుకొని "ఏమీ చేయలేకపోతే వచ్చింది యెందుకూ? వెళ్ళు, మంచినీళ్ళు తీసికొని రా."
    కఠోరంగా వున్న అతడి స్వరం పార్వతికి నచ్చలేదు. "నేను వెళ్ళలేను. నీవు వెళ్ళి త్రాగిరా" అన్నది.
    "నేను ఇప్పుడే వెళ్ళగలనా?"
    "అయితే ఇక్కడే వుంటావా?"
    "ఇక్కడే వుంటాను. తరువాత యెక్కడికైనా వెళ్ళిపోతాను."
    ఇదంతా విని పార్వతికి చాలా దుఃఖం కలిగింది. దేవదాసు యొక్క యీ వైరాగ్యం చూసి, అతడి మాటలు విని ఆమె కళ్ళు చెమర్చాయి. "అయితే నేను కూడా వస్తాను" అన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS