Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 2


    "ఆ, నాలుగు రోజులు తిరిగితే అసలు సంగతులు, బిహేవియర్ తెల్సిపోతుందా?"
    "నాలుగు రోజులు కాకపోతే నాలుగేళ్లు తిరిగినా, భార్యాభర్తల మధ్య వుండే మైనస్, ప్లస్ పాయింట్లు బైటికి రావు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గా వున్నన్ని రోజులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోడానికి ప్రయత్నిస్తారు. పెళ్లయి సంసారం, బాధ్యతలు పైన పడితే అప్పుడసలు స్వభావాలు బైటికి వస్తాయి" జయలక్ష్మి అంది.
    "ఎస్, యువర్ మమ్మీ ఈజ్ రైట్ చతురా, మూడుముళ్లు పడి కాపురం మొదలుపెట్టేవరకు అసలు ఎవరు ఏమిటి అన్నవి బైటపడవమ్మా! కాని అన్నాళ్లు పెళ్లి కాకుండా లిగింగ్ టుగెదర్ చేస్తాం అంటే ఒప్పుకోడానికి మన సమాజం ఇంకా అంత ఎదగలేదు. అలా తిరిగిన అమ్మాయిని మళ్లీ ఏ మగాడు యిష్టపడడు తెలుసా? ఏదో చదివేస్తున్నాం, ఉద్యోగాలు చేసేస్తున్నాం, మాకేం అనుకున్నా పెళ్లిళ్ల వేళకి సాంప్రదాయాలు, అలవాట్లు, కుటుంబాలు, అమ్మాయిల ప్రవర్తన అన్నీ చూస్తారు. అబ్బాయిలు మాత్రం తక్కువా? తను గర్ల్ ఫ్రెండ్ తో తిరగచ్చు కానీ, అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో తిరిగితే అలాంటి అమ్మాయితో సరదాగా తిరుగుతాడు కాని, మళ్లీ పెళ్లి అంటే ఆలోచించే స్థాయిలోనే వున్నాం మనం ఇంకా."
    "అలా చెప్పు కాస్త దానికి. ఏమిటో అదేం చేసినా, ఎలా తిరిగినా మగపిల్లలు లైను కట్టి నిల్చుని పెళ్లి చేసుకుంటారనుకుంటుంది."
    "పోనీ చేసుకోకపోతే, పెళ్లి కాకపోతే ఇంక జీవితమే వుండదా?" నిర్లక్ష్యంగా అంది.
    "ఇప్పుడిలాగే మాట్లాడుతారు. సంపాదించుకుంటూ, కేర్ ఫ్రీగా స్నేహితులతో తిరగడం అదే లైఫ్ అనుకుంటారు. రాను రాను ఆ లైఫ్ విసుగొస్తుంది. స్నేహితులు ఎవరి లైఫ్ లో వాళ్లు సెటిల్ అవుతారు. రొటీన్ లైఫ్ బోరు కొట్టి మార్పు కావాలనిపిస్తుంది. మీదపడిన వయసు, నచ్చక కొందరు, భావాలు సరిపడక కొందరు, వయసుకి తగ్గవాడు దొరక్క వేసారి, ఆ విసుగు, కోపం, ఆ ఫ్రస్టేషన్ మళ్లీ పేరెంట్స్ మీదే చూపిస్తారు. ఎంతమందిని చూడలేదు ఇలాంటివారిని?"
    "సరేలే నా కోపం, తాపం మీమీద చూపించనని బాండు పేపరు మీద రాసిస్తాలే. ఇంక వదిలెయ్ తల్లీ! ఈ పెళ్లిగోల..." సగం హాస్యం, విసుగు, అప్రసన్నత అన్నీ కలిపి చూపిస్తూ అంది.
    ఇంట్లో గెస్ట్ లున్నారు అని కూతురు ఇలా వదిలింది. లేకపోతే ఎలా అరిచేదో జయలక్ష్మికి తెలుసు కనక ఇంక వూరుకొంది. "ఇదిగో ఇదీ వరస శోభా! కోపం, బాధ మిళితమైన స్వరంతో అంది.
    "సరేలే, ఓ.కె... చతురా, పెద్దవాళ్లు, పేరెంట్స్ మీ మంచి కోరి అనుభవంతో చెపుతారమ్మా! అర్థం చేసుకో!" ఇద్దరినీ సముదాయిస్తూ అంది శోభన.
    "ఓ.కే. లెటజ్ హావ్ ఫుడ్..." డ్రింక్స్ పూర్తయి చనువుగా అన్నాడు రాధాకృష్ణ వాళ్ల కబుర్లు, వీళ్ల కబుర్లకి ఫుల్ స్టాప్ పెడుతూ.

                                                *  *  *  

    వారం తరువాత జయలక్ష్మి కాలేజీనుంచి యింటికి వచ్చేసరికి ఎవరో ఫ్రెండ్ తో కూర్చుని కబుర్లు చెపుతోంది చతుర. డైనింగ్ టేబుల్ మీద పిజ్జా, కేక్ లు, కప్పులు, చిప్స్ చెల్లాచెదురుగా వుండడం యిద్దరూ చాలాసేపటి నుంచి యింట్లో వున్నట్టు చెప్పకనే చెపుతున్నాయి జయలక్ష్మికి.
    "హాయ్ అమ్మా! ఇతను పవన్... నా కొలీగ్" పరిచయం చేసింది.
    ఆ అబ్బాయి కుర్చీలోంచి లేచి "నమస్తే ఆంటీ!" అన్నాడు.
    మర్యాదకి ఓ నవ్వు నవ్వి "ఏమిటీ ఆఫీస్ లేదా? వెళ్లావు గదా!" అనుమానంగా చూస్తూ అడిగింది.
    "వెళ్లా... నిన్న రాత్రి మా బాస్ కి సీరియస్ కార్ యాక్సిడెంట్ అయిందని, కేర్ హాస్పిటల్లో వున్నాడని అందరం చూడడానికి వెళ్లాం. అందరికీ మూడ్ ఆఫ్ అయింది. సెలవిచ్చేశారు ఆఫీసుకి. ఇక్కడికి వచ్చి లంచ్ ఆర్డర్ చేసి తిన్నాం యిద్దరం" వివరణ ఇచ్చింది చతుర. తల్లి మొహంలో మారుతున్న రంగులు చూసి కూడా చూడనట్టు తేలిగ్గా అంది.
    "ఐసీ, ఎక్స్ క్యూజ్ మీ... ఫ్రెష్ అయి వస్తా" లోపలికెళ్లిపోయింది.
    బట్టలు మార్చుకు వచ్చేసరికి బయట ఇద్దరూ అతని బైక్ దగ్గర నించుని మాట్లాడుతున్నారు. కూతురు మోటార్ సైకిల్ సీటు మీద బైఠాయించి, ఆ అబ్బాయి ఏదో చెప్తుంటే "ఏయ్, యార్ షటప్..." అంటూ చనువుగా భుజం మీద చరుస్తూ అంటోంది. చుట్టూ బాల్కనీల్లో చాలామంది వున్నారు. పిల్లలు కింద ఆడుతున్నారు. కొందరు వయసు మళ్లినవారు వాక్ చేస్తున్నారు. అంతా చతుర వంక ఒకసారి చూసి చూపులు తిప్పుకుంటూ వెళుతున్నారు.
    'ఇంట్లో ఇంతసేపు గడిపింది చాల్లేదు కాబోలు, బయట నిలబడి ఆ నవ్వులేమిటి? భుజం మీద చేతులేసేంత చనువేమిటి? నలుగురూ చూస్తున్నారన్న లెక్కలేదు" జయలక్ష్మి కోపం అణుచుకుంటూ వంటింట్లోకి వెళ్లి కాఫీ చేసుకు తెచ్చుకుని బాల్కనీలో కూర్చుంది. తాగుతున్న వేడి కాఫీ ఆమె ఆలోచనలని మరింత వేడెక్కించింది.
    మరో పది నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన చతురని చురచుర చూస్తూ "అయిందా సాగనంపడం? ఏమిటలా బైకెక్కి కూర్చుని నవ్వులు, మాటలు, అంతా చూస్తున్నారని కూడా లేకుండా..."
    "మొదలుపెట్టావా, సెర్ మన్స్... ఏమిటి నీ బాధ? ఎవరితో స్నేహం చెయ్యకూడదు, మాట్లాడకూడదు. ఆఫీసు, ఇల్లు తప్ప ఇంకోటి లేకుండా బుద్ధిగా కూర్చోవాలి. అమ్మా, నీ ఆంక్షలు నే పాటించనని తెలిసీ ఎందుకలా రోజూ ఏదో ఒకటి వల్లిస్తావు?"
    "ఎందుకంటే నీ తల్లిని కనక, నీ మంచిచెడ్డల బాధ్యత నాది కనక, అలా ఆ అబ్బాయిని యింటికి తీసుకొచ్చి యింతసేపు గడిపింది చాలక, రోడ్డుమీద ఆ మాటలేమిటి?"
    "ఓహో! అమ్మాయిలయితే గంటలకొద్దీ మాట్లాడినా ఫరవాలేదన్నమాట! బాయ్ ఫ్రెండ్స్ తో కూడదన్నమాట!"
    "చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు, యింతకీ ఎవడీ పవన్? ఇదివరకు చూసినట్టు లేదు?" ఆరా తీసింది.
    చతుర నిర్లక్ష్యంగా "పవన్ అని చెప్పాగా, మా కొలీగ్..."
    "అంటే కొత్తగా చేరాడా? ఇన్నాళ్లు స్నేహం లేదా మరో కొత్త ఫ్రెండా? ఇంటికొచ్చేంత ఫ్రెండ్ అయ్యాడా?"
    "నా కొలీగ్. ఇంకో బ్రాంచి నుంచి కొత్తగా వచ్చాడు. చాలా ఇన్ఫర్మేషన్? కులం, గోత్రం, కుటుంబం, జాతకం అన్నీ చెప్పమంటావా? ఇంటికి రావడం తప్పంటే ఇంక తీసుకురాను. ఏ కాఫీ హౌస్ కో పోతాం. అమ్మా! నీలాంటి చదువుకుని, ఉద్యోగం చేసే తల్లులు కూడా ఇలా మాట్లాడితే వళ్లు మండుతుంది" కోపంగా అంది.
    "ఏం చదివినా, ఉద్యోగాలు చేసినా ఆడ మగ తేడాలున్నంతవరకూ ఆ స్నేహాలు ఎక్కడికి దారితీస్తాయో, ఎంత చదివినా ఆడపిల్లలు ఎలా బోల్తా పడతారో చూస్తున్నాం గదా! అందుకే తల్లులు భయపడతారు. ఆ రోజులే కాదు, ఈ రోజులైనా ఆ స్నేహాలు, ప్రేమలు నమ్మి మోసపోయే అమ్మాయిలు ఎక్కువవుతున్నారు కదా, అందుకూ భయం" తనూ అంతే కోపంగా అంది జయలక్ష్మి.
    "అంటే మాకు నచ్చినవాడిని చేసుకోవాలంటే మా అభిప్రాయాలు కలిశాయో లేదో చూసుకునే అవకాశం ఆడపిల్లలకి ఈనాటికీ ఇవ్వరా పేరెంట్స్? అబ్బాయిలతో స్నేహం చెయ్యకుండా, కలిసి మెలిసి తిరగకపోతే ఒకరి గురించి ఒకరికి ఎలా తెలుస్తుంది? వాదనకి దిగింది చతుర.
    "పదిమందితో స్నేహం చేసి, పదిమందితో కలిసి తిరుగుతాం నచ్చేవాడు దొరికితే చేసుకుంటాం అంటే సమర్థించే స్థాయికింకా ఈ సమాజం ఎదగలేదు. ఎంత ఆధునిక కబుర్లు చెప్పినా స్నేహాలు, ప్రేమలకి ఓకే గాని పెళ్లిళ్లకి మాత్రం సాంప్రదాయాలు, అమ్మాయిల ప్రవర్తన అన్నీ చూస్తారు. పెద్దవాళ్లే గాదు నిన్ను చేసుకునేవాడు తను నీతో తిరగవచ్చు కానీ నువ్వు ఇంకొకరితో తిరిగితే ఆ అమ్మాయి నచ్చినవాడిని ఎంచుకుంటూంది అని గొప్ప విశాల హృదయం చూపించి చేసుకుంటాడనుకుంటున్నావా? పదిమందితో స్నేహం చేస్తే 'తిరుగుబోతు' అన్న బిరుదు తగిలించి నీకు దూరం జరుగుతారు. అది మర్చిపోకు."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS