ఈశ్వర చంద్రుడు - నవయువకుడు
.jpg)
పగలు పదకొండు గంటలు కావచ్చుచుండెను. అప్పుడే బర్ ద్వాన్ స్టేషనులో రైలుబండి ఆగినది. రెండవ తరగతి పెట్టెలోనుండి ఒక నవయువకుడు క్రిందికి దిగెను. అతనివెంట ఒక పెట్టెయు, పేము సంచియు ఉండెను. నవయువకుడు ఇటునటు చూచి "కూలీ-కూలీ" అని అరచెను. ప్లాటుఫారముపై కూలీ ఎవ్వడును కనిపించలేదు. యువకుడు చప్పట్లు కొట్టుచు "కూలీ-కూలీ" అని మరల పెద్దగా అరచెను. కాని అచ్చట వానికి కూలివాని జాడ కానరాలేదు.
మిట్టమధ్యాహ్నము. ఎండ మిటమిటలాడుచుండెను. ఇంతలో ఒక వృద్ధు డచ్చటికి వచ్చి "అయ్యా! ఇచ్చట కూలీలెవ్వరు లేరు. మీ కభ్యంతరము లేనిచో మీ పెట్టెయు, సంచియు నేను మోసికొని వచ్చెదను" అని పలికెను. నవయువకుడందులకు అంగీకరించెను. వృద్ధుడు సామానులు రెండు చేతులతో పట్టుకొని యువకునివెంట నడచెను.
ఉభయులును నవయువకుని గృహమునకు చేరిరి. వృద్ధుడు సామాను యింటిలో పెట్టి "అయ్యా! నేను వెళ్ళివచ్చెదను" అని పలికెను. యువకుడు వృద్ధునకు కూలి డబ్బులు ఈయబోయెను. కాని వృద్ధుడు పుచ్చుకొనుటకు నిరాకరించెను. అతని అమాయకత్వమునకు యువకునకు చాలా ఆశ్చర్యము కలిగెను.
సాయంకాలము నగరమున పెద్ద సభ జరుగబోవుచుండెను. మహాసభలో పాల్గొనుటకే యువకుడు ఆ పట్టణమునకు వచ్చియుండెను. సరియగు సమయమునకు యువకుడు సభాభవనమున కరిగెను. ఆనాటి సభకు అధ్యక్షుడు "ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు". యువకుడు సభలోనికేగి అగ్రపీఠముపై గూర్చుండియున్న ఈశ్వరచంద్రుని వదనముచూచి చకితుడయ్యెను. తన సామాను మోసికొని వచ్చిన ఆ వృద్ధుడే ఈ సభాధ్యక్షుడని యువకుడు గుర్తించెను.
సభ సమాప్తమైన అనంతరము యువకుడు ఈశ్వరచంద్రుని వద్దకుపోయి నమస్కరించి తన అవివేకమును క్షమింపుడని పరిపరివిధముల ఆయనను ప్రార్థించెను.
* * * *
