Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 17


                                                        ఒక క్షణంలో

ఒక క్షణంలో
మనస్సులో ఎదో స్మృతి
తటిన్మణి
మణీఘృణి
ఎదో మతి వికాసించి,

క్షణంలో
అదే పరుగు    
మరేడకో.....
ఆకులలో చీకటిలో
ఇరుల ఇరుకులలో
చినుకులలో
ఏడనో మరపులలో
మరపుల మడతలలో
కనబడక!

ఒక క్షణంలో
పూర్వపు సఖుని ముఖం
నవ్వులతో
రంగుల పువ్వులతో
కలకలమని కళలు కురిసి
హర్షంతో
ఆశావర్షంతో
కనులవెనుక తెరముందర
కనిపించి,
మరుక్షణం
విడివడి మరేడకో-
వడివడి మరేడకో!

ఒక క్షణంలో
సకల జగం!
సరభస గమనంతో...
 పిమ్మట నిశ్శబ్దం.

ఆ క్షణమందే
గుండెల కొండలలో
మ్రోగును మార్ర్మోగును
హుటాహుటి పరుగెత్తే
యుగాల రథనాదం.

                                                                            30-10-1934

                                                       * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS