"నేను రానమ్మా!"
"తలకొరివి పెట్టాల్సిన ఒక్కగానొక్క కొడుకుని కదరా! నన్నీ ముసలితనంలో అనాధను చేయకురా!" ఆవిడ హృదయవిదారకంగా ఏడవసాగింది. "ఇంత అవమానపు బ్రతుకేమిటిరా నీకు? ఇంటికి పద! ముత్యంలాంటి పిల్లను తెచ్చి నీకు పెళ్లిచేస్తాను. ఈ విధవముండతో కాపురం ఏమిట్రా నీకు ఎంగిలాకును నాకినట్టుగా!"
"మంచో చెడో తెలియదు. నా జీవితం ఆమెతో ముడిపడింది. నేనో, ఆమో చస్తే తప్ప ఈ బంధం తెగదు. వృద్దాప్యంలో నువ్వు అనాధవు కాకూడదనుకుంటే, నీకు కొడుకు కావాలనుకొంటే మా దగ్గరే వుండిపో! నీకేమీ లోటు జరగనీయం! కాదంటే, నీ కొడుకు చచ్చాడనుకొని వెళ్లిపో" నిష్కర్షగా చెప్పాడు అచ్యుతం.
"నోట్లో వేలుపెడితే కొరకలేనట్టుగా వుండేవాడివి. ఎన్నిమాటలు నేర్చావురా? ఎంత మారిపోయావురా? జాణ! ఏ మందో మాకో పెట్టినట్టుంది."
"ఎప్పుడు బయల్దేరారో, రండి! స్నానం చేసి భోం చేద్దురు" ఆవిడ ఎంత తిట్టినా పట్టించుకోకుండా మర్యాదగా పిలిచింది శంకరి.
"పాపిష్టిదానా! నీచేత్తో తినడంకూడానా? నీచేత్తో అమృతం ఇచ్చినా విషమౌతుందే నాకు! నా ఖర్మగాలి ...... మంత్రాలు నేర్చుకొని ఒక ప్రయోజకుడవుతాడని తీసుకు వచ్చి మీ అన్నయ్య దగ్గర వదిలి నీ చేతికి పట్టించినట్టయింది నా కడుపులో ఇంత కార్చిచ్చు రేపి నువ్వేం బాగుపడతావు? నా ఉసురు ముట్టిపోతావులే."
"అమ్మా! ఇంకొక్కమాట ఆమెనంటే నీ మర్యాద దక్కదు" అచ్యుతంలో సహనం నశించింది.
"మదంతో నీ కళ్లు మూసుకుపోయాయిరా! నీకు తల్లీ , ప్రపంచం ఎక్కడ కనబడతారులే! పోతావులేరా మట్టిగొట్టుకొని కన్నతల్లిని ఏడిపించి ఈ ప్రపంచం లో ఎవరేం బాగుపడ్డారులే!" ఆవిడ శాపనార్దాలు పెడుతూ, ఏడుస్తూ వెళ్లిపోయింది.
* * * *
కాలచక్రం గిర్రున తిరిగి ఏడాది గడిచిపోయింది.
శంకరి కళ్లలో అన్నగారి పెద్దకూతురు సుభద్ర పదే పదే మెదలసాగింది. ఒక్కసారి అన్నగారినీ, పిల్లలనీ చూసి రావాలని బలంగా అనిపించడంతో అచ్యుతం వారిస్తున్నా వినకుండా ఒక సంచీలో పళ్లు స్వీట్లు పువ్వులు తీసుకొని బయలుదేరింది.
ఇప్పుడిప్పుడే శంకరి ఈ ఇంటికి తెచ్చిన మచ్చనూ, మనసులకు కలిగిన గాయాన్ని మరిచిపోతున్న సమయంలో చిన్న సంచితో తిరిగి వచ్చిన శంకరిని చూసి జయలక్ష్మి భగ్గున మండిపోయింది. శంకరి వచ్చినప్పుడు జయలక్ష్మి భగ్గున మండిపోయింది. శంకరి వచ్చినప్పుడు జయలక్ష్మి వాకిట్లోనే వుంది. శంకరిని ఇంట్లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. నోటికి వచ్చిన దుర్బాషలన్నీ మాట్లాడింది. "చేసిన పని చాలక ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? సిగ్గూ లజ్జాలేని మనిషివి వంశంలో చెడబుట్టావు. ఇద్దరు మగాళ్లు కావలసి వచ్చారే నీ ముండముఖానికి."
"నేను వుండాలని రాలేదు, వదినా ఒకసారి సుభద్రనీ, అన్నయ్యనీ చూసి వెడతాను"
"నువ్వసలు మీ అన్నయ్య కంటపడటానికే వీల్లేదు నువ్వు చేసిన దుర్మార్గానికి ఆయన ఎంత దెబ్బతిన్నారంటే అవమానంతచో ప్రామం తీసుకొంటారేమో అనిపించింది.
ఆయన ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతువన్నాడు. నువ్వు మళ్లీ ఆయన కంటబడి ఆ పుండును కెలక్కు. నీ పాపిష్టి చూపు నా పిల్లమీద పడడానికి అస్సలు వీల్లేదు."
ఆవిడ ఆ మాట అంటూండగానే ఎర్రగా, బొద్దుగా వున్న ఒక పాప ఇంట్లోంచి బయటికి పరుగెత్తుకు వచ్చింది.
"సుభద్రా!" అంటూ ఆ పిల్లను పట్టుకొని, సంచీ లోంచి స్వీట్ పాకెట్ డబ్బా తీసివ్వబోయింది శంకరి.
హిడింబిలా మీదపడి కొట్టినంత పనిచేసింది జయలక్ష్మి. స్వీట్ పాకెట్ శంకరిముఖాన విసిరికొట్టి పిల్లని లాగి చంకన వేసుకొంది. "నీ పాపిష్టి చేతులతో పిల్లను తాకడానికి ఎంత ధైర్యమే నీ స్పర్శ సోకి నా బిడ్డ బ్రతికి బట్టకడుతుందనే? నడూ ఇక్కడి నుండి నువ్వు ఒక్కక్షణం ఇక్కడ నిలువడానికి వీల్లేదు."
"ఇంతదూరం వచ్చాను! ఒకసారి అన్నయ్యను చూసి వెడతావొదినా" శంకరి ప్రాధేయపూర్వకంగా అంది.
"నీలాగా నేను ముండమోస్తే తప్ప నీ కళ్లు చల్లారవేమే? ఈ ఇల్లు సర్వనాశనం అయితే తప్ప నీకు తృప్తిగా వుండదా?"
"వదినా శంకరి ఖిన్ను రాలైపోయింది.
"ఆ నోటితో వదినా అని పిలవకు! తేళ్లు జెర్రులు ప్రాకినట్టువుతూంది నాకు!"
"వెళ్లిపోతాను వదినా నావల్ల మీరంత బాధపడతారనుకొంటే వచ్చేదాన్ని కాదు" శంకరి గుడ్ల నీరు కుక్కుకొంటూ అంది.
జయలక్ష్మి తారాస్థాయిలో అరవడం వల్ల ఇరుగు పొరుగులు ఇళ్ల బయటికి వచ్చారు. శంకరిని చూసే ముఖాల్లో అవహేళనా పూర్వకమైన నవ్వు కదిలింది. అలా వచ్చి చూసిన వాళ్లలో రుక్మిణమ్మా వుంది.
