Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 13


                                                 అమ్మాయిలూ తొందరపడకండి !

    ఓ చేతిలో ఏణార్ధం పాప, రెండో చేత్తో బరువయిన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా వున్నా హ్యాండు బ్యాగుతో బస్సు కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలం ఏమో ఉదయం ఎనిమిదన్నరకే ఎండ చుర్రుమంటోంది. ఉక్క చెమట, చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు . రాని బస్సు కోసం ఎదురు చూపుతో నీరసం వస్తోంది భారతికి. పిల్లని నేలమీద కూలేసి కింద కూలబడాలన్నంత చిరాగ్గా వుంది ఆమెకి. ఏమున్నా ఏం లేకపోయినా మధ్యతరగతి మధ్య సంస్కారం వుంది కనక అంత పనీ చెయ్యలేక చేతిలో పిల్ల వైపు గుడ్లురుమి చూసి భయపేడ్తూ , గొణుక్కుంది.
    "భారతీ ......నువ్వేనా ....దూరం నుంచి చూసి నువ్వా కాదా అనుకున్నాను.... యిదేమిటే యిలా అయిపోయావు?" గొంతు విని చటుక్కున తపతిప్పి చూసింది. భారతి ------సునయన! ---పేరులాగే పెద్దకళ్ళతో అందంగా వున్న సునయన. బి.ఏ లో క్లాస్ మేట్ -----ఏమిటలా చూస్తున్నావు . గుర్తుపట్టలేదా? సునయన నవ్వుతూ అంది. వూర్లోనే వుంటున్నావా? పెళ్ళయిందా/ లేక వుద్యోగమా? భారతి ప్రశ్నలు కురిపించింది. ఆరోగ్యంతో మిసమిసలాడుతూ , ఖరీదయిన బట్టల్లో అందంగా మెరిసిపోతున్న ఆమెని చూసి భారతి మనసు కృంగిపోయింది.
    "పెళ్ళయింది . మావారు యింజనీరు -----క్రంప్టన్ గ్రీవ్స్ లో పని. పెద్ద కంపెనీ కదా మంచి జీతం, యిల్లు, కారు అవన్నీ యిచ్చారులే. నువ్వేమిటి యిలా వున్నావు .....కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని యిలా నల్లగా పుల్లలా అయిపోయావేమిటి? మీ ఆయనేం చేస్తున్నారు. యీ పాప నీ పాపా ఎన్నాళ్ళయిందేమి పెళ్ళయి?' సునయన కుతూహలంగా అడిగింది. భారతి ముఖం ముడుచుకుంది. జవాబు చెప్పడానికి తడబడింది. ఆమెని అవస్థ నించి తప్పిస్తున్నట్టు బస్సు వచ్చి ఆగింది -----' సారీ సునయనా....ఈ బస్సు మిస్సయ్యానంటే మరో అరగంట వరకూ దొరకదు -- బి.హెచ్. యి.ఎల్ స్కూల్లో పనిచేస్తున్నాను . యింకోసారి కలుద్దాం. మీ యిల్లేక్కడో చెప్పు' అంటూ గాభరాగా బస్సేక్కేసింది--సునయన యింటి గుర్తులు ఏవో చెప్పింది. అవి భారతి చెవికి ఎక్కనేలేదు. బస్సు కదిలింది ----ఏదో ప్రమాదం తప్పినట్టు ఊపిరి పీల్చుకుంది భారతి.
    ఎవరన్నా తెల్సినవారు కనిపిస్తే ఏదో తప్పు చేసినదానిలా తప్పించుకుని పారిపోవాలనిపిస్తుంది . ఛా ......వెధవ బతుకయిపోయింది. అనుక్షణం తనను తాను నిందించుకుంటూ చావలేక బతికే బతుకు యిది. భారతికి ఉక్రోషంతో ఏడుపు వచ్చినట్లయింది. విసుగంతా చేతిలో గిజగిజలాడుతున్న పిల్ల మీద చూపించి ఒక్కటేసింది. పిల్ల ఏడుపు లంకించుకుంది. ఏడుస్తున్న పాపని చచ్చినట్లు సముదాయించాల్సి వచ్చింది. మొదటి స్టాపు లో దిగి రెండు సందులు నడిచి అక్కడ బేబి కేర్ సెంటర్లో పాపని, పాప సామానుని ఆయా చేతికిచ్చి మళ్ళీ వచ్చి బస్సు స్టాపులో నిల్చుని బి.హెచ్.యీ.ఎల్ వెళ్ళే బస్సు కోసం ఎదురు చూడసాగింది భారతి. జీవితంలో సగం భాగం యీ బస్సుల కోసం ఎదురుచూడం ప్రయాణించడంతోటే సరిపోతోంది అనుకుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి బస్సు దిగి పాపని పికప్ చేసుకుని మళ్ళీ బస్సెక్కి ఇల్లు చేరి యిన్నీ టీ నీళ్ళు తాగి ట్యూషన్ కి వచ్చిన పిల్లలకి ఏడున్నర వరకు పాఠాలు చెప్పి , ఉదయం ఐదు గంటలకి వండుకున్న చల్లని మేకుల్లాంటి అన్నం యింత పచ్చడి చారు వేసుకుని తిని, వళ్ళేరాగకుండా నిద్రపోయి - మళ్ళీ తెలలవారి లేచి వంట ఆరంభించి, యిన్ని చపాతీలు చేసుకుని టిఫిను బాక్సులో పెట్టుకుని, పాప కోసం పాలు , అన్నం బిస్కట్లు వగైరాలు ప్లాస్టిక్ బ్యాగులో సర్ది పాప, తను స్నానం చేసి యిల్లు సర్దుకుని మళ్ళీ పరిగెత్తి బస్సులు ఎక్కడం ----- యిదీ తన జీవితం! యిదా తను కలలు కన్న జీవితం! ఉదయం లేచింది మొదలు పొట్టకూటి కోసం అరక్షణం విశ్రాంతి లేకుండా పరిగెత్తే జీవితమా తను కోరుకున్నది ! ఏ ప్రేమ కోసం తపించి తప్పటడుగు వేసిందో ఆ ప్రేమ, అనురాగం అన్నీ ఎండమావులు, దూరపుకొండలు అని అర్ధం అయ్యేటప్పటికి , మెడకి గుదిబండలా ఓ పాప , ఆ పాప కోసం జీవచ్చవంలా బతికే తను మిగిలారు! బతుకు మమత, తీసి , కోరిక అన్నీ చచ్చిపోయినా ఏదో కసితో తనని తను శిక్షించుకోడాని కన్నట్లు బతుకీడుస్తోంది. పాత జీవితాన్ని గుర్తు చేసే ఏ మనషులు కన్పించినా, ఏదన్నా సంఘటన జరిగినా ఆ రోజంతా భారతి మనసు వికలమయిపోతుంది. బండబారిన గుండెలో బతుకీడ్చే ఆ గుండెపై సమ్మెట పోట్లు తగుల్తాయి ---- అప్పుడప్పుడు పాత పరిచయస్తుల్ని చూసి నప్పుడు.
    సునయన.....ఎంత అద్రుష్టావంతురాలు! చక్కటి భర్త, హోదా, అందం, అనందం, ఆరోగ్యం ------ఐశ్వర్యం ...అన్నింటినీ గుత్తకి తీసుకున్నట్లు ఎంత హాయిగా వుంది! ఆ హాయి ఆ అనందం తనకి దక్కకుండా చేసుకున్నది తనేగా! కావాల్సిందే ఈ శాస్తి తనకి! భారతికి ఉక్రోషం, ఆవేదనతో కన్నీళ్ళు జారాయి. తనూ ఓ ఇంజనీరుకి భార్య అయి వుండేదే! ఈనాటి సునయనలా తనూ అందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో మిసమిసలాడుతూ కారులో తిరిగేది! చేతులారా అన్నింటిని దూరం చేసుకుంది తనేగా! యిప్పుడు తనేవరిని బ్లేం చెయ్యగలదు! 'ఇడియట్ ....యూ డిజర్విట్ కసిగా తనని తాను ,మరోసారి తిట్టుకుంది!...హు....ప్రేమట! ప్రేమ!....యీ బ్లడీ ఫూల్ ....ప్రేమ!....లవ్!,,,,అవన్నీ అందనంత వరకే అందంగా కన్పించి ఊరిస్తాయి....పెద్ద ప్రేమికులుగా చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయిన రోమియో జూలియట్ , దేవదాసు పార్వతి , సలీం అనార్కలి ....వీళ్ళందరి ప్రేమసఫలం కాలేదు కనక అమర ప్రేమికులుగా నిలచిపోయారు! అదే వీళ్ళందరి ప్రేమ  పెళ్ళిగా మారితే అప్పుడు తెలిసేది వీళ్ళంతా ఎంతటి అమర ప్రేమికులో.....అప్పుడు వీళ్ళ ప్రేమలు, పేర్లు నామరూపాలు లేకుండా పోయేవి! ప్రేమ! పిటీ....పూర్ పిటీ ....ఈ ప్రేమల గురించి గొప్పగా రాసే రచయితలందరినీ సూట్ చేసి పారేయాలి!.....ప్రేమలు, త్యాగాలు చూపించి ఆడపిల్లల్ని వెర్రెక్కించేట్లు చేసే ఈ రచనలన్నీ తగలబెట్టాలి! ప్రేమ కధలుగా సినిమాలు తీసి ప్రేక్షకులని మోసం చేసి డబ్బులు సంచులు నింపుకునే నిర్మాతలను క్షమించకూడదు! తెలిసీ తెలియని వయసులో పుస్తకాలు చదివి, సినిమాలు చూసి ప్రలోభంలో పడి, ఉచితానుచితాలు మర్చిపోయేట్టు మైమరుపులో, భ్రమలో పడేసే ఈ రాతలన్నీ తగలబెట్టాలి! 'ప్రేమంటే దూరంగా వున్నప్పుడే దాని మజా, అందగానే అదీ అతి మామూలు అయిపోతుంది. వెర్రి మొహాల్లారా......అంచేత ప్రేమ మెరుగులు ఎండమావులని తెల్సుకోండి. ఎండమావి ఊరిస్తుంది తప్ప దాహం తీర్చదు . పిచ్చి నాయనల్లారా, యీ పుస్తకాలు కావలిస్తే సరదాగా చదువుకోండి కాలక్షేపానికి , అంతేగాని ఆచరణలో పెట్టకండి అని ఓ హెచ్చరిక ఏ రచయితలూ రాయరేం ---సిగరెట్టూ పెట్టె మీద సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరికలా యీ ప్రేమకధలూ మీ భవిష్యత్తుకి హానికరం అన్న కాషన్ చివర్న ఈ రచయితలు చేర్చరేం! ప్రేమ అన్నది అందమైన ఊహ మాత్రమే----ఊహాగా ఉన్నంతవరకే అందులో తీపి! అంతకంటే ప్రేమ నుంచి ఏమి ఆశించకండి! ఏవెధవా ఏ త్యాగాలూ చెయ్యడు ప్రేమ కోసం..... అమ్మాయిలూ జాగ్రత్త! ప్రేమని గురించి చదవండి, ఊహల్లో ఆనందించండి! కలల్లో తెలిపొండి! --- కాని ప్రేమలో పడకండి! పడినా అది పెళ్లి దాకా రానీయకండి! రానిచ్చారా బస్, ఆనాటితో మీ జీవితం అధోగతే అని నమ్మండి. అని అరిచి అందరికీ చెప్పాలని వుంటుంది భారతికి! అలా అరవలేదు కనక, తెల్సిన ప్రతీ టీనేజ్ పిల్లకి, స్కూలు తెరిచి కొత్త సంవత్సరం , కొత్త క్లాసు తీసిన మొదటి రోజు మొదటి పాఠం ప్రేమ గురించే చెప్తుంది భారతి!.....తన జీవితం కధగా మలిచి ------


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS