Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 14


    పది లిప్తలపాటు నిశ్శబ్దం.
    
    "ఇందులో నేను మిస్ లీడ్ చేయడమేముంది?" అడిగాడు నెమ్మదిగా.
    
    "ప్రబంధ చెప్పిన జవాబును మీరు అంగీకరించారు. కారణం మీకు తెలిసింది అంతే కాబట్టి. మీకు తెలిసిందే కరెక్టుగా చివరికి న్యాయనిర్ణేతలైన ప్రొఫెసర్స్ అంగీకరించారు కాబట్టి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే థరోగా తెలీని ప్రశ్న వేయడం సమంజసం కాదనిపించబట్టే."
    
    "అంతవరకు నేను అంగీకరించినా మీరంటున్న మిస్ లీడ్ అనేపదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను."
    
    "అసలు మిస్ లీడ్ చేయడమంటే?" టక్కున అడిగింది ప్రణయ.
    
    "జవాబులేని ప్రశ్నతో తప్పుదోవ పట్టించడం" అనేశాడు "అలా తప్పుదోవ పట్టించడమంటూ జరిగితే నావలన కాదు- మిస్ ప్రబంధ మూలంగానే జరిగింది."
    
    "ఇప్పుడు ఆశ్చర్యపోవడం ప్రణయ వంతైంది."
    
    "ఎస్ ప్రణయా! వాత్స్యాయనుడి కామసూత్రాలలోని సాంప్రయోగికం అనే రెండో అధికరణంలో వున్నది పది అధ్యాయాలే. ప్రబంధ పదకొండో అధ్యాయం గురించీ, అందులోని చివరి అంశం గురించీ అడిగింది."
    
    "మీకిది ముందే తెలుసా?"
    
    "తెలుసు."
    
    "మరి వెంటనే ఎందుకు నిలదీయలేకపోయారు?"
    
    "అలా నిలదీయడం, పేచీపడటం పోటీలాకాక పదో అధ్యాయంలోని చివరి అంశంలా వుంటుంది కాబట్టి."
    
    "ఏమిటా చివరి అంశం?"
    
    "ప్రణయ కలహం..."
    
    ఆ పదంలో తన పేరు దొర్లినందుకేమో క్షణం ఉలిక్కిపడిన ప్రణయ అసంకల్పితంగా ఆదిత్య కళ్ళలోకి చూసి తల తిప్పుకుంది.
    
    ఆట పట్టిస్తున్నట్టు కాక చాలా నిజాయితీగానే అన్నాడు- "అసలు ఇలామ్టి వ్యవహారాలలో తలదూర్చడం నాకు ఇష్టంకాని విషయమే మిస్ ప్రణయా! కాని ఒక స్నేహితుడికోసం తప్పనిసరైంది. నేను గెలిచానూ అన్న ఆనందం నాకు లేదు కాని ఒక స్నేహితుడిని జీవితకాలం ఓడిపోకుండా కాపాడగలిగానన్న సంతృప్తి వుంది. నేనో మేధావిగా ప్రొజక్టరు అయ్యానని అనుకోవడంలేదు. అనవసరంగా నా ప్రపంచంలోనుంచి బయటికి వచ్చానని బాధగా వుంది అంతే! ఎనీ హౌ మీ రిమార్క్స్ ని దృష్టిలో వుంచుకుంటాను. థేంక్స్ ఎ లాట్."
    
    కారు దిగాడు.
    
    "ఈసారి కంగ్రాచ్యులేట్ చేసేటప్పుడు మళ్ళీ కలుస్తాను." అంది ప్రణయ చూపు మరల్చుకుంటూ.
    
    "బహుశా అలాంటి అవకాశం మీకు రానివ్వను."
    
    "అదేం? ఈసారి మీరు పార్టిసిపేట్ చేయడం లేదా?"
    
    అర్ధం కాలేదు అదిత్యకి. "ఎందులో?"
    
    "సిల్వర్ స్పాట్ కంపెనీ వాళ్ళు ఇంటర్ యూనివర్శిటీ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారుగా."
    
    "తెలీదు."
    
    "తప్పకుండా మన యూనివర్శిటీనుంచి మిమ్మల్ని, ప్రబంధనీ ప్రపోజ్ చేస్తారనుకుంటాను."
    
    "నో.... వాటెవ్వర్ ఇట్ మే బీ" తల అడ్డంగా ఊపాడు ఆదిత్య. "మరోసారి ఇలాంటి పోటీల్లో పార్టిసి పేట్ చేయను. అది నాకు సాధ్యం కాదు" వెళ్ళిపోయాడు ఆదిత్య.
    
    నిశ్శబ్దంగా కారులోనుంచి చూస్తూ వుండిపోయింది ప్రణయ.
    
    కేవలం తన కుమార్తె గెలుపుకోసం సిల్వర్ స్పాట్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీ చేత రాష్ట్రముఖ్యమంత్రి ఈ క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహింపచేస్తున్నాడని ఆమెకే కాదు, యూనివర్శిటీ అధికారులకి సైతం తెలియదు.
    
                                                             * * *
    
    హఠాత్తుగా యూనివర్శిటీలో సంచలనం మొదలైంది. కాంపస్ లోని కాలేజీల విద్యార్ధులంతా క్లాసెస్ బాయ్ కాట్ చేశారు.
    
    సుమారు వెయ్యిమంది దాకా విద్యార్ధులు సూరి ఆధ్వర్యంలో ఊరేగింపులా బయలుదేరారు.
    
    "వైస్ ఛాన్సలర్ నిరంకుశత్వం నశించాలి."
    
    "న్యాయబద్దంగా నిర్ణయం జరగాలి!"
    
    నినాదాలతో కాంపస్ హోరెత్తిపోయింది.
    
    ఆరోజు ఉదయమే యూనివర్శిటీ మెయిన్ నోటీస్ బోర్డులో ఓ సర్క్యులర్ డిస్ ప్లే అయింది.
    
    వారం రోజులలో భాగ్యనగరంలో నిర్వహించబోయే క్విజ్ కాంపిటీషన్ లో ప్రబంధ, సుధీర్ ఆంధ్రా యూనివర్శిటీ తరపున రిప్రెజెంట్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో గట్టిగా రియాక్టయ్యారు.
    
    ఒక ఉద్యమం లీడ్ చేసింది సూరి.
    
    స్టూడెంట్ యూనియన్ లీడర్ శౌరిని కలిసిన విద్యార్ధులు ఆదిత్య్తలాంటి స్టూడెంట్ ని కాదని, సుధీర్ లాంటి ఓ అనామకుడిని పోటీలకు పంపడం దారుణమని నిలదీశారు.
    
    అసలు వైస్ ఛాన్సలర్ ని ఇన్ ఫ్లుయెన్స్ చేసింది శౌరి కావడంతో ఈ విషయంలో తను జోక్యం చేసుకోలేనన్నాడు.
    
    సుధీర్ పేరు ప్రపోజ్ చేయడం, సూరి, ఆదిత్యల పైన శౌరికున్న వ్యక్తిత్వమైన కక్షగా భావించిన విద్యార్ధులు, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ చాంబర్ దాకా ఊరేగింపుగా వెళ్ళారు.
    
    ఇరకాటంలో పడిపోయాడు వైస్ ఛాన్సలర్.
    
    ఒక మామూలు విషయంగా భావించి ముఖ్యమంత్రి కొడుకూ, విద్యార్ధి సంఘ నాయకుడూ అయిన శౌరి మాటపైన ప్రబంధ, సుధీర్ లను ఏకపక్షంగా నిర్ణయించాడు తప్ప, అది ఇలాంటి ఓ గొడవకి కారణమవుతుందనుకోలేదు.
    
    అరగంటపాటు ఏం చేయాలో పాలుపోని స్థితిలో చాంబర్ లోనే కూర్చుండిపోయిన వీసీ, ఇప్పుడిక మార్గం తోచకపోవడంతో సూరితో పాటు మరో ఇద్దరు విద్యార్ధుల్ని చర్చలకి ఆహ్వానించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS