Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 12

    "నాకెవరు కన్నారావు అనే పేరుగల స్నేహితులు లేరే!" ఆశ్చర్యంగా అన్నాడు శివరావు.
    "మీరిద్దరూ ఒకటో తరగతిలో కల్సి చదూకున్నారుటండి.. మరేమోనండి మీరు మొదటివర్సలో కూర్చుంటే ఆయనేమో ఆఖరి వర్సలో కూర్చునే వారంటండి.
    "నాకేం గుర్తులేదే!!.."
    "కానీ ఆయనకి మాత్రం మీరు బాగా గుర్తున్నారండీ... స్నేహితుల్ని మర్చిపోయే దగుల్బాజీ కాదండీ ఆయన..." వినయంగా చేతులు కట్టుకుని అన్నాడు వెంకట్రావు.
    శివరావు దెబ్బతిన్నాడు.
    "ఓ...ఆయనా?... గుర్తులేకేం హిహి... బాగానే గుర్తున్నాడు... ఆయన మీ నాన్నగారా?..." బలవంతంగా నవ్వుతూ అడిగాడు శివరావు.
    "కాదండి... ఆయనతో బాటు నాలుగో తరగతి మా నాన్న కలిసి చదివాడండి. మా నాన్నపేరు నారాయణండి. నాకు హైదరాబాద్ లో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చిందని తెలిసి కన్నారావు నాకు హైద్రాబాద్ లో మంచి ఫ్రెండున్నాడు... వాడింటికి మీ అబ్బాయిని పంపించు... తెల్సినవాళ్ళుండగా హోటల్లో ఉండడం ఎందుకూ డబ్బు దండగా అని మా నాన్నతో అన్నాడండి..."
 "అబ్బే... డబ్బు దండగెందుకౌతుందీ... రేపొద్దున్న నువ్వు సెలెక్ట్ అవుతే వందలువేలూ సంపాదిస్తావుగా!" కళ్లు తుడుచుకుంటూ అన్నాడు శివరావు.
    "అబ్బే... డబ్బు దండగేనండి... మీకు తెలీదు... పదండిలోపలికి పోదాం..." అంటూ గుమ్మం వైపు అడుగులు వేసి ఆశ్చర్యపోయాడు.
    అక్కడ గుమ్మంకి అడ్డంగా ఒకావిడ పడుకుని ఉంది.
    "ఎవరండీ ఈవిడ ఇక్కడ అడ్డంగా ఇలా నిద్రపోతున్నారు....?
    "ఆవిడపేరు పార్వతమ్మ... ఆవిడేం నిద్రపోడంలేదు. బహుశా గుమ్మందగ్గర నించుని మనమాటలన్నీ విని ఉంటుంది. మూర్ఛపోయింది..." జాలిగా భార్యవంక చూస్తూ అన్నాడు శివరావు.
    "ఇద్దరూ పార్వతమ్మ మొహం మీద నీళ్లు చిలకరించి లేపారు.
    "పోయిన వారం ఒకాయన ట్రాన్స్ ఫర్ పనిమీదొచ్చి మా యింట్లోదిగి నిన్ననే వెళ్లాడు బాబూ... అంతకుముందు ఉద్యోగం ప్రయత్నం కోసం ఒకబ్బాయి మా యింట్లో దిగి నెల్రోజులున్నాడు బాబూ... ఆ అబ్బాయికి ముందు మరోకాయనహైదరాబాద్ ఊరు చూద్దామని వచ్చి మాయింట్లో దిగి నాల్రోజులున్నారు బాబు... ఇప్పుడేమో నువ్వొచ్చావ్... అందుకే కళ్లు తిరిగాయ్... ఏవనుకోకు బాబూ..." అంది పార్వతమ్మ మెల్లిగా.
    "నువ్వు మరీ అంత మర్యాదగా మాట్లాడితే వీడు ఊరెళ్లింతర్వాత అక్కడినుండి హైదరాబాద్ వచ్చే ఎవడైనా ఉంటే వాడ్ని మనింటికి పంపిస్తాడు. నువ్వు కాస్త నోర్మూస్కో..." పళ్లు కొరుకుతూ భార్య చెవిలో అన్నాడు శివరావు.
    "ఏంటో ఆవిడగార్కి చెవిలో ఏంటేంటో ఇన్స్ ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారే!... నాకోసం బిర్యానీలూ, స్వీట్లు లాంటి స్పెషల్స్ చెయ్యమని ఆవిడ్నేమీ బలంవంతం పెట్టకండి... రెండు మార్లు రసం, సాంబారు, ఆవకాయ, పెరుగు ఉంటే చాలు. ఎడ్జస్టయిపోతా..." అన్నాడు వెంకట్రావు వినయంగా.
    "అసలు నీకు మా యింట్లో వంటలు సహించవేమో... హైదరాబాద్ హోటల్సులో భోజనం ఎంత రుచిగా ఉంటుందో నీకు తెల్సా?..." అన్నాడు శివరావు కసిగా వేళ్లు విరుచుకుంటూ.
    "అబ్బే!... హోటల్ మీల్సు నా ఒంటికి పడదండీ... అర్రే!... ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయామే!!... పదండి పదండి... లోపలికి పదండి" అంటూ లోపలికి అడుగు పెట్టి ఒక్కసారిగా కెవ్వుమని సంతోషంతో కేకపెట్టాడు.
    "ఏమైందేమైంది?..." కంగారుగా అడిగారు ఇద్దరూ.
    "ఆ సోఫాలో కూర్చుని ఉన్న ఓణీ వేస్కున్న అమ్మాయి మీ అమ్మాయేనా?..." కళ్ళింతింత చేస్కుని చూస్తూ అడిగాడు.
    "అవును యేం?" భయం భయంగా అడిగాడు శివరావు.
    "హబ్బా...నేనెంత లక్కీనో?"... ఠాప్...ఠాప్...లొట్టలు వేశాడు.
    "యేం నాయనా... ఎందుకూ?... స్టాప్ మీద మరుగుతున్న సాంబారు వాసన నీకు తగలిందా?... అది నీకు నచ్చిందా?..." పార్వతమ్మ సంబరంగా అడిగింది.
    "అది కాదులెండి... మీకు వయసులో ఉండే కూతురుంటే అది నాకు అదృష్టమే కదండీ... చక్కగా తియ్య తియ్యగా కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చెయ్యొచ్చు. లేకపోతే మీ యింట్లో ఉండడానికి బోర్ కొడ్తుంది. ఇప్పుడైతే ఎన్ని రోజులైతే అన్ని రోజులుండొచ్చు... ఠాప్....ఠాప్"
    "ఏవండోయ్! అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టుంది... అల్లుడిగారికి ఉద్యోగం వస్తే అమ్మాయినిచ్చి చేసేద్దామా?" భర్త చెవిలో సంబరంగా అడిగింది పార్వతమ్మ.
    శివరావు భర్యవంక చూసి పళ్లు బైటపెట్టి"ఈ..." అన్నాడు కోపంగా.
    శివరావ్ కి తిక్కరేగి జుట్టు పీక్కున్నాడు.
    "ఒసేవ్ కమలా!... నువ్వెందుకిక్కడ? లోపలికెళ్లు" అంటూ గావుకేక పెట్టాడు సోఫాలో కూర్చుని ఉన్న కూతుర్ని చూస్తూ శివరావు.
    భోజనాల దగ్గర కూరలో కారం ఎక్కువైంది. సాంబార్లో ఉప్పు తక్కువైంది అంటూ పేర్లు పెట్టుకుంటూ తిన్నాడు వెంకట్రావు. రోజూ ఆ కూర చేస్తే బాగుంటుంది ఈ పులుసు చేస్తే బాగుంటుంది. అంటూ కోరికలు కూడా కోరసాగాడు. ఏ మాత్రం అవకాశం దొరికినా కమలతో కబుర్లేసుకోసాగాడు వెంకట్రావు. శివరావుకి మాత్రం ఒంటికి కారం పూసినట్టుగా ఉంది.
    "ఆ ఏవోయ్... ఈ రోజేనా మన ప్రయాణం" కులాసాగా అడిగాడు శివరావు ఇంటర్య్వూ నుండి వచ్చిన వెంకట్రావుతో.
    "అదేంటండీ మీరు మరీను... ఇంటర్య్వూ ఎలా చేశానో అడక్కుండా నా ప్రయాణం గురించి అడుగుతారేం?..." అన్నాడు వెంకట్రావు చిన్న బుచ్చుకుంటూ.
    "సర్లె... సర్లె... ఇంటర్య్వూ ఎలా చేశావ్?"
    "బాగానే చేశానండి..."
    "మరి ప్రయాణం ఈ రోజే కదా?..." వెంకట్రావుకి సంతోషంగా కన్నుకొట్టి కులాసాగా అడిగాడు.
    "అబ్బే... ఇంకో వారం ఉంటానండీ ... వచ్చే వారం ఆ ఆఫీసుకెళ్తే ఇంటర్వ్యూ రిజల్సు చెప్తారు."
    "ఇక్కడ ఉండడం ఎందుకూ?... మీ ఊరెళ్తే నువ్వు సెలెక్టయిన తరువాత అర్దర్సు వాళ్లే పోస్టులో పంపిస్తారుగా?" పాలిపోయిన మొహంతో అన్నాడు శివరావు.
    "ఆ... ఆ పోస్టులు వాళ్లని ఎవరు నమ్ముతారు లెండి... ఎక్కడ పారేస్తారో ఏమో... నేనిక్కడ ఉండే ఆఫీసుకెళ్లి కనుక్కుంటా... మీరీ ఊళ్ళో ఉండటం నాకెంత లక్కీనో." అన్నాడు వెంకట్రావు.
    ఇలా లాభంలేదని శివరావు తన పేర్న తనే ఒక దొంగ టెలిగ్రాం ఇచ్చుకున్నాడు.
    "వార్నాయనో... మా తాతకి సీరియస్ గా ఉందట్రో దేవుడో... మేం వూరికి వెళ్లిపోవాలి నాయ్ నో... నువ్వు హోటల్లో దిగాలి దేవుడో... అంటూ గోలగా ఏడ్చాడు శివరావు.
    మీరు ఊరెప్పుడెళ్తారు ఇప్పుడు ట్రైన్ ఏమీలేదే?"
    "రేపెళ్తాను..." కళ్లు తుడుచుకుంటూ అన్నాడు శివరావు.
    "నేనిప్పుడే వస్తాను..." అంటూ బయటికి వెళ్లాడు వెంకట్రావు.
    మర్నాడు తెల్లారగాట్టే శివరావుకి టెలిగ్రాం వచ్చింది. దాన్ని వెంకట్రావే అందుకున్నాడు.
    "మీ తాతగారికి కులాసాగానే ఉందనీ... మీరు ఊరికిరానక్కర్లేదనీ టెలిగ్రాం వచ్చింది. అయితే నేనిహ మీ యింట్లోనే ఉండొచ్చు" చిలిపిగా చూస్తూ అన్నాడు వెంకట్రావు.
    శివరావు గోడకేసి సున్నితంగా తలకొట్టుకున్నాడు.
    అతనికి అర్ధమైపోయింది ఆ టెలిగ్రాం వెంకట్రవే ఇచ్చాడని!
                                                    *   *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS