Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 12

"ఒక వారంనుండి."
"థాంక్ గాడ్! దాన్ని అంతటితో కట్ చేయ్."
నిఖిల్ భయపడిన క్షణాలు యింత త్వరగా వస్తాయని ఆమె అనుకోలేదు.
"డాడీ! మీరయినా చెప్పరా? మమ్మీ ఎందుకంత ఆవేశపడిపోయింది? నేనేం తప్పుచేశాను? అతని స్నేహాన్ని నేనెందుకు కట్ చేయాలి?" ఆవేశంగా అంది.
"ఏ తప్పూ చేయలేదు గనుకనే యిక ఈ స్నేహాన్ని యింతటితో ఆపేయమంటున్నాం" రేఖ మరింత కఠినంగా అంది.
"ఓ....చాలా గొప్ప విషయం చెప్పావు మమ్మీ! తప్పు చేస్తే స్నేహం కొనసాగించవచ్చు. జేవితంలో అతనికి భార్యగా సెటిల్ అవ్వచ్చు. చేయలేదు గనుక స్నేహం మానెయ్యాలి. స్నేహం ఖరీదు 'తప్పు' అయితే ఆ స్నేహం మాకక్కరలేదు మమ్మీ."
"నో...." రేఖ మరింత బిగ్గరగా అరిచింది.
భర్తవైపు తిరిగి....
"కళ్యాణ్! దీన్ని ముందు లోనికి తీసుకుపదండి...నేనీ కుర్రవాడితో కొన్ని విషయాలు మాట్లాడాలి."
కళ్యాణ్ కీ పరిణామం అయోమయమయింది.
తన భార్యకు ఈ కుర్రవాడు ముందే తెలిసివుండాలి.
"వాట్ రేఖా! దిసీజ్ డెలికేట్ ఎఫైర్! డోన్ట్ బి అవుత విత్ ది చైల్డ్...ఏదయినా రాంగ్ వుంటే మనం వారిని కన్ విన్స్ చేయాలి. నీకా కుర్ర్రవాడు ముందే తెలుసా?"
"యస్....తెలుసు."
ఆమె మాటల్తో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. తను ఎలా ఆమెకు తెలుసో నిఖిల్ కు ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు. తనకు తెలీకుండా తన రేఖకి ఆ కుర్రవాడు ఏ రకంగా తెలుసో కళ్యాణ్ కు అంతకంటే అర్ధం కాలేదు.
సింధూ అయితే మరీ బిగుసుకుపోయింది.
తమకంటే ఆర్ధికంగా వెనుకబడి వున్నారనే విషయం తల్లికి ముందే తెలుసన్నమాట. అయితే మాత్రం అంతగా ఆవేశపడిపోవాలా? మనీ లేనంత మాత్రాన గుణగణాలు లేకుండా పోతాయా? నిఖిల్ తన విషయంలో ఏ మాత్రం తొందరపడలేదు. అతడు త్వరపడివుంటే తను వారించగలిగేదేనా?
"మమ్మీ! నీవు ఏరకంగా అతన్ని అవమానపరచినా నీకు తెలీని పరిణామం నీ, నా మధ్య జరుగుతుందనే విషయం గుర్తుంచుకో."
కుమార్తెలోని ఆ తెగింపూ, తెలివీ రేఖను ఆపాదమస్తకం ఆశ్చర్యంలో ముంచేశాయి.
"ఎప్పుడెదిగింది యిది యింత ఎత్తుకు? దీనికెలా చెప్పాలీవిషయం?"
ఆమె అలాగే కాస్సేపు మౌనంగా వుండిపోయింది. అలా ఆ భవంతి హాలులో నలుగురూ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు.
నిఖిల్ ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ రేఖ దగ్గరగా జరిగి....
"సారీ మేడమ్! నేనెలాభయపడ్డానో అదే జరిగింది. మీ భవంతులు చాలా ఎత్తుగా వుంటాయనీ, వాటికి కూలింగ్ అద్దాల వెనుక నిశితమైన కళ్ళు వుంటాయనీ....
అవి సుదూరంగా వున్న మా పూర్ హౌసెస్ జాగ్రత్తగా పరిశీలిస్తూ, వాటి గాలుల్ని కూడా తమ ప్రహరీ గోడల్ని దాటి లోనికిరానీయవనీ యిప్పుడే తెలిసింది."
అని మెల్లగా సింధూ దగ్గరికి వెళ్ళాడు.
"డియర్ సింధూ! మా పేరెంట్స్ వద్దంటే- నీ యింటికి వస్తానన్నావు. ఇప్పుడు నేను మా ఇంటికి వెళుతున్నాను. నీవు రాగలిగితే తీసుకెళతాను.
మన మధ్య మొలకెత్తిన ప్రేమ సాక్షిగా చెపుతున్నాను. నాకు మీ బిజినెస్ లు గానీ, ఈ ఖరీదయిన భవంతులుగానీ ఏం ఆఖర్లేదు. నీవు నా వెంటవస్తే అదే చాలు" అన్నాడు.
వెంటనే రేఖ వారి మధ్యకొచ్చింది.
"నిఖిల్! దయచేసి త్వరపడవద్దు. నీవు నీ ఇంటికి వెళ్ళిపో....నా సింధూను పూర్తిగా మర్చిపోయి వెళ్ళిపో. ఈ భూమ్మీద సింధూ అనే అమ్మాయి పుట్టలేదనీ, ఆమెను నేను ప్రేమించలేదనీ వెళ్ళిపో."
భార్య ఏమంటుందో- ఎందుకలా అంటుందో కళ్యాణ్ కు అసలు అర్ధంకాలేదు.
ఈలోపు సింధూ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చింది. మౌనంగా హాలులోంచి పైకి వెళ్ళింది.
కుమార్తె అలా ఏం ప్రతిఘటన లేకుండా వెనుతిరిగి లోపలికి ఎందుకెళ్ళిందో కళ్యాణ్ కు అర్ధంకాలేదు. ఆస్థిని కూడా వదులుకుంటానని సిద్దపడిన ఆమె- కూతురు విషయంలో తన పరంగా అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుందో నిఖిల్ కి అంతకంటే అర్ధంకాలేదు.
ఈ అర్ధంకాని పరిస్థితి హాలులో అలుముకున్న సమయంలో....
అనూహ్యంగా- శరీరాలు భయంతో కంపించేట్టు- సింధూ మెట్లు దిగుతూ పెద్దగా అరిచింది.
"మమ్మీ! నీవు మాట్లాడిన మాటలకంటే దీనిలోని తూటాలు నాకు వుపశమనం ఇస్తాయి. నీ అర్ధంకాని ఆంక్షలకంటే- దీనిలోని తూటాలు నా జీవితానికో పరిష్కారాన్నిస్తాయి.
ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఎవరూ నాకు అడ్డం రావద్దు. ఎవరు ఎదురు చెప్పినా....ఎవరు నా మూమెంట్స్ కు అడ్డం వచ్చినా, దీనిలోని గుళ్ళు ఒకటొకటిగా నా మెదడులోకి దూసుకుపోతాయి."
అంటూ పిస్టల్ ను తన తలకు గురిపెట్టుకుని మెల్లిగా మెట్లు దిగటం మొదలుపెట్టింది.
ఏం అంటే ఏమవుతుందో అనే టెన్షన్ ఆ హాలులో అలుముకుంది.
ఆమె ఒక్కొక్క మెట్టే దిగుతోంది.
అలా వూపిరి బిగబట్టి అందరూ శిలాప్రతిమల్లా నిలబడి, తమ గుండె చప్పుళ్లను తామే వింటున్న ఉద్రిక్తమైన క్షణాలకు....
ఇరవై ఐదు సంవత్సరాలక్రితం__
                                                         *    *    *    *

దస్తగిరి ఇంటికి వచ్చి మౌనంగా కూర్చున్నాడు. వెడల్పుగా, నల్లగా వున్న అతని ముఖంలో విచారాన్ని ఎప్పుడూ బదరి చూసిఎరుగదు.
దస్తగిరి ఎంత నల్లగా వుంటాడో - బదరి అంత తెల్లగా వుంటుంది. దస్తగిరి వెనుకబడిన కులానికి చెందిన యువకుడు.
బదరి అగ్రవర్ణం స్త్రీ!
బదరి తండ్రి బిజినెస్ లో దెబ్బతిని ఒకరకంగా దివాళా తీశాడు. హైదరాబాదు నగరంలో అప్పటికి ఓ చిన్న ఇల్లు మాత్రమే వుంది. బదరి తల్లి ఎప్పుడో చనిపోయింది. కుమార్తె ఒక్కటే కావటం....ఇంటిపనుల అవుసరాల్లో ఆమె కావాల్సిరావటంతో బడరీని పెద్దగా అతడు చదివించలేదు. తను బిజినెస్ పనులకు బయటకు వెళ్ళేప్పుడు 'దస్తగిరి' అనే కుర్రవాడ్ని వెంటతీసుకు వెళుతుండేవాడు. దస్తగిరి ఒకరకంగా బదరీ కుటుంబానికి బానిసచాకిరీ చేశాడు.
అయితే అతనికి తిండి విషయంలో ఎలాంటి లోటూ జరుగలేదు. పరిశ్రమించే వంటికి పంటిక్రింద పుష్కలంగా తిండి అనురటంలో 'దస్తగిరి' బలిష్టంగా తయారయ్యాడు. కండలు నున్నగా మెలితిరిగాయి.
ఒకరోజు వున్నట్టుండి బదరి తండ్రి గుండాగి చనిపోయాడు.
బడరికి అప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు. దస్తగిరికి పాతికదాకా వున్నాయి. ఇప్పుడు బడరికి దస్తగిరి ఒక్కడే మగదిక్కుగా మారాడు.
ఇల్లుతప్ప వేరే ఆస్తి లేకపోవడంతో...బడరిని ఏ అగ్రవర్ణం యువకుడూ చేసుకోవటానికి ముందుకురాలేదు.
ఈ ప్రపంచం ఎంతటి వ్యాపారమయిందో అప్పటికే బడరీకి ఒక అభిప్రాయముంది.
దస్తగిరి తన ఇంటి ముంగిట్లో పడివుంటున్నాడు. పగలంతా ఏదో ప్రయివేట్ ఫరమ్ లో చాకిరీచేసి, చీకటిపడే సమయానికి తినటానికి తెస్తున్నాడు. ఈ ప్రపంచంలో తను యింకా ఎవరికోసం ఎదురుచూడాలి? ఎందుకు ఎదురుచూడాలి?
అగ్రవర్ణం తెల్లతోలు యువకుడి కోసమా? బదరీకి నవ్వు వచ్చింది. ఆ నవ్వులో ఈ 'వర్ణం' అనే పధం మీద ఏహ్య భావం కలిగింది.
తన వర్ణం యువకుడు ఒక్కడూ తనవంక చూడటంలేదు. తన వెనుక ఎలాంటి రెడీమేడ్ మనీ లేదు. వర్ణం అనే పదానికి అర్ధంలేదు. అదంతా ఉత్త ట్రాష్. కరెన్సీ కట్టలు ఎవడినైనా కుక్కను ఆడించినట్టు ఆడిస్తాయి. అటెండర్ నుండి అమెరికా అధ్యక్షుడి వరకూ- ఫకీరు నుండి పెట్టుబడిదారు వరకూ...అంతా ఆ మనీ కోసమే రకరకలా ఫీట్లు చేస్తుంటారు. అయినప్పుడు దస్తగిరి యింకా తననెందుకు కనిపెట్టుకున్నాడు. తన శరీరశ్రమను "రూపాయిలు" గా మార్చి తనకు తిండి అమర్చే అవుసరం అతనికెందుకు?
బదరి ఆలోచనల్లో పడింది!
'దస్తగిరి'లో ఒక మనిషి-అంతకుమించిన శక్తి, ఒక ఆరాధన-ఒక ప్రేమ ఆమెకు కనిపించసాగాయి.
తన జీవితంలోకి అతన్ని ఆహ్వానించాలని నిర్ణయించుకుంది. తండ్రి బ్రతికుండగా తనకు చేయించిన నగలు ఒకటీ అరా వంటిమీదున్నాయి.
ఆరోజు దస్తగిరి తెలీకుండా అవన్నీ అమ్మింది. మ్యారేజ్ ఆఫ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి ఆఫీసర్ ని కలిసింది. తన మనసులో వున్న అభిప్రాయాన్ని చెప్పి....సింపుల్ గా వివాహాన్ని ముగిస్తే ఖర్చెంతో అడిగింది.
బదరీ తెగింపును ఆఫీసర్ ఆశీర్వదించాడు. ఖర్చు ఏం అక్కర్లేదనీ ఆ మనీ వివాహానంతరం కొద్ది కాలమయినా సుఖంగా బ్రతికేందుకు దగ్గర వుంచుకోమని చెప్పి.....రెండు దండలు చాలన్నారు.
ఆ విధమైన ప్రామిస్ ఆఫీసర్ దగ్గర తీసుకుని బదరి ఆరోజు సంతోషంగా ఇంటికి వచ్చింది.
తన మనసు తీసుకున్న నిర్ణయం యింకా దస్తగిరికి తెలీదు.
అదేరోజు దస్తగిరి రోజూకంటే ఉత్సాహంగా వచ్చాడు. ఓ సంతోషకరమైన కబురు చెప్పాడు. తమ కంపెనీ ప్రొప్రయిటర్ అమెరికా వెళుతున్నాడనీ, నిజాయితీగా పనిచేసే తనను గమనించాడనీ....కంపెనీ 'కేర్ టేకర్'గా నియమించాడనీ....అమితానందాన్ని అనుభవిస్తూ, ఆ సంతోషాన్ని తెలియజేయటానికి మాటలు కూడా తన దగ్గర లేవనీ చెప్పాడు.
"జీతం కూడా పెంచాడు. ఇకనుండి నెలవారీగా ఇస్తానన్నాడు. అసలు సంతోషానికి కారణం ఇదిగో...." అంటూ ఓ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS