Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 12


                                    శృంగార లహరికలు
    
    అందములు మాధురీ ని
    ష్యందములై ప్రేక్షకాళి సమ్మోదింపన్
    నందనవన నవవికసిత
    మందార మనంగ నొక్క మానిని  వచ్చెన్.
    
    చూపులు ప్రసూన చాపుని
    తూపుల వలె మానసమ్ము దూరి కలంపన్
    రూపవతి యొకర్తుక యువ
    భూప వసంతుని సమీపమున కరుదెంచెన్.
    
    నవనవలాడెడు ప్రాత
    ర్నవమాలికలీల కౌను నాట్యమొనర్పన్
    నవలావణ్యోజ్జ్వలయొక
    నవలా చనుదెంచె శాక్యనందను గాంచన్.
    
    కప్పురపు గమ్మతావులు
    గుప్పుమనం భయము సిగ్గు కుతుకము లోలో
    ముప్పిరిగొనఁగా నొప్పుల
    కుప్ప యొకతె వచ్చె శాక్యకులశశిఁ జూడన్.
    
    తొలివలపుల కలగలపుల
    వలపుల వల వైచి పట్టువచ్చిన పగిదిన్
    తెలి మేలిముసుఁగు దాల్చిన
    చెలి యొక్కతె కదలె శాక్యసింహుని కడకున్.
    
    దృక్కుల చిక్కుల బెట్టెడి
    నొక్కుల ముంగురులు మిసిమి నుదుట నటింపన్
    జిక్కని చక్కదనమ్ముల
    చుక్క యొకతె వచ్చె శాక్యసుందరు దెసకున్.
    
    సొంపులతో, లావణ్యపు
    ముంపులతో, చూడ చూడ ముద్దులొలుకు మై
    వంపులతో, నొయ్యారపు
    జంపులతో వచ్చె నొక్క సఖి నతముఖియై.
    
    వన్నెలు చిన్నెలు గల రా
    కన్నెలు చనుదెంచి సమ్ముఖమ్మున నిలువన్
    గన్నెత్తి కనఁడు శాక్యుల
    కన్నయ్య; యదెట్టి భావగాంభీర్యంబో!


                                             


    స్వచ్చ గంభీర శాంతరసమ్ము మాడ్కి
    నలరె సౌవర్ణ పీఠి సిద్దార్ధమూర్తి;
    రాగరంజిత శృంగారరసము పగిది
    సముఖమున నిల్చె కన్యకా సముదయంబు.
    
    సుందరు లెందరో నృపకిశోరు గనం జనినారు; తీరుగా
    వందన మాచరించి నిలువంబడినారు; బహూకృతుల్ మహా
    నందము మీరా నందుకొనినారు; మరే! యోకరైన శాక్యరా
    ణ్ణందను డెంద మించుకయినం గదలించినవారు లేరటే!
    
    అందము చిందువందినది; యౌవన మాక్రుతి మల్చుకొన్న; దా
    నందము మూర్తి దాల్చినది; నమ్రత రూపులు దిద్దుకొన్న; దా
    సుందర సుస్మితాధర యశోధర సౌమ్యమనోజ్ఞమూర్తియై
    యిందిరవోలె సాగిన దొకింత కనన్ యువరాజ మాధవున్.
    
    స్వామిసమక్షమందు తలవంచెడు ప్రార్ధనభంగి, సత్కవి
    స్వామి పదమ్ము ముందు వివశం బగు వ్యంజన మాడ్కి, గున్న లే
    మామిడిపొంత సిగ్గుపడు మంజుల మాలతి లీల, బాల తే
    జోమయమూర్తి ముందు నిలుచున్నది భక్తిరసప్రసూనమై.
    
    సుదతి శుచిస్మితాధర యశోధర రాగరసార్ద్రమూర్తియై
    హృదయము దోయిలించి పరమేశ్వరు ముందర నుంచినట్లుగా
    నుదయ సరోరుహోధర సహోదర మంజలి సాచె, సత్యసౌ
    హృద మధుమంజరుల్ పులకరింపగ, కోర్కులు తొల్కరింపగన్.
    
    చక్కనిచుక్క శాక్యకులచంద్రుని ముందర మందహాసముల్
    చెక్కుల జాలువార నిలిచెన్ క్షణకాలము, స్వామి సన్నిధిన్
    మ్రొక్కిన భంగి; శిల్పి నవమోహనరూపము పాలరాతిపై
    చెక్కిన భంగి ప్రేమవివశీకృత నిశ్చలనిర్నిమేషయై.
    
    కందని కుందనమ్ము! కసుగందని క్రొంజివురాకు! నాల్కపై
    జిందని తేనె! యంకితము సేయని కావ్యము! వాచ్యభావమున్
    జెందని వ్యంగ్యవైభవము! చెక్కిలి తాకని ముద్దు! మోవిపై
    కందని మందహాస! మొక యందము కన్నుల ముందు నిల్చినన్.
    
    అచ్చటనున్న పళ్ళెరములందు వెలందికి పారితోషిక
    మ్మిచ్చుట కేమి లేమి క్షణ మిట్టటు గన్గొని రాజనందనుం
    డచ్చపు గూర్మి పేర్మి నుపహార మిడెన్ మెడలోని జాళువా
    పచ్చల హారమున్ జెలి కపార కృపారసపారవశ్యుఁడై.
    
    మొగ్గె నాకింత గౌతముఁడు ముందునకున్; దారళాక్షి వెన్కకుం
    దగ్గె రవంత; నయ్యెడల తన్మృదులాంగుళు లింత సోకి లో
    నగ్గలమయ్యె క్రొవ్వలపు లంత లతాంగికి, గన్ను గొల్కులన్
    సిగ్గులు మొగ్గలై మిసిమిచెక్కుల నవ్వులు జాజిపువ్వులై.
    
    కాంచెనురాకుమారు కడకంట యశోధర; ఆ యశోధరన్
    గాంచెను రాకుమారు డరకంట; బరస్పరదృష్టు లైక్యముం
    గాంచెను మెల్లఁగా; ప్రణయకౌతుక రేఖలు పులకరించి మే
    ల్కాంచెను వారి మానసములన్ జననాంతర రాగవీచికల్.
    
    చూచె వధూమణిన్ బ్రభువు; సోగకనుల పయికెత్తి తీయగా
    జూచె ప్రభున్ వధూమణియు; జూచె ప్రభుండు శుభాంగి నెన్నడో
    జూచినయట్లు; ప్రీతిమెయి జూచుచునున్న ప్రభున్ శుభాంగియున్
    జూచియు జూడన ట్లొదిగి చూచెను మేలిముసుంగు చాటునన్.
    
    ఆ దరహాససుందర శుభానన మించుక గాంచినంత చం
    ద్రోదయవేళ పొంగెడి మహోదధి కైవడి సంచలించె శౌ
    ద్దోదని; వాని నేత్రము లహో! రమణీ రమణీయ కౌతుకా
    హ్లాదమయప్రసన్న మధురాధరరాగ సుధాభిషిక్తముల్!


                                       వర పరీక్ష
    
    అది మహాసభ; సుప్రబుద్దావనీశు
    సుత యశోధర ప్రియసఖీతతుల గూడి
    రాజపుత్త్రుల బాహుపరాక్రమంబు
    చంచల దృగంచలముల వీక్షించుచుండె.
    
    తనకు తెలిసియు శాక్యరాట్తనయు క్షాత్ర
    వీరవిస్ఫూర్తి జగతికి వెల్లడింప
    చాటినారు  స్వయంవరోత్సవము నీకు;
    గట్టివారమ్మ మీ నాన్నగారు చెలియ!
    
    సింహధనువును సజ్యంబు చేసి, లక్ష్య
    ములను భేదించి, మల్లూర గెలిచి, సప్త
    తాళముల గూల్చి, సమద సైంధవ మహోక్ష
    కరుల లోగొనుటే నేఁటి వరపరీక్ష.
    
    ఈ కఠోర పరీక్షలో నెవఁడు నెగ్గు.
    నతఁడె నీ నాథుఁడగు మగువా! విచార
    మందకు; కృతార్ధుఁ డగును సిద్దార్దుఁడొకఁడె
    తరలి వచ్చిన రాజనందనుల యందు.
    
    చక్కనివారు, నిక్కినభుజంబులవారు,మదోత్కటంబులౌ
    దృక్కులవారు, తృష్ణ చిగురించిన చెక్కులవారు, పేరు పెం
    పెక్కినవారు, రాకొమరు లెందరొ కొందలమంద డెందముల్
    త్రొక్కిసలాడుచుండిరి వధూమణి! నీ కరమున్ గ్రహింపఁగన్.
    
    వేసము రోసముం బరిఢవిల్లు నరేంద్రకుమారుఁ డొక్కఁ డు
    ల్లాసము చెంగలించెడి విలాసముతో కొనగోట నీటుగా
    మీసము మీటి యేగె కనుమీ ధను వెక్కిడ; సర్వధా వృథా
    యాసము తత్ర్పయత్నము సుహాసిని! ఆశకు అంతమున్నదే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS