వరండాలో పడుకోవడం కూడా కష్టమే. వర్షపు జల్లు తలుపుల్ని కూడా తడిపెస్తోంది.
కానీ అంతకంటే మార్గం లేదు కాబట్టి వరండాలో పడుకుంటాననే అతను అడిగాడు.
"క్షమించండి. ఇక్కడ పురుషులు వుండకూడదు" ఆమె ఖచ్చితంగా చెప్పింది.
"మీరలా అంటే నేను రిస్కు తీసుకుని బయటికి వెళ్ళాల్సి వస్తుంది. బయట నాకోసం వాళ్ళు పొంచి వున్నారంటే యిక నా పని ఆఖరు. మరోమారు ఆలోచించండి" అన్నాడు అతను.
"ఆలోచించడానికి ఏమీ లేదు. మీరు యిక వెళ్ళచ్చు" ఆమె తలుపు వేయబోయింది.
"ప్లీజ్... ఆగండి. ఈ రాత్రికే ఆశ్రయం యిప్పించండి. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను"
"మీరు ఎన్నైనా చెప్పండి - మిమ్మల్ని యిక్కడ పడుకోనివ్వడం వీలుకాని విషయం. అసలు మీలాంటి యువకుడితో మాట్లాడటం కూడా తప్పే"
"కాదనను. కానీ నేనున్న పరిస్థితి అలాంటిది. ప్రాణాలు పోతాయి"
"ఇదంతా నాకు తెలుసుగానీ, నేను నిస్సహాయురాలిని. మా అమ్మగారికి తెలిస్తే పెద్ద గొడవైపోతుంది"
ఆమె కొద్దిగా మెత్తబడిందని అతను కనిపెట్టాడు.
"అమ్మగారంటే?"
"ఈ కేంద్రం నిర్వాహకురాలు. మా సంరక్షకురాలు" అన్నది ఆమె.
"ఆమెకి తెలియకుండా మానేజ్ చేస్తే?"
"అబద్ధాలు చెప్పకూడదని మేం యిక్కడ నేర్చుకున్న మొదటి పాఠం" ఆమె కటువుగా చెప్పింది.
"ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి మొదటిసారి, అట్ ది సేమ్ టైమ్ చివరిసారి నిజం చెప్పకుండా వుండండి. అంతే చాలు"
"నిజం దాచడానికి, అబద్ధం చెప్పడానికి పెద్ద తేడాలేదు. నావల్ల కాని పని. ఇక్కడ, ఇంత రాత్రిపూట మీతో మాట్లాడడమే పెద్ద నేరం. దీనికి ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అనే ఆలోచిస్తున్నాను. దయచేసి వెళ్ళిపొండి" అన్నది.
వర్షం మరింత ఎక్కువైంది. అతను అప్పటికే పూర్తిగా తడిసిపోయాడు.
అతనికి ఏం తోచడంలేదు. అక్కడ్నుంచి వెళ్ళిపోవాలనుంది. కానీ ఈ వర్షంలో ఎక్కడికని వెళ్లడం? అదీగాక గణపతిరాజు ఇక్కడే పొంచి వుంటే మృత్యువును తనే కౌగిలించుకున్నట్టు అవుతుంది.
"ప్రాణాలు అరచేత పట్టుకుని సాయంచేయమని అడిగినవాడిని నిర్ధాక్షిణ్యంగా వెళ్ళిపొమ్మంటున్నారు. ఇది మంచి పనే అని మీకు అనిపిస్తోందా?"
"మంచి చెడుల విషయం నేను ఆలోచించడంలేదు"
"ఏది మంచో, ఏది చెడో ఆలోచించకుండా ఎవరూ వుండలేరు. నాగరికత సమాజం పుట్టినప్పట్నుంచీ ఈ ప్రశ్న వస్తూనే వుంది - అధిక సంఖ్యాకులకు అధికంగా సుఖం యిచ్చేదంతా మంచేనంటాడు జాన్ లాక్ అనే తత్త్వవేత్త."
ఆమెకి తత్త్వశాస్త్రం అంటే ఇష్టం. అందుకే ఆమె విమలాబాయి చెప్పేదంతా శ్రద్ధగా వింటోంది. విమలాబాయి భారతీయ తత్వశాస్త్రాల గురించే చెబుతోంది. పాశ్చాత్య తత్వశాస్త్రాల గురించి వినడం ఆమెకి కొత్తగానూ, ఇష్టంగానూ వుంది. కానీ యిప్పుడున్న పరిస్థితి వేరు. అందుకే విసుగ్గా ముఖం పెట్టింది.
అయితే ఆమె ముఖకవళికలు స్పష్టంగా కనిపించడంలేదు అతనికి. ఆమె మౌనంగా వుండడంవల్ల అతను చెప్పుకుపోతున్నాడు.
"ఇమాన్యుయెల్ కాంట్ అనే తత్వవేత్త ఏమన్నాడో తెలుసా? ఏ నీతి సూత్రాన్ని నువ్వు విశ్వజనులందరూ ఆచరించాలని కోరుకుంటావో ఆ నీతిసూత్రం ప్రకారమే నువ్వు నడుచుకో అన్నాడు. దీన్నే సార్త్ర్ ముందు దాన్ని వెనక్కి, వెనక దాన్ని ముందుకీ తోశాడు. ఎలా నడుచుకుంటే అది సార్వజనీన నైతిక సూత్రం అవుతుందని నీకనిపిస్తుందో అలా నడుచుకో. అదే నీ కర్తవ్యం అన్నాడు."
వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినమని వర్షాన్ని వెనక నుంచి గాలి తోస్తున్నట్లు వర్షం అప్పుడప్పుడూ లోనికి కొడుతోంది. అతను పూర్తిగా తడిసి ముద్దయి పోయాడు.
"చూశారా వర్షం? వరండాలో కూడా పడుకోనిచ్చేట్లు లేదు" తన వంక చూసుకున్నాడు. నీళ్ళు కాలువల్లాగా అతని నుంచి కిందకు కారుతున్నాయి.
అంటే దానర్థం, లోపల పడుకోనివ్వమనా? ఆమె బెదిరిపోతూ అతని వంక చూసింది.
లోపలున్న ఒకే గదిలో ఇద్దరూ పడుకోవడం అనేది ఆమె ఊహకందని విషయం. అతనికి సాయం చేయాలంటే అంతకు మించి మరో మార్గం లేదు.
ఆమె మరింత వణికింది.
"మీరేమో అసలే వీలు కాదంటున్నారు. ఈ విషయం తెలియని వర్షం వరండానంతటినీ తడిపేస్తోంది" కురుస్తున్న వర్షంకేసి చూస్తూ అన్నాడు.
ఎక్కడో ఉరిమింది. ఆకాశం సగానికి చీలిపోయినట్లు శబ్దం. ఆమె ఒక్కడుగు వెనక్కి వేసింది.
మెరుపులు కళ్ళముందు చిట్లుతున్నాయి. వర్షానికి పిచ్చిపట్టినట్లు కురుస్తోంది.
దగ్గర్లోనే చెట్టు విరిగిన చప్పుడు.
కరెంటు వుండడం ఒక్కటే కొంత ధైర్యాన్ని యిస్తోంది. మొత్తం ప్రకృతంతా బీభత్సంగా వుంది.
అతన్నుంచి తనకేదైనా ప్రమాదం సంభవిస్తుందని ఆమెకి అనిపించడం లేదు. సేవా కేంద్రం నియమావళికి విరుద్ధం కాబట్టి తటపటాయిస్తోంది. అదీగాక ఒక యువకుడితో కలిసి ఒకే గదిలో పడుకోవడమనే ఊహనే భరించలేకపోతోంది.
అలాగని పొమ్మనడానికీ మనసొప్పడం లేదు.
ప్రాణభయంతో తలదాచుకోవడానికి వచ్చిన వ్యక్తిని అంత రాత్రిలో, ఆ వర్షంలో పొమ్మనడం దారుణంగా తోస్తోంది. ఇప్పుడేం చేయాలి?
వర్షం మరింత ఉధృతమైంది. అతనిలో వణుకు ప్రారంభమైంది. ఆమె ఇదంతా గమనిస్తోంది.
"చచ్చేంత ఆకలిగా వుంది. మీ గదిలో ఏమైనా తినడానికి వుందా?" అని అడిగాడు.
లేదని చెప్పడానికి ఆమె చచ్చేంత సిగ్గుపడింది.
"ఏమీలేదు. మేమంతా భోజనశాలకు వెళ్ళి తిని వస్తుంటాం" అన్నదామె.
"ఓహో! అలాగా! పప్పిళ్ళలు కానీ, వేరుశనగ పప్పులాంటివి గానీ లేవా? మేం యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో గదుల్లో ఇలాంటి తినుబండారాలు పెట్టుకునేవాళ్ళం."
"ఇది యూనివర్సిటీ కాదుగా!"
"నిజమే. కానీ ఇప్పుడేమిటి చేయడం? పైన వర్షం బాధ, లోపలఆకలి బాధ. గొప్ప కష్టంలోనే ఇరుక్కున్నాను నేను."
