విశ్వేశ్వరశాస్త్రి కనుపాపల్లో పొరలుగా ఉబుకుతున్న కన్నీళ్ళు.
"ఏమి చెప్పాను?"
నానీ సిగ్గుపడుతున్నాడు.
"చెప్పరా భడవా..."
"మరేమో... నువ్వు మంచి రాముడివి... అందుకే మీ నాన్న చెప్పినట్టు విన్నావు..." ఆగి ఆగి చెపుతున్నాడు. "మా నాన్నేమో తాత చెబితే వినడు. నాన్నని తాతకి మంచి కొడుకుని చెయ్యి అన్నాను."
"అప్పుడు" విశ్వేశ్వరశాస్త్రి కంఠం అప్పటికే రుద్ధమైంది. "అలాగే అన్నాడా?"
"వినబడిందో, లేదో... మనసులో అనుకున్నాను కదా" కొద్దిగా అనుమానాన్ని ప్రకటించి "ఎక్కడికి పోతాడు... గుడిలోనే వుంటాడుగా రోజూ అడుగుతాను. అలాగయితే వింటాడు, ఎంతైనా మంచి దేవుడుకదా" సర్టిఫై చేసేస్తూ "ఇదిగో ప్రసాదం తెచ్చాను" అంటూ అందించాడు.
తాతయ్య రెండోచేయికూడా లేపలేకపోతుంటే "పోనీలే తాతయ్యా! నేను తినిపిస్తాగా" అంటూ నోట్లో వుంచాడు.
చేతులురాని తనకు చేయిగా, కుమిలిపోతున్న మనసుకి ఓదార్పుగా సర్వావస్థలలోనూ తనకి బాసటగా నిలిచే మనవడ్ని చూస్తుంటే ఆర్థ్రతను దాచుకోలేకపోతున్న శాస్త్రి వివశత్వంలో వెనక్కి పడిపోతుంటే "ఏంటి తాతయ్యా చిన్నపిల్లాడిలా" అంటూ కళ్ళు తుడిచాడు.
"అదికాదురా బుజ్జికన్నా... నేనంటే నీకెందుకింత ప్రేమ."
"మంచి తాతయ్యంటే మనవడికి ప్రేముండదేంటీ" అన్నాడు అదో విచిత్రమా అన్నట్టు.
"ఇన్ని చేసిన నావాళ్ళంతా నన్ను నిరసిస్తుంటే గద్గదికమైపోయింది గొంతు. "ప్రత్యేకించి ఈ పనికిరాని తాతయ్యమీద నీకెందుకింత మక్కువా అని."
"చెప్పేయమంటావా తాతయ్యా" తాతయ్య గుండెపై తలానించి ఆకతాయిగా తల ఆయనవైపే తిప్పుతూ అన్నాడు. "అన్ని రసాల్లోకి కరుణరసం గొప్పదని నువ్వు చెప్పావుగా."
"కరుణ చూపిస్తే దేవుడిక్కూడా ప్రేమ పుడుతుందని చెప్పావుగా."
"అన్ని మాటలెలా నేర్చావురా చిట్టితండ్రీ."
"నువ్వే నేర్పావు" తాతయ్యా చిలిపిగా అన్నాడు.
"చెప్పేయమంటావా తాతయ్యా... ఏకోరసః కరుణ పరం నిమిత్త భేదాద్ధిన్నః పృథ క్పృథగి వాశ్రయత వివరాత్న ఏ ఆవర్తం బుద్భుద తరంగ మయాక వికరాసంభోయధాసంల మేవహితతః మస్తమౌ."
భవభూతి శ్లోకాన్ని నోరు తిరగనిచోట స్వల్పమైన తప్పులు దొర్లినా యధాతథంగా వల్లెవేస్తుంటే తన శరీరంలోని కొన్ని అంగాలనుకున్నవి తనకు మనోభంగాన్ని కలిగించినా తానింకా గెలుపు ఒడ్డునే నిలబడ్డానన్న సంతృప్తితో చూశాడు ఆయన.
ఇన్నాళ్ళూ విడిపోయిన ప్రకృతిని తలచుకుని విశ్వ ఏకత్వంలో విశ్వశక్తి భావంతో మనవడ్ని పెనవేసుకుంటూ "నువ్వు ఏక సంథాగ్రాహివిరా భడవా" అన్నాడు తాత్వికంగా.
* * *
అర్థరాత్రి...
చుక్కలలో ఆదర్శాలను లెక్కించడం చేతకాని చీకటి ప్రకృతిని రెక్కపట్టి నిలబడి చూస్తూంది.
చీకటి సముద్రపు ఒడ్డున కట్టుకున్న పిచ్చిక గూళ్ళను చూస్తూ ప్రకృతి కలలకి కాటుకనద్దుతూ వూపిరితిత్తిని కొలిమితిత్తిగా మార్చుకుని గాలిని పాముబుసలా పైకి నెడుతూంది.
గదిలో ఆదమరిచి నిద్రపోతున్న పావనిని ఎవరో తట్టినట్టయి ఉలిక్కిపడి లేచింది.
పక్కమీద చంద్రం కూర్చుని వున్నాడు.
ముందు నమ్మబుద్ధికాలేదు.
అందుకే వూరవతల మామిడితోపుల్లోని నక్కల ఊళలుగాని, చెరువుపక్క చెట్టునీడన సర్పమెత్తిన కళింగనాగు కోరలుగాని ఆమెకు గుర్తుకురాలేదు.
"కాఫీ చేస్తావా?" ఆప్యాయంగా అడిగాడు.
అలాంటి ప్రేమకూడా ఆమెకు కొత్తే. అందుకే పరవశించింది. ఒక చీకటి కుహరంలో మగ్గిపోతున్న తన బ్రతుక్కి అదే ఓ కోరని కాంతిరేఖగా తలపోసి వంటగదిలోకి నడిచి లైటు వెలిగించింది.
దఢేల మన్న చప్పుడు, పెట్రోలియం గేస్ అంటుకున్నట్టుగా. మరుక్షణం ఓ ఆర్తనాదం.
అంటుకున్న అరణ్యంలా రోదిస్తూ మంటలమధ్య కేకలతో బయటకు పరుగెత్తుకొచ్చింది.
నానీ ఉలికిపాటుగా నిద్రలేచాడు. పక్కన అమ్మలేదు.
కాని ఎదురుగా అమ్మ- మంటలా మండే అమ్మలా ఆక్రందన చేస్తూంది.
"అ... మ్మా...!"
ఏ శనిదేవత రధచక్రపు యిరుసులోనో పడి నలుగుతున్నట్టు అమ్మని చేరబోతుంటే నాన్న పట్టుకున్నాడు.
అప్పుడు చూశాడు గదిలో పరుగెడుతున్న అమ్మలాంటి మంటను గమనిస్తున్న నానమ్మని, అత్తయ్యని, తండ్రినీ అందర్నీ.
"ఎవరూ కదలరేం... అమ్మనెవరూ ఆదుకోవాలని, ఆర్పాలని ప్రయత్నించరేం."
చిన్న మనసుకేదో అర్థమైపోతూంది.
మరోసారి "అమ్మా" అంటూ కేకపెట్టి తండ్రిచేతిని విదిలించుకోబోయాడు.
"రా...కు... నాన్నా... రాలి... పోతున్న... నాకోసం... నువ్వు కాలిపోకు... "దీనంగా, దారుణంగా రోదిస్తూనే కాలుతూ అమ్మ కదులుతూంది.
మంట కదిలి కదిలి అమ్మ కాలి కాలి మంచంపైనే వున్న విశ్వేశ్వరశాస్త్రి ఆక్రందనలు నేపథ్యంకాగా ఒకచోట ఆగిపోయింది.
బొగ్గులా మాడి సంఘ బహిష్కృతురాలైన సంస్కారపు దేవతలా మూలుగుతూ ఓ మూల పడిపోయింది పావని.
"అయ్యో... పావనీ " నాన్న చేరుకున్నాడు ముందు.
"వదినా" సరళ ఏడుస్తూ సమీపించింది.
"అమ్మా పావనీ" కాంతమ్మ గొంతెత్తి రోదిస్తూంది.
కాని...
నానీ ఏడవటంలేదు.
ఒక స్వప్నాన్ని చూసినట్టు ఒక పీడకలలోని పాత్రలా మారినట్టు రెప్పలనుంచి జారని నీటిబొట్లను రాల్చే ప్రయత్నం చేయకుండా శిలలా నిలబడి అలాగే చూస్తున్నాడు.
