Previous Page Next Page 
ప్రతీకారం పేజి 11


    "కాదు డియర్! నిన్ను చూస్తుంటే నా హృదయం."
    "ఆ నీ హృదయం? జపాను రబ్బరు బంతిలా ఎగిరెగిరి పడుతుందా లేక జ్యోతిలక్ష్మిలా డాన్సు చేస్తుందా?" ఎగతాళిగా అడిగింది.
    "నేను ఏది మాట్లాడినా నీకు ఎగతాళిగానే వుంటుంది. అందుకే అంటారు పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని" కోపంగా ముఖం పెట్టాడు హిప్పీరావు.
    "అంతలోనే కోపం! ఆ చెప్పు..." అన్నది హేమ.
    "నాకు ఇవ్వాళ సూటి సమాధానం కావాలి. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?"
    "లేకపోతే?"
    "ఇప్పుడే వెళ్ళి..."
    "ఆఁ వెళ్ళి? ఆగిపోయావేం? హుసేన్ సాగర్ లో దూకుతావా లేక ఉరిపోసుకుంటావా?" వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధించింది హేమ.
    "నన్ను చూస్తుంటే నవ్వుగా వుందికదూ?" లేచి నిలబడ్డాడు హిప్పీరావు విసుగ్గా.
    హేమ హిప్పీరావు చెయ్యి పట్టుకొని "ఆడపిల్లలా అలా అలిగి పారిపోతావేం కూర్చో!" అంటూ కూర్చోబెట్టింది.
    హిప్పీరావు అసలు పేరు అప్పారావు. "అప్పారావు" అనే పేరులో చాలా చాలా పాత వాసన వస్తుందని తన పేరు "హిప్పీరావు"గా మార్చుకున్నాడు. హిప్పీరావును దూరం నుంచి వెనుకగా చూసి "ఆడో...మగో" చెప్పడం కొంచెం కష్టమే. మెడవరకు పెరిగిన జుట్టు, పిల్లిగడ్డం, పెన్సిల్ తో గీచి నట్లుండే మీసాలూ, ఒంటికి అతుక్కుని వుండే దుస్తులు, మెళ్ళో సన్నగా మెరుస్తూ వుండే వెండి గొలుసూ, కాస్త నడుం తిప్పుతూ నడక- ఆ గడ్డం మీసాలూ లేకపోతే ఏపుగా పెరిగిన ఆడపిల్లలా వుంటాడు.
    హేమ తెల్లగా, పొట్టిగా, బొద్దుగా మూడు సున్నాలు చుట్టినట్టు వుంటుంది.
    "చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా?"
    "నేను చెప్పేది ముందు విను..."
    "ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా- ఎన్ని చెప్పినా వింటాను" అన్నాడు హిప్పీరావు హేమ చేతిని తన చేతిలోకి తీసుకొని నొక్కుతూ.
    "అది కాదు..."
    "ఎందుకు కాదు? తప్పక అవుతుంది ఎందుకు కాదో నేను చూస్తాగా"
    "నేను చెప్పేది వినవేం?"
    "ఇంకా ఏం చెబుతావ్? తప్పక అవుతుంది... మన పెళ్ళి ఎలా కాదో నేను చూస్తానుగా? ఇక నువ్వేం చెప్పక్కర్లేదు."
    "అడుగో మా నాన్న!" అంటూ లేచి పరిగెత్తుకెళ్ళి చెట్ల చాటున కూర్చుంది.
    హిప్పీరావు లేచి గబగబా పరంధామయ్యకు ఎదురు వెళ్ళాడు.
    "నమస్కారమండీ మామగారూ!" చేతులు జోడించాడు హిప్పీరావు.
    "ఎవడ్రా వాడు? మామగారూ?" చేతిలోనున్న వంకీ కర్ర గాల్లోకి లేచింది.
    హిప్పీరావు కాలికి బుద్ధి చెప్పాడు.
    "ఆగండి సన్యాసి! అంట్ల వెధవ ! మామగారట! మామగారు" పరంధామయ్య గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
    హిప్పీరావు హేమ కోసం వెతికి వెతికి బెంచీ మీద కూలబడ్డాడు నీరసంగా.
    వెనుక నుంచి హేమ కళ్ళు మూసింది.
    "అమ్మ దొంగా!" అంటూ హేమను హిప్పీరావు ఒళ్లోకి లాక్కున్నాడు.
    
                                              10

    రవి బట్టలు సర్దుకుంటున్నాడు. జగన్నాధం అవీ ఇవీ అందిస్తూ ట్రైనింగ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఒకటే చెప్పుకు పోతున్నాడు. సర్దుకుంటూ తండ్రి మాటలు నవ్వుతూ వింటున్నాడు రవి.
    నాన్న ప్రాణాలన్నీ తనమీదే వుంటాయి. ఇంతవరకు ఒకరోజు కూడా తనను విడిచి వుండలేదు. తల్లిలేని లోటు తెలియకుండా పెంచాడు పిచ్చి నాన్న!
    "కంగ్రాచ్యులేషన్స్ రవీ!"
    రవి ఆలోచనల నుండి బయటపడి చివ్వున తలెత్తి చూశాడు.
    మూర్తి చెయ్యి చాపి రవికి 'షేక్ హేండ్' ఇచ్చాడు.
    "హార్టీ కంగ్రాచ్యులేషన్స్!" అభినందలు తెలిపింది రజని.
    "థాంక్స్!" కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రవి.
    "ఇప్పటికి తీరిందా?" నిష్ఠూరంగా అన్నాడు మూర్తిని ఉద్దేశించి.
    "ఊళ్ళో లేను వారం రోజులుగా. ఉదయమే వచ్చాను. అనుకోకుండా వెళ్ళాల్సొచింది, నీకు చెప్పటానికి కూడా టైం లేకపోయింది. రాగానే రజని చెప్పింది రవికి ఐ.పి.యస్. సెలక్షన్ వచ్చిందని" అన్నాడు మూర్తి.
    రజని అటెన్ షన్ లో నిల్చుని రవికి శాల్యూట్ చేసి "సర్!" అని మళ్ళీ అటెన్ షన్ లో నిలబడింది.
    రవి నవ్వుతూ దగ్గిరకొచ్చి "కొంటెపిల్ల!" అన్నాడు రజని చెవి మెలిపెడుతూ.
    "బాబోయ్!" నా చెవి!" కెవ్వుమంది రజని.
    జగన్నాధం, మూర్తి పకపక నవ్వారు.
    "ఎంతకాలం ట్రైనింగ్?" రజని అడిగింది.
    "ఆరు నెలలు" అన్నాడు రవి.
    "ఆ తర్వాత... లెఫ్ట్ ... రైట్ ... లెఫ్ట్...141...304... వుట్ హిం ఇన్ సైడ్ ... కిక్ హిం అవుట్... సో ఆన్ అంతేగా?" కిలకిల నవ్వింది రజని.
    రవి నవ్వుతూ రజని తలమీద మొట్టికాయ వేశాడు.
    "బాబోయ్! చూడు నాన్న!" చిన్నపిల్లలా ఏడుపు మొహం పెట్టి అన్నది రజని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS