Previous Page Next Page 
కొత్తనీరు పేజి 10


    తండ్రి పిల్లలమీద పెట్టుకున్న ఆశలు, కోరికలు ఎరగనిది కాదు విజయ. ఇప్పటివరకూ ఆయన ఆశలు ఏ ఒక్కరివల్లా తీరలేదన్న సంగతి తెలియనిది కాదు. అందుకే తన నిశ్చయం బయట పెట్టడానికి సందేహించింది. ఏదో తప్పు చేస్తున్న భావం కలిగింది. అయినా ఒకరి సంతోషం కోసం తన కోరికని, ఆశయాన్ని చంపుకోవడం ఆమె వల్ల గాలేదు. ఫారిన్ వెళ్ళాలని, విదేశాలలో పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించాలని, పెళ్ళిచేసుకోకుండా ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా జీవించాలని విజయ కోరిక. ఆ మాటే నెమ్మదిగా చెప్పింది.
    అది విని జగన్నాథంగారు ఏమీ అయిపోలేదు. ముందే ఊహించిన సంగతిలా వచ్చే నిట్టూర్పు అణుచుకున్నారు.
    "విజయా, ఆడపిల్లవు పెళ్ళి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఒంటరిగా జీవించగలవు? నీకు అంతగా యిప్పుడు పెళ్ళి చేసుకోవడం యిష్టం లేకపోతే పోనీ ఫారిన్ నుంచి తిరిగి వచ్చాకే చేసుకో! అంతే గాని పూర్తిగా పెళ్ళిచేసుకోకుండా వుండడం కష్టం అమ్మా! నీ కింకా పట్టుమని పాతికేళ్ళు లేవు. నీముందు ఎంతో జీవితం వుంది. ఆడది లోకంలో ఒంటరిగా జీవించలేదు తల్లీ! నీకు తెలియదు. నేను చెప్పినట్లు విను...." కన్నందుకు తన బాధ్యతగా మంచి చెడ్డలు వివరించారు ఆయన. విజయ నవ్వింది చిన్నగా.
    "ఒంటరిగా ఎందుకు ఉండలేను? ఇప్పుడు ఒంటరిగా ఉండిచదువుకోవడం లేదూ?" అంది.
    "ఇది వేరమ్మా! చూడు తల్లీ, ఇప్పుడు నా పర్యవేక్షణలో ఉన్నావు. అలాగే పెళ్ళయితే రేపు భర్త పర్యవేక్షణ నీకు రక్షగా వుంటుంది....."
    "ఏ పర్యవేక్షణలు, రక్షణలు లేకుండా నేను ఉండలేనా? నేనేం చిన్న పిల్లనా? నన్ను ఒకరు చూడాలా ఏమిటి?"
    "నీకు తెలియదమ్మా! యౌవనం చాల చెడ్డది. ఆ ప్రలోభంనుంచి తప్పించుకోవడం కష్టం! కాలు జారకుండా నిగ్రహించుకోవడం నువ్వనుకున్నంత సులువుకాదు. అంతేకాక నువ్వు ఏమి పోగొట్టుకొన్నావో నీ కిప్పుడు తెలియదు. ఆ సత్యం నువ్వు ఎప్పుడో తెలుసుకుంటే, అది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే అవుతుంది. నీ మనసు ఎప్పుడో మారితే, అప్పుడు ప్రయోజనం ఉండక పోవచ్చు....." కూతురికి మంచి చెడ్డా బోధించసాగాడు జగన్నాథంగారు.
    "ఏమిటి నాన్నా, మీరు మాట్లాడుతున్నారు?....నా అభిప్రాయాలు అంత చంచలమైనవి కావు. నా మనసూ అంత నిగ్రహం లేనిదికాదు. ఒకవేళ ఎప్పుడన్నా నా అభిప్రాయం మీరన్నట్టు మారితే అప్పుడే నాకు నచ్చిన వాడిని పెళ్ళాడుతాను. ప్రస్తుతం వివాహం చేసుకోను అంటున్నాను. తర్వాత సంగతి తర్వాత ఆలోచించవచ్చు. ముందు ఫారిన్ వెళ్ళడం నా ధ్యేయం" అంటూ విజయ తన నిర్ణయం తెలియచేసింది. ఇంకేం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక వూరుకున్నారు ఆయన.
    "నీ యిష్టం అమ్మా!.....ఇంక నేను చెప్పేది ఏముంది, అంతా నువ్వు నిశ్చయించుకున్నాక? మీ రందరూ పెద్దవాళ్ళయిపోయారు. రెక్కలు వచ్చిన పక్షులని కట్టివుంచాలనుకోవడం అవివేకమే. మీ మీ మంచి చెడ్డలు తెలుసుకునే వయసు మీకుంది. మీరు నామాటకి విలువ ఎప్పుడు యిచ్చారు, ఇవాళ యీయలేదని బాధపడడానికి" అని ఆయన వ్యథగా కళ్ళు మూసుకున్నాడు. విజయ నెమ్మదిగా అక్కడ నుంచి జారుకుంది.
    తండ్రి వదిలినంత తేలిగ్గా తల్లి వదలలేదు. విజయని చెడా మడా తిట్టింది. కేకలు వేసింది. దానినింతవరకు చదివించడం మీ తప్పు అని భర్తని దుయ్యబట్టింది. "ఇరవైమూడేళ్ళ దానివి పెళ్ళి పెడాకులు లేకుండా వున్నదే చాలు. ఇంకా చదివి ఉద్యోగాలు చేసి ఊళ్ళేలక్కరలేదు" అని కూతురిని మందలించింది. "ఆడపిల్లవి ఒంటరిగా విదేశాలు వెళ్ళడం ఏమి"టని కేకలు వేసింది.
    తల్లి ఏడుపును, తండ్రి ముభావాన్ని-వేటినీ లెక్కచెయ్యకుండా విజయ తన విదేశ ప్రయాణం ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
    "అందరూ ఒక్కలా కాల్చుకు తింటున్నారు. నా కడుపున చెడబుట్టారు. నామాట వినని నువ్వు నా కూతురివేకాదు. నాకు యీ రోజునుంచి నువ్వు లేనట్టే లెక్క" అంటూ ఏడ్చింది పార్వతమ్మ, విజయ వెళ్ళే రోజున.
    పార్వతమ్మలా జగన్నాథంగారు బయటపడకపోయినా లోలోపల కుమిలిపోయారు. ఇంక విజయ కావాలనుకున్నప్పుడు కంటికి కనపడదు. అనుకోగానే ఆయనకీ మనసులో ఎంతో దుఃఖం కలిగింది. అందరిలోకి ఆఖరి కొడుకు శంకర్, ఆఖరి కూతురు విజయ అంటే ఓపాలు అభిమానం హెచ్చే ఆయనకు. అలాంటి విజయ దేశాలు పట్టివెళ్ళిపోవడం! మళ్ళీ ఎన్నాళ్ళకి వస్తుందో! అసలు వస్తుందో, రాదో! ఆమె ఉద్దేశాలు ఏమిటో కూడా సరిగా చెప్పకపోవడం ఎంతో బాధ అనిపించినా బాధ అణుచుకున్నాడు.
    విజయ ఆ వెళ్ళడం వెళ్ళడం చాలా కాలం వరకు మరి తిరిగి రాలేదు. ముందు రెండేళ్ళు రీసెర్చి చేస్తున్నానని రాసింది. తర్వాత తనకి అక్కడే మంచి పెద్ద జీతంతో ఉద్యోగం దొరికిందని. ఆ దేశం తనకుచాలానచ్చింది కనక అక్కడే స్థిరపడిపోదల్చుకున్నాను అంది. ఎప్పుడైనా తన అభిప్రాయం మారితే అప్పుడు తిరిగివస్తానని తెలియచేసింది. ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని రాసింది.
    ఆ ఉత్తరం చూసి పార్వతమ్మ కళ్ళు ఒత్తుకుంది. జగన్నాథం గారు దీర్ఘంగా నిట్టూర్చారు.
    మొదట్లో ఆయన పిల్లల గురించి ఏవేవో కలలు కన్నాడు. ఏవేవో ఆశయాలు పెట్టుకున్నాడు.....కాని, రోజులు గడిచిన కొద్దీ తన కోరికలు ఒక్కొక్కటే కోరికగానే మిగిలిపోవడంతో, తీరని కోరికలను పిల్లల యిష్టాలలో చూసుకుని సంతృప్తి పడడం సాగించాడు.
    అక్షరాలా తన కోరికలు తీర్చుకోలేక పోయినా మొత్తంమీద పిల్లలంతా సుఖంగా వున్నందుకు, సంఘంలో కాస్తో కూస్తో ఉన్నత స్థానాలలోనే వున్నందుకు సంతృప్తిపడ్డాడు. కర్మ సిద్దాంతాన్ని నమ్మి మనసుకు నచ్చచెప్పుకోవడం అలవరచుకున్నాడు.
    పిల్లల్ని కన్న తరువాత పెంచి పెద్ద చేసేవరకే తమ బాధ్యత! తరువాత వారే తమ త్రోవ ఎన్నుకునేది. అది వారివారి అదృష్టాలను బట్టి వుంటుంది. అందులో తాము చేయగలిగింది ఏమీ ఉండదని, ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్దచేశాక కాని గ్రహించలేకపోయాడు ఆయన. వ్యక్తిత్వం ఏర్పడిన పిల్లలకి కన్న తల్లిదండ్రులుగా మంచి చెడ్డలు చెప్పడం తమ బాధ్యత! కాని తమకు చెడుగా కనిపించేది పిల్లలకి మంచిగా కన్పించి ఆ తోవనే వెడతామంటే 'వాళ్ళ' ఖర్మ అని సరిపెట్టుకుని వూరుకోవడం మినహా చెయ్యగలిగింది ఏమీలేదని ఆయన యిన్ని రోజులకు గ్రహించాడు. చొరవతీసుకున్నవారే ఫలితం అనుభవిస్తారని ఊరుకోడమే ఉత్తమం అని నిర్ణయించుకున్నాడు.....కాని....అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోతే కన్నవాళ్ళం కాబట్టి బాధ పడకుండా వుండలేం అని నిట్టూర్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS