Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 10


    "మీరు వెళ్ళడానికి అంత తొందర ఎందుకు పడ్తున్నారు. ఇక్కడ వుండడం మీ కిబ్బందిగా వుందా. మీరు వుంటే మాఅమ్మ ఎంతో సంతోషిస్తూంది. మీరు వచ్చాక యీ పది రోజులలో ఆమె ఎంతగానో కోలుకుంది. మీలో మా చెల్లెల్ని చూసుకుని ఆవిడ దుఃఖం మరిచిపోతోంది......మీరు ఉద్యోగంలో చేరినా మా యింట్లోనే ఉండండి. మిమ్మల్ని యివాళ మీ ఆఫీసుకి తీసుకెడతాను నేను. అప్పాయింట్ మెంట్ ఆర్డరు అది తీసుకొచ్చుకుందురు గాని. ఏ హాస్టల్లోనో, గది అద్దెకి తీసుకునో ఉండే బదులు మా యింటిలోనే ఉండండి. వంటరిగా ఉండే యిబ్బంది మీ కుండదు. మా అమ్మకోరిక తీరుతుంది..."
    "ఇక్కడ వుండిపోనా...అదేమిటి, ఎలా....ఎలా ఉంటాను?"....మధ్యలోనే అడ్డుకొని ఆశ్చర్యంగా అంది సరోజ.
    "ఏం అమ్మా, ఉండడానికి నీకేం అభ్యంతరం-వుంచుకోడానికి మాకు లేని అభ్యంతరం నీ కెందుకు.... నీ వెందుకు యింత మొహమాట పడ్తున్నావు. నీకు తల్లి లేదు. నాకు కూతురు లేదు. నిన్ను కన్న బిడ్డలా చూసుకుంటాను నేను- నీకేలోటు రానీయను..." సరస్వతమ్మ ఆదుర్దాగా సరోజని వప్పించడానికి అంది. ఆవిడ చూపే అభిమానానికి, ఆదరానికి సరోజ కళ్ళు చమర్చాయి. ఆవిడ అభ్యర్ధనని కాదని ఎలా అనడమో కూడా తెలియలేదు....కాని...
కాని, అంతా ఏమనుకుంటారు.... మామయ్యా అత్తయ్య ఏమంటారో..." గొణిగింది.
    "నీకెందుకు మామయ్యగారికి మావాడే రాస్తాడు--యింక మిగతావారు ఎవరేమనుకుంటారు? అనుకుంటే మాత్రం మనకేం....ఒరేయ్ కృష్ణా, యింక సరోజమాట మనం వినద్దు. ఇక్కడే ఉంటుంది. ఎక్కడికీ వెళ్ళదు. ఆ ఉద్యోగం ఏమిటో సరోజని వెంట తీసికెళ్ళి చూడు. యిదిగో నీ వింకేం మాట్లాడకు, నాకు అడ్డు చెప్పకు..."  సరోజని, మరో మాట మాట్లాడే అవకాశం యీయకుండా కొడుకుకి ఆజ్ఞ యిచ్చేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. సరోజ యిబ్బందిగా, బిడియంగా కృష్ణమోహన్ మొహంలోకి చూసింది. సరోజ వంక చూస్తూ "మా అమ్మ మాటంటే మాటే తిరుగులేదు" అంటూ అదోలా నవ్వాడు. సరోజ సిగ్గుగా మొహం దించుకుంది. "అయినా మీరేమిటి అంత మొహమాట పడ్తున్నారు.....యీరోజునించి యింక యిది మీ యిల్లే అనుకోండి, ఫ్రీగా ఉండండి. ప్లీజ్" అన్నాడు అభ్యర్ధిస్తున్నట్టు. సరోజ ఏమనగలదు?
    
                                       *    *    *
    
    "సారీ సరోజగారూ యిలా అవుతుందనుకోలేదు....." నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణమోహన్.
    "మీదేం తప్పు, యిది నా దురదృష్టం, యీ జ్వరం నా దౌర్భాగ్యంకొద్ది వచ్చి దొరక్క దొరక్క దొరికిన ఉద్యోగాన్ని పోగొట్టింది. ఇంక మళ్ళీ ఉద్యోగం దొరకడం నాలాంటి వాళ్ళకి మాటలా, యింకేం చెయ్యాలో అర్ధం అవడంలేదు." వాడిపోయిన మొహంతో నిరాశ, నిస్పృహ లతో అంది సరోజ, కారు డ్రైవ్ చేస్తూ ఏం అనాలో అర్ధం కాక వూరుకున్నాడు కృష్ణమోహన్. సరోజ వెళ్ళేసరికి యిస్తానన్న ఉద్యోగం - సరోజ అన్న టైముకి రానికారణంగా మరో రెండు మూడు రోజులు చూశాక మరొకరికి యిచ్చినట్లు మేనేజరు చెప్పి తన అసహాయతను ఆ విషయంలో వెల్లడించి విచారం వ్యక్తంచేశాడు. కృష్ణమోహన్ స్వయంగా మాట్లాడి తన పరపతిని ఉపయోగించినా యింకా ఏ ఉద్యోగం ఖాళీ లేదని తన అశక్తతని వెల్లడించాడు అతను. సరోజ నల్లబడిన మొహం చూస్తే బాధ అన్పించినా ఏం చెయ్యగలడు!
    "ఇంకా యిక్కడ వుండి ఏం చెయ్యను? నాకిక్కడ ఎవరూ తెలియదు. నాలాంటి అనామకురాలికి ఉద్యోగం ఎవరిస్తారు...నేను వూరికి వెళ్ళిపోతాను. అక్కడయితే నాలుగు ప్రైవేట్లన్నా చెప్పుకుంటాను. రేపు నన్ను రైలెక్కించండి....నాకంటే మీరు పెడ్తారు తిండి ధర్మాత్ములు కనుక-కాని అక్కడ మామయ్య అత్తయ్య గతి ఏమిటి, నేనిక్కడ రాజభోగాలనుభవిస్తూంటే పాపం వాళ్ళక్కడ ఏం యిబ్బంది పడ్తున్నారో ..." వ్యధగా అంది సరోజ. "నేను రేపు వెడతానండి, యింక అడ్డు చెప్పకండి.." దృడంగ అంది.
    "మీ రెందుకంత వర్రీ అవుతున్నారు. ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం ప్రయత్నిద్దాం."
    "హ...ఎంత ప్రయత్నంచేస్తే ఈ ఉద్యోగం దొరికింది మీకేం తెలుసు. యిప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళు ప్రయత్నించాలి..." నిస్పృహగా అంది కన్నీళ్ళు మినహా పట్టుకొన్న గొంతుతో. నల్లబడిన మొహంతో మాట్లాడుతున్న సరోజని చూస్తే కృష్ణమోహన్ కి ఆమెకి ఏం చెప్పాలో, ఏం ధైర్యం చెప్పాలో అర్ధంగాలేదు. నిజమే ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో తనకి తెలుసు - యిల్లు నడపాల్సిన బాధ్యతవున్న సరోజ వ్యధా అతనికి అర్ధం అవుతూంది. ఆమె అన్నట్టు ఆమె ఒక్కర్తే అయితే తమ యింట్లో నిరభ్యంతరంగా వుంచుకోవచ్చు. ఆమె అత్తయ్య మామయ్య లని తాము వుంచుకోగలరా! ఉంచుకుందామన్నా వాళ్ళు ఒప్పుకుంటారా! తను వేలు సంపాదిస్తున్నాడు. ఆమె వారికి పంపమని నెలకి వందో రెండు వందలో యీయడం తనకి కష్టంకాదు కాని ఈ దానాన్ని ఆమె స్వీకరిస్తుందా? ఇంట్లో వుండడానికే ఎంతో బిదియపడ్తున్న ఆమె ఉచితంగా ధర్మాన్ని స్వీకరిస్తుందా! ఆమేకాదు, ఆత్మాభిమానం వున్న ఎవరూ ఒప్పుకోరు! అసలు ఆ మాట తను ఎలా చెప్పడం? కారు డ్రైవుచేస్తూ ఆలోచించాడు కృష్ణ మోహన్...ఉద్యోగం లేకపోతే సరోజ వెళ్ళిపోతుంది! ఆమె వెళ్ళిపోతే తల్లి మళ్ళీ మామూలు మనిషి కాదు. తల్లికోసం సరోజని కొన్నాళ్ళయినా వుంచాలి. కారు గార్డెన్సు దగ్గరికి రాగానే చటుక్కున ఆపాడు. "ఇక్కడ కాసేపు కూచుని మాట్లాడుదాం. దిగండి సరోజా..." అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. "ఇక్కడా? ఏమిటి? ఎందుకు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS