"అత్తగా మీ అమ్మ, ఆడపడుచుగా నువ్వు, భర్తగా మీ అన్నయ్య నన్నెంత రాచిరంపాన పెట్టినా నేను అడ్డుపడను. బ్రతికినంతకాలం భరిస్తాను. కాని నానీమీద మరొక్కసారి చెయ్యి చేసుకున్నా, నేను ఇంకా బ్రతికుండటానికి కారణమైన నానీకే ఆపదొచ్చినా అదే మీ చీకటి బ్రతుకుల్ని బయటపెట్టే తొలిక్షణమవుతుంది గుర్తుంచుకోండి" హెచ్చరించి నానీని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది.
కాంతమ్మ అప్పటికే చెమటతో తడిసిపోయింది.
"ఇంత బ్రతుకూ బ్రతికిన నన్ను చివరికి దానిముందు దోషిలా నిలబెట్టావు కదే" వాపోయింది కూతుర్ని చూస్తూ.
"అమ్మా" క్షమించమన్నట్లు తల్లి పాదాలపై పడిపోయింది.
"తప్పు చేసినా కడుపులో దాచుకోవాల్సిన నువ్వే ఇలా అంటే ఎలాగమ్మా... నేను పెళ్ళికిముందే రాజారావుని ప్రేమించాను.
కాంతమ్మకి అవేమీ వినిపించడంలేదు.
ఇన్నాళ్ళూ తన్నినా, తిట్టినా తలవంచుకునే నిలబడ్డ పావని తొలిసారి తల పైకెత్తింది.
తల పైకెత్తి వూరుకోలేదు. బుస కొట్టింది. కాటేస్తాననీ హెచ్చరించింది. అదీ తన కూతురు కాపురం విషయంలో.
సరిగ్గా ఇదే సమయంలో...
తల్లిపొట్టని తన పుట్టిల్లుగా భావిస్తూ తలని అమ్మ పొట్టపై వుంచి ఏడుస్తున్న నానీ "పొద్దుటే నాన్నకి చెప్పేద్దాం" అన్నాడు.
"వద్దు నాన్నా..." వారిస్తున్నట్లుగా కొడుకు తల నిమిరింది.
"అదికాదమ్మా... ఉపనిషత్తులు చెప్పేముందు తాతయ్య "ఓ దేవతలారా! మేము మంచినే విందుముగాక, మా కనులతో మంచినే చూతుముగాక మాకు మీరిచ్చిన ఆయువున్నంతకాలం మంచిగా బ్రతుకుతూ మిమ్మల్ని స్తోత్రం చేయుదుముగాక" అంటూ శాంతిపాఠం చెబుతాడుగా."
"కాని నువ్వు చూసింది మంచికాదమ్మా."
"అయినా అది నిజమేగా... "సత్యంవధ" అనికూడా నువ్వు చెబుతావుగా" అమాయకంగా అడిగాడు.
"సత్యంకన్నా క్షమ గొప్పదమ్మా... అదీ తాతయ్యే చెప్పాడుగా" నిశ్శబ్దంగా కొడుకుని గుండెలకు హత్తుకుంది.
ఆ క్షణంలో పండిత విశ్వేశ్వరశాస్త్రి రూపం గుర్తుకొచ్చి బాధగా కన్నీళ్ళు పెట్టుకుంది.
* * *
మిట్టమధ్యాహ్నపు వేళ...
ఉండుండి రేగిన పెనుగాలికి సూర్యుడు శాపగ్రస్తుడిలా మబ్బుమాటున దాగున్నాడు.
ఘడియో క్షణంలోనో వర్షించబోయే ఆకాశంలా మంచమంతా పరుచుకుని వున్న కామేశ్వరి ఆమెను ఆక్రమించబోయిన చంద్రాన్ని గట్టిగా పట్టుకుని నిలదీసింది. "ఎన్నాళ్ళు మనకీ చాటుమాటు వ్యవహారం" అంటూ.
పురుషార్థాలతో కామంకూడా ఒకటని బలంగా నమ్మి భార్య వుండగానే కామేశ్వరితో సంబంధం పెట్టుకున్న చంద్రం ఆ సమయంలో ఇలాంటి ప్రసక్తిని ఇష్టపడకపోయినా అసహనంగా ఆగిపోయాడు. "ఇంకెన్నాళ్ళు కాముడూ... పావని ఇప్పటికే సగం చచ్చింది. రేపోమాపో గుటుక్కుమంటే మనకేం అడ్డం వుండదు."
"అది పూర్తిగా చచ్చేసరికి నేను ముసలిదాన్నయిపోతాను. ఈలోగా తాడిచెట్టు నీడౌతాడా తగులుకున్నోడు మొగుడౌతాడా అంటూ లోకం నన్ను ఎగతాళిచేస్తూ ఆట పట్టిస్తుంది . ఆగు... కదలకు... ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు... అసలు నీకేం తక్కువచేశాను" కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది.
"అద్సరే కాముడూ... పావని వుండగా మనం పెళ్లిచేసుకుందాం అంటే మనం గవర్నమెంటు ఉద్యోగస్థులం. చట్టమొప్పుకోదుగా పావని తొందరగా ప్రాణాలు వదిలితే ఈ రెండు అరసున్నాలు కలిసి పూర్ణస్వారంగా మారి పోవచ్చని అతనికీ వుంది.
"ఇలాంటి మాటలు చెప్పే ఇన్నాళ్ళూ మభ్యపెట్టావు. నేనూరుకోను" కోపంగా మంచంమీదనుంచి దిగిపోయింది అతడ్ని దూరంగా నెడుతూ.
"అదికాదు కాముడూ..."
"చంద్రం! నేను కోరుకునేది సగం మొగుడు కాదు. సంఘం ఒప్పుకునే మొగుడు. అది నీతో కానిపని. ఒకవేళ నువ్వు సరే అన్నా నీ భార్య బ్రతికుండగా అది వీలుకాదు. పైగా నీ తండ్రి చండశాసనుడు."
"పిచ్చిదానా... ఆయన నడుం విరిగిన పాములా మంచం పట్టేశాడు . పైగా నాకు అమ్మ సపోర్టుంది."
"ఈ తర్కం నాదగ్గర చాలాసార్లుపయోగించావు. కాని నీమాట వింటూ ఇంకా మోసపోవటానికి నేను పద్మినిజాతి ఆడదాన్నికాదు" కోపంగా ఒంటికి చీర చుట్టేసుకుంది. "చూడు చంద్రం... మీ ఆవిడతో తాడోపేడో తేల్చుకుని గాని మళ్ళీ యీ గడపతొక్కకు. నాకు పడక ఒక్కటేకాదు... కడుపైనా ఇష్టమే... మొగుడులేకుండా తల్లినైపోయి నలుగురిమధ్య నవ్వులపాలు కాలేను" విసురుగా తన ఇంట్లోనుంచి బయటికి నడిచింది ఆఫీసుకెళ్ళాలన్నట్లుగా.
ఇది మామూలు చర్చకాదు. బాగా ముదిరిపోయిన హెచ్చరికగా గుర్తించిన చంద్రం ఉన్మాదిగా మారి కామేశ్వరి యింటినుంచి బయటపడ్డాడు.
ఆ క్షణంలో చంద్రానికి గుర్తుకొచ్చింది పావనికాదు.
యిందులో సంపూర్ణంగా సహకరించి సలహా యివ్వగల తల్లి కాంతమ్మ.
సరిగ్గా ఇదే సమయంలో...
కాంతమ్మ కూతురిపై విరుచుకుపడుతూంది. "అంటే నువ్వు ఇంటినుంచి బయలుదేరి పదిరోజులయిందన్నమాట" చేతిలోని అల్లుడు రాసిన ఉత్తరాన్ని మరోసారి చదివింది.
