Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 1

 

             చాటుపద్యమణి మంజరి

                                                        శ్రీ. వేటూరి ప్రభాకర శాస్త్రి

                


        శ్రీ గురుచరణం శరణమ్
        చాటుపద్యమణి మంజరి
        దేవతాస్తుతి స్తబకము
        
               పిళ్ళారప్ప

    క.  శ్రీకర దంతరుచికితసు
        ధాకర మృడపార్వతీముదాకర గుణర
        త్నాకర వరదీకర పర
        భీకర భాగ్యములకుప్ప పిళ్ళారప్పా!

    క.   ఉండ్రాళ్ళు పప్పునెయ్యిని,
        బండ్రించిన చెఱకుఁబాలుఁ ఐడిత పుతట్లున్    
        జుండ్రేచుపచ్చితేనియ,
        తండ్రీ వెనకయ్య ! నీకుఁ దడయక తెత్తున్.
    
    క.  ఓరీ వాలుఁడ నీ విటు    
        రారా యని నన్ను ఁ బిలిచి రంజీలుదయచేఁ    
        గోరిక లోసగుము భువి నీ
        పేరును బ్రకటించి చెప్పఁ బిళ్ళారప్పా.

    క.  గజముఖుని నేకడంతుని
        భజియింతును వాణి గౌరీ ఁ బంక జనిలయన్
        నిజభక్తి బుద్ది విద్యా
        త్రిజగత్ ఖ్యాత్యాయురుదయ తేజమ్ములకై.

        తొలినే యవిఘ్నమస్తనుచు దూర్జటినందన నీకు మ్రోక్కేదన్
        ఫలితముఁ జేయుమయ్య తలఁపంబడు కార్యకలాప మెల్ల నా  

         వలపలిచేతిగంటమున వాక్కున నెప్పుడుఁ బాయకుండుమా
        తెలివి ఘటింపుమా సతము దేవ వినాయక లోకనాయకా !

    క.  భక్షింపుము గావలసిన    
        భక్షములు నీకు నిత్తు భక్షించియు నీ
        కుక్షిఁగల విద్య మాకున్    
        భిక్షం బిడి కావుమప్ప పిళ్ళారప్పా!

    క.  మల్లెలు మొల్లలు జాజులు
        గొల్లలుగాఁ గోసి తెచ్చి కొనియాడి నినుం
        జల్లఁగఁ ఋజింతుము కృప
        వెల్లువగాఁ జూడుమప్ప పిళ్ళారప్పా!
    
    ఉ.  మోదకహస్తునిన్ ధవళమూషకవాహను నేకదంతు లం
        బోదరు నంబికాతనయు నూర్జిత పుణ్యు గణేశు దేవతా
        హ్లాదగరిష్టు దంతిముఖు నంచితభక్త వర ప్రదాయకున్
        మోదముతోడ హస్తములు మోడ్చి భజించెద నిష్ఠసిద్దికిన్!
        
            కదిరి వసంతా!

    
    క.   తిన్నని కస్తూరినామము        
        సన్న పుఁదలపాగచుంగు చక్కఁదనంబున్
        జెన్నలర ,మిమ్ముఁ గంటిమి    
        కన్నుల తెలివెంత వింత కదిరి వసంతా!
    
            మంగళాద్రీశ్వరుడు


    గీ.   ఉక్కుఁగంబంబు వెడలిన చక్కనయ్య        
        మున్ను ప్రహ్లాదుఁ గాచిన వన్నెలాఁడు
        నన్ను నేలిన శృంగార నాయకుండు
        హృదయమున నిల్చు మంగళాద్రీశ్వరుండు.

            కృష్ణస్తుతి.

    గీ.   చేత వెన్నముద్ద చెంగల్వపూదండ
        బంగరు మొలత్రాడు పట్టుదట్టి
        సందేతాయేతులును సరిమువ్వగజ్జెలు
        చిన్ని కృష్ణ ! నిన్నుఁ జేరి కొలుతు.

    క.  మడుపుకుఁ జని కాళిందుని
        పడగలపై భరతశాస్రపద్దతి వెలయున్
        గడువేడుకతో నాడెడు
        నడుగులు నామదిఁ దలంతు నచ్యుత కృష్ణా!
    
    క.   నారాయణ నీ నామము    
        నారాయణ వ్రాయవయ్య నా నాలుకపై
        నారాయణ నిను నమ్మితి
        నారాయణ కావవయ్య నారదవరదా!

            శ్రీ నారాయణ స్తుతి
    
    మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దెవతల్ భృత్యులై
        పరమామ్నయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
        సిరి భార్యామణియై విరించి కోడుకై శ్రీ గంగ సత్సుత్రియై
        వరుస న్నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!

    క.    నిరుపమ బాలానందా
        వరవనితాచిత్తచొర వరవసునందా!
        గిరిధర శరణు ముకుందా
        కరుణాకర నీవు నాకు గతి గోవిందా!

            ఇతర దేవతలు
    
    చం.  కమలజకృష్ణ శంకరులు కాంచనీలపటీర వర్జు లా
        గమనగ చంద్రధారు లాఘకంసపురారులు హంసతార్షగో        
        గమనులు జన్మ పుష్టిలయకారులు వాక్కమలాంబికేశ్వరుల్
        శమకరుణావిభూతిగుణశక్తులఁ బ్రోతురు మిమ్ము నెప్పుడున్.

    చం.    మొదలిటి గద్దెయక్షరము మువ్వురు వేల్పులలావు మేనిలో        
        మొదలివెలుంగు నెత్తి తుదిమోవఁగఁ జేయుట కేర్చుజంత్ర మ
        భ్యుదిత తనూసరోజములనూనిన గాడ్పుల యూటపట్టు స
        మ్మదమలరారఁగాఁ బ్రణవమంత్రము మాకుఁ బ్రసన్నమయ్యేడున్.
    
    చం.    సలిలవిహారు లిద్దఱును సంత తకాననచారు లిద్దఱున్
        వెలయఁగ విప్రు లిద్దఱును వీరపరాక్రమశాలు లిద్దఱున్
        బోలఁతులడాయువాఁ డొకఁడు భూమిని బుట్టెడు వాఁడు నొక్కఁడున్
        జెలువుగ మీ కభీష్టఫలసిద్ది ఘటింతు రసంతకాలమున్.
    
    చం.    చరణము లైదు మూఁడు విలసన్మణి నేత్రయుగంబు పుచ్చమున్
        బరువడి రెండువేలు నొకపంచకమున్ మాఱిరెండు నొప్పుచున్
        గరములు రెండు రెండ్లు ఘనకాయచతుష్కము గల్గినట్టియా
        సురుచిరమైన వేల్పు మిము సుస్థితిఁ బ్రోవుత మెల్లకాలమున్.


Next Page 

WRITERS
PUBLICATIONS