Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 9


    "ఇదేమిటి, ఇంతరాత్రి! ఈ సామానేమిటి?" ఆశ్చర్యపోయింది.
    "ముందు లోపలకి రానీ చెపుతా" భాస్కర్ సామాను లోపలపెట్టి అంతా చెప్పుకొచ్చాడు. రంజన మొహం నల్లబడింది. "ఆ కోతిమూతి వెంకట్రావే రాసుంటాడు, వెధవ నేను వాడితో సరిగా మాట్లాడనని కోపం. ఇప్పుడేం చేద్దాం. అందరికీ తెలిస్తే ఆఫీసులో ఎలా మొహం ఎత్తుకోవడం" గాబరాగా అంది.
    "ఈ వ్యవహారం ఇంతదూరం వెళుతుందనుకోలేదు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రభావతి ఇంత సీరియస్ గా దీన్ని తీసుకుంటుందనుకోలేదు"
    "నీవిక్కడ ఉంటే ఏం చెప్పాలి అందరికీ. ఇంటి ఓనర్ ముసలావిడ. అసలే లక్ష ప్రశ్నలు వేస్తుంది. నిన్ను రెండుమూడుసార్లు చూసి "ఎవరమ్మా అతను వచ్చిపోతుంటాడు' అని ఆరాలు తీసింది. "కజిన్ బ్రదర్, ఆఫీసు పనిమీద వచ్చిపోతుంటాడు అని సర్ది చెప్పాను" రంజన మాటల్లో అతనిక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తానే సిద్ధంగా లేదన్నది ధ్వనించింది. భాస్కర్ ఉక్రోషంగా చూశాడు.
    "అయితే నీవూ పొమ్మంటున్నావా, నీ పరువే నీకు ముఖ్యమా, ఇన్నాళ్ళూ ఈ పరువు గుర్తు రాలేదా. ఈ గొడవంతా నీ వల్లేగా. తప్పంతా నాదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు."
    "అది కాదు భాస్కర్, ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడుంటే లోకం ఏం అనదా" తడబడింది.
    "కజిన్ బ్రదరన్నావుగదా. ట్రాన్స్ ఫర్ అయి వచ్చాడు. ఇల్లు దొరికేవరకు ఉంటాడని చెప్పు. ఈలోగా ఏదన్నా ఏర్పాటు చూసుకుంటాను." అతనికి అప్పటికీ మనసులో ఏదో మూల ఆశ! ఓ వారం రోజులూరుకుంటే ప్రభావతి కోపం తగ్గి, ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని, ఏదో తనెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నురాలిని చేసుకోవచ్చన్న నమ్మకం ఉంది.
    ఆరోజు ఇద్దరూ గదిలో ఒంటరిగా ఉన్నా, రాత్రంతా గడిపే అవకాశం వచ్చినా, ప్రతిసారీ దొంగచాటుగా కలుసుకోవడానికి ఆరాటపడి, అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరి పొందులో ఒకరు మైమరచేవారు. ఆరాత్రి అలాంటి ఛాన్సు వచ్చినా, ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్నా, ఏ స్పందనా లేకుండా ఎవరిపాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు.

                                                        *  *  *

    దూరపు కొండలు నునుపు, అందరి ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే. కానీ, అందిన ద్రాక్ష తీపి, ఆ తీపి నాలుగు రోజులకే మొహం మెత్తేస్తుందన్నది పది రోజులలోగానే అనుభవంలోకి వచ్చేసింది. అందనంతవరకు ఊరించి, ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి, అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావలసింది అందగానే ఏ థ్రిల్లూ కనిపించదు. అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి, అడగకుండానే కళ్ళెదుట ఉండేసరికి తినబుద్ధిగాదు అన్నది ఇద్దరికిద్దరికీ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది. ఇద్దరి మనసులూ సరిగాలేవు. చూసినవాళ్ళేం అంటారో, ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రంజనకి, ముందేం జరుగుతుంది. ప్రభావతి నిజంగానే నిర్ణయించుకొంటే బంధువుల ముందు తనేం చెప్పాలి. ఆఫీసులో పరువేం అవుతుంది అని భాస్కర్ కి. భాస్కర్ ఎందుకైనా మంచిదని నాలుగు రోజులు సెలవు పెట్టాడు.
    "ఛ, ఆఫీసులో అంతా నావంకే చూస్తున్నట్టు గిల్టీగా ఫీలవుతున్నాను. ఇవాళ తెలియకపోవచ్చు. నాలుగురోజులు పోయాక నీవిక్కడున్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపాలి అందరికీ." రంజన చిరాగ్గా అంది. "వెధవలు నీవు ఆఫీసుకి రాకపోతే నన్నడుగుతారేమిటి. "మీకు తెలియకుండా ఉంటుందా." అన్నాడా టైపిస్ట్ వంకర నవ్వు నవ్వి." ఇంటి ఓనర్ ముసలావిడ ఎలా చూసిందో, "ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీసిందప్పుడే...' ఎంత కజినయినా అలా ఓ గదిలో ఇద్దరూ ఉంటే చూసినవాళ్ళేం అనుకుంటారు. ఇల్లు వేగిరం చూసుకోమను అతన్ని" అంది విసుగ్గా. రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్ కి కోపం వచ్చేసింది. "అంతేలే, కాళ్ళదగ్గరకొచ్చిన మగాడిని చూస్తే ఆడదానికి అలుసే. నీ కోసమే ఇదంతా జరిగింది. ఇన్ డైరెక్టుగా పొమ్మని చెప్తున్నావు. ఏదన్నా రూము చూసుకుపోతాలే. లేదంటే హోటలుకి పోతా ఇప్పుడే పొమ్మంటే. నిన్ను నమ్ముకుని నా పెళ్ళాం బిడ్డలకు దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు. ఇన్నాళ్ళూ నన్ను వెర్రి వెధవని చేసి సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు. నాలుగు రోజులకే నీవు బరువయిపోయాను.' రోజూ ఆఫీసునుంచి వస్తూనే ధుమధుమలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్ కి చర్రున కోపం వచ్చేసింది.
    "నాకిష్టం లేదన్నానా, అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే." సర్దుకుంటూ అంది రంజన.

                                                    *  *  *

    "రంజనా నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి. ఉతికంచలేదు." వచ్చిన నాలుగోరోజు అన్నాడు.
    "ఉతికించడానికి నాకేం పనిమనుషులు లేరు. నీ బట్టలు నేను ఉతకడం ఏమిటి? నీవు ఉతుక్కోవాలి గానీ, నీ పెళ్ళాననుకున్నావా." వారంరోజులకే రంజన జవాబు.
    "అబ్బ పొద్దుటా ఇదే వంట, రాత్రి ఇదేనా, రాత్రికి కాస్త కూరైనా వేరే వండకూడదూ!"
    "రెండు పూటలా వండడానికి నాకేం ఓపికలేదు బాబూ. చచ్చి చెడి ఆఫీసు నుంచి వచ్చి మళ్ళీ ఎవరొండుతారు. నేనెప్పుడూ రెండు పూటలకి ఒకసారే వండుకుంటాను" నిర్లక్ష్యపు జవాబు. వేడివేడిగా ఏ పూటకాపూట వండిపెట్టే ప్రభావతీ ఉద్యోగం చేసేది మరి. చాకిరీతో అలసిపోయినా తను తినడని రెండుపూటలా వండేది. ఎప్పటికప్పుడు బట్టలుతికించి ఇస్త్రీ చేయించేది. బనీను కనపడకపోయినా అరిచేవాడు. ఇప్పుడు రంజనని ఏదన్నా, ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే.
    "ఇంట్లోనే ఉంటున్నావు. అలా బజారుకెళ్ళి కూరలన్నా తేవచ్చుగా." విసుగు భాస్కర్ మీద చూపింది రంజన. బ్యాంక్ నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది. అలవాటులేదన్న భాస్కర్ ని చురచుర చూసింది రంజన.
    ఆఫీసుకొచ్చేటప్పుడు ఫెళఫెళలాడే గంజి ఇస్త్రీ చీరతో ఫుల్ మేకప్ తో, బాబ్డ్ హెయిర్ తో వచ్చే రంజన - ఇంట్లో ఉన్నంతసేపూ పాత నలిగిన నైట్ గౌనుతో ఉంటుంది. అదీ రెండుమూడు రోజులకు గానీ ఉతుక్కోదు. ఇంటికి రాగానే జుట్టుకి నూనెలు పట్టిస్తుంది. మొఖానికి క్రీములు పట్టించుకుని బద్ధకంగా పక్కమీద పుస్తకం చదువుతూ దొర్లుతుండే రంజనని చూసి రియాలిటీ ఎంత చేదు అనిపించింది భాస్కర్ కి. మేకప్పులు లేకపోయినా, పెద్ద అందం లేకపోయినా నీటుగా ఒళ్ళు, బట్టలు, ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు. అసలు రంగులు కలిసి ఉంటేగాని బయటపడవు. ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకుని వెంటబడి కాపురానికే చేటు తెచ్చుకున్నాడు తను.
    పదిహేను రోజులకే ఒకరంటే ఒకరికి మొహం మొత్తేసింది. "ఏంటలా అరుస్తున్నావు. నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకుంటున్నావా. నీకు మూడుపూటలా వేడిగా వండి వార్చటానికి నేను నీ పెళ్ళాన్ని కాదు. పెట్టిందేదో తిను, లేదంటే వండుకో" తెగేసి అంది రంజన ఓరోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే.
    "నీ పెళ్ళాం వెళ్ళి ఆఫీసులో చాటింపు వేసి వచ్చిందనుకుంటాను. ఆ సుశీల ఏమందో తెలుసా. 'తోటి ఆడదాని సందారం కూల్చడం సంస్కారం అనిపించుకోదు, నీక్కావాలంటే పెళ్ళయిన మగాడు తప్ప మరొకడు దొరకడా' అని మొహంమీద ఉమ్మేసినట్లు అంటే తలదించుకున్నా" అంది ఓ రోజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS