అన్ని ఉత్తరాలు వసంత టైపు చేసేసరికి గంట గంటన్నర పట్టింది. అవి తీసుకెళ్ళి అయన టేబిల్ మీద పెట్టింది. అంతవరకు అయన ఏవో కాగితాలు చూస్తూ -- చుట్టూ వున్న మూడు ఫోనులు మోగుతుంటే జవాబిస్తూ , ఎవరెవరినో పిలిచి ఏదో చెప్తూ , చాలా బిజీగా వున్నాడు. వసంత టైపు చేసిన ఉత్తరాలు అయన చదివి సంతకాలు పెట్టాడు. ఆలోగా పోస్ట్ వచ్చింది. పోస్ట్ లో వచ్చిన ఉత్తరాలని అయన చదివి యిస్తే, వాటికి జవాబులు వెళ్ళింది లేనిది పాత ఫైల్సు లో ఆఫీసు కాపి చూసి నోట్ పుటప్ చెయ్యడం, రొటీన్ ఉత్తరాలు అయితే ఆఫీస్ ఫైల్స్ లో కరస్పాండెంన్స్ చూసి జవాబు వసంత డ్రాప్ట్ చేసి పెడితే అయన సంతకం తీసుకుని టైపు చేసి పంపడం, అయన ఉత్తరాలు చూసి యివ్వవలసిన జవాబులు డిక్టేట్ చేస్తే లంచ్ తర్వాత మిగతావి టైపు చేసి సాయంత్రం పోస్టల్ పంపడం, రోజు వసంత చేయాల్సిన పని గురించి చెప్పాడు జీవన్ లాల్.
వసంత కిప్పుడిప్పుడే పని అర్ధం అవసాగింది. అయన చెప్పిన అన్నింటికి తల ఆడించింది. పాత ఫైల్స్ ఎక్కడున్నాయో చూపాడాయన. ఉత్తరాలు డిక్టేట్ చేసి అయన లంచ్ కి వెళ్ళిపోయాడు. వసంత మళ్ళీ టైపు మిషన్ ముందు కూర్చుంది.
'అదేమిటి టిఫిన్ బ్రేకు ఒక గంట , రండి రండి టిఫిన్ తిందాం" ఫతిమా చనువుగా వచ్చి పిలిచింది. అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం చిన్న హాలుంది. దాన్లో మేగజన్స్ చాలా వున్నాయి. అంతా లంచ్ తింటూ మేగజైన్స్ చూస్తూ ఒక గంట రిఫ్రెష్ అవుతారు.
వసంత ఫతిమాతో అక్కడికి వెళ్ళేసరికి అంతా గుంపులు గుంపులు గా చేరి మాట్లాడుకుంటూ యింటి నించి తెచ్చిన టిఫిన్ బాక్స్ లు తెరచుకుని టిఫిన్లు తింటున్నారు. ఏ పదిమందో తప్ప మిగతా అంతా ఇంటి నించి తెచ్చుకున్నారు. బాచిలర్ కుర్రాళ్ళు మాత్రం ఫ్యూను చేత పక్క నున్న హోటల్ నించి కాఫీ, టిఫిను ఏదో తెప్పించుకు తింటున్నారు.
"మీరేం టిఫిను తెచ్చుకోలేదా....' ఫతిమా వసంతని అడిగింది.
వసంత బిడియంగానే చుట్టూ చూస్తూ .' ఇక్కడి పద్దతులు ఏమిటో నాకేం తెలియలేదు. రేపటి నించి తెచ్చుకుంటాను.'
"తెచ్చుకోండి, లేకపోతే వీళ్ళిచ్చే జీతం కాస్తా టిఫిన్ కి, బస్సు చార్జీలకే అయిపోతుంది. నేను కాఫీ కూడా తెచ్చుకుంటాను.' అంటూ ఓ ప్లాస్టిక్ అల్లిన బుట్ట లోంచి కాఫీ ప్లాస్కు , టిఫిన్ బాక్స్ తీసింది." "ఇవ్వాళ మనిద్దరం షేర్ చేసుకుందాం అంటూ తను తెచ్చుకున్న మూడు పరోటా ల్లోంచి ఒకటిన్నర తుంచి మూత మీద పెట్టి యిచ్చింది.
"వద్దండి.....మీరు తెచ్చుకున్న దాన్లో నాకిచ్చేస్తున్నారు. నేను హోటల్నుంచి తెప్పించుకుంటాను." మొహమాటపడింది వసంత.
"ఫరవాలేదు , యిలా షేర్ చేసుకుని తింటుంటాం మేం అందరం. మీరు తెచ్చినవి నాకిష్టమైనవి నేను తీసుకుని తింటాను. మనందరం కల్సి మెల్సి పనిచేస్తున్నాం. ఒకరోజు నేను తీసుకు రాకపోతే మీరు పెట్టారా" అంటూ చనువుగా భుజం తట్టి యిచ్చింది . "నాకు మీ తెలుగువాళ్ళ టిఫిన్లిష్టం మీ దోస, యిడ్లీ, ఉప్పుడు పిండి మినపరొట్టే భలే యిష్టం. నళిని పెడుతుండేది . మీరవి తెచ్చారంటే అంతా లాక్కుంటాను ' అంది.
"తప్పకుండా , రోజూ ఒకటి తెస్తాను' అంది నవ్వుతూ , చుట్టూ అంతా కొత్తగా వచ్చిన వసంతని కుతూహలంగా చూసారు. కొంతమంది దగ్గిరగా వచ్చి మాట కలిపారు. అంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ తిన్నారు. కాసేపు సోఫాల్లో వాలి పుస్తకాలు తిరగేసి టైము కాగానే సీట్లలోకి వెళ్ళారు.
వసంతకి ఆ వాతావరణం అంతా చాలా నచ్చింది. అంతా ఫ్రెండ్లీ గా వున్నారు. తన అదృష్టం కొద్ది మంచి ఉద్యోగం దొరికింది అని సంతోషించింది. వసంతకి ఒక్కటే కాస్త నిరుత్సాహం అన్పించింది. బాస్ యీ ముసాలయన కాకుండా ఆ యువకుడైతే ఎంత బాగుండును అన్పించింది. అతను యింటర్వ్యూ లో వున్నాడు మరి, ఈయన కొడుకే గదా అఫేసుకి అతను రాడా.....ఆ సందేహం ఫతిమాని అడగాలనుకునే లోపలే టైమయిపోయింది. సాయంత్రం బస్సుకి వెళ్ళినప్పుడు అడగాలనుకుంది.
సాయంత్రం ఫతిమా చెప్పిన విషయం వినగానే వసంత మనసు గాలిలో తెలిపోయినట్ల యింది. సాధారణంగా ఆ కొడుకే యిక్కడ చూసుకుంటాడుట. వాళ్ళకీ ట్రావెలింగ్ ఏజెన్సీ కాక యింకా రెండు బిజినెస్ లున్నాయట. తండ్రి, పినతండ్రి ఆవి చూస్తుంటారుట. అప్పుడప్పుడు కొడుకు పై వూర్లకి వెడితే తండ్రి ఆఫీసుకి వస్తాడట. ఆ వివరణ వినగానే ఏదో సాధించినంత అనందం కలిగింది వసంతకి. తను అనుకున్నదనుకున్నట్టు జరుగుతుంది అన్న తృప్తితో ఆమె మొహం కలకల్లాడింది.
* * * *
"ఏమయిందిరా నాయనా....భోజనానికి రారా, ఉదయం నించి తిండి తిప్పలు లేవు....యిదెం నీకు కొత్త. యీ రోజు యింతలా మొహం పెట్టుకు కూర్చోడానికి ....తిండి తినకుండా మాడితే ఉద్యోగం వస్తుందా? ఎన్నో యింటర్వ్యూలకి వెళ్ళావు, యిదీ ఒకటి అందులో.... పదరా నన్నరిపించక" అప్పటికి పదిసార్లు భోజనానికి రమ్మని పిలిచి పిలిచి విసిగింది కాంతమ్మ. ఉద్యోగానికి యింటర్వ్యూ కి వెళ్ళిన ప్రసాద్ రెండు గంటల వేళ మొహం వాడిపోయి యింటిలోకి వచ్చి గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిపోయాడు. కాంతమ్మ అన్నానికి రమ్మని పదిసార్లు పిలిచి పిలిచి విసిగి పోయింది.
"నాకాకలిగా లేదు. నన్ను విసిగించకమ్మా, నన్ను పడుకొని ...' అన్నాడు విసుగ్గా. తల్లి మనసురుకోక ఆవిడ పది నిమిషాలకొకసారి పిలుస్తూనే వుంది. ఎన్నో ఉద్యోగాలకి యింటర్వ్యూ లకి వెళ్ళి మొహం వాల్చుకుని వచ్చే కొడుకుని చూస్తె ఆవిడకి కడుపు తరుక్కు పోతుంది.
ప్రసాద్ వసంతకి ఉద్యోగం దొరికిన దగ్గిర నుంచి మరీ తప్పు చేసిన వాడిలా కుంచించుకు పోతూ , యింట్లో ఏదో పరాయి వాడిలా తప్పుకు తప్పుకు తిరుగుతూ, ఎవరితో మాట్లాడకుండా, అన్యమనస్కంగా కూర్చునే కొడుకుని చూస్తె ఆవిడకి బాధ వేసేది. ఉద్యోగం లేకుండా కూర్చోవటం మగాడి కెంత కష్టమో ఆవిడ కర్ధం కాకపోయినా, కొడుకు మొహాన రెండేళ్ళుగా నవ్వే కనపడక పోవటంతో అవిడికీ దిగులుగా, జాలీగా వుంది. రోజూ పూజ చేసేటప్పుడు నాయనా వెంకరమణమూర్తి వాడికి ఉద్యోగం వస్తే నీ కొండకి పంపిస్తా . ఉద్యోగం యిప్పించు అంటూ ప్రార్ధించేది. ప్రతిసారి నిరాశగా యిల్లు చేరి ఉద్యోగం రానందుకు బాధపడ్తూ , చిరాగ్గా వుండేవాడు. కాని, యిసారి ఏదోలా ....పెద్ద ఆపద నెత్తిన పడిన వాడిలా జీవస్మరణ సమస్య ఎదురైతే ఏం చెయ్యాలో తోచనివాడిలా దిగాలు పడిపోయి ఎప్పుడూ కనపడలేదేమో , ఏం జరిగిందో తెలియక ఆవిడ గాభరా పడింది. 'నేనన్నం తిన్నానమ్మా. నన్ను విసిగించక వెళ్ళు' మరోసారి కసిరాడు ప్రసాద్. ఆవిడ చేసేదేం లేక బాధగా వెళ్ళిపోయింది.
సాయంత్రం వసంత, మాలతి, శంకర్, వెంకట్రావు....వరసగా ఒక్కొక్కరూ యిల్లు చేరినప్పుడల్లా ప్రసాద్ వైఖరి చెప్పింది. అంతా ఆశ్చర్యంగా విన్నారు. జాలిగా మొహాలు పెట్టారు. బాధపడ్డారు.
