పడవలో కాసేపు అలా తిరిగి రావాలి. ఎక్కడికీ పోనక్కర్లేదు. కాస్సేపు అలా త్రిప్పుకు వస్తే చాలు" అంటూ తన ప్రయాణం గురించి చెప్పాడు.
"ఇది అమరావతి యాత్రికుల కోసం నడుపుతున్న పడవ. అలా అలా షికారు చేసేందుకయితే మరొక లాంచి మాట్లడుకో" అన్నది జ్యోతి వెనుదిరిగి వెళ్ళబోతూ! కాని అతడు వెళ్ళిపోనివ్వలేదు.
"ఆగాగు" అంటూ దగ్గరకు వచ్చాడు.
"ఎక్కడికయితేనేం నీకు కావలసింది డబ్బే కదా! అది నేను ఇచ్చేస్తాను" అన్నాడు ఆదుర్దాగా! అనవసరంగా అతడు పడుతున్న కంగారు చూచి మనసులోనే నవ్వుకుంది జ్యోతి.
ప్రయాణికులు వచ్చేవేళ అయింది. వెంటనే వచ్చేయాలి" అన్నదామే. పెదవులమీదికి ఉరికి పడుతున్న నవ్వుని మునిపంటితో నొక్కివేస్తూ.
"ఓ అరగంట సేపు తిప్పుకొస్తే చాలు" అని బదులిచ్చాడు.
"ఇది ప్రత్యేకమయిన ప్రయాణం కాబట్టి చార్జి కూడా ప్రత్యేకంగానే అవుతుంది" అంది జ్యోతి. అందుకతడు అంగీకరించాడు.
ఆమె ముందుగా లోపలకు వెళ్లి స్టీరింగ్ దగ్గర కూర్చుంది. అతడు కూడా ఆమె వెనుక లాంచి లోపలకు వచ్చి కూర్చున్నాడు.
లాంచి బయలుదేరెందుకు సిద్దమైంది. ప్రయాణీకులు లేకుండానే లాంచి బయలుదేరటం చూచి చేస్తున్నపని ఆపేసి జ్యోతి దగ్గరగా వచ్చాడు రమణ.
"అక్కా నేనింకా టిఫిన్ తినలేదు." అన్నాడు. జ్యోతి రవంత సేపు ఆలోచించింది. ఊరికే అలా తిరిగి వచ్చేయ్యటమే కాబట్టి పని కుర్రాడితో పని ఉండదు. ఈలోగా అతడు నాస్తా కొట్టేసి తిరిగి వస్తాడు.
లాంచి కోసం వచ్చిన ప్రయానికులకు వివరాలు చెప్పి వారిని తిరిగి పోకుండా చేస్తాడు. ఇలా అలోచించి అతడికి రోజు కంటే మరికొంచెం చిల్లర ఎక్కువగా ఇచ్చి వెళ్ళమని చెప్పింది జ్యోతి.
రమణ ఉత్సాహంతో లాంచి దిగిపోయినాడు.
లాంచి బయలుదేరింది. మెత్తని శబ్దంతో అది ముందుకు పోతూ వుంటే తెరచిన అద్దాల కిటికీ నించీ బయటకు చూస్తూ నిలబడ్డాడు యువకుడు. జ్యోతి మరొక ఆలోచన లేకుండా స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తుకుంటూ లాంచి నడుపుతోంది.
రేవు దాటి దూరంగా వచ్చేశాక ఆమె వంక చూశాడు యువకుడు. ఆమె అతని గురించి రవంతయినా పట్టించుకోలేదు. తాను సంపాదించవలసిన డబ్బు కోసం తన పనిలో తాను లీనమయింది.
అతడు ఉన్న చోటు నించి కదలి ఆమె దగ్గరగా వచ్చాడు.
"నీ పేరేమిటి?" అని అడిగాడు అధికమయిన చొరవ తీసుకుని . ఆమె రావంతయినా జంకు లేకుండా అతని వంక చూసింది.
"పడవ ప్రయాణంలో సరదా తీర్చుకుందుకు వచ్చావు. పడవలో కూర్చున్నావు. ప్రయాణం చేస్తూనే వున్నావు. ఇంకా పేరుతొ పని ఏమిటి?" అని ఎదురు ప్రశ్న వేసిందామే. అతడు కూడా రవంతయినా జంకలేదు.
"నీ గురించిన వివరాలు నాకు కావాలి" అన్నాడు నిర్భయంగా మెండిగా.
"నా గురించి తెలుసుకోవాలన్న అభిలాష నీకుంటే ఉండవచ్చు. కాని చెప్పాలన్న ఉబలాటం నాకుండాలి కదా? అది నాకు లేదు. అందునించి నా గురించిన వివరాలు నీకు తెలిసే అవకాశం రవంతయినా లేదు" అంటూ త్రిప్పి మొహం మీద కొట్టినట్లుగా మాట్లాడింది జ్యోతి.
అతనికి కోపం వచ్చిన దానికి గుర్తుగా ముఖం ఎర్రబడింది.
నీవు ఒంటరిగా వున్న సంగతి మరిచావా? అన్నాడు కరుకుగా. జ్యోతికి ఒళ్ళు మండింది. ఆమె నేత్రాలు విశాలమయినాయి.
"నేను ఒంటరిగా వున్నా నీవంటి తుంటరులు చేయగలిగింది ఏమీ లేదని తెలుసుకో! హద్దు మీరి వచ్చావంటే నట్టేట మునిగిపోతావు . జాగ్రత్త" అని హెచ్చరికగా అన్నదామె.
అతడు తగ్గాడు. కోపాన్ని తగ్గించుకున్నాడు. రవంత దూరం జరిగాడు. "ఎందుకంత తెగించి మాట్లాడతావు. నీతో కొన్ని సంగతులు మాట్లాడాలి. అందుకే షికారు అనే ఒక కారణం కల్పించాను" అన్నాడు.
"ఏమిటా మాట్లాడవలసిన సంగతులు" అన్నది జ్యోతి విసుకుగా.
"ఈ లాంచి నడుపుతూ ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు. ఆడపిల్లవు నీకెందుకు ఈ కష్టం" అన్నాడు యువకుడు.
"నా వృత్తి నాకు కష్టమేలా అవుతుంది కాని, ఇదేనా నీవు చెప్పదలచిన సంగతి?"
అంటూ మూతి విరిచింది జ్యోతి.
"కాదు, కాదు ఈ పడవ మంచి ధర పలుకుతుంది. అమ్మేసి హాయిగా బ్రతకొచ్చు. ఒకింటి దానివి కావచ్చు" అన్నాడతను.
"నిన్ను చూస్తే , ఒట్టి వాచాలుడల్లె వున్నావు. అనవసరమయిన విషయాలనే అధికంగా మాట్లాడుతున్నావు. నా పెళ్ళి గురించి నాకు లేని తొందర నీకెందుకు?
కొంపతీసి నువ్వు కాని నన్ను ప్రేమించావా?" అన్నదామె.
"నిన్ను ప్రేమించడమా! బాబాయ్ అంతకు తెగించలేదు. కాని, ఈ పడవ కొనాలనుకుంటున్నాను" అన్నాడతను.
"పోనీలే అంతవరకయితే మంచిదే! కాని నేను ఈ లాంచినీ అమ్మాలన్న ఆలోచనలో నేను లేను. దయచేసి ఇంక సంభాషణ ఆపెయ్యి. వెళ్ళి ఆ బల్ల మీద కూర్చో" అన్నదామె మృదువుగానే .
కాని అతడు తిరిగి వెళ్ళలేదు.
"అమ్మటమంటే ఏదో ఒక ధరకు అమ్మటమని కాదు. నీవు ఊహించలేనంత డబ్బు ఇస్తాను" అన్నాడు యువకుడు.
జ్యోతి నేత్రాలు విశాలమయినాయి.
"ఎంత డబ్బిస్తావేమిటి?" అన్నది నిర్లక్ష్యంగా.
దీని విలువ క్రొత్తలో అయితే బహుశా ముప్పై వేలదాకా వుండొచ్చు. అనుకుంటాను. పాతబడిపోయింది ఇప్పుడు అయినా నేను యాభై వేలిస్తాను" అన్నాడతను.
అతడేదో మాయాజాలం విసురుతున్నాడని అనుకుంది జ్యోతి. ఇంక సంభాషణ ఎక్కువగా పొడిగించడం మంచిది కాదని భావించిందామె.
"యాభై వేలిచ్చినా నేనివ్వను" అన్నది నిర్లిప్తంగా. కాని అంతటితో నిరుత్సాహ పడి ఊరుకోలేదతడు.
"ఈ లాంచి మీద నీకంతగా నమ్మిక వుంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. కావాలంటే మరికొంత పెద్ద మొత్తమైనా యిస్తాను. డెబ్బయి వేలిస్తాను" అన్నాడు జ్యోతి అతని వంక పిచ్చివాడిని చూసినట్టు చూసింది.
అయినా అతడు నిరుత్సాహపడలేదు.
"నీవు సంశయించకు. ఈ లాంచి నాకు కావాలి. పాత లాంచి అయినా కొనాలన్న పట్టుదలతో ఉన్నాను. లాంచి యిచ్చెయ్యి. లక్ష అయినా ఇస్తాను" అన్నాడతను. ఆ మాటతో విభ్రాంత అయిందామే.
అతడు తననేదో ఆటలు పట్టిస్తున్నాడు అనుకుంది. కాని అతని మొఖం లోని భావాలను చదివాక అది అసత్యమనిపించలేదు. ఈపడవ నడుపుకోవటమనేది కేవలం ఉదర పోషణకే అయితే ఇప్పుడీ నవాగతుడు చూపే ఆశకు లొంగి ఉండేదామే.
ధనార్జన ఒక్కటే లక్ష్యమైతే ఆనాడు శ్రద్దాదేవి తనతో వచ్చెయ్యమని అడిగినప్పుడే ఒప్పుకునేది. కాని లాంచి నడుపుకుంటూ జీవించటం కేవలం డబ్బు కోసమే అని ఆమె ఎన్నడూ అనుకోలేదు.
