కాస్త గర్వంగా "నీకు ఇటువంటి సున్నితమైన విషయాలు అర్థం కావులే. నీకు తెలుసా..... అతను ఇంతకు ముందెన్నడూ నా అంతటి అందమైన, పోడుగైన, ఆకర్షణీయంగా వున్న శరీరాన్ని చూడలేదు. ఇదే మొదటిసారి నా అంత అందమైన గ్లామరస్ కర్వ్ ని చూడటం అన్నాడు. నా చేతులు పట్టుకున్నప్పుడు అతనెంత చిన్నపిల్లాడిలా మారిపోతాడో నేను చెప్పలేను" అన్నాను.
రోజా మరి తర్కించలేదు.
* * *
ఎవరేమనుకున్నా నేను అతన్ని చూడకుండా వుండలేను. మా నాన్నలా ఎప్పుడూ ముఖంలో విసుగు ప్రదర్శించే వాడే కాదు. అలా చిరాకు లేకుండా ఎలా వుండేవాడో నా కిప్పటికీ అర్థమయ్యేది కాదు. ఏదేమైనా అతడు దూరమైతే నేను తట్టుకోలేను. ఆ దిగులుతోనే చచ్చిపోతానేమో కూడా!
నాన్న ఇవ్వలేని ప్రేమ అతనిస్తున్నాడు. ఇంట్లో దొరకని భద్రతాభావం అతని సమక్షంలో కలుగుతుంది. ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్ళి జరుగుతుందన్న ఆశ నాకుండేది కాదు. అతనే ధైర్యం చెప్పేవాడు. మా నాన్నకి చెప్పే ధైర్యం నాకు లేదు. అతనితో 'లేచిపోవడానికి' కూడా నేను సిద్ధమే.
* * *
మా నాన్న నాకోసం ఓ సంబంధం నిశ్చయం చేశాడు.....! ఆయనకి ఎదురు చెప్పలేక, మా అమ్మతో నా పెళ్ళి విషయం కదిపాను. "నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు" అన్నాను.
"ఏం?"
ధైర్యం చేసి, పూర్తి శక్తిని కూడగట్టుకుని నిజంచెప్పేశాను. "నేను ఒకతన్ని ప్రేమించాను!"
ఆ మాట వినగానే మా అమ్మ షాక్ అయింది. చాలా సేపు మాట్లాడలేదు. "మీ నాన్నకి తెలిస్తే నిన్ను కన్నందుకు నన్నూ చంపేస్తారు" అంది చివరికి.
ఆవిడతో వాదించడం వల్ల లాభంలేదని నాకు తెలుసు. మా నాన్నని ఎదిరించి ఆవిడెప్పుడూ సమాధానం చెప్పలేదు.
ఈ విషయం చెప్పిన దగ్గిర్నుంచీ నన్ను బయటికి కదలనివ్వటం లేదు మా అమ్మ. నేనెక్కడ 'లేచి పోతానో' అన్న భయంవల్ల అని నా కర్థమైంది.
రోజీ వస్తే ఈ విషయం చెప్పి "నా ప్రియుడిని వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పు" అన్నాను. రోజీ అతని దగ్గరికెళ్ళింది.
నాకు తెలుసు 'ఇలూ' నన్ను దూరం చేసుకోలేడని, తప్పకుండా వస్తాడు ఆశతో ఎదురుచూశాను. రోజీ ఒక్కతే తిరిగి వచ్చింది. "తను చాలా బిజీ అట. నాలుగైదు రోజుల్లో వచ్చి కలుస్తాను అని చెప్పమన్నాడు" అంది.
నా ఆశల మేడ బీటలు వారింది.
* * *
నా పెళ్ళికి ముందురోజు కూడా రోజీని అతని దగ్గరకు పంపించాను 'వస్తాను. మీరు పదండి' అని రోజీని పంపించేశాడు. అతను రాలేదు.
నా పెళ్ళి 'జరిగిపోయింది.'
'ఇలూ' తో నా బంధం తెగిపోయిందని కుమిలి కుమిలి ఏడ్చాను.
నా మొదటిరాత్రి (?) అది.
"ఆ రాత్రే నా భర్త నన్నడిగాడు. "ఎవరినైనా ప్రేమించావా?" అని.
చెప్పాలని నాలుక చివరవరకూ వచ్చి ఆగింది. కానీ భయం వేసింది ఆయన వ్యక్తిత్వం ఆ రాత్రే అర్థమైంది. అంత ఉన్నతభావాలు కలిగిన వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. నన్ను, నేను ప్రేమించిన వ్యక్తితో కలపడానికి కూడా అతను సిద్ధపడతాననటం నన్ను బాగా కదిలించింది. ఆ తరువాత అతను ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పినప్పుడు నేను పెద్దగా బాధపడలేదు. నూటికి తొంభై శాతం మంది పురుషులు 'ఆపోజిట్ సెక్స్' తో కొద్దిగానైనా మానసికంగా 'సంబంధం' కలిగి వుంటారని నాప్రగాఢ నమ్మకం. అందుకే అది దాచకుండా చెప్పిన ఆయన నిజాయితీని నేను అభినందించకుండా ఉండలేకపోయాను.
ఆ రాత్రి నా భర్తకు నేను సెక్స్ లో పూర్తిగా సహకరించాను. 'ఇలూ' నన్ను నిర్లక్ష్యం చేశాడన్న 'కసి' తో!
* * *
ఓ రోజు..... నా భర్తలేని సమయంలో 'అతను' వచ్చాడు.
అతన్ని చూస్తూనే నేను బరస్టయ్యాను.
"ఇంత మోసం చేస్తావా?" అని కలర్ పట్టుకుని చెంపలు వాయిఅమ్చాను తిట్టాను, రక్కాను, చివరికి ఏడ్చాను.
చాలా సేపు అతను కామ్ గా ఉన్నాడు. అసలతను 'ఏమీ అనకపోవడం' నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
చివరకతను నా ఒళ్ళో తల పెట్టుకుని "నీ దగ్గరికే వద్దామని బయలుదేరాను. దార్లో నాకు ఏక్సిడెంట్ అయింది. స్పృహ వచ్చేసరికి నీ పెళ్ళి జరిగిపోయింది" అంటూ ఏడ్చేసాడు. నేను పూర్తిగా కరిగిపోయాను. ఆ సమయంలో నాకు నా భర్త గుర్తుకు రాలేదు. అతన్ని హత్తుకుని మరింత దగ్గరయ్యాను.
* * *
అసలు అన్ని రోజులూ అతన్ని వదిలి నేనెలా వుండగలిగానో నాకే అర్థంకాలేదు. అతన్ని కలిశాక ఆ వెలితి స్పష్టంగా నాకు బోధపడింది. తను అతనికి దూరంగా ఉండలేను అనిపించింది. అతనిలో ఒక గుణం నన్ను కట్టి పడవేసింది. నా దగ్గిర చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. నేను లేకపోతే క్షణం కూడా బ్రతకలేనన్నట్టు కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. ఆ దుఃఖంలోంచి ఆవేశంలోకి విజృంభిస్తాడు. అందుకే తరచూ అతను వస్తుంటే కాదనలేకపోయాను. నా భర్త క్యాంపుకి వెళ్ళగానే అతన్ని ఫోన్ చేసి పిలిపించుకునేదాన్ని. సెక్స్ లో అతను పూర్తిగా రెచ్చిపోయేవాడు. నా భర్త అలాకాదు, నా శారీరంమీద ఎక్కడైనా ముద్దు పెట్టుకోవాలన్నా నా పర్మిషన్ అడిగేవాడు. అందుకే 'ఇలూ' తో నా అనుభవం నా కెప్పుడూ కొత్తగా 'భూకంపం' వచ్చినట్టుగానే వుండేది.
వెరైటీకన్నా గొప్ప థ్రిల్ మరేమీ లేదు. (నేను నేచురాల్ని).
హృదిగదిలో నా భర్త 'సడి' వినిపించినప్పుడు మాత్రం 'ఇలూ'కి దూరంగా జరిగేదాన్ని. నా మనోపంచలనాన్ని పట్టించుకోకుండా 'తనపని' తాను చేసుకుపోతూనే వుండేవాడు. అలాంటి సమయంలో నా భర్త గుర్తుకు వచ్చినప్పుడు 'అతని' ముందు నేను జడపదార్థాన్నే అయ్యేదాన్ని. అంత మంచి మనిషికి ద్రోహం చేస్తున్నానన్న బాధ నన్ను రంపపు కోతకు గురిచేసేది. నిజానికి నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు. దేనికీ లోటు లేకుండా! అయినా నేను 'అతనికి' దూరం కాలేకపోతున్నాను. నా మొదటి, చివరి బలహీనత 'అతనే' కావడం నా దురదృష్టం.
నా విషయంలో చూసుకుంటే మాత్రం నా కిప్పటికీ ఒక సందేహ పీకుతూనే వుంటుంది. 'నేను కొన్ని పనులు చెయ్యడానికి నెట్టివేయబడ్డాను' అని అప్పుడప్పుడూ వేదాంతిలా సర్ది చెప్పుకునేదాన్ని. కానీ అది కొద్దిసేపే.
క్యాంపునించి నా భర్త రోజుకో ఉత్తరం వ్రాసేవాడు. వస్తూ వస్తూ నా కోసం విలువైన బహుమతులు తీసుకొచ్చేవాడు. ఒకసారి నా భర్త నెలరోజులుక్యాంపు కెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన రెండోరోజు నాకొక ఉత్తరం వ్రాశాడు. చాలా ఆర్ధ్రం వుంది ఆ ఉత్తరం, నన్నెంత ప్రేమిస్తున్నదీ ..... నేను దూరమైతే ఎంత బాధ వున్నది..... పూర్తిగా చదివాక మీద నాకే అసహ్యం వేసింది. అంత 'గొప్ప' భర్తను మోసం చేస్తున్నానన్న బాధనన్ను రంపపు కోతకు గురిచేసేది. ప్రతీక్షణం ముల్లులా పొడిచేది.
ఈ రోజు నా ప్రియుడైన ఈలూ నాకో నిజం చెప్పాడు. అతడికి ఆక్సిడెంట్ కాలేదట. వివాహం చేసుకోవటం ఇష్టంలేక అబద్ధం చెప్పాడట. నాకు అసహ్యం వేసింది. కోపం కూడా వచ్చింది. అతడో కొత్త థియరీ చెప్పాడు. నేనతని కలల రాణినట. అతని అణువు అణువులోనూ నా అణువు అణువుపట్ల ఆప్యాయతలేనిండి వున్నదట. వివాహమయితే ఆ ప్రేమ పోతుందట. ప్రేమ ఒక బొమ్మలాంటిదట దాన్ని అద్దాల బీరువాలో దాచుకోవాలాట.
చెపుతున్నప్పుడు బాగానే వుంది కానీ, ఆ తరువాత మాత్రం నామీద నాకే అసహ్యం కలిగింది.
* * *
ఈ రోజు వుత్తరం వ్రాసింది రోజీ! తనకి కూడా వివాహం నిశ్చయమైందట. ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాను. మాటల మధ్యలో 'ఈలూ' ప్రసక్తి వచ్చింది.
"ఇంకా కలుస్తున్నాడా?" అని అడిగింది. "అప్పుడప్పుడు" అని అన్నాను.
"నీకో విషయం చెప్పనా?" అంది. చెప్పమన్నాను. ".....నీతో స్నేహం చెయ్యటానికి ముందే అతడు నా ఫ్రెండ్ ! నాకే కాదు, చాలా మంది అమ్మాయిలకి" ఫోన్ పెట్టేసింది. నాకు పెద్ద షాక్.....!
అప్పుడే 'అతను' వచ్చాడు. నేను చాలా సీరియస్ గా "నువ్వు మళ్ళీ నా దగ్గిరకి రావద్దు" అన్నాను. 'అతను' జోకనుకున్నాడు. నేను చాలా ఖచ్చితంగా చెప్పాను. "భర్తకు నేను ద్రోహం చేయలేకపోతున్నాను. దయచేసి నాకు కనిపించినంత దూరం..... ఏటయినా వెళ్ళిపో!" అన్నాను. అంత కఠినంగా ఎలా చెప్పగలిగానో నాకే తెలీదు. అతను బ్రతిమలాడాడు. ఏడ్చాడు. చివరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతే! నేను కరిగిపోయాను. మళ్ళీ!!
7
డైరీ చదవటం పూర్తికాగానే మహర్షి స్తబ్దంగా అయిపోయాడు. అతడి మనసంతా చల్లటి ఫ్రిజ్ లో పెట్టినట్లు అయిపోయింది.
నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, 'నిజానికి' కూడా రెండు ముఖాలుంటాయి! అప్పటివరకూ అతడి భార్య గోముఖవ్యాఘ్రం, పైకి అమాయకత్వం నటిస్తూ, చాటున భర్త క్యాంపులకి వెళ్ళగానే ప్రియుడితో 'రంకు' సాగించే నాయవంచకి!
కానీ లోతుగా పరిశీలించగలిగితే-
ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, ఆకాశన్నంటే ఆశలు తీర్చుకోలేక, కుటుంబ సభ్యులతో సరి అయిన కమ్యూనికేషన్స్ లేక అలమటిస్తున్న 'మానసిక అనాధ'! ఆమె పరిస్థితిని స్నేహం పేరిట చక్కగా ఉపయోగించుకున్నాడు 'అతను'.
స్త్రీని పొగిడి- ఒళ్ళో పడుకుని ఏడ్చి, బలహీనత మీద ఆడుకున్న అతనంటే మహర్షిమనసులో కక్ష, ద్వేషం, అసహ్యం ఆ క్షణం హిమాలయాల్లా పెరిగిపోయాయి.
ఆ కోపం అంతకుముందు తనని ఉరిశిక్ష బారినుంచి తప్పించడానికి అతను ఒక సాక్షిగా నిరాకరించినప్పుడు కలిగిన కోపం కన్నా పెద్దది! పెళ్ళి పేరిట ఢిల్లీ, బొంబాయి తిప్పి, చివరికి పెళ్ళి చేసుకోకపోవడం ఒక తప్పయితే- పెళ్ళయ్యాక పాత జీవితం మరచిపోతున్న అమ్మాయిని తిరిగి అందులోకి దింపటం అతను చేసిన రెండో తప్పు!
దీనికి అతడిని దేవుడు కూడా క్షమించడు.
ఆ ఆలోచన రాగానే అంత వేదనలో కూడా మహర్షికి నవ్వొచ్చింది.
ఏం తప్పు చేశాడని దేవుడు తనకీ శిక్ష విధించాడు?!
భార్య గురించిన ఆలోచనల్తో రెయిలింగ్ మీద చేతులు ఆన్చి, కిందకి చూస్తున్న మహర్షికి ఓ మనిషి పైప్ లైన్ పట్టుకుని పైకి ప్రాకడం కనిపించింది.
హొటల్ గదులు వరుసగా రెండు ఫ్లాట్ ల ఆకారంలో వున్నాయి.
చీకటిగా వుండటంవల్ల అవతల ఫ్లాట్ కీ, అతనున్న ఫ్లాట్ కి మధ్యనున్న పైప్ లైన్ పట్టుకుని ఎక్కుతోంది ఎవరయిందీ స్పష్టంగా కనిపించడం లేదు. తన గురించి పోలీసులకి తెలిసి పోయిందేమో అనుకున్నాడు.
ఆ ఆకారం మెల్లమెల్లగా పైకి పాకి పక్కరూమ్ లోని బాల్కనీలో దూకింది. ముఖం సరిగ్గా కనిపించండం లేదు. చాలా పొడుగ్గా, దృఢంగా వున్నాడా వ్యక్తి.
ఇంతలో ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ముందువైపుకు వెళ్ళాడు. మహర్షికి అతనెవరయిందీ అర్థంకాలేదు. లోపలేం జరుగుతూండి వుంటుందో అతను ఊహించలేకపోయాడు. ఊపిరి బిగపట్టి చూడసాగాడు. ఇంతలో .....ఆప్లాట్ లోంచి పెద్ద శబ్దం వినిపించింది. దాంతోపాటే అరుపులు.
మహర్షి టెన్షన్ ఆపుకోలేక తాన్ గది తలుపు తెరుచుకుని కారిడార్ లో వచ్చాడు.
ఆ గదిలోంచి ఇద్దరు వ్యక్తులు బయటికి పెరుగెత్తు కొచ్చారు. వెనకే.... ఇందాక పైకి ఎక్కినా వ్యక్తి వాళ్ళని వెన్నాడుతూ అటువేపు పరుగెత్తడం చూసాడు.
అతని చేతిలో రివాల్వర్ వుంది.
మహర్షికి జరుగుతున్నదేమిటో బోధపడలేదు. విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆ వ్యక్తి వెనుకే అతను కూడా మెట్లెక్కాడు.
ఆ వ్యక్తిడాబా పైకి చేరుకునే వరకూ మహర్షి నిశ్శబ్దంగా ఆ వ్యక్తినే వెంబడించాడు. ఇద్దరూ పైకి చేరుకున్నారు.
లోపల నుండి పరుగెత్తుకు వచ్చిన వాళ్ళేమయ్యారో మహర్షికి అర్థంకాలేదు. వాటర్ టాంక్ పక్కన కనిపించకుండా నుంచుని ఆ వ్యక్తి కదలికల్నే గమనించసాగాడు. అతను నడిచి వాటర్ టాంక్ వేపే వస్తుండటం చూసి మహర్షి పక్కకు తప్పుకోబోయాడు. కానీ ఇంతలో .....టాంక్ కి ఇవతలివైపు నున్న లైట్ ఫోకస్ ఆ వ్యక్తి ముఖమీద పడింది అంతే! మహర్షి సర్పదష్టలా ఆగిపోయాడు.
ఆ వ్యక్తి..... తన భార్య ప్రియుడు.
అతన్ని చూడగానే మహర్షి షాక్ తిన్నాడు. అసంకల్పితంగా చాటుకి జరిగాడు. అతని మెదడు కొద్దిక్షణాలు పనిచేయటం మానేసింది. కానీ అది కొద్దిసేపే! అతనిలో ఉన్న ద్వేషం మొత్తం బయటపడింది. తనీరోజు ఈ స్థితిలో వుండడానికి అతడే కారణం! ఒక సంసార స్త్రీతో వ్యభిచారం కొనసాగిస్తూ రెడ్ హండెడ్ గా పట్టుబడి, తన పరువుకి మచ్చ వస్తుందేమోనన్న భయంతో.....ఒక వ్యక్తి ఉరికంబం ఎక్కుతున్నా ఏమీ పట్టునట్టు వుండిపోయిన కిరాతకుడు.
మహర్షి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశం వివేకాన్ని జయించింది.
సరిగ్గా అప్పుడే అతడు పిట్టగోడ దగ్గరకు వెళ్ళి క్రిందకి తొంగిచూస్తున్నాడు. వెనుకనించి మహర్షి గాలికన్నా వేగంగా వెళ్ళి అమాంతం అంత ఎత్తునుంచీ అతన్ని క్రిందకి తోసేసాడు. ఏం జరిగిందో గమనించే లోపలే అతడి శరీరం మూడంతస్తుల పైనుంచి నేలమీద పడిపోయింది.
దబ్బున శబ్దంమైంది.
తరువాత నిశ్శబ్దం మిగిలింది.
