"శిల్పూ!...... మనం ఎల్లుండే ఊటీకి వెళ్ళిపోవాలి! నీకేమేం కావాలో చెప్పు, సాయంత్రం అమ్మా, నాన్నా, నేనూ, భరణక్కా, నువ్వూ అందరం టాంక్ బండ్ కెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దామా?" అంది శిల్పూ తల నిమురుతూ రాగిణి. ఇన్నాళ్ళ తర్వాత రాగిణి అంత తీరిగ్గా మాట్లాడడం శిల్పకి సంతోషాన్ని కలిగించింది.
"ఓ!....." అన్నట్టు తలూపింది. ఆ రోజు సరోజినీ, రాగిణీ ఇంట్లోనే వుండడం వలన, సరోజినీ పప్పు అన్నం కలిపి ముద్దలు తినిపించింది శిల్పకి. చాలా రోజుల తరువాత మనుషుల్ని చూస్తున్నట్టనిపించింది శిల్పకి.
సాయంత్రం నాలుగింటికల్లా శిల్పని తయారుచేసేసింది భరణి. హైదరాబాద్ కళాకేంద్రం నుంచి సుబ్బారావుగారు అర్జంటుగా సంక్రాంతి కార్యక్రమాలలో రాగిణి డాన్స్ గురించి మాట్లాడడానికి రమ్మంటున్నారు. తొందరగా వచ్చేస్తామంటూ వెళ్ళారు రాగిణీ, సరోజినీ. వాళ్ళు తిరిగి ఎప్పుడొచ్చారో నిద్రపోతున్న శిల్పకి తెలీదు. కానీ, అందరూ కలిసి బయటికి వెళ్ళి ఐస్ క్రీం తింటున్నట్టు కలలు కంటూ పడుకుందేమో, మధ్య మధ్య "అమ్మా...... అక్కా...... పోదామా......" అంటూ కలవరించింది.
సంక్రాంతి కార్యక్రమంలో రాగిణి రెండుగంటలు భామాకలాపం, గిరిజా కళ్యాణం నృత్యాలు చెయ్యాలి! అయిదు వేలకి ఒప్పించింది సరోజిని. మళ్ళీ రోజూ రిహార్సల్సూ, ప్రాక్టీసూ. ఇల్లంతా హడావిడే! ఆ గొడవలో శిల్పని టాంక్ బండుకి తీసికెళ్ళడం, ఐస్ క్రీం తినిపించడం ఎవరికీ గుర్తులేదు ఒక్క శిల్పకి తప్ప! శిల్ప ప్రయాణమయ్యే రోజున కూడా రాగిణి బిజీగానే వుంది. ఎయిర్ పోర్ట్ కి వెళుతూ వెళుతూ, జ్ఞాపకం చేసింది రాగిణి "అయ్యో! మనం శిల్పని టాంక్ బండ్ కి తీసికెళ్ళి ఐస్ క్రీం ఇప్పిస్తామని చెప్పాం. భరణీ నేను బిజీగా వున్నానని తెలుసుకదా- నువ్వైనా తీసికెళ్ళొద్దూ" అంది.
"అవును. అన్నింటికీ నేనొక్కదాన్ని దొరికాను. ప్రతిదీ నేనే చెయ్యాలి" విసుక్కుంది భరణి.
"ఎందుకే అంత విసుక్కుంటావ్? అక్క ఏమందని" మందలించింది సరోజిని. అంతలోనే ఎయిర్ పోర్ట్ రావడంతో టాక్సీ దిగిపోయారు.
"ఊటీ చేరగానే ఉత్తరం రాయి. నేను సిస్టర్ ఫెర్నాండెస్ కి ఉత్తరం రాస్తాను. జాగ్రత్తగా వుండూ" అంటూ గట్టిగా ముద్దు పెట్టుకుని. ప్లెయిన్ లోపలిదాకా వచ్చి, ఎయిల్ హోస్టెస్ కి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయింది రాగిణి.
శిల్ప కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఫ్రాక్ జేబులోంచి కర్చీపుతీసి కళ్ళు తుడుచుకుంది.
గుప్పెటినిండా చాక్లెట్లు తీసి ఫ్రాక్ జేబులో వేసింది ఎయిర్ హోస్టెస్. బుగ్గలునొక్కి ముద్దెట్టుకుని - "ఆఁ! నీ పేరేమిటి?" అనడిగింది.
"శిల్ప."
"లవ్ లీ నేమ్! మంచిపేరు! ఇందాక వచ్చినావిడ మీ మమ్మీయా?" అంది తలమీద నిమురుతూ.
"మా అక్క!"
"అక్కా......!" అంటూ అదోలా మొహం పెట్టి -
"మరి మీ అమ్మా..... నాన్నా..... రాలేదా?" అని అడిగింది.
వచ్చారన్నట్టు తలూపింది.
"అక్కడున్నారా?"
"అవునన్నట్టు"గా తలూపింది.
"ఏంటి? ఈ అమ్మాయితో చాలా మాట్లాడేస్తున్నావ్? తెలిసినవాళ్ళా?" అడిగింది మరో హోస్టెస్.
"కాదు...... ఊటీలో చదువుకుంటోందిట. బెంగుళూరులో, తెలిసిన వాళ్ళెవరో ఏర్ పోర్టుకొచ్చి, ఈ పాపని రిసీవ్ చేసుకుంటారట. అక్కడి నుంచి బస్సులో వెళతారట ఊటీకి! ఈ పాప ఎంత క్యూట్ గా వుందో కదూ! బుగ్గలు చూడు....." అంటూ మళ్ళీ గట్టిగా నొక్కి బుగ్గల్ని ముద్దెట్టుకుంది.
"ఆఁ...." అంది శిల్ప బుగ్గలు నెప్పెడితే.
శిల్పకేసి నవ్వుతూ చూసింది హోస్టెస్.
శిల్పకూడా చిన్నగా నవ్వింది.
"మళ్ళీ వస్తానూ" అని ఫాన్ బెస్ట్ శిల్పకి సరిచేసి కూర్చోబెట్టి, వెళ్ళింది హౌస్టెస్.
శిల్ప మనసులో ఏదో దిగులూ, ఎలాగో వున్నా హోస్టెస్ లనీ, వాళ్ళు అందరికీ ఫలహారాలూ, కాఫీ టీలు ఇచ్చే పద్ధతినీ, పాసింజర్లనీ ముఖ్యంగా చంటిపిల్లల్నీ. చంటిపిల్లల తల్లుల్నీ చూస్తూ కూర్చుంది శిల్ప.
ఏ తల్లయినా బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అలా కబుర్లు చెబుతూ, లాలిస్తూ వుంటే తన కేదో లోకాల్లో తేలిపోతున్నట్టుంటుంది. తను అలా అమ్మవొళ్ళో కూర్చోవాలనుకుంటుంది. ప్రేమగా కబుర్లు చెప్పాలనుకుంటుంది. కానీ తీరా అమ్మని చూశాక తనలోని ఆ భావన ఏదోలా మారిపోతుంది. అక్కతో అలా వుండాలనుకుంటుంది. అక్క అలా వుండకపోయేసరికి ఏదో బాధ ఆ చిన్నారి బుర్రని వేధిస్తుంది. ఇలా ఆలోచనలతో అస్తమానం మునిగి వుండటం వల్లా, ఆ ఆలోచనలకి ఒక గమ్యం అంటూ వుండకపోవడం వల్లా ఆ అమ్మాయి అలా మూగగానే వుండిపోయింది.
అలా వాళ్ళని చూస్తూ కూర్చుంటే, శిల్ప తనకి తెలీకుండానే నిద్దర్లోకి జారుకుంది. ఎయిర్ హోస్టెస్ లేపి, ఒక పేస్ట్రీ తినిపించి, కప్పు పాలు తాగించింది. ఏవో కబుర్లు చెబుతూ వద్దన్నా వినక.
ఏర్ పోర్ట్ కి రాగిణికి తెలిసిన వాళ్ళెవరో ఒకతను డాక్టర్ వాసుదేవరావుగారని, అతను వచ్చాడు. శిల్ప ఊటీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా అతనే హైద్రాబాద్ ప్లెయిన్ ఎక్కించాడు.
శిల్పని హోటల్ కి తీసుకెళ్ళి. బస్సు టైం అయిపోయేవరకు ఆ హోటల్లోనే రూము తీసుకున్నాడు. మధ్యాహ్నం బస్సులో పంపిస్తున్నట్టు సిస్టర్ ఫెర్నాండిస్ కి టెలిగ్రాం పంపించాడు.
శిల్పలో ఏదో నిరాశా, నిస్పృహ చోటుచేసుకుని, మరీ మూగగా చేసేశాయి మాటరాకుండా. బస్సు కండక్టర్ తో కాస్త ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాసుదేవరావుగారు శిల్పకి టాటా చెప్పి వెళ్ళిపోయారు. యూకలిప్టస్ ఆయిల్ చెట్లు దట్టంగా కొండలకిరువైపులా పచ్చగా నిగనిగలాడుతూ వుంటే, రానురాను చలి దట్టంగా ఒంటికి తాకి వణుకు పుట్టుకొచ్చింది. మెల్లగా బ్యాగ్ తెరచి అందులోంచి స్వెట్టర్ తీసి వేసుకుంది శిల్ప. ఆమె అలా అతి నెమ్మదిగా తీసి, స్వెట్టర్ తొడుక్కోవడం, హ్యాండ్ బ్యాగ్ మూసేసి ముద్దుగా బొమ్మలా ముడుచుకు కూర్చున్న శిల్ప, ఆ క్షణంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. అందరూ ఆ అమ్మాయిచుట్టూ చేరి కబుర్లు చెప్పడమే. శిల్ప వారితో పెద్దగా నోరు విప్పి మాట్లాడలేకపోయినా అంతమంది తనని ముద్దుగా, ప్రేమగా పలకరించడం, ఏదో తృప్తిని కలిగించింది. సమాధానాలు చెప్పి మాట్లాడకపోయినా అందరికేసి చిరునవ్వుతో చూసింది.
బస్సులో అందరూ చూపినంత ఆప్యాయతా, అటెంషనూ కూడా తనకి ఇంట్లో సెలవుల్లో దొరకలేదనిపించింది. స్కూల్లో సిస్టర్ ఫెర్నాండెస్ మాట్లాడే తీరులో వున్న అభిమానం, ఆదరణాకూడా తను సెలవుల్లో ఇంట్లోవారిదగ్గర పొందలేకపోయాననిపించింది. చిన్ని మనసు విలవిలలాడిపోయింది. అలసిపోయిన దానిలా సీటుమీద ఒరిగిపోతే పక్క సీట్లో వాళ్ళు పట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు.
"ఇంత చిన్నపిల్లని ఇంతింత దూరాలూ పంపించడానికి తల్లిదండ్రులకి మనసెలా వస్తుందో!" అన్నారెవరో.
"ఏం చేస్తాం? మంచి మంచి స్కూళ్ళలో అడ్మిషన్ కావాలీ. పిల్లలు వృద్ధిలోకి రావాలీ అంటే మరి తప్పదు. మమతలు చంపుకోవాలి" మరొకరి ఉవాచ.
