"ఎక్కించాల్సిందంతా ఎక్కించి, ఇప్పుడు ఏం ఎరగనట్టు మాట్లాడతావేమిటమ్మా?"
"ఏం ఎక్కించాను?"
"వయసొచ్చిన ఆడపిల్లను ఒంటరిగా అంతదూరం పంపితే యేం బాగుంటుంది? ఒంటరిగా ఏం వేషాలు వేసిందో అని ఎవరయినా పుకారు లేవదీశారా, ఇహ దానికి పెళ్లికావడం యెంత కష్టమో ఆలోచించండి. అంతా సక్రమంగా వుంటేనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం కష్టమై పోతున్న యీ రోజుల్లో యిలాంటి అపవాదులొచ్చిపడ్డాయా ఇహ పెళ్లి చేస్తామన్న ఆశ వదులుకు కూర్చోవలసిందే. అంతేనా? పెళ్లికాని ఆడపిల్లతో ఉద్యోగం చేయిస్తున్నామంటే, దాని సంపాదన మనం ఒకపైసా ముట్టకపోయినా, ఆడపిల్ల సంపాదనకు ఆశపడి ఉద్యోగం చేయిస్తున్నా మంటారు లోకులు!" అని, నాన్నకు నువ్వు నూరిపోయలేదూ? కొట్టినట్టుగా అడిగింది శాలిని.
"నువ్వు ఉద్యోగం అంటూ ఊళ్లు పట్టుకుపోతే జరిగేది చెప్పాను! దానికి అంతకోపం ఎందుకు?"
"ఆంటీ నేనొకటి అడుగుతాను. సూటిగా జవాబు చెప్పండి! మనం బ్రతుకుతన్నది మనకోసమా? ప్రపంచం కోసమా?" అడిగింది సుధ.
"మనం బ్రతుకుతున్నది ఒక సమాజంలో అయినప్పుడు అంతా మనకోసమే యెలా బ్రతుకుతామమ్మా? ఎప్పటికప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రవర్తించాల్సి వస్తుంది."
"మీ మాటలను నేను పూర్తిగా కొట్టివేయనుగాని మనం నీతిబాహ్యమైన పని చేయనంతవరకు, తప్పు చేయనంతవరకు మనం ఎవరికీ భయపడనక్కరలేదంటానండీ? ప్యూన్ ఉద్యోగానికికూడా పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీపడుతున్న యీ రోజుల్లో ఆ ప్యూన్ ఉద్యోగాలు కూడా వేలకి వేలు లంచాలిస్తూ, మినిష్టర్ల దగ్గరినుండి రికమండేషనులు తెచ్చుకొంటున్న యీ రోజుల్లో, అదేమీ లేకుండా మీ అమ్మాయికి టీచరుగా ఉద్యోగం వచ్చింది ఇంకెవరయినా అయితే కళ్లకద్దుకొని చేసే ఉద్యోగాన్ని మీరెంత తేలిగ్గా త్రోసిపుచ్చాలనుకొంటున్నారు! అదీ, ఎవరో యేదో అంటారని అనుకొంటారని!లేక మీకే మీ అమ్మాయి మీద నమ్మకంలేదా?"
ఇంతసూటిగా ఆ అమ్మాయి తనమీద దాడిచేయడం చూసి ఆవిడ బిత్తరపోయింది తన పిల్లమీద తనకే నమ్మకం లేదంటే అంత లూజ్ కారెక్టరుగా పెంచారా? అనొచ్చు అయితే బిడ్డనుబట్టి తల్లి అనుకోవచ్చా? అన్నంతవరకూ వెడుతుంది దాని అర్దం.
"నా పిల్ల మీద నాకు నమ్మకం లేకపోవడం ఏమిటి? నా భయమల్లా ఒంటరి ఆడపిల్లను వంచించడానికి పరిస్థితులు పొంచి వుంటాయని" అంది రాధమ్మ బలవంతంగా ముఖంలోకి నవ్వు తెచ్చుకొని.
"పాతికేళ్లు వచ్చిన మీ అమ్మాయి మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత యింకా మీదేననుకొంటున్నారా?"
"పాతికేళ్లు వచ్చినా, ముప్పయ్యేళ్లు వచ్చినా పెళ్లిచేసి ఒక అయ్య చేతిలో పెట్టేంతవరకు ఆ బాధ్యత కన్నవాళ్లకి వుండక తప్పదు"
"పాతికేళ్లొచ్చి. గ్రాడ్యుయేషన్ చేసినమ్మాయి తన మంచీ చెడ్డతను చూచుకోలేదని మీరు చూస్తారా? తన వ్యక్తిత్వాన్ని బయటికి పోనివ్వరన్న మాట తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తను తీసుకొనే స్వేచ్చ ఇవ్వరన్నమాట! ఈపాటిదానికి, దానికి చదువు ఎందుకు చెప్పించారు?పాతికేళ్లు వచ్చేవరకు పెళ్లి చేయకుండా దానికి చదువు ఎందుకు చెప్పించారు? పాతికేళ్లు వచ్చేవరకు పెళ్లి చేయకుండా ఎందుకుంటారు? అక్షరజ్ఞానంలేకుండా అజ్ఞానంలో అలాగే వుంచి చిన్నప్పుడే పెళ్లిచేసి చేతులు దులుపుకొంటే ఇప్పుడు తను ఒక వ్యక్తిత్వం సంతరించుకొని మీ బాధ్యతలతో సంఘర్షించే అవసరం వచ్చేది కాదుకదా?"
ఆ పిల్ల చేస్తున్న హేళనకు ఒళ్లు మండిపోయినట్టుగా అయింది రాధమ్మకు "చదవేస్తే వున్నమతి పోయినట్టుగా వున్నాయి నీ మాటలు. చదువుకొన్నంతమాత్రాన తలిదండ్రుల అదుపాజ్ఞలలో లేకుండా పోవాలేమిటి? ఆ డిగ్రీకాస్త చేతపట్టుకోగానే సర్వం మీకే తెలిసిపోయినట్టా?" ఎక్కడ చూసినా ఆడవాళ్లమీద అత్యాచారాలు, అమానుషాలు రోజూ చూస్తున్నాం, వింటున్నాం. ఒంటరిగా ఆడపిల్లను దూరంగా ఎలా పంపించాలని మేం సందేహపడుతూంటే నువ్వుతీసే అర్దాలు ఎంత విపరీతంగా వున్నాయి" రాధమ్మ చిరాకుతో అంది. "ఎంత చదివినా ఆడపిల్ల ఆడపిల్లే. దాన్ని కన్న వాళ్లంగా మేంతీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకోవలసిందే! అది ముందే ఉద్యోగం చేసి తీరుతానూ అంటూ మాప్రాణాలను తోడుతూంటే నువ్వింకా దానికి నేర్పిపెట్టేట్టున్నావు!"
"అలా కోప్పడకండి, ఆంటీ! చదువుకొని, పాతికేళ్లు వచ్చిన ఆడపిల్ల తన శీలమర్యాదలను తను కాపాడుకోలేదా అని నా ప్రశ్న. పెళ్లేయ్యేంతవరకు అది మీ బాధ్యత అని మీ జవాబు! పెళ్లయ్యాక భర్త బాధ్యత! కొడుకులు ఎదిగివచ్చాక వాళ్ల బాధ్యత. పిత్రా రక్షతి కౌమారే. అని అదేదో శ్లోకంతో సమర్దింపు. దానికితోడు "నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి" అని ఎవడో వెధవ స్త్రీ దుర్గతిపాలు కావడానికి దారిచూపించాడు. ఆశ్రయం లేకుండా స్త్రీ శోభించదు అంటూ ఆడదాన్ని మల్లె తీగలుగానూ, మగవాడిని పందిళ్లుగానూ అభివర్ణించి ఆడదాన్న ఆ కోమలత్వంనుండి. ఆ అబలత్వం బటపడకుండా వుంచేశారు. ఇప్పుడిప్పుడే కళ్లుతెరిచిన ఆడపిల్ల తను మల్లెతీగ అనీ, మగవాడు పందిరి అనీ అనుకోవడంలేదు! అసలు తను చెట్టు పుట్ట కాదు. మనిషి! రక్తమాంసాలున్న మనిషి. ఎవడిమీదా ఆధారపడకుండా తన బ్రతుకు తను స్వేచ్చగా బ్రతకాలనుకొంటూన్న మనిషి ఎవడి అజమాయిషీ తనమీద వుండకూడదు!"
