Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 5

 

    "అమ్మా జ్యోతి నన్ను గుర్తించినావా?" అని ఆదరంతో ప్రశ్నించినాడు తండ్రి. అవునని తల వూగించింది. మూర్తి కట్టిన చిన్నారి జ్యోతి. అతడు ఆమె తలపై చేయి ఉంచి ఆశీర్వదించినాడు. ఆమె అతని పాదలాపై పచ్చని నుదురు తాకిస్తూ సాగిలి మ్రొక్కింది. బిడ్డను అక్కున చేర్చుకున్నాడు తండ్రి.
    "జ్యోతి! నేనిప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా?" అని ప్రశ్నించాడు . జ్యోతి లేదని తల త్రిప్పింది.
    "మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది?" అంది.
    "నీకు నేను బ్రతికి వుండగా కొన్ని ముఖ్యమయిన సంగతులు చెప్పాను. జ్ఞాపకం ఉన్నాయా?" తండ్రి అడిగాడు.
    "ఉన్నాయి నాన్నగారూ!"
    "ఇంకా కొన్ని సంగతులు చెప్పాలి తల్లీ"
    "ఏమిటవి?" జ్యోతి ఆసక్తిగా చూస్తోంది తండ్రి వంక.
    "అమ్మా! సర్పాకృతులు చెక్కి వున్న తలుపులు వెనుక ఒక అపురూపమయిన నిధి దాగి వున్నదని నీతో చెప్పాను. నా తండ్రి గొప్ప మంత్రవేత్త. ఈ సువిశాల విశ్వంతరాళంలో యదేచ్చగా విహరించే ఆత్మ రూపాలను అతడు దర్శించేవాడు.
    ఆత్మలను పిలిచి వాటితో తాను సంభాషిస్తూన్నట్టు, తన సంకల్ప శక్తులతో వాటికి సజెషన్స్ అందించగలుగుతున్నట్లు చెప్పాడు. కొందరు శాస్త్రవేత్తల ముందు కూడా నా తండ్రి ఈ విద్యలను ప్రదర్శించేవాడట. కొందరు వాటిని విశ్వసించినారు.
    అయితే కొందరు ఇదంతా కనికట్టు విద్య అనీ, కొందరు సంశయాస్పదమయిన తాంత్రిక ప్రదర్శన అని కొట్టి పారేశారు.
    అయినా నా తండ్రి ఆ విద్యలో పురోగమించాడు. ఆత్మస్థయిర్యంతో ఒంటరిగానే పయనించాడు. అలా ఆత్మలతో సంభాషిస్తూ ఉండగానే నా తండ్రికి ఒక చిత్రమయిన విషయం తెలిసింది. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి సుమా!" అంటూ చిన్నారి జ్యోతి వంక సుక్ష్మంగా చూసినాడు తండ్రి.
    జ్యోతి మనోపటలం మీద ప్రత్యక్ష మయిన ఆ దృశ్యం లో కన్పించే చిన్నారి జ్యోతి శ్రద్దాసక్తులతో తండ్రి మాటలు వినసాగింది.
    అతడు బ్రతికి వుండగా చెప్పలేని మాటలు చెప్తున్నాడిపుడు. ఈ సృష్టిలో అనూహ్యమయిన , రహస్యమయిన సంగతులు అనేకం వున్నాయి. అలాంటివి తెలుసుకోవాలన్నప్పుడు తెలియవు.
    యాదృచ్చికమయిన అలౌకికమయిన అద్భుతమయిన సంఘటనలు ద్వారా మాత్రమే తెలుస్తాయి. అటువంటి దృశ్యమే ఇప్పుడు కన్పిస్తోంది.
    "నాన్నగారూ! మీరేమిచెప్పినా అత్యంత శ్రద్దా సక్తులతో వింటాను. మీరు ఈ లోకంలో ఉన్నా లేకున్నా నాకు దారి చూపే మార్గదర్శకులు" అన్నది జ్యోతి.
    తండ్రి ముఖం ఆనందంతో ప్రపుల్లమయింది.
    "అమ్మా! నీవు నాపై అంతగా మనసు నిలిపినావు అని నాకు తెలుసు. నా ఆత్మకు వారసురాలిగానే నీవు పుట్టావు. నిన్ను కాపాడుకోవటం నా విధి -- అందుకే తిరిగి వచ్చినాను తల్లీ!"
    నా తండ్రి అలా ఆత్మలతో సంభాషించటం నేర్చాక ఒకసారి ఆయనకు అద్భుతమయిన ఒక విషయం తెలిసింది.
    "మన దేశంలో రాకాసి గుహలని వున్నాయి అవి చారిత్రకంగా ఎంతో అపురూపమయినవి. వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారివి విచిత్రమయిన సాంప్రదాయిక రీతుల్లో సమాధి చేసేవారు.
    అవి ఈజిప్టు పిరమిడ్స్ లోని మమ్మీలను పోలి వుంటాయి.
    మమ్మీలను గురించి నీవు అనేక కధలు విన్నావు కదా!
    ఇప్పటికి మూడు వేల సంవత్సరాలకు పూర్వం దక్షిణాది భూముల్లో నాగ జాతీయులు నివశించేవారు. వారంతా ఒకే తెగ అయినా చిన్ని చిన్ని గణాలుగా చీలిపోయినారు. కృష్ణా, గౌతమి తీరాలలో వేరు వేరు చోట్ల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
    వారి మధ్య పొరపొచ్చాలు వుండేవి. అవి అంతహ కలహలుగా అప్పుడప్పుడూ మంటలు రగిలించేవి. అయినా ఉత్తరాది భూముల్నించి వచ్చే దాడుల్ని వారు సమైక్యంగా ఎదుర్కొనేవారు.
    అలా జరిగిన యుద్దాలలో ఎన్నో వింతలూ జరిగినాయి. ఈ కృష్ణాతీరం అటువంటి చరిత్రకమయిన ఎన్నో అంశాలను తన గుండెల్లో దాచుకుంది. ఈ లోకం వాటి గురించి పూర్తిగా మరచిపోయింది.
    ఈనాడు పురుషాధిక్య సమాజమూ, అర్ధరహితమయిన ఆర్ధిక విలువల ఆధిక్యతా మనిషిని ఒకచోట  నిలువనీయకుండా పరుగెత్తేలా చేస్తున్నాయి. ఈ పరుగు పందెంలో వెనుదిరిగి చరిత్రవంక చూచేవారెవరు?
    అలా చూడగలిగిన వారికి ఎన్నో నిధులు దొరుకుతాయి.
    "నా తండ్రి అలాంటివాడు అతనికి అతి ప్రాచీనమయిన ఒక అర్మరూపం దర్శన మిచ్చింది. ఈ కృష్ణాతీరంలో ఒకచోట ఈజిప్టు పిరమిడ్స్ ని పోలిన రాకాసి గుహలు దాగున్నాయని చెప్పింది.
    పిరమిడ్స్ భూమిపైకి కన్పిస్తాయి. రాకాసి గుళ్ళు , రాక్షసి గుహలు టూంబ్సు  అని పిలవబడే ఈ నిర్మాణాలు భూమి పొరల్లో దాగి వుంటాయి. అంతే తేడా! మమ్మీలాగే ఈ రాకాసి గుహలలో కూడా శిధిలమయిపోయిన మనవ శరీరాలుంటాయి.
    వాటికి కూడా అనేక శక్తులుంటాయి.
    కృష్ణ వేణీ తీరంలో ఒకచోట అటువంటి రాక్షసి గుహ ఉన్నదనీ దానిలోని శిధిల మానవ శరీరం చుట్టూ అనేక రహస్యాలు నిక్షిప్తం అయి వున్నాయనీ చెప్పిందా ఆత్మరూపం.
    "దాని గురించిన సమాచరం కొన్ని రాగి రేకులపై వ్రాసి ఉన్నదనీ, ఆ తామ్ర పత్రాలు ఇంద్రకీలాద్రి దగ్గరలో ఎక్కడో భూమిలో నిక్షిప్తమై వున్నాయనీ చెప్పింది.
    నా తండ్రి ఆ అర్మరూపం ఇచ్చిన సూచనలను అనుసరించి ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలను కొన్ని సంవత్సరాల పాటు అన్వేషించాడు. ఆత్మరూపం చెప్పిన విధంగానే కొన్ని తామ్రపత్రాలు లభించాయి.
    వాటిని మన లాంచిలో సర్పాకృతులున్న తలుపుల వెనుక దాచి వుంచాడు: తరువాత నా తండ్రి కాలం చేశాడు.
    నేను వాటిని జీవితమంతా ఎంతో శ్రద్దాసక్తులతో కాపాడాను. నీవు విద్యాబుద్దులు నేర్చిన ఆడపిల్లవు.
    ఈ ప్రపంచంలో ఒంటరిగానే అయినా నీ బ్రతుకు నీవు బ్రతక గలిగినదానవు. నీ మీద నాకు పూర్తీ విశ్వాసముంది.
    ఆ నమ్మికతోనే చెప్తున్నాను తల్లి!
    నీవు ఆ తామ్రపత్రాలపై ఉన్న సమాచారాన్ని చదువు. తామ్రపత్రాలపై వున్న అమృతాక్షరాలను అర్ధం చేసుకోలేక ఒదిలేశాడు. నా తండ్రి. వాటి గురించి పట్టించుకునే శక్తి సంపన్నత లేనివాడను నేను.
    నీవయినా అవి చదువు. నీ తాతగారు సంపాదించిన అపురూపమయిన సమాచారాన్ని ప్రపంచానికి అందించు.
    అందువల్ల పదుగురికి ఏవయినా మేలు జరిగితే అంతకన్నా కోరదగినది ఏమున్నది? నీకు ఆశీస్సులు తల్లీ!
    ధైర్యసాహసాలు నీ ఊపిరిగా బ్రతుకు దారిలో పురోగమించు" అని చెప్పాడు. తండ్రి మాటలు వింటున్న జ్యోతి విబ్రాంతి అయిపొయింది.
    "అలాగే నాన్నగారు!" అని తల ఊగించింది. ఆమె అలా అనగానే ఆత్మ రూపమయిన కాంతిపుజం ఆకృతిని విడిచి పెట్టి తిరిగి వెలుగు రాసిగా మారిపోయింది. ఆ వెలుగు రాసి క్రమంగా దూరం అయిపోతూ కనుమరుగు అయిపొయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS