సురేష్ చకచక ఆలోచించాడు. బోర్నవిటా తాగటం వంకగా తీసుకుని!
కధ ఇక్కడితో ఆపేస్తే ఏం జరుగుతుందో తను దివ్యదృష్టితో చూడగలడు.
రాత్రి ఆమె భర్త ఇంటికొస్తాడు.
రాగానే అతని చొక్కా పట్టుకుంటుంది శ్ర్రీదేవి.
హిస్టీరియా వచ్చినట్లు ఊగిపోతూ అరుస్తుంది . గొడవ గొడవయిపోతుంది.
అతను నిశ్చేష్టుడవుతాడు. తర్వాత కోలుకొని సంగతేమిటని అడుగుతాడు.
"అలా అమాయకత్వం నటించకండి! ఆ రాజేశ్వరితో మీరు గడిపే ప్రతి క్షణం నాకు తెలీదనుకుంటున్నారేమో!"
"నీమీద ఒట్టే! ఆ రోజు ఆఫీస్ పార్టీలో కలుసుకోవటమే! ఆ తర్వాత కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు."
"పిచ్చి అబద్దం."
"పచ్చి నిజమే! అయినా ఈ అబద్దం నీకెవరు చెప్పారు?"
"సురేష్..."
అతను టెర్రరిస్ట్ అయిపోతాడు.
"అలాగా! ఇప్పుడే వాడి అంతు తేలుస్తాను" అంటూ ఏ.కే. 47 తీసుకుని - లేదా కొనుక్కుని తనకోసం వెతుకుతాడు.
అంచేత పరిస్థితి అంత దూరం రానీకుండానే శ్రీదేవిని శాంతపరచాలి.
లేకపోతే అంతా రసాభాస అవుతుంది.
"మాట్లాడవేం? ఏం మాట్లాడుకున్నారు?"
"ఆమె మాటలయితే సరిగా వినబడలేదు గానండీ! అయన మాత్రం స్పష్టంగా మాట్లాడారు. బహుశా మీరిలా రోజూ బోర్నావిటా ఇవ్వటం వల్లనెమో గొంతు ఖంగున మోగుతోంది."
"ఇస్తా - ఇస్తా -- ఇవాల్టి నుంచి వాళ్ళిద్దరి శ్రాద్ధం ఇస్తా -- ఏమన్నారో చెప్పు త్వరగా!"
"రాజేశ్వరీ. నువ్వెన్నయినా చెప్పు! శ్రీదేవంటే నాకు ఇష్టం! శ్రీదేవి కేం తక్కువని నేను మళ్ళీ నీతో సెటప్ పెట్టాలి? ధర్టీ నైన్ - ట్వంటీ సిక్స్ - ధ ర్టీ సిక్స్ లాంటి మేజర్ మెంట్స్ ఎంతమంది ఉంటాయ్ అసలంత సెక్సీ ఫిగర్ ట్విన్ సిటీస్ లో ఎక్కడుంది? నో శ్రీదేవిని మాత్రం నేను వదల్లెను" అన్నారండీ!"
ఆమె ముఖకవళికలు జాగ్రత్తగా గమనిస్తూ చెప్పాడు.
ఆమె చాలా ఇంప్రెస్ అయిపొయింది గర్వంగా చూస్తోంది.
"నాకు తెలుసు! అయన మరీ అంత బేవార్స్ రకమేం కాదు!" అంది మెత్తబడి పోతూ.
"ఆ తరువాతేమయింది?"
"ఇంకా తరువాతే ముందండి! బిల్లు కట్టడానికని కౌంటర్ దగ్గర కొచ్చి నన్ను చూశాడు. అమాంతం బయటికొచ్చి ఈ విషయం మా ఇంటి దగ్గర చెప్పావో నిన్ను అపార్ట్ మెంట్స్ నుంచి బయటకు గెంటుతా అంటూ బెదిరించారండీ."
"అపార్ట్ మెంట్స్ కి శేక్రటరీని నేను. నిన్ను నేను గెంటలిగానీ తనెలా గెంటుతాడు?"
"ఎందుకొచ్చిన గొడవండీ! మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరీ విషయం అయన దగ్గర కదపకుండా ఉండటం మంచిది. ఒకవేళ కడపాల్సి వచ్చినా నేను మీకీ విషయం చెప్పినట్లు ఏ మాత్రం అనుమానం రాకుండా చూడండి ."
ఆమె ఓ క్షణం ఆలోచించింది.
"సరే! ఇంకొన్నాళ్ళు ఓపిక పడతాను. ఆయనంతట అయన తన తప్పు తెలుసుకుని దారి కొచ్చారా సరి! లేకపోతే అప్పుడే ధ్వజమెత్తుతాను."
"అదండీ బాడీకీ తగ్గ బ్రేయినంటే! ఇదే మీ పొజిషన్ లో ఇంకెవరయినా వున్నారనుకొండి! మొత్తం 'షో' చెడగొట్టేసేవాళ్ళు."
"సరే! ఇకనుంచీ నువ్ రోజూ ఓసారి ఆ కాంటిన్ దగ్గర కెళ్ళి వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారేమో చూసి నాకు చెబుతుండాలి తెల్సిందా?"
సురేష్ తల గోక్కున్నాడు.
"చెప్పచ్చు గానండీ రోజూ ఆ ఆఫీస్ కి బస్ లో వెళ్ళాలంటే చాలా చార్జీలయి పోతాయ్. పోనీ రోజు విడిచి రోజు వెళ్ళ వచ్చాండీ?"
తన బాగ్ తెరచి ఓ ఇరవై నోటు తీసి మీదకు విసిరింది.
"ఊహూ! వద్దు! రోజూ వెళితే గానీ వాళ్ళిద్దరి అసలు రంగు బయట పడదు. కనీసం ఓ వారం పదిరోజులయినా జాగ్రత్తగా కనిపెట్టి వుండాలి!"
"ఆ మాట నిజమేనండీ! మొగుడి వ్యవహారం తేలిగ్గా తీసుకోబట్టే కే. హైమవతి బ్రతుకు కొల్లేరే లేక్ అయిపొయింది. ఆ సరస్సులో ద్వీపకల్పా లున్నట్లు సెటప్ లు పెట్టాశాడండీ చాలా చోట్లా."
"కె. హైమవతీ ఎవరు?"
"యస్. కామేశ్వరి ఫ్రెండండీ -- నేను వస్తానండీ! ఏ రోజూ రిపోర్టు ఆ రోజు మీరిస్తుంటానండీ!" ఆమె చూస్తూండగానే లిఫ్ట్ లో కెళ్ళాడు సురేష్.
ఇందాకట్లా మెట్లెక్కమని గొడవ చేయలేదామె.
"టెర్రేస్ మీద కొచ్చేసరికి కుమిదిని ఇంకా బట్టలు అరేస్తూనే వుంది.
ఆమె కంటపడకుండా వాటర్ టాంక్ కింద వున్న నాలుగడుగుల గోడల్లేని గడిలాంటి స్థలంలోకి దూరి పడుకుందామని దుప్పటి కోసం వెతికాడు.
కానీ దుప్పటితోపాటు తన మడత పెట్టి ఉంచిన లుంగీ , బనీనూ కూడా కనిపించలేదు.
గుండె గుభేల్ మంది.
ఏమై పోయినాయ్?
కొంపదీసి కొత్తగా టెర్రరిస్టుల్లాగా , టెర్రేస్ దొంగలు తయారవలేదు కదా?
మోకాళ్ళ వరకూ చీర మడత పెట్టిన కుముదిని కాళ్ళు అందంగా , నాజూగ్గా క్లోజప్ ఫోజులో టాంక్ పక్కనుంచీ కదులుతున్నాయి. ఇదే మొదటిసారి --
ఓ అందమయిన అమ్మాయి కాళ్ళు మోకాళ్ళ వరకూ నగ్నంగా చూడటం! అదీ ఆ అమ్మాయికి తెలీకుండా.
పని మనుషుల క్కూడా ఇంత నాజూకయిన కాళ్ళు ఉంటాయా?
తను కాళ్ళ స్పెషలిస్టు కాదు గనుక ఉండే ఉంటాయ్.
మరీ దగ్గరకు వంగి కాళ్ళ వంక మరింత ఆనందంగా చూడబోతుంటే చటుక్కున నేలమీద కూర్చుందామే.
దాంతో తన దొంగతనం బయట పడిపోయింది.
"వన్ బై టూ! ఏమిటా దొంగచూపులు! " గదమాయించింది కుమిదిని చేరడేసి కాటుక కళ్ళతో.
"ఇందులో దొంగతనం ఏమీ లేదు. ఆడపిల్ల కాళ్ళలలో కూడా ఇంత అందం ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు ఈ కాళ్ళేక్కడ చేయించావ్?"
ఆమె నవ్వేసింది .
"అలకాపురి కాలనీలో "
"అది సరేగానీ నా లుంగీలూ, బనీన్సూ, దుప్పట్లో కనిపించటం లేదు ఏమయ్యాయంటావ్?"
