Previous Page Next Page 
ప్రార్థన పేజి 5


    "ఆవిడ్ని కాదు గురూగారూ- ఆవిడ్ని కాదు! మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. ఆ క్షణం ఆవిడ అంతలావు బౌండు పుస్తకాన్ని అలా ఏకాగ్రతతో చదివే భంగిమని ప్రేమించాను. ఆవిడకన్నా బరువుగా వున్న పుస్తకాన్ని, ఆవిడ చదివే తీరు ముచ్చటేసింది. మీకు తెలుసుగా- విజ్ఞానం ఎక్కడున్నా..."

 

    "నీ విశ్వజనీయమైన ప్రేమకు జోహార్లు"

 

    "థాంక్యూ- థాంక్యూ"

 

    "ఇంతకీ రాత్రి డిన్నర్ కి వస్తున్నావా?"

 

    "ఒంటరిగాడ్ని. మీరు పిలవాలేగానీ, మధ్యాహ్నం భోజనానికి కూడా రమ్మంటే వచ్చేస్తాను".

 

    "వద్దొద్దు" అంటే భార్గవ అతడివైపు తేరిపార చూసి, "పెళ్ళి చేసుకోకూడదటోయ్?" అన్నాడు కాస్త మందలిస్తున్నట్టూ.

 

    శేఖరం అదే నమ్రతతో "పెళ్ళి అనేది కేవలం భోజనం కోసమే కాదనేది నా ఉద్దేశ్యం గురూగారూ. దానికే అయితే వంట మనిషి చాలు" అన్నాడు.

 

    "కానీ ఇంట్లో మనకోసం ప్రేమగా ఎదురు చూసేవాళ్ళు ఒకరుంటారు కదోయ్"

 

    "ఎదురు చూడటమే ప్రేమయితే, మంచి ఆల్సేషన్ కుక్కని పెంచుకోవటం ఉత్తమం".

 

    "నీకెలా చెప్పాలో తెలియటం లేదోయ్! ప్రేమంటే..."

 

    "మీరు చెప్పలేరని నా ఉద్దేశ్యం గురూగారూ. నా ప్రేమని అర్థం చేసుకోలేక నా లాబ్ సూపర్ వైజర్ తెల్లజుట్టు రాంబాయమ్మ తనో ఫిజిక్సు పోస్టు గ్రాడ్యుయేట్ ని అన్న విషయం కూడా మర్చిపోయి అచ్చ తెలుగులో 'దొంగసచ్చినోడా' అని తిట్టింది".

 

    "విషయం అంతవరకూ వచ్చిందీ".

 

    "నా తప్పేంలేదు గురూగారూ! అంతలావు బౌండ్ పుస్తకాన్ని వళ్ళో వేసుకుని, కిటికీ పక్కన కూర్చొని చదివేస్తూంటే ముచ్చటేసి దగ్గిర కెళ్లి 'ఇంతింత బరువైన వాటిని మోస్తున్న మీ శరీరం ధన్యమైంది' అన్నాడు. అందులో 'దొంగసచ్చినోడా' అని తిట్టాల్సిన అవసరం ఏముందో నా కర్థం కాలేదు".

 

    "అవును, నిశ్చయంగా లేదు. కానీ నువ్వు నీ తెలుగుని కొద్దిగా సంస్కరించుకోవటం మంచిదని నా ఉద్దేశ్యం. అలాగే ఆడవాళ్ళు మోసే వాటి గురించీ, వాళ్ళ కళ్ళద్దాల్లోని జ్ఞానం గురించీ ఆలోచించటం మానేసి- అఫ్ కోర్స్ నువ్వు నిజాయితీగానీ ఆలోచిస్తున్నావనుకో- కానీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేక పోయినప్పుడు వాళ్ళని క్షమించి, వాళ్ళ మానాన వాళ్ళని వదిలిపెట్టేసి, నువ్వు నీ పనులు చూసుకోవటం మంచిదని నా ఉద్దేశ్యం".

 

    "మీకూ రాంబాయమ్మగారిలాగే నాపట్ల నీచమైన అభిప్రాయం వున్నట్టుంది గురూగారూ! కానీ చేరి పూర్తిగా పదిహేను రోజులు కాకపోయినా అప్పుడే కపాడియా కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ని ఇప్పుడొస్తున్న నష్టాలనుంచి రక్షించే మార్గాన్ని ఒక అకౌంటెంట్ గా కనుక్కున్నాను. తెలుసా?"

 

    "ఏం కనుక్కున్నావు?"

 

    "మొన్నరాత్రి నిద్రపట్టక సెక్సుపుస్తకం చదివినట్టూ సామ్సన్ కంపెనీ బ్యాలెన్సు షీటు బోర్లాపడుకుని చదవసాగాను. మనం పేటెంట్ ఇచ్చిన కాన్స్- క్యూర్ మందుని వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారో తెలుసా గురూగారూ- మిల్లీగ్రాము రెండొందలకి.... భారతదేశంలో కెల్లా అదే ఖరీదైన మందు".

 

    "అవును. ఖరీదైన వ్యాధికి ఖరీదైన మందు".

 

    "మిల్లీగ్రాము రెండొందలు ఖరీదుచేసే ఈ మందులో వాడబడే ముఖ్యమైన పదార్ధం సల్ఫా-2. దీని ఖరీదు నూట అరవై రూపాయలు. మీరు మొన్న సంభాషణలో ఒక మాట వాడారు.... మెరాప్టోపూరిన్ గానీ మెథొట్రెక్సేట్ గాని తొందర తొందరగా విడిపోయే రక్తకణాల వేగాన్ని ఆపుతాయని... అదే యీ సల్ఫా-2 నా? దీనికి బదులు ఇంకో చౌక అయిన పదార్థాన్ని వాడలేమా? ఇది కనుక్కున్నాం అనుకోండి. కాన్స్- క్యూర్ ధర రెండొందల్నుంచీ రెండ్రూపాయలకి పడిపోతుంది. నోబుల్ బహుమతి మనకే వస్తుంది. ఏ నిష్పత్తిలో పంచుకునేది తరువాత ఆలోచిద్దాం. నాకు మాత్రం ఈ ఆలోచన వచ్చిన దగ్గర్నుంచీ మరి నిద్ర పట్టటంలేదు. ఏ హేమమాలినినో ఊహించుకుంటూ గడపాల్సిన ఆ చలిరాత్రి..."

 

    భార్గవ మాట్లాడలేదు. ఆ యువకుడినే కన్నార్పకుండా చూస్తున్నాడు.

 

    "ఏమిటి గురూగారూ- ఆలోచిస్తున్నారు?"

 

    "ఇంత విషయ పరిజ్ఞానం వున్నవాడివి ఎప్పుడూ అమ్మాయిల గురించి మాట్లాడతావేం?" అన్నాడు భార్గవ నవ్వుతూ.

 

    "శరీరం అనే రిఫ్రిజిరేటర్ లో మెదడు అనే భాగం వేడెక్కకుండా కాపాడే కంప్రెషరు స్త్రీ తాలూకు ఆలోచన" అన్నాడు ఆచార్య రజనీష్. మగువా- మద్యమూ, మాంసమూ- ఈ మూడు- బైదిబై మాంసం అంటే గుర్తొచ్చింది. ఈ రాత్రి డిన్నర్ లో మాంసం వండించండి. నిర్మొహమాటంగా చెబుతున్నాను- పుట్టింది క్షత్రియవంశమైనా నాన్ వెజిటేరియన్ అంటే చెవికోసుకుంటాను. అందులోనూ 'మటన్' అంటే..."

 


                                         *    *    *

 


    డైనింగ్ టేబిల్ మధ్యలో పొగలు సెగలు కక్కుతున్న గిన్నెలో వున్న మాంసంకూర తాలుకూ వాసన ఆ గది అంతా వ్యాపించివుంది.

 

    శేఖరం చిన్న ముక్కని నోట్లో పెట్టుకుని పీలుస్తూ "ఈ ఎముక లోపల వుండేదాన్ని ఏమంటారు" అని అడిగాడు.

 

    శ్రీను "మూలగ" అన్నాడు, ఇంత చిన్న విషయం తెలీదా అన్నట్టూ.

 

    "భలే రుచిగా వుంటుంది కదూ! కేవలం రుచికోసమే పెట్టాడేమో దేముడు దీన్ని ఎముక మధ్యలో".

 

    "కాదు" భార్గవ అన్నాడు. "ఎముక మధ్యలో నల్లగా, స్థబ్దుగా ఏ ప్రాముఖ్యతా లేనట్టూ పడివుండే ఈ గుజ్జులాంటి పదార్థమే మనిషి జీవితాంతం బ్రతకటానికి కావల్సిన 'రక్తాన్ని' తయారుచేసి ఎముకల్లో వుండే సన్నటి రంధ్రాలగుండా శరీరంలోకి పంపిస్తుంది. ఈ 'మూలగ'నే ఇంగ్లీషులో MARROW అంటారు. శరీరంలో ఏ పదార్ధం పాడయినా ఫర్లేదు కానీ ఈ 'మారో' పాడయితే మాత్రం మందులేదు"

 

    శేఖరం చేతిలో ఎముక కంచంలో పడేసి- "ఈ క్షణం నుంచీ నేను మూలగ ముట్టనని శపథం చేస్తున్నాను" అన్నాడు. అందరూ నవ్వారు. ఇంతలో జిన్నీ నాలుక బయటపెట్టి "సీ" అని అరిచింది. ఆ పిల్ల నాలుక ఎర్రగా ఉంది. భార్గవ కంగారు చూసి ప్రార్థన నవ్వుతూ "చెర్రీస్ డాడీ" అంది. ఫ్రూట్ సాలిడ్ లో వేసే చెర్రీని పళ్ళమధ్య పెట్టుకుని నాలుకతో లాగితే రక్తంలా వస్తుంది. స్కూల్లో తనకి ఎవరో చెప్పార్ట. మొదట నేనూ కంగారుపడ్డాను".

 

    జిన్నీ అందరివైపు తాను తెలివైన దాన్నే కదా అన్నట్టు చూసింది. భార్గవదాన్ని చివాట్లు పెట్టాడు. శేఖరం జిన్నీ తరఫున వాదించాడు. మొత్తానికి నవ్వుల మధ్య డిన్నరు పూర్తయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS