Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 44


    "యీళ్ళందరిని అడగండి. ఆళ్ళందరికీ తిండిచ్చి, బట్టిచ్చి, గాజులిచ్చి, పూలిచ్చి యింటినీడ యిచ్చి ఓ గూటికింద కోడి పెట్ట రెక్కల కింద దాచుకుని పిల్లల్ని రక్షించుకున్నట్టు యీ దిక్కూ మొక్కు లేనివోళ్ళని రక్షిస్తున్నానండి. నే లేకపోతే బజారుపాలై పురుగుల్లా ఎదవ బతుకు బతికేవారండి" యిసడింపుగా అంది.
    "మా మీద ప్రేమతోనేంటి చేస్తున్నావు. మా వొంటి మీద ప్రేమ, అది సరిగా వుంటే డబ్బులోస్తాయని తిండేట్టి, సోకులకి స్నోలు, పౌడర్లు, సెంట్లు, పూలు యిస్తావు' కసిగా అంది ఆ అమ్మాయి.
    జడ్జి సాలోచనగా చూసి 'నీకు నీ వాళ్ళెవరూ లేరా?' అసలు యీమె గుప్పెట్లోకి ఎందుకొచ్చావు?' కుతూహలంగా అడిగింది.
    'జడ్జిగారూ , ఈ జీవితంలోకి కావాలని ఎవరూ రారండి. యిక్కడున్న అందరినీ అడగండి, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క కధలు. పరిస్థితులు లాక్కోస్తాయండి.'
    'ఏముంది , సినిమాలు చూసీ, ప్రేమలనుకుని ఎవరినో నమ్మి మోసపోయి రావడం, తల్లీ తండ్రినీ కాదని సినిమాల్లో చేరాలనో, నమ్మినవాడు గట్టెక్కిస్తాడనో వచ్చి నట్టేట్లో ముంచి పోయే వెధవల కధలేగా అందరివి? నీదీ అంతే అనుకుంటాను.'
    ఆ అమ్మాయి కాస్త రోషంగా చివ్వున తలెత్తి ' 'అందరినీ అలాంటి కధలే అవక్కరలేదండి. బలవంతంగా రొచ్చు లోకి లాగే కధలూ వుంటాయండి' దెబ్బతిన్నట్లుంది. 'నా కధ చెప్పమంటారా. ఇక్కడే చెప్పనా, చెపితే యిక్కడుండే మగాళ్ళంతా సిగ్గుతో ఉరెట్టుకుచావాలి. అడాళ్ళంతా సిగ్గుతో చితికిపోతారు. చెప్పనా, యిక్కడే చెబుతే, ఇలాంటివి వింటే నన్నా మీ సభ్యసమాజానికి నాలాంటి వారికీ జరిగే అన్యాయాలు అర్ధమవుతాయి. ఉద్రేకంగా అంది. జడ్జి చెప్పమన్నట్టుగా తల ఊపింది.
    "జడ్జిగారూ ....పెద్దమనిషినవకుండానే తల్లినైన ఘనచరిత్ర నాది.....' మొదలు పెట్టింది.
    'ఆమ్మా.....నా పొట్టలో చేపపిల్లలా ఏదో కదులుతూందే' పన్నెండేళ్ళ రేణుక అంది.
    ఉడుకుతున్న అన్నం గిన్నె కింద చితుకులు తోస్తూ 'అన్నం వార్చి పెడతాలే. ఆకలికి పేగులు అరుస్తుండయి కాబోలు' చాలా తేలిగ్గా అంది జయమ్మ.
    'అది కాదే....ఆకలి కాదే అమ్మ, చేపపిల్లలా యిటు నుండి అటు అటు నుండి యిటు తిరుగుతుందే.'
    "నీ బొంద చేపపిల్ల తిరగడమేంది . పో....' తల్లి హేళనగా అంటూ ఉల్లిగడ్డలు తరగడం మొదలెట్టింది.
    మరో నాలుగు రోజులు పోయాక పెరట్లో తడికల దడి చాటున స్నానం చేస్తున్న రేణుక 'అమ్మోయ్...ఇటు రావే. అమ్మోయ్....'అంటూ కేకేపట్టింది.
    జయమ్మ చేస్తున్న పని ఆపి ఏదో అనుమానం తోచి కూతురి దగ్గర కెళ్ళింది. పిల్లది పెద్ద మనిషైంది గాబోలు, భయపడి అరిచింది గాబోలన్న అనుమానం వచ్చింది.
    'అమ్మాయ్, యిక్కడనించి పాలోస్తున్నాయే. రెండు సార్లు కారాయే' బిక్కమొహం పెట్టి అంది.
    జయమ్మ తెల్లబోయింది ' పాలు రావటం ఏటే?"
    "కావలిస్తే చూడు' రొమ్ము నొక్కి చూపింది.
    తల్లి గాభరాగా చూసింది. ఏం అర్ధం కాలేదు. పిల్ల సమర్తాడిందేమో అనుకుంటే యిదేమిటి పాలురావడం......పిల్లకి పన్నెండు నిండాయి. పిల్ల వొళ్ళు చేసి నిగారింపు వచ్చి రొమ్ములు నిండుకొస్తున్నాయి. యివాళో, రేపో సమర్తాడుతుందనే అనుకుంది. పెద్దమనిషయేముందు యిట్లా పాలు పడ్తాయా .. ఎప్పుడూ వినలేదే. కూతురి వంక చూసింది అనుమానంగా సాలోచనగా.
    'సాయంకాలం డాక్టరమ్మ దగ్గరెళ్ళీ అడుగుదాంలే. ఎటో నాకేం తెలియదు యిట్టా పాలెందుకొస్తాయి చెప్మా" అనుకుంటూ 'బట్టలేసుకో సాయంకాలం డాక్టరమ్మ దగ్గరికెడదాం . అడుగుదాం లే' అంది .
    
                                               ***

    'మీకీ జన్మలకి బుద్దులు రావు. పదేళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు. పన్నెండేళ్ళ పిల్లలకి కడుపులు, పిల్లలు, గవర్నమెంట్ ఊరికే చదువులు చెప్పించినా చదువుకోరు . కొంప మునిగినట్లు పదేళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. పన్నెండేళ్ళ పిల్ల అదేపిల్ల దానికి మరో పిల్ల అంత. తల్లులు, పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ శరీరాలు, మనసులు ఏం ఎదుగుతాయి? మీరీ జన్మకి మారరు!' తలవాచేట్టు చివాట్లు పెట్టసాగింది డాక్టరమ్మ రేణుకని లోపలికి తీసుకెళ్ళి పరీక్ష చేశాక.
    జయమ్మ తెల్లపోయి చూసింది.   'దానికి పెళ్లెంటమ్మ, పెళ్ళి కాలేదు యింకా' అంది డాక్టరు అన్నది అర్ధం కాక.
    డాక్టరు కోపంగా చూసి 'ఓహో, పెళ్ళి కాకుండా పన్నెండేళ్ళకే కడుపు తెచ్చుకుందా, పన్నెండేళ్ళకే ప్రేమలు నడుపుతారా?' తిరస్కారంగా , హేళనగా అంది.
    జయమ్మ యింకా తెల్లపోయింది సారీ. కాస్త పౌరుషం వచ్చింది డాక్టరమ్మ అలా తిట్టేసరికి. "ఏంటండి. నా కూతురు సమర్తాడనేలేదు పెళ్ళే కాలేదు. కడుపంటారేంటి?' రోషంగా అంది.
    ఈసారి డాక్టరు తెల్లబోయింది. "ఏమిటి , ఈ పిల్ల పెద్దమనిషి కాలేదూ?" అంది ఆశ్చర్యంగా.
    "నేదమ్మగారూ."
    "అదేంటి , పిల్లకి ఆరో నెల వచ్చింది. కడుపులో బిడ్డ తిరుగుతోంది. స్పష్టంగా తెలుస్తుంటే, కడుపు సాగింది. చూస్తేనే తెలుస్తుంది' అంది అనుమానంగా చూస్తూ.
    'సత్తేపమాణంగా యింకా పిల్ల పెద్దమనిషి కానేదమ్మాపిల్లకి సమర్తాడే వయసు వచ్చింది. అందుకే పిల్లకి నిగారింపు వచ్చింది. వొళ్ళు చేసింది అనుకున్నాను. యివాళ పాలు కారాయి అంటే సమర్తాడే ముందు అలా వస్తాయా అని అడగాలని వచ్చానంతే ' అంది జయమ్మ ఆరాటంగా.
    డాక్టరమ్మ సందిగ్ధంలో పడింది. తన డైగ్నోసిస్ తప్పా/ అంత స్పష్టంగా పిల్ల తిరుగుతున్నట్టు అనిపించింది. హార్ట్ బీట్ వుంది. మరోసారి లోపలికి తీసికెళ్ళి అన్ని పరీక్షలూ మళ్ళీ మళ్ళీ చేసింది. స్పష్టంగా గర్బిణీ అన్నది తెల్సినా అనుమాన నివృత్తి కోసం స్కానింగ్, యూరిన్ టెస్ట్ రాసిచ్చింది. రిపోర్టులు తీసుకుని మళ్ళీ రమ్మంది. స్కానింగ్ లో స్పష్టంగా బిడ్డ తెలిసింది. అన్ని రిపోర్టులు పాజిటివ్ వచ్చాయి. తన కొలీగ్ ని కూడా పిలిచి రిపోర్టులు చూపించి రేణుకని మళ్ళీ ఆవిడ చేత పరీక్ష చేయించింది. ఆరు నెలల గర్బిణీ అని తేలాక యిద్దరు డాక్టర్లు నిర్ధారణ కి వచ్చారు.' చూడు జయమ్మా ఈ అమ్మాయి ఆరు నెలల గర్బిణీ అన్నదానిలో ఏ అనుమానం లేదు. అయితే పెద్దమనిషి కాకుండా గర్బం ఎలా వచ్చిందంటే , చూడు మన ఆడవాళ్ళలో నెలసరి కొన్ని రోజుల ముందు ప్రతినెల ఓ అండం విడుదల అవుతుంది. ఆ అండం విడుదలైనప్పుడు మగాడు కలిస్తే అండం ఫలిస్తే గర్బం వస్తుంది. గర్బం రానపుడు మళ్ళీ నెలసరి వస్తుంది గదా. నీ కూతురు పెద్దమనిషి కాకముందు కొన్ని రోజుల ముందు అండం విడుదలయింది. ఆ అండం గర్బం అయిందంటే ఎవరో మగాడితో కలిసుండాలి. అందుకే గర్భం వచ్చింది. మగాడు కలియకపోతే అండం పొదగబడక పెద్దమనిషయ్యేది తెల్సిందా? యిప్పుడు దాన్ని అడుగు వాడెవడో. పిల్లతో కల్సినవాడెవడో. అది ఆ సంగతి ఎందుకు దాచింది గట్టిగా నిలేసి అడుగు. యిప్పుడు నీ కూతురికి పెళ్ళి కాలేదు. కడుపోచ్చింది. దానికి కారణం ఎవరో చూసి వాడ్ని పిలిచి చివాట్లు పెట్టి నయానో, భయానో నొప్పించి పెళ్ళి చెయ్యండి. ఆరునెలలు వచ్చాయి. అబార్షన్ కి కూడా వీలుకాదు' డాక్టరు విడమరచి వివరించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS