Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 4

    తనలా చేసినందుకే ఆ వ్యక్తి అనిరుధ్రను గాయపరిచాడు.
    "హాయ్.. అవనీ...ఏంటాలోచిస్తున్నావ్"  అడిగాడు అనిరుద్ర అవని వాలకం చూసి.
    ఉలిక్కిపడి  'ఏమీ లేదు' అన్నది అవని.
                    *            *            *
    "ఏయ్..అవనీ.. డల్  గా వున్నావేంటి?"  ఆఫీసుకు రాగానే అడిగింది  వసుధ ఎదురొస్తూ.
    అనిరుద్రతో   హొటల్ లో టిఫిన్ చేసి తను సరాసరి ఆఫీసుకు వచ్చింది. సాయంత్ర్రం ప్రశాంత్ థియేటర్ దగ్గరికి రమ్మని చెప్పాడు అనిరుద్ర.
    నిజానికి సినిమాకు వెళ్ళే మూడ్ లేదు.  కానీ,  వెళ్ళకపోతే అనిరుద్ర ఫీలవుతాడు.
    "నిన్నే..అవనీ..."  భుజాలు కుదిపి మరి అడిగింది వసుధ.
    ఉలికిపాటులో నుంచి తేరుకొని "ఏం లేదు"  అంది మెల్లిగా అవని.
    "అద్సర్లేగానీ,  నీకు మెనీ  మెనీ థాంక్స్...నిన్న సినిమా బావుందే.  ధీరజ్,నేను బాగా ఎంజాయ్ చేసాం.  నీకు చాలా థేంక్స్..ఎట్ ద సెమ్ టైం సారీ... శ్రమ కూడా ఇచ్చాను కదూ."
    "దట్సాల్ రైట్...ఇదిగో ...ప్యాకింగ్ సెక్షన్ తాలూకు క్లియరెన్స్ పేపర్స్" అంది టేబుల్ సొరుగునుంచిదాని తాలూకు  ఫైల్ ఇస్తూ.
    "ఫైల్ ఓసారి తిరగేసి నువ్వు నా సెక్షన్ కు మారిపోరాదే... నేను ఎంచక్కా నీ పొజిషన్ లోకి వస్తాను"  అంది.
    "నాకా జాబ్ మీద ఇంట్రస్ట్ లేదు.  అయినా నేను ఎక్కువకాలం జాబ్ చేయను.  పెళ్ళి కాగానే ఉద్యోగానికి గుడ్ బై" అంది అవని.
    "అదేంటే..ఉద్యగం చేయకపోతే మొగుడు మన చెప్పుచేతల్లో ఎలా వుంటాడు?"  అంది వసుధ.
    ఆ టాపిక్ కొనసాగించండం ఇష్టం లేక.. "వదిలేయ్  వసుధా..  ఎవరి అభిప్రాయం వాళ్ళది."
    వసుధ ఓసారి అవని మొహంలోకి చూసి,
    "ఏంటి... రాత్రి నిధ్రలేదా?  కళ్ళు ఎర్రబడి పోయాయి."  అని అడిగింది.
    "అదేంలేదు.  పన్నెండు వరకూ టి.వి   చూస్తూ వుండడంవల్ల."
    ఈలోగా ఆఫీసు ప్రెమిసెస్ లోకి యం.డి  కారు వచ్చేసింది.  అందరూ ఎక్కడి వాళ్ళక్కడ  ఎలర్ట్ అయ్యారు.  సీరియస్ గా ఫైళ్ళలో  తలను దూర్చారు.
                           *           *         *
    ఫెడ్రిక్ తన ఛాంబర్ లోకి వెళ్తూనే,  ప్యూన్ ని పిలిచి అవనిని పిలిపించాడు.
    అవని డిక్టేషన్  తీసుకోవడానికి వచ్చింది.
    అవని వంక చూశాడు ఫెడ్రిక్.
    సింపుల్ గా వున్నా  చాలా అందంగా కనిపించింది అతని కళ్ళకి.  పింక్ కలర్ శారీ,  మ్యాచింగ్ బ్లౌజ్,  చెవులకు చిన్న టాప్స్.  కొందరు అలంకరణ లేకపోయినా అందంగా వుంటారు.  అలాంటి కోవలోకి చెందినదే అవని.
    "కూచోండి అవనీ"  సీట్ ఆఫర్ చేశాడు.
    "చెప్పండి సార్"  అంది తనని డిక్టేషన్ కోసం పిలిచాడనుకొని.
    "మిస్.. అవనీ...  వన్ పర్సనల్ క్వశ్చన్........" అన్నాడు అవని వంక చూస్తూ.
    ఒక్క క్షణం తడబడింది. వెంటనే తేరుకొని "అడగండి సార్" అంది. లోలోపల భయంగానే వుంది. పర్సనల్  క్వశ్చన్ అంటే ఏమడుగుతాడు?
    "మీరింతవరకు ఎవరినైనా ప్రేమించారా?"  అడిగాడు ఫెడ్రిక్.
    ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది.
    ఒక్క క్షణం  మౌనం వహించింది.
    "చెప్పండి మిస్ అవని... మీరెవర్నైనా  ప్రేమించారా?"
    ఒక్క క్షణం బాస్ తననేం అడుగుతున్నాడో అర్ధం కాలేదు.  అర్ధమైన మరుక్షణం ఆమె మొహం వివర్ణమైంది.
    ఈ ప్రశ్న తననెందుకు అడుగుతున్నట్లు?  తనిప్పుడు ఏమని చెప్పాలి?
    ప్రేమించండం తన పర్సనల్ విషయం.  అలా అని బాస్ తో చెప్పడమా?
    "సారీ మిస్ అవని.. మిమ్మల్ని బాధపెట్టానా?  అఫ్ కోర్స్...ప్రేమించడమనేది మీ పర్సనల్ ఇష్యూ నేను ఈ ప్రశ్న అడిగేది మీ ప్యూచర్ ప్లాన్ గురించీ తెలుసుకుందామని"  అన్నాడు ఫెడ్రిక్.
    "లేదు సర్ "  చెప్పింది ఓ నిర్ణయానికి వచ్చిన అవని.
    దానికి రెండు కారణాలున్నాయి.
    మొదటి కారణం తన పర్సనల్ వ్యవహరం  మరో వ్యక్తికి తెలియజేయడం ఇష్టం లేక పోవడం.  మరో కారణం,
     తను ప్రేమిస్తున్నానని చెప్పడం వల్ల తన   ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది కలగవచ్చుననే అనుమానం కలగడం.
    "థేంక్యూ..థేంక్యూ మిస్ అవని...మీరిక వెళ్ళొచ్చు"  అన్నాడు ఫెడ్రిక్.
    తను ప్రేమించడంలేదని చెబితే బాస్ థేంక్స్ చెప్పడమెందుకో అర్ధం కాలేదు.
    వెనుతిరిగింది అవని. ఛాంబర్ డోర్ తీస్తుంటే "మిస్ అవనీ..." పిలిచాడు ఫెడ్రిక్.
    "యస్సార్"  అంది వెనుతిరిగి.
    "ఏమి లేదు..వెళ్ళండి"  అన్నాడు ఓ క్షణం ఆగి.
    అవని  వెళ్లిపోయింది.
                                 *           *            *
    లంచ్ అవర్ క్యాంటీన్ కు కూడా వెళ్ళలేదు అవని.
    వసుధ ఎంత రమ్మని బలవంతం చేసినా,  ఆకలిగా లేదని వెళ్ళలేదు.
    తలంతా భారంగా అనిపించింది.
    బాస్ మాటలు, ఫోన్  లో బెదిరింపు, అనిరుద్ర మీద ఎటాక్,  ఇవేమీ  తట్టుకోలేకపోతోంది అవని మనసు.
    తన మనసులోని బాధను ఎవరితో పంచుకోవాలి.
    సరిగ్గా అప్పుడే ఫోన్ రింగయింది.
    "హలో"అంది రిసీవర్ ఎత్తి.
    తెరలు తెరలుగా నవ్వు వినిపించింది.
    రిసీవర్ మీద అవని చేయి బిగుసుకుపోయింది.
    "ఎలా వున్నాడు  నీ  ప్రియుడు? జస్ట్ శాంపిల్ మాత్రమే అది.  ఏంటీ ఆలోచిస్తున్నావు. అన్నట్లు ఎలా చావాలనుకుంతున్నావు?  యాక్సిడెంట్ లోనా?  కత్తిపోటు తోనా?  రివాల్వర్?  ఛాయిస్ ఈజ్ యువర్స్... ఓ.కె.  బేబి" మళ్ళీ  నవ్వు.
    "ఎవర్నువ్వు?"  అడిగింది అవని అసహనంగా.
    మళ్ళీ  నవ్వు.  ఆ వెంటనే ఫోన్ డిస్ కనెక్ట్ చేసిన శబ్దం వినిపించింది.
    "షిట్ "  రిసీవర్ నీ కోపంగా పెట్టేసింది.  రెండు చేతులతో తల పట్టుకుంది అవని.
    నరాలు తెగిపోతాయేమోనన్నంత టెన్షన్ గా వుంది.
                     *              *             *
    రాత్రి పదయింది.
    డుంబు నిద్రపోతున్నాడు.  ఇంటిల్లిపాది ఎప్పుడో నిద్రలోకి జారుకున్నారు ఒక్క అవని తప్ప.
    సాయంత్రం ఆఫీసు వదలగానే,  సరాసరి ప్రశాంత్ థియేటర్ దగ్గరికి వెళ్ళింది.
    అప్పటికే అనిరుద్ర టికెట్లు తీసుకొని రెడిగా వున్నాడు.  అతనితో కలిసి సినిమా చూస్తున్నా,ఆ థ్రిల్ కలగలేదు.  అంతకు ముందు కాస్త ఎంజాయ్ చేసేది.
    ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్స్ తీసుకువస్తే నీళ్ళు తాగినట్టు తాగేసింది.  మధ్య మధ్యలో అనిరుద్ర మాట్లాడుతున్నా  పట్టించుకోలేదు.
     టెలిఫోన్ లో  ఆగంతకుని బెదిరింపు మీదే ఆమె ఆలోచన.
    ఎవరతను? ఏం చేయాలి?
    తననెవరైనా  కావాలని  ఆట పట్టిస్తున్నారా?   అదే నిజమైతే  అనిరుద్రని గాయపర్చాల్సిన  ఆవసరం లేదు.
    తనకు  తెలిసి  తనెవర్నీ బాధ పెట్టలేదు.  అనిరుద్రకు చెబితే అతను మరింత కంగారుపడే అవకాశం వుంది.
    ఈ సమస్య కు   పరిష్కారం ఏంటి?  పోనీ వసుధకు చెబితే?
    ఆలోచించగా...ఆలోచించగా అదే బెటరనిపించింది.   వసుధ ఇలాంటి విషయాల్లో సలహా కూడా ఇవ్వగలదు.  పైగా తనతోపాటు ఆఫీసులో పన్జేసే వ్యక్తి.
    వసుధకు చెప్పడంవల్ల తన మనసులోని  బరువు కాస్తయినా తగ్గుతుంది.
    ఆ ఆలోచన రావడంతో తృప్తి గా నిద్రపోయింది.  పడుకునే ముందు రిసీవర్ ని పక్కన పెట్టడం మరిచిపోలేదు.
                     *            *           *
    నాలుగ్గంటలకే  అలారం మ్రోగింది.
    కళ్ళు తెరిచింది అవని.   తనే నాలుగ్గంటలకు అలారం పెట్టింది.  మెల్లగా శబ్దం  కాకుండా హాలులోకి వెళ్ళి రిసీవర్ ని   యథావిధిగా పెట్టింది.
    తిరిగి తన గదిలోనికి వచ్చి బ్లాంకెట్ కప్పకుంది.  'హమ్మయ్య'  అనుకుంది ఆ పన్జేశాక.
    తమ్ముడివైపు  చూసింది.  నిద్రపోతున్నాడు.  అతని ప్రక్కనే 'అదిగో హంతకుడు'   డిటెక్టివ్ నవల వుంది.
    ఇదివరకు వాటిని చదిని  నవ్వుకునేది.  ఇప్పుడా నవ్వు స్ధానంలో భయమేస్తోంది.

                        *            *             *
    త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ హడావుడిగా వుంది.
    కానిస్టేబుల్స్,  హెడ్ కానిస్టేబుల్స్ అటు ఇటు తిరుగుతున్నారు.   యస్సయ్  శివప్రసాద్ ఠంచన్  గా స్టేషన్ కు వచ్చాడు.
    ఆ రోజే కొత్త సి.ఐ.  స్టేషన్ కు వస్తున్నాడు.  రాష్ట్రమంతగా తిరిగి తిరిగి చివరికి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నాడు  బెనర్జీ.
     ముప్పైయి అయిదేళ్ళ బెనర్జీ విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్.  డ్యూటీ విషయంలో ఎవర్నీ లెక్కలేయకపోవడం వల్ల,  లెక్కకు మించి ట్రాన్స్ ఫర్లు అయ్యాడని అతని గురించి  తెలిసిన వాళ్ళు చెబుతారు.
    అతనే స్టేషన్ లో వుంటే   ఆ స్టేషన్  పరిధిలో  ఖచ్చితంగా నేరాల సంఖ్య తగ్గుతాయని ప్రచారం.  అందులో నిజం కూడా లేకపోలేదు.
    ఉదయం పది అవుతుండగా  జీపు పోలీస్ స్టేషన్ ముందాగింది.
    ఇన్ స్పెక్టర్  బెనర్జీ జీపు  దుగాడు.
    అందరూ అటెన్షన్ లో  నిలబడి సెల్యూట్  చేశారు.  బెనర్జీ తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు.  అయిదు నిమిషాల్లో ఫైల్స్  అతని టేబుల్ ముందున్నాయి.
    ఎన్ని నేరాలు జరిగాయి.  పెండింగ్ కేసులెన్ని,  స్నాచింగ్ కేసులేన్ని?   ఇలాంటి డిటెయిల్స్ చూసున్నారు.
    యస్సయ్  శివప్రసాద్ ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాడు.
                            *           *          *
    "అక్కా... నన్ను స్కూల్  దగ్గర డ్రాప్ చేసి వెళ్ళవా? "   అడిగాడు డుంబు.                                                      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS