Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 4


                                              ఈ శిక్ష చాలు

    "హలో, సుజాతా బావున్నావా?" బట్టల దుకాణంలో చీరలు చూస్తున్న సుజాత భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా పలకరించింది డాక్టర్ అన్నపూర్ణ.
    "హలో, మీరా! ఏమిటి, మీరు ఊళ్ళో లేరా ఈ మధ్య రెండు మూడుసార్లు ఫోన్ చేస్తే లేరన్నారు." సుజాత మర్యాదగా అంది.
    "ఆఁ. అవును. మూడునెలల సూపర్ స్పెషాలిటీ కోర్సు కోసం లండన్ వెళ్ళాను."
    "అదా. అందుకే మీరు లేరు అన్నారు మీ క్లినిక్ కు ఫోన్ చేస్తే".
    "ఏమిటి, ఎనీ ప్రాబ్లమ్?" డాక్టర్, సుజాత వంక సూటిగా చూస్తూ అడిగింది.
    "ఓసారి మీ దగ్గరకి రావాలని... మాట్లాడాలని."
    "సరే, రేపు క్లినిక్కు రా. పన్నెండు తర్వాత రా. కాస్త ఖాళీ ఉంటుంది అప్పుడు. లేదంటే ఆదివారం సాయంత్రం ఇంటికి రా."
    "వద్దులెండి. మీకు దొరికేదే ఒక పూట. మీవారు, పిల్లలు ఇంట్లో అంతా సరదాగా ఉండే రోజు ఒక్కపూట, రేపు పన్నెండుకి క్లినిక్ కు వస్తాను."
    "ఓ.కే. బై.. సీ యూ టుమారో." డాక్టర్ అన్నపూర్ణ చెయ్యి ఊపి వెళ్ళిపోయింది.

                                                      *  *  *

    అన్నపూర్ణ మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ బోర్డు మీద డాక్టర్ అన్నపూర్ణ రకరకాల ఇండియన్, ఫారిన్ డిగ్రీలు, ఫెర్టిలిటీ సబ్జెక్టులో చేసిన స్పెషలైజేషన్స్ డిగ్రీలు. ఆ నర్సింగ్ హోమ్ లో బయట, లోపల ఉన్న పేషెంట్స్ ని చూస్తే ఆవిడ క్షణం తీరిక లేని డాక్టర్ అని అందరికీ తెలుస్తుంది.    
    ఔట్ పేషెంట్ల హడావిడి కాస్త తగ్గి, రిలాక్స్ డ్ గా బోర్నవిటా తాగే సమయం అది. సుజాతని చూసి "రా. రా కూర్చో. ఏమిటో మాట్లాడాలన్నావు. ఏమిటి ప్రాబ్లమ్? ఎనీథింగ్ రాంగ్" అంది అన్నపూర్ణ ఆప్యాయంగా.
    డాక్టర్ అన్నపూర్ణ, సుజాత అక్క డాక్టర్ రమ చిన్నప్పటినుంచి మెడిసిన్ వరకు వైజాగ్ లో చదివిన క్లాస్ మేట్స్. రూమ్ మేట్స్. సుజాత తన ఫ్రెండు చెల్లెలు అన్న అభిమానంతో చనువుగా మాట్లాడుతుంది అన్నపూర్ణ.
    "ఏం లేదు. కిందటిసారి మీ దగ్గర చెకప్ చేయించుకున్నాక, ఆయనని మూడునెలలు వాడమని మందులు రాశారుట కదా. మందులు వాడినా నో రిజల్ట్. మరోసారి టెస్ట్ చేసి పొజిషన్ ఇంప్రూవ్ అయిందేమో చూస్తారా?" సుజాత కాస్త ఆశగా చూస్తూ అడిగింది.
    డాక్టర్ అన్నపూర్ణ అర్ధం కానట్లు మొహం పెట్టింది. "ఏదో మందులు వాడితే నష్టం లేదు. పోనీ, ట్రై చేద్దాం అనుకున్నాను కానీ, లాభంలేదు సుజాతా ఏదో కాస్త తక్కువ కౌంట్ ఉంటే మందులు హెల్ప్ చేస్తాయిగాని, అంత తక్కువ కౌంట్ ఉంటే మందులు వాడినా ప్రయోజనం లేదు, ఏదో మిరాకిల్ గా జరిగితే తప్ప".
    ఈసారి సుజాత ఆశ్చర్యంగా చూసింది. "అంటే, ఏభై అయిదు మిలియన్ల కౌంట్ కూడా తక్కువ కిందే వస్తుందా? ఎక్కడో చదివాను. 30, 35 మిలియన్లు చాలు ప్రెగ్నెన్సీ రావడానికి అని, మొటిలిటీ తక్కువుందా?" సుజాత అనుమానంగా అడిగింది. మరోసారి ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణ.
    "ఏభై అయిదు మిలియన్లా? అంత ఉంటే ప్రాబ్లమ్ ఏమిటి? ఫిఫ్టీ ఫైవ్ కౌంట్ ఉందని ఎవరన్నారు?"
    "ఆయన రిపోర్టులో - మీరిచ్చిన రిపోర్టు చూపించారు. ఫిఫ్టీఫైవ్ మిలియన్ కౌంట్ రాసి ఉంది. మొటిలిటీ కూడా సరిగా గుర్తులేదు. కానీ, బాగానే ఉందన్నారు. అన్నీ సరిగానే ఉన్నాయి. ఇంక భగవంతుడిదే భారం అన్నారు."
    "ఐ డోంట్ అండర్ స్టాండ్ వాట్ యూ ఆర్ టాకింగ్, నేనిచ్చిన రిపోర్టులో 10 మిలియన్లు స్పెర్మ్ కౌంట్, 10శాతం మొటిలిటీ అని ఉంటే, ఏభై అయిదు అంటావేమిటి? అంత కౌంట్ ఉంటే అసలు ప్రాబ్లమ్ ఏం లేనట్టే గదా. నువ్వు అసలు సరిగా ఆ రిపోర్టు చూశావా? మా క్లినిక్ దేనా, ఇంకేదన్నానా? ఏది ఆ రిపోర్టు తీసుకురా రేపు చూద్దాం నాకు బాగా గుర్తుంది. రమ ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పిందని ఒకటికి రెండుసార్లు అన్ని టెస్టులూ స్వయంగా చేశాను. సారీ సుజాతా. ఏదో ఎక్కడో పొరపాటు పడ్డట్టున్నావు. ఎనీహౌ, ఆ రిపోర్టు మరోసారి చూద్దాం తీసుకురా. మీవారు రిపోర్టు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయనతో స్పష్టంగా అన్ని వివరాలు చెప్పాను. నీకు ఆయన చెప్పలేదా? పిల్లలు పుట్టే అవకాశాలు ఆల్ మోస్ట్ నిల్ అని చెప్పాను. నీలో ఏ లోపం లేదు. మీ ఆయనలోనే లోపం అన్నది స్పష్టంగా చెప్పాను. సరే, మరీ నిరాశ పరచడం ఎందుకని ఈ మందులు మూడు నెలలు వాడండి, తరువాత మరోసారి సెమన్ టెస్ట్ చేద్దాం అని చెప్పాను. మూడు నెలల తరువాత ఆయన మళ్ళీ రాలేదు. ఈలోగా నేను ఇంగ్లండ్ వెళ్ళాను."
    సుజాత మొహం పాలిపోయింది డాక్టర్ చెప్పింది విని. 'ఎంత మోసం! ఎంత అబద్ధం! అంతా సరిగా ఉందని రిపోర్టు చూపించితే నమ్మింది తాను. అన్నీ సరిగా ఉన్నా, భార్యాభర్తలు ఇద్దరిలో లోపం లేకపోయినా, ఒక్కోసారి గర్భం రాదు. దానికి కారణం మెడికల్ హిస్టరీలో కనుగొనబడలేదు. బహుశా భగవంతుడి దయ అంటే ఇదేనేమో అని డాక్టర్ అన్నట్లు చెపితే అందుకే మళ్ళీ తాను డాక్టరుని అడగలేదు. ఏదో మాత్రలు వేసుకుంటుంటే, ఏమో దేవుడి దయవల్ల గర్భం వస్తుందేమో అనుకుంది. ఆ విషయం భగవంతుడిమీదే భారం వేసి వదిలేసింది. అన్నపూర్ణని నిన్న చూడకపోతే మళ్ళీ ఈ ప్రసక్తి వచ్చేదికాదు. ఊరకే మరోసారి అడుగుదామన్నట్లు తాను అడిగింది. ఎంత దగా, ఎంత మోసం! తనను నమ్మించి ఫూల్ ని చేశాడు. లోపం తనలో ఉంచుకుని ఇలా అబద్ధం చెప్తాడా' సుజాతలో అవమానం, కోపం, కసి పెల్లుబికాయి.
    మాడిపోయిన సుజాత మొహం చూసి, "సారీ సుజాతా, మీవారు నీకు అంతా చెప్పి ఉంటారనుకున్నాను. లేకపోతే నీకే డైరెక్టుగా ఫోన్ చేసి చెప్పేదాన్ని. మీ అక్కకి కూడా మీరు ఎలాగూ చెప్తారని నేను ఫోన్ కూడా చెయ్యలేదు." డాక్టర్ నొచ్చుకుంటూ అంది.
    "మా అక్కకి నేను కూడా అంతా సరిగా ఉందన్నారు అంటూ రిపోర్టులు గురించి రాశాను. తానూ భగవంతుడి దయ అనుకో అని రాసింది కూడా. ఈయన ఇంత అబద్ధం ఆడతారని నేననుకోలేదు" విషణ్ణవదనంతో అంది.
    "సారీ, ఆయన ఇలా చేస్తారని నేనూహించలేదు".
    "ఉండండి. నాకెందుకు ఇలా అబద్ధం చెప్పారో, ఇంత మోసం ఎందుకు చేశారో వెళ్ళి నిలదీస్తాను." సుజాత కోపంగా అంది.
    "ఉండు. తొందరపడకు. ముందు నన్ను ఆ రిపోర్టులు మళ్ళీ ఒకసారి చూడనీ, రేపు పట్టుకురా, అవి మా క్లినిక్ వా, ఇంకెక్కడన్నా చేయించారా అన్న ఆరా తీయకుండా తొందరపడకు. రేపు అవి చూశాక మాట్లాడవచ్చు." అన్నపూర్ణ నచ్చచెప్పింది.
    "ఆయనకెంత ధైర్యం! మీరు నాకు తెల్సినవారు. మిమ్మల్ని మళ్ళీ అడుగుతానేమోనన్న భయం కూడా లేకుండా ఇంత అబద్ధం చెప్పారు."
    "బహుశా, రిపోర్ట్ చూసి నీవు నమ్మి సమాధానపడి పోతావని అనుకుని ఉంటారు. ఆయనతో ముందే గొడవపడకు. రేపు రిపోర్టు తీసుకురా" సుజాత భుజం తట్టింది ఓదార్పుగా డాక్టర్ అన్నపూర్ణ.

                                                      *  *  *


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS