Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 37

 

    "ఇదా కధా! బావుంది" డాక్టర్ ఆనందరావు అదోలా చూస్తూ అన్నాడు.
    "డాక్టర్ గారూ! నా మాట నమ్మండి. నేను ప్రేమించిన మాధవి పిచ్చిదని నిరూపించాలని డాక్టర్ మూర్తి ప్రయత్నం చేస్తున్నాడు."
    "నీ ప్రియురాలి పిచ్చికీ, మీ అమ్మ కాన్సర్ రోగానికీ ఉన్న సంబంధం ఏమిటి?" డాక్టర్ ఆనందరావు చిరాకు పడ్డాడు.
    "ఆ పిల్లకు పిచ్చనీ, ,మా అమ్మకు కాన్సర్ అనీ ఆమె ఇహ ఎక్కువ రోజులు బ్రతకదనీ నన్ను నమ్మించి మా అమ్మ పోయే లోపున సుజాతతో నా పెళ్ళి జరిపించాలని వాళ్ళ ప్రయత్నం. మా అమ్మగారి చివరి కోరిక - అంటే ఆమె బ్రతికుండగానే నేను పెళ్ళి చేసుకోవాలనేది. తీర్చాలని నా మీద వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు.
    "వాళ్ళు అంటున్నావ్ - మీ నాన్న కూడానా?"
    "మా నాన్నకు డాక్టర్ మూర్తి చేస్తున్న మోసం తెలియదు."
    "పోనీ చెప్పకపోయావా?"
    "చెప్పాను, కానీ ప్రయోజనం లేకపోయింది."
    "అంటే మీ నాన్నా, డాక్టర్ మూర్తి కలిసే చేస్తున్నారని తేలిపోవడం లా?" డాక్టర్ ఆనందరావు తర్కం తీశాడు. సాగర్ పునరాలోచనలో పడ్డాడు! డాక్టర్ ఆనందరావు చెప్పినదానిలో కొంత నిజం ఉండకపోదు. డాక్టరు మూర్తికి, తన తండ్రికి మధ్య యేవో విడదీయరాని సంబంధాలు వుండే వుండాలి! లేకపోతే తండ్రి ఇలా డాక్టర్ మూర్తి చేతుల్లో కీలుబొమ్మగా ఉండాల్సిన అవసరం ఏమిటి?"
    "సాగర్! ఇంతకీ నువ్వు బొంబాయి కెళ్ళి చేయదలచిన దేమిటి?"
    "డాక్టర్ మూర్తి మోసాన్ని బయట పెట్టడం!"
    "నీ ఆలోచనఏమిటో నా కర్ధం కావడం లేదు." డాక్టర్ ఆనందరావు అన్నాడు.
    "మీరు నాకో సహాయం చేయాలి. చీఫ్ పాధాలిస్టుకు ఇన్ ట్రడక్టరీ లెటర్ ఇవ్వండి."
    "ఇస్తాను, ఇస్తే?"
    అది పట్టుకొని బొంబాయి వెళ్తాను."
    "వెళ్తావు లేవయ్యా! వెళ్లేం చేస్తావని ?" డాక్టర్ చిరాకు పడ్డాడు. చూసున్న కొద్దీ సాగర్ మానసిన స్థితి మీద డాక్టర్ ఆనందరావు కున్న అనుమానాలు బలపడసాగాయి.
    "ఈసారి  డాక్టర్ మూర్తి ఎత్తుగడలు సాగకుండా చూస్తాను."
    "నిజం చెప్పాలంటే నువ్వు మాట్లాడేది నాకు బోధ పడటం లేదబ్బాయ్!" ఎందుకయినా మంచిది సాగర్ ను ఓసారి సైక్రియాటిస్ట్ కు చూపించడం మంచిది. ఆ మాటే సాంబశివరావు కు డాక్టర్ మూర్తికి చెప్పడం అవసరం అన్న  ఆలోచన రాగానే డాక్టర్ ఆనందరావు అప్రయత్నంగానే టెలిఫోన్ రిసీవర్ అందుకొన్నాడు.
    "ఫోన్ చేసి చెప్తారా?"
    "అవును!' కళ్ళు చిట్లించి నొసలు ముడిచి చూశాడు ఆనందరావు.
    ఆనందరావు డయల్ చేశాడు.
    "హల్లో! డాక్టర్ మూర్తి గారు లేరా?"
    "లేరు. ఇప్పుడే బయటికి వెళ్ళారు." ఫోన్ లో అవతలి గొంతు పలికింది.
    "ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడొస్తారో తెలుసా?" డాక్టర్ ఆనందరావు అడిగాడు.
    'డాక్టర్ ఆనందరావుగారింటికి వెళతానన్నారు సార్! ఎవరూ మాట్లాడేది?"
    "నేను డాక్టర్ అనందరావుని"
    "మీ యింటికే బయలు దేరారు సార్!"
    "మా యింటికా?" డాక్టర్ ఆనందరావు ఆశ్చర్యంగా అన్నాడు రిసీవర్ పెట్టేశాడు.
    ఇప్పుడే ఆనందరావు డాక్టర్ మూర్తికి ఎందుకు ఫోన్ చేసినట్టూ? మూర్తి అనందరావును కూడా పట్టేశాడా? ఆనందరావు అలాంటివాడు కాదు. సాగర్ ఆలోచన తెగక ముందే డాక్టర్ మూర్తి "నమస్కారం! ఆనందరావు గారూ!" అంటూ లోపలి కొచ్చాడు.
    "హల్లో సాగర్! నువ్వు ఇక్కడే వున్నావా? వెరీ గుడ్! మనందరికీ చాలా హాపీ న్యూస్ . మీ అమ్మగారికి కాన్సర్ కాదని తేలిపోయింది. డాక్టర్ మూర్తి ఆనందరావును చూసి "మీకు నేనెంతో రుణపడి ఉన్నాను. ఆప్త మిత్రుడు భార్య ఆరోగ్య విషయంలో నేను తప్పటడుగు వేశాను?" అన్నాడు.
    "బయాప్సీ రిపోర్ట్స్ అప్పుడే వచ్చాయా?" ఆనందరావు అడిగాడు.
    "ఇంతకూ ముందే ఫోన్ చేసి మాట్లాడాను. బోంబే మద్రాసు ఫేదాలజీ లాబ్ చీఫ్ డాక్టర్లు నెగటివ్ రిపోర్టు ఇచ్చారు. ఐయామ్ వెరీ గ్లాడ్! లెటజ్ సెలబ్రేట్ ది అకేషన్"
    "ఐ.సి. అయితే సాగర్ ఇప్పుడిస్తున్న మందులే కంటిన్యు చేయండి. నాలుగు వారాల్లో షి విల్ బి అల్ రైట్ !" అన్నాడు ఆనందరావు.
    "డాక్టర్ గారూ లేవండి. సాగర్ నువ్వు కూడా, మీ నాన్నగారూ కూడా వస్తున్నారు. క్లబ్ లో ఏర్పాటు చేశాను!" డాక్టర్ మూర్తి వాళ్ళను తొందర పెట్టాడు.


                                                            18

    "ఆనందరావు గారూ! చూశారా బాబాగారి మహత్యం!' డాక్టర్ మూర్తి విస్కీ గ్లాస్ ఎత్తి అన్నాడు.
    "టు ది హెల్త్ ఆఫ్ మిసెస్ సాంబశివరావ్ !" టోస్ట్ ప్రపోజ్ చేశాడు ఆనందరావు . సాంబశివరావు గ్లాసు ఎత్తి పట్టుకొని మూర్తి గ్లాసుకు అనించాడు.
    "సాంబశివరావ్ ఇప్పుడే మంటారు? బాబాగారి మహిమను ఒప్పుకుంటారా? సుభద్రమ్మ గారు పుణ్యాత్మురాలు. బాబాగారి అనుగ్రహం పొందగలిగారు. స్వయంగా వారే మీ యింటికి వచ్చి ఆమెను ఆశీర్వదించారు. కరుణామయులు బాబా గారికి అతీతమయింది లేదు." విస్కీ సిప్ చేసి గ్లాసు కింద పెట్టాడు మూర్తి.
    సాగర్ కోకో కోలా తాగుతూ మూర్తి కేసి కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. తండ్రి సమక్షంలో అలా కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉన్నది.
    "బాబాగారు సాక్షాత్తు భగవత్ స్వరూపులు! వారు మీ శ్రీమతి గారిని ఆశీర్వదించక బొంబాయి పెధాలజిస్ట్ కు ఫోన్ చేశాను. వారి ప్రభావం! కాన్సర్ కాదని బయాప్సీ రిపోర్టు వచ్చేసింది!"
    "బాబాగారి మహిమ మీద నమ్మకం లేక బొంబాయి వెంటనే ఫోన్ చేశారా మీరు?" డాక్టర్ ఆనందరావు సందేహాన్ని వెలిబుచ్చాడు.
    "అపచారం! అపచారం! బాబాగారి మీద నమ్మకం లేక కాదు, బాబాగారి మహిమను మీ అందరికి ఋజువు చేయాలని చేశాను."
    "ఇందులో బాబాగారి మహత్యం ఏమీ లేదు. డాక్టర్ ఆనందరావు గారు ముందే చెప్పారు!' సాగర్ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS