అతని చివరి శ్వాస బలహీనంగా వుంది.
ఓ విశ్వ వినాశనానికి చెందిన రహస్యం చెప్పడానికి నోరు విప్పాడు.
24
"పీటర్సన్...మిస్టర్ పీటర్సన్...వాట్ హేపెండ్?" కంగారుగా పీటర్సన్ ని కుదిపి అడుగుతున్నాడు డేనియల్.
పీటర్సన్ మెల్లగా కళ్ళు విప్పాడు.
"అయిపోయింది మిస్టర్ డేనియల్...అంతా అయిపోయింది. కొద్ది సెకన్ల తేడాతో మనం ఓడిపోయాం...బిత్రోచి తిరిగి అసంతృప్తుడైపోయాడు..."
ఒక్క క్షణం షాక్ తిన్నట్టు చూస్తుండిపోయాడు డేనియల్.
"యస్ మిస్టర్ డేనియల్...ఆ సుసిరియో ఆత్మ బిత్రోచిని బయటకు రాకుండా దిగ్భంధనం చేసింది. తిరిగి గెస్ట్ హౌస్ తలుపులు మూసింది. అసంతృప్తితో బిత్రోచి మళ్ళీ నిద్రలోకి జారుకుంది."
"ఇప్పుడు...ఇప్పుడేం చెయ్యాలి..పద...ఏదైనా హాస్పటల్ కు..."
"ష్...ఎక్కడికీ వద్దు...నేను చనిపోవడం తథ్యం...నా ఏకాగ్రతను భగ్నం చేసి మంత్ర దండంతో నా శక్తులను నిర్వీర్యం చేసి నన్ను ఓ స్త్రీ వలన చనిపోయేలా దొంగ దెబ్బ తీసాడు ఆ రాబర్ట్...బట్ వన్ థింగ్ నేను...నేను తిరిగి బ్రతుకుతాను..." అతి కష్టమ్మీద చెప్పసాగేడు పీటర్సన్.
"నిజమా...కానీ...అది అదెలా సాధ్యం?"
"ఎలా సాధ్యమంటే పదమూడు సంవత్సరాలు తర్వాత తిరిగి బిత్రోచి నిద్రలేస్తుంది కాబట్టి..."
ఒక్క క్షణం డేనియల్ శరీరం గగుర్పొడిచింది.
"ఇది నిజమా?"
"అవును...సైతాన్ కు ప్రీతి పాత్రమైన సంఖ్య పదమూడు ఆశుభానికి సంకేతం. పదమూడు...సరిగ్గా పదమూడు సంవత్సరాల తర్వాత బిత్రోచి నిద్రలేస్తుంది...అది...అదీ నచికేత వల్లనే...అవును...ఎవరి వలన సమర్పణ అర్ధాంతరంగా ఆగిపోయిందో, ఎవరి బలి లభించనందువల్ల బిత్రోచి అసంత్రుప్తుడైపోయేడో...అతనికి...
ఎవరివల్ల బిత్రోచికి ప్రీతిపాత్రమైన నేను నా సర్వశక్తులు కోల్పోయి మృత్యువుకు చేరువయ్యానో ఆ స్త్రీకి పుట్టిన బిడ్డను తిరిగి పదమూడేళ్ల తర్వాత బిత్రోచికి సమర్పిస్తే...బిత్రోచి సంపూర్ణ సంత్రుప్తుడై విశ్వ వినాశనానికి తిరిగి లేస్తాడు.
ఆ క్షణమే నేను పునర్జీవుడ్ని అవుతాను. అప్పటివరకూ నా మృతదేహాన్ని కాపాడే బాధ్యత నీదే. రా...దగ్గరకు రా...బిత్రోచి ఆరాధన తంతు చెబుతాను..." అంటూ డేనియల్ ను దగ్గరకు పిలిచాడు.
పీటర్సన్ పెదవులు కదులుతూనే...ఒకేసారి ఆగిపోయాయి. అతని తలపక్కకు వాలిపోయింది.
డేనియల్ కళ్ళు ఎరుపెక్కాయి...
ప్రతీకార జ్వాలతో రగిలిపోయేయి.
ఓ నిర్ణయానికి వచ్చి పీటర్సన్ మృతదేహాన్ని భుజమ్మీద వేసుకుని చిత్రావతి అడవిగుండా బిత్రోచి గెస్ట్ హౌస్ వైపు నడక సాగించేడు.
* * *
"థాంక్యూ మిస్టర్ రాబర్ట్...మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేము...మీవల్లనే మేము ప్రమాదం నుంచి బయటపడ్డాం. మీ చొరవతోనే నేనూ, తరళ ఒక్కటయ్యాం..." చెప్పాడు మనస్పూర్తిగా నచికేత.
అప్పటికే చిత్రావతి అడవి నుంచివాళ్లు సిటీకి వచ్చి నలభై ఎనిమిది గంటలైంది.
తరళను పెళ్లి చేసుకోవాల్సిందిగా నచికేతను కోరాడు రాబర్ట్. తరళకు తను చేయగల ఉపకారం అదొక్కటే. వెనకా, ముందూ ఎవరూ లేని తరళ జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని అతని కోరిక. పెళ్లి జరిపించితే తనకో తృప్తి అనుకున్నాడు. అందుకే పర్సనల్ ఇంట్రెస్టు తీసుకొని అడిగి చూశాడు.
ఇద్దరికీ ఏ అభ్యంతరమూ కనపడలేదు వద్దనడానికి.
ఆ రోజే సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకున్నారు అందరి సమక్షంలో.
రాబర్ట్, పరమహంస, నచికేత మిత్రులే ఆత్మీయ అతిథులు, ఆహ్వానితులూ అయ్యేరు ఆ పెళ్లికి.
"నేను వచ్చిన పని మునిగిపోయింది మిస్టర్ నచికేతా...అందుకే తరళని భార్యగా నీ చేతుల్లో పెట్టాను. తరళ ఇప్పుడు నీ పార్టనర్. హేపీగా ఉంటుందన్న నమ్మకం నాకు వుంది. నాకు ఇక ఏ దిక్కూ లేదు. ఎట్ ది సేమ్ టైం సుసిరియోను చంపిన ఆ పీటర్సన్ ని చంపి ఓ ప్రళయాన్ని నివారించానన్న ఆనందం చాలు.
ఐ లవ్ ఇండియా...యస్ మైడియర్ ఫ్రెండ్స్...మీ దేశాన్ని, మీ ప్రేమను, మీ ఆతిథ్యాన్ని తప్పక గుర్తుంచుకుంటాను.
ఎల్లుండే నా సింగపూర్ ప్రయాణం...ఎప్పుడైనా ఈ రాబర్ట్ అనే మనిషి గుర్తు వస్తే ఓ ఫోన్ కాల్ చేసి పలుకరించండి..." రెండు చేతులూ జోడించాడు. అందరి కళ్లూ చెమర్చాయి.
* * *
ఉపసంహారం
ఆ రోజే రాబర్ట్ సింగపూర్ వెళ్లిపోయాడు. పరమహంస మళ్ళీ తన పరిశోధనల్లో మునిగిపోయాడు. అతనికి అసిస్టెంట్ గా ప్రభు ఇంకా కంటిన్యూ అవుతూనే వున్నాడు.
సూరజ్, సూర్యనారాయణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేశారు నచికేత ప్రోద్బలంతో.
విలియమ్స్ ఓ రెస్టారెంట్ లో సూపర్ వైజర్ గా జాయిన్ అయ్యాడు.
నచికేత, తరళ దంపతులు హనీమూన్ కు మున్నార్ వెళ్లారు.
* * *
సరిగ్గా పది నెలలు తర్వాత...
ఓ నర్సింగ్ హోమ్...
మెటర్నిటీ వార్డులో రూమ్ నెంబర్ డబుల్ సిక్స్ సందడిగా వుంది.
తరళ తన పక్కన ముడుచుకుని పడుకున్న బిడ్డని చూసి మురిసిపోతోంది.,
"మాస్టర్ నచికేత ముద్దొస్తున్నాడు కదూ..." అన్నాడు ప్రభు.
సూరజ్, సూర్యనారాయణ, విలియమ్స్ బాబును చూస్తూ మురిసిపోతున్నారు.
పరమహంస అయితే "ఇక నేను నా పరిశోధనలు ఆపేసి...మనవడితో ఆడుకుంటాను..." అంటూ తెగ సంబరపడిపోతున్నాడు.
ఈ దృశ్యం చూసి కన్నీటితో మెరిసిపోయింది తరళ,
ఎక్కడో సింగపూర్ లో కొన్నేళ్ళు వుండి, తండ్రి మరణంతో ఒంటరి అయి తిరిగి తనదైన ఈ ప్రపంచంలో తనూ, తన భర్త, తన బిడ్డ, స్వంత అన్నయ్యల్లా చూసుకునే భర్త స్నేహితులూ...
తన తండ్రే తన బిడ్డగా పుట్టాడేమోనన్న ఫీలింగ్ తరళకు.
రాబర్ట్ సింగపూర్ నుంచి గ్రీటింగ్స్ పంపాడు.
* * *
అర్దరాత్రి...
పన్నెండు గంటలు...
నచికేత కుర్చీలో తల వెనక్కి వాల్చి నిద్రపోతున్నాడు.
తరళ మంచి నిద్రలో వుంది పక్కనే ఉన్న ఊయల్లో వాళ్ల బిడ్డ.సరిగ్గా అదే సమయంలో...
ఓ వ్యక్తి కంబళి కప్పుకుని ఆ హాస్పిటల్ ఆవరణలోకి వచ్చాడు.
వాచ్ మెన్ అతడ్ని గమనించి ఆపబోయాడు. కంబళి మొహం మీదనుంచి తొలగించి తీక్షణంగా చూసాడతను.
వాచ్ మెన్ భయంతో వణికిపోయాడు.
అతని కళ్ళు పూర్తిగా రక్తవర్ణంలో వున్నాయి. అతను హాస్పటల్ ఆవరణ దాటి వార్డులోకి ప్రవేశించినా, ఎవరూ అతడ్ని అడ్డగించడం లేదు. రూమ్ నెంబర్ సిక్స్ టీ సిక్స్ ముందు ఆగాడు. తలుపులు వాటంతట అవే మెల్లగా ఎవరో తెరిచినట్టు తెరుచుకున్నాయి.
రూమ్ లోకి వచ్చాడు.
నచికేత, తరళ నిద్రపోతున్నారు. బాబు నిద్రలోనే ఏడుస్తున్నాడు ఏదో ప్రమాదాన్ని పసిగట్టినట్టు...
ఆ అపరిచిత వ్యక్తి తీక్షణంగా ఆ బిడ్డవైపు చూసాడు. ఏడవటం ఆపేశాడు బాబు.
కంబళిలో నుంచి చేయి బయటకు తీసాడు. అతని చేతిలో ఎరుపురంగు దారం.
ఆ దారాన్ని బిడ్డ చేతికి కట్టి వెనుతిరిగాడు. వికృతంగా నవ్వుకుంటూ ఆ వ్యక్తి డేనియల్.
* * *
చిత్రావతి అడవి
బిత్రోచి గెస్ట్ హౌస్...
ఆ గెస్ట్ హౌస్ ను ఆనుకుని ఉన్న ఓ గుడిసెలోకి నడిచాడు డేనియల్. అక్కడో శవ పేటిక వుంది. దాన్ని ఓపెన్ చేసాడు. లోపల రసాయనాలతో పీటర్సన్ శవం భద్రపరచి వుంది.
"నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఫ్రెండ్..." అంటూ తన బొటనవేలిని శవపేటిక చివర వున్న సూదిలాంటి సాధనంలో గుచ్చాడు. రక్తం చివ్వున చిమ్మింది...ఆ రక్తం ధారలు...ధారలుగా...పీటర్సన్ నోట్లో పడుతుంది...
సరిగ్గా..పదమూడేళ్ల తర్వాత బిత్రోచిని నిద్రలేపే తంతు ప్రారంభమవుతుంది.
బిత్రోచి నిద్ర లేస్తుందా?
గెస్ట్ హౌస్ తలుపులు మళ్ళీ తెరుచుకుంటాయా? అన్నది ప్రస్తుతం మిస్టరీయే...
- NO END -
