"డాక్టర్! ఇంకా ----ఈ స్థితిలో కూడా సాగర్ కు సుజాతను ఇవ్వాలను కొంటున్నారా? నువ్వు నిజంగా ....." సాంబశివరావు కంఠం వణికింది.
"దేముడ్ని కాదు! మాములు మానవ మాత్రుడ్ని మమతలు మమకారాలు ఉన్న మనిషినే. సాగర్ నా అల్లుడు కావడం నా అదృష్టం గా భావిస్తాను. ఏమైనా వాడి భవిష్యత్తు దెబ్బతినకుండా చూడటమే మన బాధ్యత. మాధవి మాములు పిల్లయితే నేనింత బాధపడాల్సిన పనిలేదు. వాడిష్టమైన దాన్ని చేసుకుని సుఖంగా వుంటే నాకు అంతకంటే కావాల్సిందేమో లేదు. బంధుత్వం కలవకపోయినా మన స్నేహం స్నేహంగానే ఉండిపోయేది. నేను ముందే చెప్పానుగా సాగర్ అంటే నాకెంతో అభిమానమని - అందుకే వాడు ప్రేమించిన మాధవి గురించి నేనూ శ్రద్ధ తీసుకున్నాను. సైక్రియాట్రిస్ట్ చంద్ర శేఖరం గారితో మాట్లాడేను. సాగర్ మాధవిని తీసుకొని ప్రొఫెసర్ చంద్రశేఖరం దగ్గరకు వెళ్ళింది కూడా నీతో చెప్పలేదు. ప్రొఫెసర్ చంద్రశేఖరం దగ్గరకు వెళ్ళింది కూడా నీతో చెప్పలేదు. ప్రొఫెసర్ చంద్ర శేఖరం అభిప్ర్తాయాం విన్న తరువాతనే నీతో చెప్పాను. మాధవిని గురించి జడ్జి రామనాధం గారికి బాధపడటం ఎటు తప్పదు మోస్ట్ అన్ ఫార్చునెట్ మాన్! దానికి మనం చేయగలిగిందేమీ లేదు. కాని చేతులారా సాగర్ తన జీవితాన్ని సర్వనాశనం చేసుకొంటుంటే చూస్తూ ఊరుకుండగలమా? అందుకే నా ఈ ప్రయత్నమంతాను సుజాతకు సాగర్ విషయం తెలుసు. అయినా అతడ్నే ప్రేమిస్తున్నది. సానుభూతితో సాగర్ మనసు అర్ధం చేసుకొని సర్దుకు పోగలదు. సాగర్ ను మళ్ళీ మాములు మనిషిగా చేసుకోగలదు. సాగర్ ను అర్ధం చేసుకోలేని పిల్ల అయితే వాళ్ళ సంసారం నడవదు. సాగర్ త్వరలో మాధవి స్తితికే చేరుకొనే ప్రమాదం ఉన్నది!' డాక్టర్ చెప్పుకుపోతున్నాడు, సాంబశివరావు మంత్రించిన బొమ్మలా నరికిన తాడి చెట్టులా డాక్టరు చెప్పేది వింటున్నాడు. "ప్రొఫెసర్ చంద్రశేఖరం సలహా ప్రకారం మాధవికి వెంటనే షాక్ ట్రీట్ మెంట్ మొదలు పెట్టాలి. ఆ దశలో సాగర్ ను మాధవి వెంట ఉండనీయడం మంచిది కాదు. ఏదో గట్టి ఏర్పాటు చేయాలి."
"ఏం చేయాలో నాకు తోచడం లేదు. రామనాధం గారితో మాట్లాడి వచ్చాడట. మాధవిని ఎలాగయినా పెళ్ళి చేసుకొనే ప్రయత్నంలో వున్నాడు సాగర్. ఆలస్యం చేస్తే ఈ పిచ్చి వాళ్ళిద్దరూ ఎటో లేచిపోయి ఏ గుళ్ళోనో పెళ్ళి చేస్డుకునేట్టున్నారు. మరి!' సాంబశివరావు సిగరెట్ యాష్ ట్రేలో దులుపుతూ అన్నాడు.
"అమ్మా సుజాతా!" డాక్టర్ లోపలున్న కూతుర్ని పిలిచాడు.
"ఏంటి నాన్నా!" అంటూ గదిలోకి పరుగెత్తుకొచ్చిన సుజాత నాలుక్కరచుకొని గది బయట కెళ్ళి తలుపు చాటున నక్కింది.
"రా అమ్మా సుజాతా! ఎవరో కాదు, మన సాగర్ నాన్నగారే కదా! కూతురిని పిలిచాడు డాక్టర్ మూర్తి.
మినీ బికినీ నీ డ్రస్సులో ఉన్న సుజాత బిదియపడుతూ తండ్రి ముందు కొచ్చింది సాంబశివరావు సుజాత కేసి వింతగా చూశాడు. చీరలో ముచ్చటగా నిండుగా ఉండే సుజాత మూడేళ్ళు చిన్నదిగా, కొత్తగా, తమాషాగా కన్పించింది. వెంటనే మాధవి కళ్ళముందు కదిలింది! మాధవికీ సుజాతకు ఎంత తేడా ఉన్నది. స్వచ్చమైన ఎర్ర కలువకు, ఎర్ర గన్నేరుకు ఉన్నంత తేడ ఉన్నది! అయినా ఏం లాభం? చంద్రబింబంలోని మచ్చలా మాధవికి మతి భ్రమణం దాపురించింది. సాంబశివరావు సుజాతను తనకు కాబోయే కోడలిగా ఊహించుకుంటూ తన మనసును తనే సర్ది చెప్పుకునే స్థితిలో ఉండిపోయాడు. సాగర్ కు ఇలాంటి వేషాలు గిట్టవు పెళ్ళాయ్యాక సుజాత సాగర్ ఇష్టానుసారంగా నడుచు కోగాలిగితే చాలు....
'సుజాత! మాకు కొద్దిగా కాఫీ పంపించు!"
'అలాగే డాడీ!"
"వద్దమ్మా! ఇప్పుడెం కాఫీ?' అంటూ టైం చూసుకున్నాడు సాంబశివరావు, పన్నెండు దాటింది.
'అయితే అంకుల్ భోజనం వడ్డించమంటాను!" సుజాత కనురెప్పలు టపటప లాడిస్తూ అన్నది.
"లేదమ్మా! నాకు వేరే పనుంది!"
"ఆదివారం నాడు కూడా డ్యూటీ ఏమిటంకుల్!"
"మా ఉద్యోగమే అలాంటిదమ్మా! దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసేవాళ్ళకు వారాలు లేవు, వర్జ్యాలు లేవు. హాలీడేస్ అంతకంటే లేవు. మాకు అంతే . మా వృత్తి అలాంటిది."
"డ్యూటీలో వున్నా భోజనం మానేయరుగా ఆ తినేదేదో ఇక్కడే తిని వెళ్ళండి అంకుల్!' సుజాత బ్రతిమాలాడుతున్నట్లు అన్నది. సాంబశివరావు ఐస్ అయిపోయాడు. పిల్ల వేషం మోడరన్ అయినా మంచి మర్యాద, ఈ కాలంలో వేషభాషలు అంతగా పట్టించుకోవడానికి వీల్లేదు. ఈనాటి నాగరికత అలాంటిది. పిల్ల గుణవంతురాలు, సంప్రదాయం గలది. సాగర్ ను అర్ధం చేసుకోగల సామర్ధ్యం ఉన్నది. సాగర్ ను ఒక దారిలో పెట్టగలరనే నమ్మకంతో తనలో కలిగించగలిగింది సుజాత.
"డాడీ! అంకుల్ లంచ్ కు వుండమని చెప్పండి!" తండ్రి దగ్గర గారం చేసింది సుజాత.
"ఉంటాడులే అమ్మా! నువ్వు అంతగా రిక్వస్ట్ చేస్తుంటే కాదని వెళ్తాడా అంకుల్."
'ఓ.కే. అంకుల్ డన్!" అంటూ తుర్రున తూనిగలా పరుగు తీసింది సుజాత.
సుజాత గదిలో నుంచి బయటికి వెళ్ళగానే డాక్టర్ మూర్తి సాంబశివరావుతో అన్నాడు.
"పిచ్చి పిల్ల! అయిన వాళ్ళంటే ప్రాణం ఇస్తుంది. దానికి తగట్టు నాకు దగ్గర బందువులు లెవరూ లేరు. సుజాత కళ్ళు తెరవక ముందే తల్లి పోయింది. దానికి నేను నాకు సుజాత. అనురాగం ఆప్యాయతలు కరువైన సుజాత తనకు దగ్గర వాళ్ళు అన్న అభిప్రాయం కలిగితే వాళ్ళకు అతి దగ్గరగా వెళ్ళాలని, వాళ్ళతో కలిసిపోవాలని చూస్తుంది."
"డాక్టర్ చాలా కాలం నుంచి నేనో విషయం అడగాలను కుంటున్నాను. మీ కభ్యంతరం లేకపోతే...."
"అగారేం? అడగండి!"
'చాలా ఏళ్ళ క్రితమే మీ భార్య పోయింది గదా! మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు?"
"నాకు భార్యనయితే తెచ్చుకోగలను , కానీ సుజాతకు మరో తల్లిని తేలేనుగా." డాక్టర్ మూర్తి గతంలోకి తిరిగి చూసుకుంటూ అన్నాడు.
"బిడ్డ భవిష్యత్తు కోసం ఇంత త్యాగం చేశారా డాక్టర్?"
"త్యాగం ఎవరి కోసం చేశానంటారూ? నా బిడ్డ భవిష్యత్తు కోసమే గదా? ఓ రకంగా చూస్తే అది స్వార్ధమే అవుతుంది! మళ్ళీ పెళ్ళి చేసుకుంటే సవతి తల్లి సుజాతను రాచి రంపాన పెడుతుందని కాదు. ఆవిడకూ తల్లి కావాలనే ఆకాంక్ష ఉంటుంది. పిల్లల్ని కంటాం ఆ పిల్లలు భార్య మళ్ళీ సంసారం మొదలవుతుంది. సుజాతకు న్యాయం జరగదు. అందరి పిల్లలలో ఒకతయి పోతుంది. చిన్నతనంలో సుజాత పోగొట్టుకున్న దాన్ని ప్రత్యేకంగా అందించ లేకపోయేవాడ్ని."
