అతని మాటలు పూర్తికాక ముందే నెమ్మదిగా తలుపు తెరచుకుని లోపలికి వచ్చాడు డాక్టరు. కొత్త మనిషిని చూసి చిరునవ్వుతో తల పంకించి, ఉదయార్కర్ ని పరీక్ష చేయడం మొదలెట్టాడు.
"నౌ యూ ఆర్ ఫర్ ఫెక్ట్ లీ అల్ రైట్ మిస్టర్ ఉదయార్కర్. నిన్నరాత్రి మీకు ఎవరో చాలా స్ట్రాంగ్ సేడేటివ్ ఏదో ఇచ్చి వుండాలి, ఆర్ , ఇట్ మైట్ ఈవెన్ బీ క్లోరోఫాం. దట్సాల్! ప్రమాదమేమి జరగలేదు ఇంకో గంటలో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ కేసుని పోలీసులకి రిపోర్టు చేశాము. వాళ్ళు ఇందాక ఒకసారి వచ్చి వెళ్ళారు, మీరు డిశ్చార్జ్ అయ్యేలోపల మళ్ళీ వస్తారనుకుంటాను."
అని తనతో బాటు వచ్చిన నర్సు వైపు తిరిగి, చిన్నగా ఏదో చెప్పాడు డాక్టరు.
తల ఊపి మందులు వున్న ట్రే లోంచి సిరంజి తీసి ఉదయార్కర్ కి ఒక ఇంజక్షన్ ఇచ్చింది ఆమె. తర్వాత ట్రే తీసుకుని బయటకు నడిచింది.
"థాంక్స్ ఎలాట్ డాక్టర్!" అన్నాడు ఉదయార్కర్.
డాక్టరు చిన్నగా నవ్వి తలపంకించి అక్కడ నుంచి కదిలాడు.
డాక్టరు వెళ్లి వెళ్ళగానే ఎగ్జయిటేడ్ గా అన్నాడు అభిషేకన్.
"ఇతనా మీ డాక్టర్! ఇతను నాకు తెలుసండీ! చాలా బేడ్ డాక్టర్! ఎప్పుడూ ఆనర్సుతో కల్సి తెగ షికార్లు కొడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ సంబంధం ఉందండీ!" అన్నాడు సంబరంగా.
డాక్టరు మీద బురద జల్లాలనే ఉబలాటంతో ఉన్న అభిషేకన్ డాక్టరు ఇంకా గదిలో నుంచి బయటకు వెళ్ళలేదనీ, స్క్రీన్ ప్రక్కకు వెళ్ళాడనీ గమనించలేదు.
అభిషేకన్ మాటలు విన్న డాక్టరు మెల్లిగా స్క్రీన్ వెనుక నుంచి వచ్చాడు.
"ఆ నర్సుతో నాకు సంబంధం ఉందంటారా! ఉంది! ఉండక ఎలాగా! ఆమె నా భార్య" అన్నాడు సహనంగా.
ఆ దెబ్బతో అభిషేకన్ మొహం దిబ్బరొట్టెలా మాడిపోయింది. మూతి ముంగిసలా ముడిచాడు.
చాలాసేపు ఆ అవమానాన్ని దిగమింగుతూ వుండిపోయి డాక్టరు వెళ్ళిపోయాడని గట్టిగా నిర్ధారణ అయ్యాక, తన అక్కసునంతా చూపిస్తూ అఘాయిత్యంగా మాట్లాడ్డం మొదలెట్టాడు అభిషేకన్.
"అసలు సంగతి మీకు చెప్పడం మర్చేపోయాను. మీరు ప్లాన్ చేస్తున్న సీరియల్ మీరు రాయట్లేదు. ప్రేమ్ కుమార్ అనే పెద్ద రైటరు ఉన్నాడుగా. అయన రాస్తున్నాడు లెండి! ఉళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. మీరు ..........అయ్యో పాపం" అన్నాడు లేని సానుభూతి ఒలికిస్తూ.
ఆ మాటలు వినగానే స్థంభించిపోయాడు ఉదయార్కర్.
ఇంకా ఏదో చెబుతూనే ఉన్నాడు అభిషేకన్.
ఈలోగా పోలీసులు వచ్చారు. ఉదయార్కర్ స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. నర్సింగ్ హోమ్ లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తీ అయ్యాక, అక్కడనుంచి నేరుగా ఎడిటరు దగ్గరికి వెళ్ళిపోయాడు ఉదయార్కర్.
* * * *
తలుపు దగ్గర నిలబడి ఉన్న ఉదయార్కర్ ని చూడగానే చెప్పలేనంత ఆశ్చర్యం, అనందం చుట్టుముట్టేశాయి ఎడిటరుకి. తెప్పరిల్లికుని "రండీ ఉదయార్కర్! రండి! దిసీజ్ సచ్ ఏ ప్లెజెంట్ సర్ ప్రయిజ్! ఇంకో పది నిమిషాల్లో నేనే నర్సింగ్ హోమ్ కి వచ్చి ఉండేవాడిని" అన్నాడు.
సంతోషం లేకుండా నవ్వాడు ఉదయార్కర్. "నధింగ్ టూ వర్రీ! సింపుల్ కేస్ ఆఫ్ డ్రగ్గింగ్! ప్రమాదమేమీ లేదని చెప్పి డిశ్చార్జి చేసేశారు డాక్టర్లు" అన్నాడు.
"ఏమయింది ఆసలు?" అన్నాడు ఎడిటరు.
చెప్పడం మొదలెట్టాడు అతను. తను బ్యూటీ క్లినిక్ కి వెళ్ళడం వాళ్ళు సాదరంగా లోపలికి ఆహ్వానించడం , ఫేషియల్ అంటే ఏమిటో చూపిస్తానని కుర్చీలో కూర్చోబెట్టడం, తర్వాత తనకి స్పృహ తప్పడం, తెలివి వచ్చేసరికి తను నర్సింగ్ హోమ్ లో ఉండడం - అన్నీ వివరంగా చెప్పాడు.
అతను చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తూ కొద్దిసేపు మౌనంగా వుండిపోయాడు ఎడిటరు.
అయన మౌనాన్ని మరోలా అర్ధం చేసుకున్నాడు ఉదయార్కర్.
"మీరు చెప్పడానికి సందేహిస్తున్న విషయం ఏమిటో నాకు తెలుసు" అన్నాడు ముభావంగా.
ప్రశ్నార్ధకంగా ఉదయార్కర్ వైపు చూశాడు ఎడిటరు. "నేను చెప్పాలనుకుంటున్నదా? ఏమిటది?"
"సీరియల్ మీరు ప్రేమ్ కుమార్ చేత రాయిస్తున్నారు. ఆ విషయం నాకు ఎలా చెప్పాలో తోచక తటపటాయిస్తున్నారు. అవునా?"
"ఉదయార్కర్...."
నెమ్మదిగా చెయ్యి ఎత్తి ఎడిటరుని వారించాడు అతను. "మీ ఎక్స్ ప్లేషన్స్ నీ డేడ్ సర్! నేను సీరియల్ రాయలేనని మీకు అనిపించి ఉంటే, లేదా నాకంటే ప్రేమ్ కుమార్ రాస్తేనే సీరియల్ ఎఫెక్షన్ గా వస్తుందని మీకు అనిపించి వుంటే, ఆ సంగతి మీరు నాతొ డైరెక్టుగా చెప్పేసి వుంటే బాగుండేది. ఒక నమస్కారం చేసి మర్యాదగా తప్పుకుని ఉండేవాడిని నేను. అలా కాకుండా ....ఎక్కడో....... ఎవరి నోటనో నేను ఈ విషయం వినవలసి రావడం.....సర్! ఇటీజ్ వెరీ హ్యుమిలియేటింగ్! తల కొట్టేసినట్లయింది నాకు."
"ఉదయార్కర్....."
"ఒక్కమాట.....ఒక్కటంటే ఒక్కమాట నాతొ చెప్పి వుంటే చాలు సర్! నేను మళ్ళీ మీకు మొహం చూపించకుండా వెళ్ళిపోయి ఉండేవాడిని. నిన్నటిదాకా నా మానన నేను ఎక్కడో గుట్టుగా రాసుకుంటూ బతికేవాడిని. అలాంటిది నన్ను మీ అంతట మీరు పిలిచి ఎక్సెలెంట్ అపర్చునిటీ చూపించారు. ఆకాశాన్ని అందుకోబోతున్నట్లు ఫీలయ్యాను. అందలం ఎక్కిస్తానని ఆశపెట్టి ఇలా ఒక్కసారి అదఃపాతాళానికి తోసేయ్యడం మీకు న్యాయం కదండీ! రేపటి నుంచి తలెత్తుకుని తిరగలేను నేను. అలా చేసేశారు మీరు. సర్! ఒక్కటంటే ఒక్కమాట! కనీసం సూచనప్రాయంగా అయినా చెప్పి వుంటే ....." ఉదయార్కర్ గొంతు వణికింది. వాక్యం పూర్తీ చెయ్యలేకపోయాడు. కొద్దిక్షణాల తర్వాత గొంతు స్వాధీనంలోకి వచ్చాక లేచి నిలబడుతూ అన్నాడు "వెళుతున్నాను సర్! థాంక్స్ ఫర్ ద బ్రీఫ్ అనర్!"
అతను వెళ్ళబోతుంటే మృదువుగా అన్నాడు ఎడిటరు. "ఉదయార్కర్! ఒక్క రెండు నిముషాలు నాకోసం స్పేర్ చెయ్యగలరా!"
ఒకసారి అయన మొహంలోకి చూసి, సందేహంగా ఆగిపోయాడు అతను.
తన టేబుల్ డ్రాయరులో నుంచి ఒక చిన్న టేప్ రికార్డరు తీశాడు ఎడిటరు. అది సిగరెట్ ప్యాకెట్ కంటే కాస్త పెద్దదిగా వుంది. అగ్గిపెట్టె సైజులో ఉన్న ఒక మైక్రో కేసెట్ ని దానిలో ఇన్ సర్టు చేసి అన్ చేశాడు.
దానిలో నుంచి వినబడుతోంది ప్రేమ కుమార్ గొంతు. తనే సీరియల్ రాస్తానని ఎడిటరుని అడుగుతున్నాడు. అలా కుదరదనీ, సీరియల్ ఉదయార్కర్ చేత రాయించడానికి నిర్ణయం జరిగిపోయిందనీ స్థిరంగా చెబుతున్నాడు ఎడిటరు.
తను విన్న పుకార్లకీ, వినబడుతున్న నిజానికి సమన్వయం కుడుర్చుకోలేక అయోమయంగా చూస్తున్న ఉదయార్కర్ నెమ్మదిగా తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుండిపోయాడు.
అతని పరిస్థితీ చూస్తే సానుభూతి కలిగింది ఎడిటరుకి. ఓదార్పుగా అన్నాడు."ఉదయార్కర్ !హైవోల్టేజ్ పాలిటిక్స్ ఇవి! డిసీజ్ బిగ్ టైం! బిగ్ మనీ బిగ్ ఫేష్! ఉదయార్కర్ ఎక్కడ సక్సెస్ ఉంటుందో అక్కడ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. భోగభాగ్యాలు వుంటాయి. ఎక్కడ పేరు ప్రఖ్యాతలు , భోగభాగ్యాలు ఇవన్నీ ఉంటాయో అక్కడ ఆటోమేటిగ్గా జెలసీ స్టార్ట్ అవుతుంది. జెలసీ పాలిటిక్స్ కి దారి తీస్తుంది. ఇన్నాళ్ళనుంచి ఇవన్నీ ఎరుగరు మీరు. "నేను మేగజైను లో చేరినప్పటి నుంచి వీటీని అనుభవిస్తూనే వున్నాను. నాకూ మొదట్లో మీలాగే మనసుకి తూట్లుపడినట్లు విలవిల్లాడిపోయేవాడిని. ఇప్పుడు వీటన్నిటికి అతీతుడినయిపోయాను.
