Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 2

     కానిస్టేబుల్  దొరస్వామి దగ్గర తీసుకున్న  సిగరెట్  పెట్టెలోంచి సిగరెట్ తీసి వెలిగించాడు రాబర్ట్.

    అతని పెదవుల మధ్య ఎర్రగా కాలుతోంది సిగరెట్ .

    మనిషి  డెవిల్ గా ఎందుకు మారతాడు తల్లి గర్భంలో ఏమీ తెలియకుండా పది నెలలుండి.  ప్రాణాన్ని పోసుకుని పుట్టి. ఎంతో సాత్వికంగా పెరిగిన- ఆ మనిషి కెదురైన కొన్ని పరిస్థితులు, సమస్యలు అతని ఆలోచనా సరళిని మారుస్తుంది. అతనిలో మంచితనం చచ్చిపోతుంది.

 

   మనిషి డెవిల్ అయిపోతాడు  మానవతావాదం  నశిస్తుంది.

    జాలి, దయ, క్షమా అన్నమాటల  అర్ధాలని సమాధి చేస్తాడు.

    రాబర్ట్  మరో సిగిరెట్  వెలిగించాడు. తనమీద ఆరోపించబడిన  నేరాలతో తను  ఊబిలో  పీక  వరకూ కూరుకుపోయాడు.

    ఈ ఊబిలోంచి బయటపడగలనన్న  నమ్మకం  అతనికి లేదు.

    సొంత వూరు  పోలేడు చదుకున్న ఊరుకి పోలేడు.

    తల్లిపోయాక  మేనమామ  చెన్న కేశవులే  అతన్ని  చదివించాడు.

    ఇప్పడాయన  ఎలా ఉన్నాడో? తన గురించి ఆయన ఏమనుకుంటున్నాడో?

    అతని కళ్ళముందు ఏవో అస్పష్టమైన నీడలు కదులుతున్నాయి.

    ఆ నీడ కదులుతూ  పెద్దదయింది.

    అర్జున!

 

    రెండు చేతులూ చాచి తనని రమ్మని ఆహ్వానిస్తోంది అర్జున.

 

  కన్నీళ్ళ మధ్య అర్జునా!

 

   అర్జునా!

 

   తన ప్రాణం అర్జున.... కాని తనకేం మిగిలింది?

    అతను పళ్ళు పట పట కొరికాడు.

    కాశ్మీర!
   
    కాశ్మీర!

                     *    *    *

    విజయ్ అద్దెకి వుంటున్న మేడ ప్రక్కనే సంవత్సరం క్రితం ఓ మేడ వెలిసింది.

    ఆ మేడ ఓనరు రామదాసు. ఆయన భార్య అనసూయమ్మ.  రామదాసు కాంట్రాక్టులు  చేసి  లక్షలు  గడించాడు. ఇప్పడూ కాంక్ట్రులే చేస్తున్నాడు.

    అనసూయమ్మగారికి  పట్టుచీరలు  కట్టుకొని, ఒంటినిండా నగలు తగిలించుకొని  క్లబ్బుకి , మహిళా మండలికి బలాదూరులు తిరగడం పెద్ద హాబి  త్వరలో అమెరికా వెళ్ళి  రావాలన్న ఉబలాటంతో వచ్చి రాని ఇంగ్లీషుభాషలో  ఎదురుగా  వున్న వాళ్ళని చంపుతూ వుంటుంది.

    వీళ్ళిద్దరి కలల పంట కాశ్మీర.  కాశ్మీరకి పదహారేళ్ళుంటాయి. ఈ మధ్యనే  వోణి వేస్తోంది. గుండెలప్తెకి  వోణి వచ్చిందో లేదో తానో పెద్ద  హిరోయిన్ అయినట్టుగా  ఫీలవుతుంది కాశ్మీర.

    కాశ్మీర అందాల బొమ్మే. ఆకర్షణగానే  వుంటుంది. కాశ్మీర ఆడ పిల్లల బడిలో  ఇంటర్ చదువుతోంది.

    బాల్కనీలో నించుని పాట పాడుతోంది కాశ్మీర సరిగ్గా అప్పడే విజయ్ గదిలోంచి  బయటకొచ్చాడు.

    అతన్ని చూసి కూడా పాట ఆపలేదు కాశ్మీర.

    విజయ్ కిది కొత్తకాదు. కాశ్మీర వెకిలితనం  చూసి జాలిపడుతూ వుంటాడు.

    "కాశ్మీరా!"

    "నువ్వా" అంది.

    "నువ్వు పాటపాడుతుంటే ఎంతమంది వింటున్నారు" అన్నాడు విజయ్ నవ్వుతూ.

    కాశ్మీర కిందికి చూసింది అతను చెప్పినట్లుగా  అక్కడెవరూ లేరు గాని  రెండు  గాడిదలు మాత్రం వున్నాయి.

    వాటిని చూసి కాశ్మీరకూడా నవ్వేసింది.

    "నిన్నెవరో కొట్టారటగా?" అడిగింది కాశ్మీర. ఓ ఆడపిల్ల సూటిగా అలా అడిగేసరికి  విజయ్ కి కోపం. రోషం ముంచుకొచ్చినయి.

    ఆరోజు అతనికి బాగా గుర్తు.

    సాయిబాబా గుడిదాటి ఓ సందులోకి  తిరిగాడు తను. మొహం పైన బలంగా ఓ గుద్దు  పడింది. తను తేరుకునేలోగా  సైకిల్ చైన్ గాలిలోకి లైచింది. సర్రుమని  తనని చుట్టేసింది చైన్.

   వాళ్ళెవరో తననెందుకు  కొడుతున్నారో అర్ధంకాలేదు విజయ్ కి.

    రక్తం కారుతోంది. షర్టు చిరిగిపోయింది. పేగులు తెగిపోయాయి.

    వాళ్ళు తనని చంపెస్తున్నారనిపించింది.

    ఒళ్ళు గిరుకుపోయిన చోటా గాయల్లోకి దుమ్ము రుద్దుకుని మరింత మండిపోయింది.

    స్పృహ తిరిగి వచ్చేసరికి ఎదురుగా అర్జున తననిచూసి  ఫక్కున నవ్వింది.

    "నౌ యూ ఆర్  ఎ హీరో, దీన్ని రాజయోగం అంటారు" అంది.

    "ఎగతాళిగా వుందా" అన్నాడు తను.

    "కాదు ఒళ్ళు మండుతోంది ఇన్ని దెబ్బలు తిని కనీసం నాకు కబురు చెయ్యలేదంటే  ఎలా వుంటుంది? అందుకే నువ్వంటే  నాకు  చిరాకు ఆ కొట్టినవాళ్ళు  మరో నాలుగు గట్టిగా కొడితే కాళ్ళకి చేతులకి బెండేజి వేయించి  ఇంట్లో  పారేసేదాన్ని" అంది.

    "నీకెవరు  చప్పారు?" అడిగాడు మెల్లగా.

    "పూర్ణ  పనికట్టుకుని  వచ్చి చెప్పాడు నాకు" అంది.

    "ఇక్కడికి నువ్వెందుకొచ్చావ్ " అసహనంగా అడిగాడు.

    "ఎందుకా? అసలు నిన్ను కొట్టించిందే  నేను. దెబ్బలు సరిగా తగలకపోతే మరో నాలుగు తన్నాలని వచ్చాను" అంది.

    "చాల్లే వేళాకోళం"

    "లేకపోతే ఏమిటి విజయ్ దెబ్బలు తగిలి నువ్విలా పడివుంటే  నా మనసెలా  వుంటుందో ఆలోచించలేక పోయావు" అర్జున కళ్ళలో నీరు తిరిగింది.  


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS