Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి  పేజి 2

నిద్రపో హాయిగా
వృక్షమా! ఋక్షమా! ద్విపక్షమా!
బదులు చెప్పండర్రా! మీరైనా

జవాబులేదు
గాలి మూగదయిపోయింది
పాట బూడిదయిపోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
సభస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి
మరి కనిపించడా?

కోకిలవలె కూజించే కలధ్వని
కేసరివలె గర్జించే రణధ్వని
ఇక వినిపించదా
భావి దూర తీరాలకు

చేరువుగా విహరిస్తూ
జీవనాడి స్పందించే
రుధిర మధువు లందించే
యువకవి లోక ప్రతినిధి

నవభావామృత రసధుని
వితా సతి నొసట నిత్య
రస గంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్ఛస్ఫాటిక ఫలకం
నడినింగిని మాయమయాడా
మన మిత్రుడు
కవితా పుత్రుడు
కదనా క్షాత్రుడు
సకల జగన్మిత్రుడు!
                                                    --శ్రీశ్రీ
"మావాడు - మహా గట్టివాడు"

ఆధునిక కవితా రంగంలో - అంటే శ్రీ శ్రీ యుగంలో - తమ రచనలు గ్రంధ రూపంలో రాకపూర్వమే యావదాంధ్ర దేశంలో ఉత్తమ కవులుగా లబ్ధ ప్రతిష్టులైనవారు ముగ్గురున్నారు. వారిలో తిలక్ ఒకడు; మిగిలిన యిద్దరూ శ్రీశ్రీ, అజంతాలు. దీనికి కారణం శ్రీశ్రీలోనైతే, అయన గేయాలలో పెల్లుబికిన అపూర్వ భావ విప్లవం. ఆయన రాసిన ప్రతి గేయమూ ప్రతి తెలుగువాడి గుండెలో ప్రతిధ్వనించింది. అభ్యుదయ కవితా యుగానికి ఆయనే ఆద్యుడని అంగీకరింపజేసింది. మిగిలిన యిద్దరిలో యీ ప్రతిష్టకు కారణం ప్రధానంగా వారు సాధించుకున్న శైలీ రమ్యత. అజంతా మొత్తంమీద పదో పన్నెండో గేయాలు మాత్రమే రాసి తన దైన ఒక సొంత శైలిని నిర్మించుకున్న ప్రతిభావంతుడు. తిలక్ అంతకంటే విస్తృతంగా, బహుముఖంగా రాసి తన శైలిని స్థాపించుకున్నాడు. కవిత్వం కొద్దిగా రాసినా, ఎక్కువగా రాసినా తన సొంతమని చెప్పుకోదగిన శైలిని స్థాపించుకోలేనివాడు సాహిత్య చరిత్రలో నిలదొక్కుకోలేడు. నన్నయ, తిక్కన, శ్రీనాధుడు, పోతన, పెద్దన - పేర్లు అన్నిటికీ యీ శైలి సంబంధం వుండనే వుంది. ప్రేమ కవుల్లో కృష్ణశాస్త్రిగారికి అగ్రతాంబూలం ఇవ్వడం కూడా యిందుకే. అభ్యుదయ కవితా యుగంలో వందలమంది కవులు ఒకే రకమైన భావాలను కవిత్వంలో ప్రకటించినప్పటికి వారిలో బహుస్వల్ప సంఖ్యాకులు మాత్రమే కవులుగా చెలామణి కావడానిక్కూడా యిదే కారణం. ఈమాట చెప్పినందువల్ల ప్రతిపాదిత వస్తువుకంటే, తత్ప్రయోజనం కంటే శైలికి అధిక ప్రాధాన్యమిస్తున్నాననే అపోహ ఎవరూ పడనవసరం లేదు. కవిత్వంలో శైలికి గల ప్రాధాన్యాన్ని వివరించడం, తిలక్ సర్వపాఠకులకు ఆకర్షణీయమైన శైలీవిన్యాసం చేశాడని చెప్పడం మాత్రమే దీని ఉద్దేశం.

వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కొద్దిమందిలో తిలక్ కు ప్రత్యేక స్థానం వుంది. ఈనాడు చాలావరకు పరిపక్వమైన వచన గేయపు శైలికి అతను ఎంతో దోహదం చేశాడు. వచన గేయపు శైలిలో తిలక్ చూపిన ఒడుపులవల్ల ఆ ప్రక్రియ సంప్రదాయ పద్య కవితాభిమానులు కూడా చాలావరకు వశపరుచుకుంది. సంప్రదాయవాదుల మెప్పు మన కెందుకని వాదించే తీవ్రవాదులు వుంటారని కూడా నాకు తెలుసు. కాని ఒక కొత్త ప్రక్రియ సాహిత్యంలో స్థిరపడటానికి చేసే ప్రయత్నంలో సంప్రదాయవాదుల ఆమోదం కూడా ఒక ముఖ్యమైన ఘట్టమని నేననుకుంటాను. తన ప్రతిభా సంపన్నచేత వచన కవితా ప్రక్రియను యీ మజిలీకి చేర్చిన కొత్తతరం కవుల్లో తిలక్ పేర్కొనదగినవాడు.

వచన కవిత నేడు ప్రధానంగా రెండు రకాలైన శైలులను ఆశ్రయించుకొని ప్రయాణం చేస్తూ వున్నది. ఒకటి సమాన బాహుళ్యమూ, సంస్కృత లేక ఆంగ్లభాషా శబ్ద ప్రదర్శనమూ, ఉక్తిలో గ్రాంధికచ్ఛాయలూ కలిగి పద్యమూ వచన గేయమూ అనే భేదం మాత్రమే మిగుల్చుకుని పూర్వ కావ్య భాషా సాంప్రదాయానికి చేరువుగా నడుస్తున్న శైలి. రెండవది, వ్యావహారిక భాషావాదాన్ని జీర్ణించుకుని ప్రజల పలుకుబడిలోని మెళుకువలను సంగ్రహించుకుని, తెనుగు నుడికారములోని సొగసులను ఆవిష్కరించుకుంటూ, వర్తమాన కాల పరిస్థితులకూ, సమకాలీన ప్రజల హృదయాలకు దగ్గిరగా నడుస్తున్న శైలి. తెనుగుభాషా, భావ వికాసోద్యమాలకు ఆద్యులైన గిడుగు, గురజాడల ఆశయాలకు యీ రెండవ శైలి నిజమైన వారసురాలు; మొదటిది నన్నయాదుల నుండి వస్తున్న కావ్య భాషా సంప్రదాయానికి దగ్గిరచుట్టము. ప్రజల భాషలో నుండి సహజముగా వచ్చిన శబ్దాలుగాని, పదబంధాలు గాని, అలంకారాలు గాని, నుడికారపు సొగసులుగాని ప్రకటించగలిగినంత శక్తివంతంగా భావాన్ని కావ్య భాషా సంబంధంగల కవితా సామాగ్రి ప్రకటించలేదనేది అనుభవంలో ప్రతివారికీ, ప్రతి కవికీ తెలిసిన విషయమే. కాని కావ్యం రాయడం మొదలుపెట్టగానే తాను ఏదో ఒక పై అంతస్తులో వున్నాననే భ్రాంతిని పొందడంవల్ల ఆ అంతస్తుకు తగిన భాష కావ్య భాషే అనే మూఢ విశ్వాసం వల్ల కవులు కృత్రిమత్వమనే రొంపిలో దిగబడిపోవడం జరుగుతున్నది. కవిత్వం ప్రజలకు దూరం కావడానికి యిదే మొదటి కారణం. ఈ కావ్యభాష అనే సంకెలను తెంచుకోకపోవడం, గ్రాంధిక పలుకుబడిని తప్పనిసరిగా ఆదరించవలసిరావడం, సంప్రదాయా చ్ఛందస్సులనూ కొంతవరకు మాత్రాచ్ఛందస్సులనూ వాడే సందర్భాలలో తప్ప వచన కవితా ప్రక్రియా రంగంలో అడుగుపెట్టిన వారికి ఏ మాత్రం అవసరం వుండదు. అయితే పూర్వ వాసనలను పూర్తిగా వదిలించుకోలేక పోవడం వల్లనూ, గట్టి సమాసాలతో గొట్టు సంస్కృత పదాల్లో లేనిదే కార్యరూపం సిద్ధించదేమోననే సందేహం వల్లనూ, ఆధునికులైన కవుల్లో చాలామంది, యీ దృష్ట్యా చూసినప్పుడు తప్పటడుగు వేస్తూ వున్నారనే చెప్పవలసి వస్తుంది. తిలక్ కూడా యీ పరిస్థితిని తప్పించుకోలేకపోయిన సందర్భాలు చాలాచోట్ల కనిపిస్తాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS