Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 2

    కాలానికెప్పుడూ  ముందుగా  ఉండడం  నేర్చుకో. అది అంత సుళువుగా ఒకరి చెప్పుచేతల్లో  నడవదు. ఈ కాలానికి మాత్రం ఒక గుణం వుంది. తన అధికారంలో  వున్న వాడ్ని  ఎంత అథఃపాతాళానికి  అణచేస్తుందో  అంతగానూ తనని శాసిస్తున్నవాడికి  బానిసైపోతుంది.

    ఇది తెలియనందువల్లే  తామే కాలానికి బానిసలమని అందరూ  అనుకుంటారు  అసలు విషయం  తెలుసుకోకుండా. ఖర్మ అని, దైవమని, లలాట లిఖితమని  అంటూ ఎన్నో విధాల తమను తాము మోసం  చేసుకుంటూ, ఇతరుల్ని  మోసంచేస్తూ బతికేస్తారు. వాడే నాకు సమస్త సదుపాయాలు చేస్తాడని, కనిపించని  భగవంతుడ్ని  నమ్ముకొని  కూర్చుంటారు. ఇదే అసలైన బానిసత్వం. నాకిదే  ఇష్టంలేదు.

    "ముప్పయి మూడుకోట్ల  దేవతలు  కాపాడుతున్నా  పరాంకోటి  దరిద్రులున్నారు సరోజా! నాకీ దరిద్రమూ వద్దు, దేవతలూ వద్దు. ఇంతసేపూ  నేను చెప్పింది ఆ బుర్రలోకేమైనా  ఎక్కిందా?" అని అడిగారు.

    నేను నవ్వాను.

    "నవ్వడంకాదు సరోజా! పొద్దుట  ఎన్ని గంటలకి  ఇక్కడ  వుండాలని చెప్పాను?" అని అడిగారు.

    "జ్ఞాపకం వుందండీ. మీరంతగా  చెప్పాలా? నాకు తెలీదూ?" అన్నాను. శ్రీశ్రీగారు  అలా చిరాకుపడడం చూసి, నొప్పి  ఎక్కువగా  వుందేమో  అనుకుంటూండగా  డాక్టరుగారు వచ్చారు. కొన్ని  మందులురాసి  తెప్పించమని  చెప్పారు.

    "వారికి  నొప్పి  ఎక్కువగా  వుందిట  సార్?" అని చెప్పాను.

    నర్సుని  పిలిచి  ఏదో ఇంజక్షన్  ఇమ్మని చెప్పి  డాక్టర్ వెళ్ళిపోయారు. కారు డ్రైవరు సుబ్బారావు చేత  మందులు  తెప్పించాను. నర్సు  ఇంజక్షన్  చేసి వెళ్ళింది.

    అరగంటకి  బాగా  నొప్పి  తగ్గినట్లుంది.

    "ఇంతసేపూ  ఈ నొప్పితోనే నాకు  ఉపన్యాసం  ఇచ్చారా?" అనడిగాను.

    "దేనిదారి  దానిదే  సరోజా!" అన్నారు.

    "ఏడుగంటలు కావస్తోంది. నేనిక  ఇంటికి  వెళతాను. రేపు  త్వరగా  వస్తాన"ని  చెప్పి  బయలుదేరాను.


                            *         *        *        *


    మర్నాడు ఉదయం  అనుకున్న ప్రకారం  ఆరుగంటలకే  హాస్పిటల్ కి వచ్చేశాను. నేను వెళ్ళిన పావుగంట తర్వాత శ్రీశ్రీగారిని  లోపలికి  తీసుకువెళ్ళారు. ఆయన నవ్వుతూ "భయపడకండ"ని  మా అందరికీ  చెప్పి మరీ వెళ్ళారు.

    శ్రీశ్రీగారికి  ఆపరేషన్ చేసి, మళ్ళీ  రూమ్ కి తీసుకురావడానికి  రెండుగంటలసేపు  పట్టింది.

    ఇక్కడో  ముఖ్యవిషయం  వుంది. శ్రీశ్రీగారు  ఈ మూలవ్యాధి  ఆపరేషన్ 1965వ సంవత్సరంలో  అని రాశారు. కానీ  ఇది  1958లో  జరిగింది. నాకు బాగా జ్ఞాపకం. ఇందులో  సందేహంలేదు. అప్పటికి  మా పెళ్ళికూడా కాలేదు. శ్రీశ్రీగారి జీవితంలో  ఆయనకు  జరిగిన  ఆపరేషన్  మొదటిదీ  ఆఖరిదీ  కూడా ఇదే.

    పదకొండుగంటల  ప్రాంతంలో  బాగా మాట్లాడే  స్థితికొచ్చారు.

    "ఏవండీ ఎలాగుందండీ" అని అడిగాను శ్రీశ్రీ గారిని.

    "బాగానేవుంది  సరోజా!" అన్నారు.

    "మీకు  మత్తుమందు ఇచ్చారా?" అని అడిగాను.

    "లేదు. నడుంమీద, దిగువభాగానికి మాత్రమే  ఇంజక్షన్ ఇచ్చారు. నాకు ఒంటిమీద పూర్తిగా స్పృహవుంది. అయినా నాకు ఆపరేషన్ జరుగుతున్నట్టే  అనిపించలేదు. ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ  నేను డాక్టర్లతో మాట్లాడుతూనే  వున్నాను. ఆపరేషన్ అయిన తర్వాత  డాక్టర్ కృష్ణన్ గారు  'మరో ఇరవై  నాలుగ్గంటలసేపు  నొప్పిగా ఉంటుంది. అయినా  అది మీరు భరించగలరని  నాకు  తెలుసు అన్నారు" అని శ్రీశ్రీగారు  చెప్తూంటే  గుండె ఎవరో పిండినట్టు  బాధ కలిగింది.     

    "సరే మీరెక్కువ  మాటాడొద్దు. రెస్టు తీసుకోండి నేనిక్కడే వుంటాను.

    మీ ఆవిడ రాగానే  నేను వెళతాను" అన్నాను.

    ఆవిడ ఇంకారాలేదు. ఒంటిగంట కావస్తోంది.

    శ్రీశ్రీగారు  తీవ్రమైన నొప్పివల్ల  అప్పుడప్పుడు  మూలుగుతున్నారు. మేడమీద వున్న డాక్టర్ గారికి  కబురుచేశాను. ఆయన వచ్చారు.
    "బాధ ఎక్కువగా  వుందనుకుంటాను డాక్టర్ గారూ! లేకపోతే ఆయన మూలగరు" అన్నాను.

    "ఫరవాలేదు. శ్రీశ్రీగారు  భరించగలరు" అని అన్నారాయన.

    "ప్లీజ్! వారికి  భరించే శక్తి  వుండవచ్చు. కానీ మేంచూసి  భరించలేకుండా  వున్నాం. బాధ తెలియకుండా  ఏదయినా  ముందు ఇవ్వండి సార్!" అన్నాను.

    "శ్రీశ్రీగారూ! నిద్రవస్తోందా?" అని డాక్టర్ గారు అడిగారు.

    "వస్తోంది కానీ నొప్పివల్ల  నిద్రపోవడం  సాధ్యంకాలేదండీ" అన్నారు. డాక్టర్ వెంటనే  ఓ ఇంజక్షన్ ఇచ్చారు. పదినిమిషాల్లో  ఆయన హాయిగా  నిద్రపోయారు.

    రవణమ్మగారు వచ్చాక  నేను బయలుదేరి  వెళ్ళిపోయాను.


                                *            *         *          *


    మళ్ళీ నేను సాయంత్రం  నాలుగు గంటలకి  హాస్పిటల్ కి వచ్చేసరికి అందరూ అక్కడే వున్నారు. ఆవిడ నన్ను చూశారు కానీ ఏమీ అనలేదు. అందరూ  సైలెంట్ గా వుండడం  చూశాక  నాకు గాభరా వేసింది. గబగబా శ్రీశ్రీగారి గదికి పరుగెత్తాను.

    ఆయన నవ్వుతూ  పలకరించేసరికి ధైర్యం  వచ్చింది.

    "నొప్పి ఎలాగుంది?" అని అడిగాను.

    "నొప్పి అంతగాలేదు  సరోజా! హాయిగా నిద్రపోయాను" అన్నారు.

    "సరే. నేను బయట కూర్చుంటా" నని హాల్లోకి  వచ్చేశాను.

    డాక్టర్ ఎదురుపడి "నాతో  చెప్పకుండా  మీరెవ్వరూ  ఇళ్ళకు వెళ్ళడానికి వీల్లేదు. మీతో మాట్లాడాలి" అన్నారు.   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS