Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 2

 

    మంజీరకు పదహారేళ్ళట! ఎలా ఉంటుందో? అనుకుంది.
    

                                                            *    *    *    *

    చతుర్ముఖుడు తన ఎనిమిది కళ్ళతో తదేకంగా చూస్తూ, అతి జాగ్రత్తగా మలిచిన అందమైన బొమ్మలా ఉంటుంది మంజీర.
    ఆకాశంలో చాలా ఎత్తుగా ఎగుర్తున్నప్పటికీ తండ్రిని వదిలి పెట్టకుండా , ఎందుకో సతాయిస్తోంది తల్లి. ఆ జంటకి ఇంటా,  మింటా అనే బేధం లేదు!
    ఏర్ హోస్టెస్ ఇచ్చిన చాక్లెట్ తీసి నోట్లో వేసుకుంది. చేతిలో ఉన్న 'హెరాల్డ్ రాబిన్స్' నవల సైతం బోరుగా అనిపిస్తోంది. పొట్టిగా , ఒత్తుగా ఉన్న జుట్టు మొహం మీద పడి అల్లరి పెడ్తోంది.
    "షి....ట్..." విసురుగా తల విదిల్చింది.
    ఆ విసురుకి పక్కనే కూర్చున్న అతను ఉలిక్కిపడి చూసాడు.
    "మంచి హేండ్సమ్ గా ఉన్నాడు. ఇండియన్ కూడాను" అనుకుంది.
    "హలో....." తియ్యగా పలికింది.
    అతను కంగారుపడి అంతలోనే సర్దుకుని "హలో" అన్నాడు.
    "నా పేరు మంజీర" అని ఇంగ్లీషులో చెప్పింది.
    అతను కూడా ఏదో పాత చింతకాయ పచ్చడి లాంటి పేరు చెప్పాడు. చివరన రావ్' ట.
    "మీరు చాలా బావున్నారు" చెప్పింది.
    "థాంక్యు " అతను కాస్త సిగ్గుపడ్డాడు.
    "మేనర్స్ లెస్ ఫెలో!" అనుకుంది కసిగా మంజీర.
    వెనుక నించి తల్లి గొంతు వినిపిస్తోంది. "అక్కడికి వెళ్ళగానే ఇక మొదలు అది ముట్టుకోకు" ఇది ముట్టుకోకు! అని, చాదస్తం నేను భరించలేను బాబూ!"
    "పోనీ లేవే పెద్దావిడ , నాకు తల్లి లాంటిది."
    "అయితే ఆ దిక్కు మాలిన ఊరు మీరు ఒక్కరే వెళ్ళండి, నేను రాను. నేనూ మంజూ హైదరాబాద్ లోనే ఉంటాము."
    మంజీర లేచి వెళ్ళి , తల్లి నోరు నోక్కేయ్యాలనిపించింది.
    సన్నగా ఈల వేస్తున్నాడు పక్కనున్న అబ్బాయి.
    మంజీరకి నచ్చలేదు. విసుగ్గా మొహం పెట్టి అతని వేపు చూసింది.
    అతను పట్టించుకోలేదు. కంటిన్యు చేస్తున్నాడు.
    అంతే!
    గబుక్కున దగ్గరికి జరిగి అతని పెదవుల మీద పెదవులు గట్టిగా నొక్కి వదిలేసింది. న్మిశంలో వెయ్యో వంతు సేపు మాత్రమే!
    తెల్లబోయాడతను.
    "హౌ ఈజ్ ఇట్!" అడిగింది కన్ను కొడ్తూ.
    అతను బలవంతంగా నవ్వాడు.
    "ముద్దపప్పు" అనుకుంది మనసులో.
    ఎవరూ ఈ సంగతి గమనించనే లేదు. విమానం సాగిపోతూనే ఉంది, తనగమ్యం వైపు .        
    నారాయణ మూర్తి దృష్టిని అది దాటిపోలేదు. అతని భ్రుకుటి ముడిపడింది అసహనంగా.
    సుమిత్ర ధోరణి , సుమిత్రదే!
    మంజీర ప్రవర్తన అతనిలోని సనాతనుడికి కొరుకుడు పడటం లేదు. అత్తయ్య పెంపకంలో పెరిగిన తనకు, ఆచారాలూ, సంప్రదాయాలూ, నరనరాల్లో జీర్ణించుకు పోవడం అందుకు కారణమేమో! మంజీర ఎలా ఉండకూడదను కుంటున్నాడో , సరిగ్గా అలాగే ఉంటోంది. స్మోక్ చేస్తుంది, బూజ్ చేస్తుంది, అబ్బాయిలతో డేటింగ్ లంటుందీ , అందుకే! ఈ నిర్ణయం అంత హటాత్తుగా తీసుకొని స్వదేశానికి వచ్చేయ్యాలనుకోవడం.
    సుమిత్రకీ, మంజీరకీ అసలు ఇష్టం లేదు, ఇలా వచ్చెయ్యడం, కానీ తను ఒప్పుకోలేదు. తన కూతురు అటువంటి నాగరికతకి అలవాటు పడి, అటువంటి జీవితం గడపటం అనేది తనకి కొరుకుడు పడని విషయం. ఆ జీవితంలో తృప్తి లేదు, సంపూర్ణత్వం లేదు, నారాయణ మూర్తి మంజీరనే చూడసాగాడు.
    ఆమె నిర్లక్ష్యంగా చెక్ లేట్ నముల్తూ, ఏదో పాట హమ్ చేస్తోంది.
    పక్కనున్న అబ్బాయికి చేతిలో ఉన్న పుస్తకం మీద మనసు నిలవడం లేదు. మంజీర అందం అతన్ని రెచ్చగొడుతుంది. దానికి తోడు ఇందాకటి ఆమె ప్రవర్తన! నెమ్మదిగా జరిగి , ఆమె చేతి మీద తన చేతిని వేసాడు.
    మరో నిమిషంలో అతని చెంప ఎర్రగా కందిపోయింది. మంజీర కొట్టిన చెంప దెబ్బ వల్ల.
    "యూ ఈడియట్! హౌ డేర్ యూ!" అంటోంది మంజీర.
    "వాట్ హేపెండ్?" హెయిర్ హోస్టెస్ హడావుడిగా వచ్చింది.
    "నన్ను ముద్దు పెట్టుకుంటావా? ఏమనుకుంటున్నావు నా గురించి?" కోపంగా అరుస్తోంది మంజీర.
    ఎయిర్ హోస్టెస్ చూసిన చూపులకి సిగ్గుతో తల వంచుకున్నాడు ఆ అబ్బాయి.
    జరిగిందేమిటో నారాయణమూర్తి ఒక్కడే చూసాడు.
    "ఏం జరిగింది?" అంటోంది సుమిత్ర.
    నారాయణమూర్తికి చెప్పాలనిపించలేదు. కళ్ళు మూసుకుని వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. అతని మనసంతా చేదు తిన్నట్లుగా అయిపొయింది.
    విమానం సంతా క్రజ్ కి దగ్గరవుతోంది.
    నిస్పృహగా ఉన్నాడు నారాయణమూర్తి.
    అసంతృప్తిగా ఉంది సుమిత్ర.
    ఏదో తెలియని ఉత్సాహం ఆవరించింది మంజీరకి.


                                                          *    *    *

    అరుంధతికి చాలా ఆనందంగా ఉంది.
    నారాయణమూర్తి పసిపిల్లవాడిలా, ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు.
    ఆమె హృదయం సముద్రం అంతా విశాలంగా, వ్యాప్తి చెందింది. దూరంగా పోతున్న కెరటాన్ని లాక్కునే తల్లిలా అతని తల నిముర్తోంది! గొప్ప తృప్తిగా.    
    "నాతొ హైదరాబాద్ 'వచ్చేయమ్మా! ఇంక ఒంటరిగా ఉండద్దు" అన్నాడు అతను డగ్గుత్తికతో.
    "నీకోసమే ఈ ప్రాణం నిలిచి ఉందిరా. ఇంకా బూడిద చెయ్య వలసిన వాడివి నువ్వేగా! ఇక ఎప్పుడూ పిలుపోచ్చినా ఫరవాలేదు"
    నలభై ఆరేళ్ళకే ఆమెలో ఎనబై ఏళ్ళ పరిపక్వత.
    సుమిత్ర వీళ్ళ సంభాషణ విసుగ్గా వింటూ, మంజీర కోసం కళ్ళతోనే వెతికింది.
    మంజీర కిటికీ అవతలి వేపు కనిపించింది. ఆమె చేతిలో కెమెరా ఉంది. అరుంధతిని ఫోటో తియ్యడానికి ప్రయత్నిస్తోంది.
    సుమిత్ర కోపంగా కూతురి వైపు నడిచి "ఏం చూస్తున్నావూ " అంది.
    "మమ్మీ, గ్రానీ చాలా ఫన్నీగా ఉంది కదూ! అలా గుండు ఎందుకు చేయించుకుందీ? ఇంకా మరేమో....."
    మంజీర నోటికి తన అరచెయ్యి అడ్డు పెట్టి, "త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని డాడీతో చెప్పు!" అంది.
    "నో! మమ్మీ ఇక్కడ ఓ రోజు ఉందాం! నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అదిగో అటు చూడు!"
    సుమిత్ర అటు చూసింది.
    అశ్వర్ధ నారాయణ పాలు పిండుతున్నాడు.
    "ఆ........ఇక్కడ ఇలాగే పశువులని ఇంట్లోనే పెట్ట్టుకుంటారు" అంటూ ముక్కు చిట్లించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS