"నా ఇష్టం. చేసుకునేది నేను. భాషవేరైనా, జాతివేరైనా అందరమూ మనుష్యులమే. మమతా మనసూ అందరికీ ఒకేలా పెట్టాడు దేముడు. వాటికి హెచ్చు తగ్గులు లేనప్పుడు మనిషి పెట్టుకున్న అడ్డు గోడలు, ప్రాంతీయ భేదాలు, కులమత తత్వాలు వీటికి ప్రాధాన్యత నివ్వడం మూర్ఖత్వం" అంది సుబ్బలక్ష్మి.
'ఇంక గట్టిగా మాట్లాడితే నా ఇష్టం, మీరొచ్చినా రాకున్నా ఈ పెళ్ళి చెసుకు తీరుతానూ అంటే ఆ దెబ్బతో, సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. లేదా మీ కిష్టం లేకపోతే సుబ్బలక్ష్మి ఈ పెళ్ళి నేను జరిపిస్తానని నరసింహారావుగారు అంటే, వీరి ప్రాధాన్యత పూర్తిగా పడిపోతుంది. పైగా, ఆ అబ్బాయికి బాగా ఆస్తి పాస్తులున్నాయని చెబుతున్నారు. 'సిరిరా మోకాలడ్డు వారుందురా' అని- శ్రీమంతుడు కోరి వస్తానంటే, అడ్డుపడడం అనివేకమే అవుతుంది,' ఆలోచించారు రాఘవ, తమ్ముళ్ళూ, జానకమ్మ అందరూనూ.
"సరే. సుబ్బలక్ష్మి ఇష్టానికి మేము మాత్రం కాదంటామా?" అన్నారు.
ఆ సాయంత్రం రాగానే పరిచయాల తరువాత పేకాట, విందూ, అన్నీ జరిగాయి. సుబ్బలక్ష్మి అన్నలందరూ కూడా పేకాటలో దిట్టలే అనిపించుకున్నారు. చింటూ కూడా పాతపేక ముక్కలు పేకరించి ఆయమ్మనీ, కామాక్షమ్మనీ కూర్చోబెట్టి ఆడ మనడం మొదలెట్టాడు. వారి అనుకరణని చూసి మురిసిపోయారు ఇంటిల్లిపాదీ.
రెండుమూడు రోజులుండి వెళ్ళిపోయారు జానకమ్మా, కొడుకులూ సకల మర్యాదలూ పేకరించి పెళ్ళివారి లంఛనాలతో. కాలం గడుస్తోంది. పరీక్షలు దగ్గర పడడంవల్ల డే రావడం మానేశాడు. పేకాటకి నరసింహారావుగారు క్లబ్బుకే వెళుతున్నారు. కంబైండు స్టడీస్ కి సుబ్బలక్ష్మి ఎవరో స్నేహితురాలింటికి వెళుతోంది.
సుమతిని మళ్ళీ వంటరితనం ఆవహించింది. అది గమనించిన కామాక్షమ్మగారు గబగబా చింటూకి ముస్తాబుచేసి ఏ బీచికో సినిమాకో రోజుకో ప్రోగ్రాం పెడుతోంది. రానురాను సుమతిలో ఓపిక తగ్గిపోయి తిరగలేక పోతోంది. పుస్తకాలకోసం కాకపోయినా ఆ యింటి మీద అల్లుకుపోయిన మమతలవల్ల తరచు 'వాసుదేవ లైబ్రరీకి' వెళ్ళి కాస్సేపు కూర్చుని వస్తోంది.
* * *
డాక్టరు చెప్పిన టైముకి పదిహేను రోజులు ముందుగానే సుమతికి పురుడోచ్చేసింది కాన్పు కొంచెం కష్టమయినా, గోవిందు కోరిక ప్రకారం కామాక్షమ్మగారి కోరిక ప్రకారం ఆడపిల్ల పుట్టినందుకు అందరూ ఎంతో సంతోషించారు. 'ఈ సంతోషంలో తండ్రి కూడా వుంటే ఎంత బావుందేది' అనకుని తలుచుకుని ఏడ్చింది సుమతి.
సుబ్బలక్ష్మి పరీక్షల పేరుతో ఇంట్లో వుండడమే అరుదైపోయింది. ఆయమ్మకి వంటపనీ, చింటూతోటే సరిపోతోంది. కామాక్షమ్మగారు ఒక్కరే నర్సింగ్ హొం చుట్టూ తిరగలేక సతమత మయిపోతోంది. బ్లడ్ ప్రెషరూ, నీరసం ఎక్కువయిపోతోంది. సుమతి ఇంటికి వచ్చేనాటికి కామాక్షమ్మ గారు మంచం పట్టింది. డాక్టర్లూ, మందులూ; వచ్చేజనం, వెళ్ళేజనం ఆయమ్మ చాకరీతో ఉక్కిరిబిక్కిరీ అయిపోతోంది. సుమతికి రెస్టులేదు, మనశ్శాంతిలేదు.
రోజులు గడుస్తున్నాయి. గోవిందు "అన్యువాల్ లీవ్ మీద వచ్చాడు. మిలిటరీలో సంవత్సరానికోసారి రెండు నెలలు సెలవులిస్తారు. రెక్కలు కట్టుకు వాలాడు గోవిందు. కూతురు పుట్టిందన్న సంబరం అతన్ని ఆకాశాని కెగరేసినా, మంచం పట్టిన తల్లినిచూసి పాతాళానికి కుంగిపోయాడు. చిక్కిశల్యమైన సుమతిని చూస్తే కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది. "అయినవాళ్ళు అందరినీ కాదనీ ఏం సాదించాలని వెళ్ళాను? అందరి మధ్యా వున్నప్పుడు ఎక్కడికో ఎగిరి పోవాలని కోరుకున్నాను. తీరా పోయాక ఇప్పుడు ఇక్కడే వుండాలని కోరు కుంటున్నాను. ఏమిటి ఈ మనస్తత్వం? ఏది చెయ్యలేనో దాని గురించి ఆలోచించడం ఆశపడడం నాకలవాటయి పోయింది. నా వల్ల మీ రందరూ బాధపడుతున్నారు" సుమతి ముందు చిన్న పిల్లాడిలా వెళ్ళబోసుకున్నాడు. అతని పరిస్ధితికి జాలి పడటం తప్ప సుమతి మాత్రం ఏం చేస్తుంది? సలహా చెప్పినప్పుడు పెడచెవిన బెట్టాడు. ఇప్పుడేమీ చెయ్యలేని స్ధితిలో "సలహా అడుగుతున్నాడు" ఆవేదనతో అలమటించి పోతోంది సుమతి.
ఆరోజు డే వచ్చాడు. గోవిందుకి తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే చిరపరిచితుడులా కలసిపోయాడు డే. "లేట్ అజ్ హావ్....ఎ! డ్రింక్ మన స్నేహానికి నాంది పలుకుతూ తాగుదాం, క్లబ్బు కెళదాం రండి" అన్నాడు గోవింద్.
"అమ్మకి ఒంట్లో బాగులేదు కదా. పైగా మీ మిసెస్ కూడా రాలేరు. అందుకనీ, ఇంట్లోనే తాగుతే?" అన్నాడు డే.
"నాన్న గారేమైనా అంటారేమో!"
"మీ నాన్నగారు చాలా విశాల హృదయులు. ఏమీ అనుకోరు అయినా అడిగిచూస్తానుండండి" అంటూ "అంకుల్....." అనిపిలిచారు.
"అంకుల్ లేరు. ఎక్కడికో వెళ్ళారు." జవాబు చెబుతూ బయటి కొచ్చింది సుబ్బలక్ష్మి.
ఇబ్బందిగా మొహం పెట్టాడు గోవింద్.
"పోనీ అంకుల్ ఎంత సేపటిలో వస్తారో తెలుసా?"
డే అడిగాడు సుబ్బలక్ష్మిని.
"ఒక గంటలో వస్తానన్నారు. హవున్ టాక్సు కట్టడానికి వెళతానన్నారు."
"అయితే, కారులో వెళ్ళలేదేం?" గోవింద్ అడిగాడు.
"కారప్పుడు అత్తయ్యకోసం డాక్టరుగారిని తీసుకురావడానికి వెళ్ళింది."
"గోవింద్! గంట టైము వుందిగా! కారులో వెళ్ళి 'బాటిల్స్' పట్టుకొద్దాం రా" అన్నాడు డే.
"గోవింద్!" పిలిచింది కామాక్షమ్మగారు.
"వస్తున్నానమ్మా" అంటూ లోపలి కెళుతూ, "డే! మీరేమి అనుకోకపోతే, నేను అమ్మ దగ్గరుంటాను. మీరు తీసుకురండి" అని వంద రూపాయల కాయితం జేబులోంచి తీశాడు గోవింద్.
"నో.....నో ....ఎవరిస్తే ఏముంది? నేనిస్తా ఆ!.... మీ బ్రాండ్మిటి" అన్నాడు.
"అరిస్ట్రోకాట్"
"నాదీ అదే ", కారులో బయలుదేరాడు డే.
గోవిందుని పక్కగా కూర్చోబెట్టుకుని, "బాబూ! ఎంత దూరం వెళ్ళీపోయావురా, కంటికి కనిపించకుండా." గోవింద్ తలని గుండెలకి అనించుకుని, పసిపిల్లాడిలా తల నిమిరింది.
"ఏం చెయ్యనమ్మా! జరిగిందేదో జరిగిపోయింది. అప్పుడే ఒక ఏడాది జరిగిపోయింది. మరో నాలుగేళ్ళు దాని తరువాత! ఇంకెక్కడికీ పోనమ్మా!"
"నాలుగేళ్ళే! సుమతి వాలకం చూశావుగా! పిచ్చిదానిలా అయిపోయింది. నాన్నగారు, వాసు అన్నయ్య బోయినప్పటినుంచీ, తోచదంటూ, పేకాటలో పడ్డారు. మిగతా విషయాలు నీకు తెలిసినవే. సుబ్బులక్ష్మి డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెడుతోంది. ఏమన్నా బాగుండదు. నువ్వు దగ్గరుండి ఈ విషయాలన్నీ చూచుకుంటే బాగుండేది" కళ్ళనీళ్లు పెట్టుకుని తల్లి! చెబుతూ వుంటే, గుండె తరుక్కుపోయింది గోవింద్ కి. ఆనాడు సుమతి మాటలు పెడచెవిని పెట్టినందుకు తనమీద తనకే కోపంగా వుంది.
అంతలో కారాగిన చప్పుడు కాగానే, "ఇప్పుడేవస్తానమ్మా" అంటూ గోవింద్ బయటి కొచ్చాడు.
వసారాలో కూర్చున్నారు గోవింద్, డే. "సుబ్బలక్ష్మి గ్లాసులు పట్రా" అన్నాడు గోవింద్.
"సిస్టర్ ఏదీ.....సిస్టర్ ని కూడాపిలువు" అన్నాడు డే. సుబ్బలక్ష్మి గ్లాసులతో తిరిగోచ్చింది.
"డే వచ్చాడు బావ నిన్ను పిలుస్తున్నారు" అంది సుబ్బలక్ష్మి.
'కాలేజీలకి సెలవు లిచ్చారు గాబట్టి పొద్దున్నే పెకాటకి దిగాడు కాబోలు' అనుకుంటూ వచ్చింది సుమతి.
