ఇక ఒకే ప్రశ్న మిగిలి వుంది "...గోపీచంద్ ఎక్కడున్నాడు?"
అది తెలుసుకోవటం ఇక అసాధ్యం! రెండు నెలల క్రితం మరణించిన ప్రమద్వర ఎక్కడయినా అడ్రసు వ్రాసి పెడితే తప్ప నాకొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవటం ఎవరితరమూ కాదు.
ఒక్కసారిగా పదేళ్ళ వయసు పైబడినట్లు అనిపించింది. వృద్దాప్యం కృంగదీసింది. ఇన్నేళ్ళూ నా మనసులోని ఏ మూలో నేను నా కుమారుణ్ణి కలుసుకోగలనని, ప్రమద్వర అతడిని ఒక సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్ది నా ముందు వుంచుతుందని ఆశ వుండేది. కానీ ఆమె జీవితం ఇంత నికృష్టంగా ముగిసిందంటే, ఇక గోపీచంద్ ఏమైవుంటాడని ఆలోచించటానికే భయంగా వుంది.
బయట నాకోసం ఇన్ స్పెక్టర్ ఎదురు చూస్తున్నాడని తెలుసు నేను అతనికి ఈ అమ్మాయి నా కూతురో కాదో చెప్పటం కోసమే పిలిపించాడు.
నేను బయటి గదిలోకి వచ్చేసరికి ఇన్ స్పెక్టర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. "అబ్బే...ఏదో చిన్న వ్యవహారం. నువ్వు పడుకోమ్మా పదినిముషాల్లో పంపించేస్తాను" అంటున్నాడు.
అట్నుంచి ఏదో వినబడింది... "ఇలాంటి కేసులు నేను లక్ష చూశానుగా నిముషాల్లో సెటిల్ చేస్తాను" అంటూ వాదిస్తున్నాడు. అతడిని డిస్టర్బ్ చేయటం ఇష్టంలేక నేను తిరిగి లోపలికి వెళ్ళాను. ఆ అమ్మాయి తలవంచుకుని కూర్చుని వుంది. దిగులుగా- ఒంటరిగా-
నాకు జాలేసింది.
నెమ్మది మీద చెప్పాలి. తనకి అసలు నిజం! అసలే తల్లి మరణంతో కృంగిపోయి, నేనే తన తండ్రిననుకుని భ్రమపడుతూన్న ఈ అమ్మాయికి "...నేను తండ్రి కానన్న సంగతి... అసలు చెప్పవలసిన అవసరం కూడా లేదేమో. మరణించిన ప్రమద్వరకి ఆ మాత్రం సాయపడటం నా కనీస ధర్మం. ఇది చాలా చిన్న సమస్య. నాక్కావలసింది గోపీచంద్.... నా కొడుకు!!"
"అమ్మ తాలూకూ సామాన్లు నీ దగ్గిరే వున్నాయా?" అని అడిగాను. తలూపింది. అదొక్కటే ఆశ. అందులో ఎక్కడైనా గోపీచంద్ తాలూకు ఆచూకీ దొరకవచ్చు.
"మనం వెళ్దామా?" అని అడిగాను.
"ఎక్కడికి?" అంది వెంటనే.
తటపటాయించాను. ఇంటికి తీసుకెళ్తే.... తరళ సంగతి నాకు తెలుసు. నానాయాగీ చేస్తుంది. నేను చెప్పేది వినిపించుకోదు. విన్నా అర్ధం చేసుకోదు. ముఖ్యంగా ప్రమద్వర విషయం తెలిస్తే పిచ్చిధైపోతుంది. అందువల్ల ప్రస్తుతం తనకీ విషయాలన్నీ తెలియకుండా వుండటమే మంచిది.
"నేను చెపుతాగా, రామ్మా" అన్నాను. దేవిక లేచింది. ఇద్దరం ముందు గదిలోకి వచ్చాం.
ఆ అమ్మాయి బయట వరండాలోకి నడిచింది.
వెనగ్గా మిగిలిపోయిన నన్ను సత్యనారాయణ అడిగాడు. "ఎవరు భాయ్ ఆ అమ్మాయి?" సమాజం రేపు అడగబోయే ప్రశ్నకి మొట్టమొదటి గొంతు అది.
"మా తరళ స్నేహితురాలి కూతురు. నాక్కూడా బాగా దగ్గిర. వాళ్ళమ్మ చచ్చిపోతూ అల చెప్పిందట" క్లుప్తంగా అన్నాను.
"జాగ్రత్తగా వుండాలి. ఇంత ఆస్తి అనేసరికి అందరి కళ్ళూ మన మీదే వుంటాయి. ఇంటికి తీసుకువెళ్ళటం లేదుగా?"
"లేదు".
"సిస్టరుకి కూడా ఈ విషయాలేమీ తెలియనివ్వకు..." లోపాయికారిగా అన్నాడు. తలూపి బయటకొచ్చాను. ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాను. గోపీచంద్ సంగతి తెలిసే వరకూ తరళక్కూడా ఈ సంగతి చెప్పటం నా కిష్టంలేదు. ఈ రాత్రికి దేవికని హోటల్ లో వుంచాలని నిర్ణయించుకున్నాను. రేప్పొద్దున్న ఆ అమ్మాయి బాగా తేరుకున్నాక, ప్రమద్వర తాలూకు సామాన్లు ఎక్కడున్నాయో అడగాలి.
నా వెనుకే సత్యనారాయణ కూడా బయట వరండాలోకి వచ్చాడు. లోపల వెంకట్రాజు రికార్డులు మారుస్తున్నాడు. బహుశా రైడింగ్ లో దొరికిన వాళ్ళలో ఒక పేరు కొట్టేస్తున్నాడేమో.
నేను దేవికను తీసుకొని నా కారువైపు సందులోకి వెళ్తూ వుండగా దూరం నుంచి మరో కారు పోలీస్ స్టేషన్ వైపు స్మదులోకి తిరిగి ఆ వెలుగు మా అమీద పడింది. ఏదో స్టాండర్డ్ కారులా వుంది. అంతలో దాని లైట్లు ఆరిపోయాయి.
మరో రెండు అడుగులు వేసేసరికి ఈసారి కుడివైపు నుంచి మరొక జీపు వచ్చి వీధి మొదట్లో ఆగింది. దాని లైట్లు కూడా ఆరిపోయయై. రాత్రి మూడున్నరకి కాస్త అటూఇటూ అయివుంటుంది.
రెండు వైపులున్నుంచీ ఇలా లైట్లు పడటం చూసి ఇన్ స్పెక్టర్ మొహం చిట్లిస్తున్నట్టు నటిస్తూ "ఏ నక్సలైటు నాయాళ్ళైనా యుద్దానికొచ్చారా ఏమిటి?" అన్నాడు. జోకులు ఆస్వాదించే స్థితిలో లేను నేను.
దేవికతో సహా వచ్చి కార్లో కూర్చున్నాను.
కారు కదిలింది.
దూరంగా పోలీస్ స్టేషన్ దగ్గిర ఆగిన కారు నా వెనుకే వస్తూంది గానీ దాని గురించి అంతగా పట్టించుకోలేదు. ఏదో స్టాండర్డ్ లా వుంది.
హోటల్ లో దేవికను దింపాను. కేరాఫ్ అని అడ్రసు వున్నచోట నా పేరే వ్రాశాను. ఇకనుంచీ ఈ అమ్మాయి సంరక్షణాభారం నేనే వహించబోతున్నాను. ప్రమద్వర కూతురు ఈ అమ్మాయి. ఆ ఒక్కటీ చాలు ఆ అమ్మాయి నా నుంచి సర్వం పొందటానికి!
అర్దరాత్రి లగేజీ లేకుండా వచ్చిన మమ్మల్ని చూసి రిసెప్షన్ లో మనిషి ఆశ్చర్యపోయినా, వచ్చింది తరళా ఫెర్టిలైజర్స్ ఎమ్.డి. అని తెలుసుకుని నమ్రతగా గది నెంబరు చెప్పాడు.
ఈ రాత్రికి దేవికని డిస్టర్బ్ చేయదల్చుకోలేదు. ఆ అమ్మాయి సామానులింకా అక్కడే వుండి వుంటాయి. గోపీచంద్ ఆచూకీ గురించి, చనిపోతూ ప్రమద్వర ఒక ఉత్తరమైనా వ్రాసి పెట్టి వుంటుందని నా కెందుకో బలంగా అనిపిస్తూంది. "రేప్పొద్దున్నే వస్తాను. భయపడకుండా పడుకో -" అన్నాను.
"పోలీసులు?..." భయంగా అంది.
"పోలీసులా? ఇక ఎవరూ నీ గురించి కన్నెత్తి కూడా చూడరు" అన్నాను. వచ్చేస్తూంటే- "నాన్నగారూ" అంది. ఆగాను. చాలాసేపు తటపటాయించి "థాంక్స్ నాన్నగారూ! నేను చాలా భయపడ్డాను" అంది.
నేను తలూపి, "ఇంకేమీ ఆలోచించకు" అని వచ్చేశాను. నా మనసంతా కలచి వేసినట్టుంది. ప్రమద్వర.... మాటిమాటికీ గుర్తొస్తూంది.
-ఎంత దారిద్ర్య మనుభవించి ప్రాణాలు పోగొట్టుకుందో - కేవలం నా కోసం...
రోమియో జూలియెట్ ల మధ్యా, లైలా మజ్నూల మధ్యా శారీరక సంబంధం వుందో లేదో నాకు తెలీదు. కాని మా మధ్య దైవసాక్షిగా అలాటి సంబంధమేమీ లేదు. అయినా మా ప్రేమ అంతకన్నా తక్కువదేమీ కాదు. ప్రేమించిన ప్రతీవాళ్ళు అలా అనుకుంటూ వుండవచ్చు. కానీ ప్రేమలో ఎప్పుడూ మేము హద్దులు దాటలేదు. అన్నీ పెళ్ళిరోజు కోసం దాచుకున్నాం. కానీ విధి అంత కర్కశంగా మమ్మల్ని విడదీస్తుందనుకోలేదు.
