జనం పొలోమని అటు పరుగెత్తారు.
"ఈ రాక్షసుడిని సంహరించడానికి శ్రీరాములవారే వేంచేస్తారు -- ముందుగా హనుమంతుల వారిని పంపారు " అన్నాడు తులసీరావు దృడంగా.
"రాజపురోహిత్" తులసీరావు రాజా పరమేశ్వర్ నీ రాణీ సంయుక్తనీ తనతో రమ్మని సైగ చేశాడు. కుచ్చు తలపాగా , చిరుగులు పట్టిన పట్టు షేర్వాణీ , ఎలుకలు ఒకచోట కొట్టేసిన బిగుతు పైజమా , చమ్కీ చడావులూ, వేసుకుని వీధి నాటకంలో పాత్రదారిలా విషాదంగా కనబడుతున్న పరమేశ్వర్, చౌకగా కనబడుతున్న నగలూ, శాలువాతో సినీ జమిందారిణిలా కనబడుతున్న సంయుక్తా , అంతులేని భక్తీ ప్రపత్తులూ అవధులు లేని అజ్ఞానమూ మొహాల్లో కనబడుతుండగా తులసీరావు వెంట నడిచారు.
వాళ్ళ వెంట చేతులు కట్టుకుని వినయంగా నడుస్తున్నాడు లక్షణ సింగు. అతను పరమేశ్వర్ కొలువులో సైన్యాధిపతి లాంటివాడు. వాళ్ళు తరాల క్రితం రాజస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిలయిపోయిన బొందిలీలు.
అతని పక్కనే మంత్రి నడుస్తున్నాడు. అతని పేరు లోకేశ్వరరావు. జాతర టైం లో రాజావారికి అతను మంత్రి. మిగతా టైం లో తన పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు.
వాళ్ళ వెంట వెళ్ళాలని అనిపించలేదు రాజుకి. ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయాడు.
కోతుల కిచాకిచలకి మెలకువ వచ్చింది సృష్టికీ. అయోమయంగా చూస్తూ "అసలేం జరుగుతోంది మిస్టర్ రాజ్? అంది ఆందోళనగా.
జరుగుతున్నదంతా చెప్పాడు రాజు. "అర్జెంటుగా యువని వెదకటానికి వెళ్ళాలి నేను " అన్నాడు.
"మరి నేనో ?" అంది ఆమె భయపడుతూ.
"మీ సంగతే నాకు అగమ్యగోచరంగా ఉంది. సృష్టీ! మీ వాళ్ళెక్కడుంటారు?"
"అమెరికాలో " అంది సృష్టి.
'అల్ రైట్ -- మీరు సురక్షితంగా ఉన్నారని వాళ్ళకి మెసేజ్ పంపిద్దాం -- కానీ వాళ్ళెవరన్నా వచ్చేదాకా మీరెక్కడుంటారనేది సమస్య "
"అది సమస్య ఏమీ కాదు -- నేను మీతోనే ఉంటాను " అంది సృష్టి స్థిరంగా.
చిన్నగా నవ్వాడు రాజు.
"మీరు నాతొ వుండడం వల్ల ఒక సమస్య తీరవచ్చును గానీ మిగతా అనేకమైన సమస్యలు పుట్ట్టుకొస్తాయి.
"మనం పుట్టింది సమస్యలు ఎదుర్కోడానికి , సాల్వ్ చేయడానికే కదా ....... డోంట్ బాదర్ ....... నేను మీతోనే !" అంది సృష్టి . ఇంక వాదప్రతివాదాలకి అవకాశం లేదన్నట్లుగా.
రామాలయంలో మైకు కీచుమని పెద్ద శబ్దం చేస్తూ అన్ అయింది.
గుడిలో భక్తులు చేస్తున్న భజన చుట్టూ పక్కల పది కిలోమీటర్ల దూరానికి వినబడేంత పెద్దగా ఉంది.
మైకులోనే కోతుల కిచకిచ కూడా వినబడుతోంది.
కోతుల కిచకిచ వినబడగానే అలర్ట్ అయింది సృష్టి. చెవులు రిక్కించి విన్నది.
"ఓ! ఇక్కడ కోతులు చాలా ఉన్నాట్లున్నాయే - అయితే నేను మీ వెంట రావడం వృధా కాదు -- నా ఎక్స్ పెరిమేంట్సూ కంటిన్యూ చేయవచ్చు ." అంది సృష్టి ఎగ్జయిటెడ్ గా. అంటూనే ,, అతని మొఖంలో కనబడుతున్న భావాన్ని చదివేసినట్టుగా "డోంట్ వర్రీ మిస్టర్ రాజూ! మీ చెల్లెలు మీకు దొరుకుతుంది. నా మాట నమ్మండి" అంది అభయం ఇస్తున్నట్లుగా.
అపనమ్మకంగా చిరునవ్వు నవ్వాడు రాజు.
"నా చెల్లెలు సరే -- ప్లేన్ క్రాష్ లో ఇంతమంది చనిపోయినందుకు నాకు ఎంతో విచారంగా ఉంది సృష్టి!
"ఎవరికీ ఉండదూ? కానీ మనమేమన్నా చేయగలమా? విచారిస్తే పోయిన వాళ్ళు వస్తారా?
చనిపోయిన వాళ్ళని బతికించలెం గానీ బతికి ఉండే అవకాశం ఉన్నవాళ్ళని చనిపోకుండా రక్షించుకోవాలి కదా! పదండి పోదాం" అంది.
ఆమె వైపు మెచ్చుకోలుగా చూశాడు రాజు.
"పదండి!" అన్నాడు.
"ఎటు?"
అంది సృష్టి.
"చెంతపెట్ట దగ్గర 'రాక్షసుడు' సేద్యం చేస్తున్నాడని అంటున్నరుగా - అక్కడికి వెళ్దాం -- అన్నాడు రాజు -- తన మాటలు తనకే విచిత్రంగా వినబడుతున్నాయి. చింతపెంట - రాక్షసుడు -- అగ్రిమెంటు -- అరకదున్నడం .
జరుగుతున్నది జానపదమా?
పౌరాణిక,మా?
లేక కలగాపులగపు కధా?
కాళ్ళకి అడ్డం వస్తున్నా తీగెలని కష్టం మీద పక్కకి నెడుతూ ముందుకి నడుస్తున్నారు రాజు, సృష్టి. కొంతదూరం వెళ్ళాక బాట బాగా వెడల్పు అయింది.
ఆ బాటలోనే కొద్ది దూరంలో ఒక బండి రావడం కనబడింది.
అది దగ్గరికి వచ్చాక బండి తోలుతున్న మనిషి కూడా కనబడ్డాడు.
"ఇతన్ని అడుగుదాం ' అన్నాడు రాజు.
బండి ఇంకా దగ్గరయింది.
మొత్తం సంసారాన్నంతా బండి మీద తరలిస్తున్నట్లున్నాడు ఆ మనిషి. బక్కచిక్కిన రైతులాగా వున్నాడు. ఒంటిమీద బట్టలు సరిగా లేని చిన్నపిల్లలు ఆకలి వల్ల కాబోలు -- గుక్కపెట్టి ఏడుస్తున్నారు- వాళ్ళని సముదాయించలేక సతమతమవుతోంది అతని భార్య.
ఇంటికి సంబంధించిన చెంబూ తపాలాలూ బండిలో ఉన్నాయి. ఒక కుంపటి ఉంది. చిరిగినా బట్టల మూట ఒకటి ఉంది. సగం విరిగిన ప్లాస్టిక్ బక్కెట్ ఒక్కటి వుంది.
అవి కాకుండా --
పీకేసిన ఒక గుడిసె తాలుకూ వెదురు బొంగులూ, చదర లాంటి ఒక తాటాకుల కప్పు, కాస్త గడ్డీ గాదమూ , ఒక తుమ్మ కొమ్మ , ఒక తాటి దుంగా కూడా వున్నాయి.
వీటన్నిటినీ మొయ్యలేక మొయ్యలేక మోస్తోంది . ఒక ఎముకల గూడు లాంటి ముసలి ఎద్దు.
వంట్లో కదలికా, కంట్లో నీళ్ళు కనబడుతున్నాయి గనక బండిని లాగుతున్న ఎద్దుకీ, బండిలో వున్న మనుషులకీ ప్రాణం వుందని చూసేవాళ్ళకు తెలుస్తోంది గానీ, అవే గనుక లేకపోతె , వాళ్ళు బండిలో వున్న పాతబడిన సామాన్లుల్లాగా నిర్జీవంగా వున్నట్లుగా అనిపిస్తున్నారు.
"ఒకసారి అగు " అన్నడు రాజు.
రాజుని, సృష్టిని చూడగానే బండివాడికి పిప్రాణాలు పైనే పోయాయి.
బండిలో నుంచి గబుక్కున కిందికి దూకి , రాజు కాళ్ళు పట్టేసుకున్నాడు.
"ఆ రాచ్చసుడి బారి నుంచి బతికి బయటపడ్డాననుకుంటే నువ్వు మళ్ళీ మమ్మల్ని నిలువునా పీక్కుతింటావా సార్! నా తోలు వలచినా ఇంకా నా దగ్గరేం లేదు సార్! మా నలుగుర్నీ , మా ఎద్దునీ కలిపినా చటాకు మాంసం లేని వాళ్ళం సార్! ఇంక మేం ఏమిచ్చుకోగలం సార్?"
"మా ముసలాడు ఇంకేం ఇచ్చుకోలేడయ్యా- వదిలిపెట్టండి దొరా -- ఇంకొక్క దెబ్బ పడితే చచ్చిపోతాడు సార్!" అంది అతగాడి భార్య రోదిస్తూ.
అప్పుడు చూశాడు రాజు.
