ముకుందరావు ను గుడి దగ్గరికి వచ్చెయ్యమని చెప్పాము.
అటునుంచి ఆటే పెళ్లి హాల్ కి వెళ్లొచ్చు అని.
ఆయన సరే అన్నాడు.
అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది.
మధు ప్రవల్లిక చాలా సంతోషించారు.
శుభలేఖ అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ చెయ్యమని పురోహితులవారిని అర్ధించాము.
అన్నీ సక్రమంగా జరిగాయి.
అందరం గుడిలో ముడుపులు చెల్లించి పెళ్లి హాలుకు బయలుదేరాము.
ముకుందరావు గారు గుడి దగ్గర వెయిట్ చేస్తున్నారు.
ఆయనకి హలొ చెప్పి బస్సెక్కి బయలుదేరాము.
ముకుందరావు కూడా మాతో బస్సెక్కారు పెళ్లి హాలుకు దారి చూపేందుకు.
సాయంత్రం ఆరయ్యింది.
పెళ్లి తంతు మొదలయ్యింది.
హోటల్ నుంచి పెద్దవాళ్ళు, కుర్రాళ్ళు అందరూ వచ్చారు.
కుర్రకారు ఎక్కువగా ఉండటంతో జోష్ బాగా ఎక్కువయ్యింది.
పెళ్లి కార్యక్రమాలు అన్ని అనుకున్నట్లే జరుగుతున్నాయి.
మధ్యలో కొంత విరామంలో ముకుందరావు గారు చిక్కారు ఖాళీగా. చటుక్కున జేబులోనుంచి నా మొబైల్ తీసి మురళీకృష్ణ ఫోటో చూపించి ఇతను మీకు తెలుసా అని అడిగాను.
ముకుందరావు మోహంలో కొద్దిగా రంగులు మారడం స్ఫష్టంగా కనిపించింది నాకు.
అంతలోనే తమాయించుకుని ఆబ్బె ఇతనెవరో నాకు తెలియదండి అంటూ ఎవరో పిలుస్తున్నట్టు అర్జెంటుగా అక్కడనుంచి మాయమయ్యాడు.
ఇదేంది చెప్మా అనుకున్నాను.
ఏందో అంతా మిస్టరీగా ఉంది నాకు.
పెళ్లి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఇరువైపులా పురోహితులు అన్నీపద్ధతి ప్రకారం చక్కగా చేయిస్తున్నారు.
అమ్మాయిని మేనమామ బుట్టలో తీసుకొచ్చి పెళ్లిపీటలమీద ఉంచాడు. పెళ్లికూతురు కళ్ళలో ఏదో బాధ లీలగా కనిపించింది నాకు.
శశిరేఖతో చెప్పాను.
బుట్టలో తీసుకురావడం వలన బుట్ట ఏమన్నా వత్తుకుందేమో వెళ్లి పెళ్లికూతురు మంజరిని అడగమని.
తను వెళ్లి అడిగింది.
ఆబ్బె ఏమీ లేదండి.
ఇలా ఎక్కువసేపు పూజలకు కూర్చోవడం అలవాటులేదుకదా ఈ కాలం పిల్లలకి అందుకే కొంత అసహనం అంటూ సర్ది చెప్పింది మంజరి తల్లి.
బోజనాలకింకా కొంచెం వ్యవధి ఉంది.
ఇంతలో ఫోన్ వస్తే బయటికొచ్చాను లోపల శబ్దం ఎక్కువగా ఉండి వినపడకపోవడంతో.
పెళ్లిహాలు కెదురుగా మురళీకృష్ణ, వాడి ఫ్రెండ్స్ నిలుచుని ఇటువైపే చూస్తున్నారు.
బయటకట్టిన ఫ్లెక్సీ లను ఫోటోలు తీస్తున్నారు.
నేను వాళ్ళని అదే పనిగా చూడటంతో అక్కడనుంచి కదిలారు.
****
ముకుందరావు విజయవాడ వాస్తవ్యుడు కాబట్టి, అక్కడే పుట్టి పెరిగినందువల్ల పెళ్ళికి చాలా మందే వచ్చారు.
ఒక వైపు చిన్న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.
కాబోయే వధూవరులు ఒక గంట అక్కడ వేసిన అందమైన కుర్చీలలో కూర్చుని అందరి దీవెనలు అందుకుంటూ, బహమతులు స్వీకరిస్తూ నవ్వుతూ పలకరిస్తున్నారు.
వెళ్ళినవాళ్ళు వధూవరుల ప్రక్కన నిలుచుని ఫోటోలు తీయించుకుంటున్నారు.
జంట చూడ ముచ్చటగా ఉంది అన్న కామెంట్స్ కి మధు, ప్రవల్లిక తెగ ఆనందపడుతున్నారు.
సంజయ్, మంజరి మధ్య మధ్య లో నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కొందరిని మంజరి సంజయ్ కి పరిచయం చేస్తోంది.
ఈడూ జోడూ బాగా కుదిరింది ఇద్దరికీ.
శృతి, తన ఫ్రెండ్స్ పెళ్లికూతురు, పెళ్ళికొడుకు పక్కనే నిలుచుని ఆటపట్టిస్తున్నారు.
సంజయ్, మంజరి లైట్ తీసుకుని వాళ్లకు బదులిస్తున్నారు.
ముకుందరావు, అతని భార్య అందరిని పేరు పేరునా పలకరిస్తున్నారు.
పొద్దున్నే ఎనిమిది గంటలకి పెళ్లి .
ముహూర్తానికి తప్పకుండా రండి అని చెప్తున్నారు.
భోజనాలు కూడా మొదలవుతున్నాయి.
ఆరగించి వెళ్ళండి అని పదే పదే చెప్తున్నారు.
వాళ్ళ కలగొలుపుతనానికి నా మనసుకు హాయి అనిపించింది.
మధు బ్యాంకు ఫ్రెండ్స్ విజయవాడ లో పనిచేసే వాళ్ళు ఫామిలీస్ తో వచ్చారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాడు.
నాకు తెలిసిన లాయర్ ఫ్రెండ్స్ కొంతమంది, నాతో మధుతో చదువుకున్న చిన్నప్పటి ఫ్రెండ్స్ కొంతమంది, అందరూ కుటుంబసమేతంగా వచ్చారు. అందరని రిసీవ్ చేసుకుంటూ, పలకరిస్తూ, వధూవరులకు పరిచయం చేస్తూ అంతా బిజీ బిజీ గా ఉన్నాం.
అంతా సవ్యంగానే సాగుతోంది.
మధ్య మధ్యలో నేను మాజూనియర్స్ తో సోమవారం రోజు ముఖ్యమైన కేసుల విషయం చర్చిస్తున్నాను.
అంతా ఎవరి పనులలో వాళ్ళు బిజీ గా ఉన్నారు.
ఒక వైపు భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు.
భోజనాలు అన్ని రకాలు బాగా రుచికరంగా చేశారని ఫీడ్ బ్యాక్ వచ్చింది. మధు, ప్రవల్లిక సంతోషంగా ఫీల్ అయ్యారు.
పురోహితులిద్దరూ హెచ్చరించారు.
భోజనాల కార్యక్రమం పూర్తయితే మిగతా పెళ్లి విధానాలు నిర్వర్తించాలని. మాంగళ్య ధారణ పొద్దున్న ఎనిమిది గంటలకి. అప్పటికి అంతా టైం ప్రకారం జరగాలి అని గట్టిగా చెప్పారు.
సరే అని అందరం భోజనాలు పూర్తి చేసాం.
మంచి ఐటమ్స్ సెలెక్ట్ చేశారు భోజనానికి.
సౌత్, నార్త్ అన్ని రకాలు వడ్డించారు.
చాలా రుచికరంగా ఉన్నాయి అన్ని వంటలు.
వడ్డన కూడా చక్కగా, శుభ్రంగా ఉంది.
ముకుందరావు, అతని భార్య పేరు పేరునా అందరిని పలకరిస్తూ భోజనాల గురించి అడుగుతున్నారు.
శృతి, తన ఫ్రెండ్స్ భోజనాలు చేస్తున్నారు.
అదేంటే మీ వదినకి పేస్ బుక్ అకౌంట్ కూడా లేదంట.
మరీ పాత కాలం మనిషి లా ఉంది అంటూ జోక్ చేస్తున్నారు శృతి ఫ్రెండ్స్.
ఆ మాటలు నా చెవిన పడ్డాయి.
మధు నా దగ్గరికొచ్చాడు.
రాత్రి కొంత పెళ్లి విధానం ఉందిరా.
నువ్వు , శశిరేఖ రూమ్ కు వెళ్లి రెస్ట్ తీసుకోండి అన్నాడు.
ఫర్లేదులేరా. మీతోపాటే మేము.
ఎప్పుడైనా నిద్ర ముంచుకొచ్చిందంటే వెళ్లి పడుకుంటాను అని చెప్పాను.
అందరిని అడిగాను. కొంతమంది పెద్దవాళ్లు, చిన్నపిల్లలుండేవాళ్లు హోటల్ కి వెళ్లి రెస్ట్ తీసుకుని పొద్దన్నే వస్తామన్నారు.
అందరిని బస్సుల్లో ఎక్కించి జాగ్రత్తగా హోటల్ లో దింపమని డ్రైవర్స్ కి చెప్పాను.
డ్రైవర్స్ కి కూడా అక్కడే ఒక రూమ్ బుక్ చేయించాను.
వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి బాగా. లేకుంటే సరిగ్గా నడపలేరు.
అది చాలా ముఖ్యం. మా జూనియర్స్ వాళ్ళ ఫామిలీస్ ని కూడా రెస్ట్ తీసుకోమని చెప్పాను.
వాళ్ళూ హోటల్ కి వెళ్లారు.
పెళ్లి మండపంలో కొద్దిమంది మాత్రమే మిగిలాము.
గంట గంట కి టీ సప్లై చెయ్యమని చెప్పాము. లేకుంటే నిద్ర ఆపుకోవడం చాలా కష్టం.
వాడు ఒక పెద్ద కెటెల్ తెచ్చి పెట్టాడు.
పురోహితులు మంత్రాలు జోరుగా చెప్తున్నారు. హోమాగ్ని లో నెయ్యి పోస్తూ మంత్రాలు చదువుతున్నారు.
పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆ హోమం మంటనుంచి వచ్చే పొగను చేతితో అటూ ఇటూ అనుకుంటున్నారు వాళ్ళ మొహం వైపు రాకుండా.
నిజానికి ఆ పెళ్లి మంత్రాలకు ఎంతో అర్ధం, మరెంతో విలువా ఉంటాయి. కాకుంటే అందరం పెళ్లి హడావుడిలో వాటిని పెద్దగా పట్టించుకోము.
రెండు జీవితాలు ముడిపడే సమయం అది.
రెండు కుటుంబాలు కలిసే సమయం కూడా అదే.
ఎంతో పవిత్రమైనది పెళ్లి అనేది.
వధూవరులు ఒకరికొకరు తోడూ నీడగా జీవితాంతం కష్ట సుఖాలను పంచుకుంటూ, కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ, ఇరువైపులా కుటుంబాలకు మంచి పేరు తేవాలి.
తల్లితండ్రులు ఎంతో శ్రమ కోర్చి మంచి సంబంధాలు వెతికి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసేది తమ పిల్లలు సుఖంగా ఉండాలన్న స్వార్థంతోనే.
వాళ్ళు నూరేళ్లు పిల్లా పాపలతో ఆనందంగా వర్ధిల్లాలని ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు తల్లితండ్రులు.
న్యాయపరంగా న్యాయస్థానంలో విడాకులు కోరుకునే వారు అగ్నిసాక్షి గా పెళ్లి చేసుకొని ఉండాలి. లేకుంటే రిజిస్టర్డ్ మ్యారేజ్ అన్నా అయ్యుండాలి.
ఇండియన్ డివోర్స్ ఆక్ట్ లో అగ్నిసాక్షి పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది.
హిందు సాంప్రదాయంలో వైవాహిక శుభకార్యాల్లో అతి ముఖ్యమైన ఘట్టం ''అగ్ని'' సాక్షిగా పెళ్లి చేసుకోవడం.
మరి అగ్నినే ఎందుకు పెడతారు అంటే మన సంస్క్రతి, సాంప్రదాయాలలో అగ్నిని పవిత్రంగా చూడటం ఆచారం.
పూజలు, యజ్ఝ యాగాదలు అగ్ని లేకుండా జరగవు.
